Previous Page Next Page 
నిరాశలో నిండు గుండె పేజి 7

               
                                        4

    తన పెద్ద మేడలో ఉన్న విశాలమైన గదులన్నీ రోజూ తిరిగి చూసుకుంటాడు సాంబశివ౦..... ఇంటిముందు ఆవరణలో గుబురుగా పెరిగిన గూలభీ మొక్కల్నీ, అందంగా పరచుకున్న లాన్లనూ సంతృప్తితో చూసుకుంటూ నిలిచిపోతాడు ..... ఇవన్నీ తనకే! సాంబశివానివే, కాదు! సాంబశివం గారికే! అబ్బ!
    గుండెలనిండా ఊపిరి పీల్చి వదులుకుంటాడు సాంబశివం ......
    ఒకనాడు పూరిగుడిసెల్లో ఉంటూ ఆకాశాన్నంటే మేడలను ఆశగా ..... ఆబగా ..... చూసే రోజుల్లో...... ఒక నాటికి తనూ  అలాటి మెడల్లో ఉండగలనని అనుకున్నాడా? తనను దూసుకుని పోయేకార్లలోని అసామీలను తిట్టుకున్నప్పుడు తనూ అలాంటి కార్లలో తిరగలనని ఊహించ గలిగాడా? ఎంత అదృష్టం! కాదు .... స్వయంకృషి , తను సాధించింది!
    ఈ కార్లు _ మేడలూ , డబ్బు ఒక ఎత్తు ..... సుశీల ఒకత్తీ ఒక ఎత్తు ........
    రెండు జడలతో నవ నాగరికత ఉట్టిపడుతూ బి.ఏ , పాసయిన సుశీల తన కూతురు .... అన్నీ తన పోలికలే! శిల్పితన శిల్పాన్ని చూసుకుని మురిసిపోయినట్టు ..... సుశీలను చూసుకుని అనండిస్తాడు. సాంబశివ౦ _ తండ్రి కళ్ళలో ఆ ఆప్యాయత చూసుకుని అనురాగం ...... పొంగి పొరలే పితృగర్వం చక్కగా అర్ధమవుతాయి సుశీలకి ......
    ఇంత సంతోషమూ , ఇంత గర్వమూ తన భార్య లలితను చూసేసరికి నీరు కారిపోతాయి ..... లలితా కళ్ళెత్తి చూస్తె చాలు! తనేక్కడి నుండి వచ్చాడో అక్కడికి తోసేస్తున్నట్లు అవుతుంది ......
    ఇవాళ సాయంత్రం చాలామందిని టీకి పిలిచాడు . అందరూ పెద్దవాళ్ళు ..... అంటే పదవులలో ఉన్నవాళ్ళు. లలితకూడా ఉండాలి. ఉండమని అడగాలి .... అదో యజ్ఞం ..... లలితా గదిలోకి తొంగి చూశాడు _ లలిత తయారయింది . ఎక్కడికయినా వెళ్తుందేమో, లలితా తయారవటం  అంటే ఇస్రీ చీర కట్టుకుని బొట్టు పెట్టుకోవడం ......... లలితా కోసం ఎన్నోనగలు కొన్నాడు . ఒక్కటికూడా పెట్టుకోదు లలిత ......
    "ఇవాళ మనింటికి చాలామందిని టీకి పిలిచాను. నువ్వు వుండాలి _ అన్నాడు " లలితతో
    "నేను పరమేశ్వరి ఇంటికి వెళ్తున్నన్ను."
    అద్దం ముందు నించుని బొట్టు దిద్దుకొంటున్న లలితా తిరగానైనా తిరగకుండా చెప్పింది ......    
    "పరమేశ్వరి అంటే ఆ మొగుణ్ని విడిచేసిన అవిడేనా?"
    "అవును _ భర్తతో పడక ధైర్యంగా విడిపోయింది."
    "నువ్వు అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు ....."
    "అలా మాట్లాడొద్దని చెప్పాను _ నన్ను డబ్బిచ్చి కొనుక్కున్న మాట నిజమే అయినా కొన్ని హక్కులు నాకు ఉంచుకునే అమ్ముడు పోయాను ......."
    డబ్బిచ్చి కొనుక్కోవడము , అమ్ముడు పోవడము ..... ఇలాంటి మాటలు లలితా ఎలా వాడుతుందో కాని అవి సాంబశివం మనసును చిత్రవధ చేస్తాయి.
    అలాంటి స్నేహాలు మన స్తోమతకు తగినవి కావు ....."
    "స్తోమత అంటే ..... కట్ట కాసుల పేర్లు వేసుకునే అప్పలమ్మలకుంటుందే? ... అదా ?
    "అప్పలమ్మల ప్రస్తావన తేకు ."
    "తప్పేముందీ ? పాలమ్ముకునీ , పచ్చళ్ళమ్ముకునీ ...  పిడకలమ్ముకునీ ... ఇంకా అమ్మడానికి వీలైనవన్నీ అమ్ముకుని  వాళ్ళు పరమేశ్వరీ కంటే పదిరేట్లేక్కువగా డబ్బు పోగేసుకో గలరు. అదంతా స్థోమతు అనుకోగలిగే సంస్కారం నాకు లేదు " ......
    లలిత 'సంస్కారం' అన్నమాట వాడినప్పుడల్లా సాంబశివం ముడుచుకు పోతాడు __ ఆ సంగతి లలితకు తెలుసు ......
    "అలాంటి చెడిపోయిన వాళ్ళతో స్నేహంచేస్తే మనమూ చేడిపోతాం ......"
    "చెడిపోవటం అంటే?"
    "మొగుణ్ణి వదిలి తైతక్క లాడినా చెడిపోవటం కాదు?"
    గురిచూసి వదిలే బాణాల్లా ఉండే లలిత మాటలను ఎదుర్కోగలిగే శక్తి సాంబశివానికి ఏనాడూలేదు . పకాలున నవ్వింది లలిత .....
    "బెంగ పెట్టుకో కండి __ నేను చేడిపోను .... అంటే లేచి పోను .... లేచిపోయేదాన్నియతే ఎప్పుడో లేచిపోయేదానిని _ ఇన్నాళ్ళు ఆగటం దేనికి?"
    ఆ మాట నిజమే? లలిత అంతరంగంలోని అణువణువూ ఆ ఇంటిని ..... ఆ ఐశ్వార్యాన్ని .... ఆ మొగుడ్నీ వదిలి లేచిపోవాలని పరితపించి పోయిన రోజులు లేక పోలేదు ......
    బ్రతికి చెడిన కుటుంబంలోని పిల్ల లలిత ...... బి.ఏ ., పాసయింది. బి.ఏ  పాసయినా రూపం వున్నా, గుణం వున్నా, కట్నం ఇచ్చుకోలేని కారణంగా సరి అయిన సంబంధమేదీ కుదరలేదు .... సంస్కారాలు .... ఉన్న తశయాలు . మహత్తర ఆదర్శాలూ అన్నీ ఏ మూల దాకున్నాయో ....... వచ్చిన సంబంధాలన్నీ ఏదో ఒక వంక పేట్టి తప్పుకు పోయాయి ......
    పిల్లకి పెళ్ళికాదనే దిగులుతో తల్లి, లలిత ముందే "నా గుండెలమీద కుంపటిలా వున్నావు." అని విసుక్కునేది .... తండ్రి దిగాలుగా కాళ్ళీడ్చుకుంటూ ఏపార్కుకో వెళ్ళిపోయేవాడు .... అన్న దిగజారిపోతున్న పాతకాలపు హోదాను పట్టుకు వెళ్ళాడలేక , వదలలేక నలిగిపోయే వాడు .... చుట్టూప్రక్కల అమ్మలక్కలు. "ఇంకా పెళ్ళి కాలేదూ?" అని ముఖంమీదే అడిగేవారు .... అందుకు లలితలోనే ఏదో తప్పు ఉన్నట్లు వెటకారంగా నవ్వేవారు .....    
    ఇలాంటి సందర్భంలోనే సాంబశివం సంబంధం వచ్చింది. లలిత అన్నకు ఎవరో మధ్యవర్తులు చెప్పారు .... "లలితా అతడు ఏథర్డు పారమో చదువుకున్నాడు. అయితేనేం? హొటల్ నడిపిస్తున్నాడు. డబ్బుంది .... చేసుకుంటావా?" అన్నాడు అన్న కొంచెం బాధపడుతూనే ..... లలిత ఏమీ  ఆలోచించలేదు . వెంటనే ఒప్పేసుకుంది. ఆవిడ మనస్సు అప్పట్లో పెళ్ళి గురించి , వైవాహిక జీవితం గురించీ ఆలోచించే స్థితిలో లేదు. తల్లి చిరాకు మాటలూ ...... అన్న ఆవేదన .... అమ్మలక్కల వంకరటింకర వ్యాఖ్యానాలూ .... వీటన్నిటి నుండి తప్పించుకునిపొతే చాలని మాత్రమె అనుకుంది......   

 Previous Page Next Page