Previous Page Next Page 
ఎండమావులు పేజి 7


    చివాలున లేచి వెళ్ళి అవతల మంచం మీద పడుకుంది గౌతమి దుప్పటి ముసుగు పెట్టుకుని.
    "ఈ లోకాన్నే కాక భర్త హృదయాన్ని కూడా అర్ధం చేసుకోలేని, అర్ధం చేసుకోటానికి ప్రయత్నించని అజ్ఞానురాలు" అని అనుకున్నాడు జానకిరాం.

                                      6

    రైలు దిగంగానే సరాసరి జయలక్ష్మి ని చూట్టానికి బయల్దేరాదు మురహరి. ఆవేళప్పుడు జయలక్ష్మిని చూడాలంటే హాష్టలుకు వెళ్ళాలి. ఉమన్స్ హాస్టలుకు మగపిల్లల్ని అందులోను కాలేజీ స్టూడెంట్సుని రానివ్వరని మురహరికి తెల్సినా జయలక్ష్మి ని చూడకుండా ఉండలేక హాష్టలు వైపు బయల్దేరాడు. తీరా గేటు వద్దకు వచ్చాక ఈ లోకంలోకి వచ్చినట్లయింది. ఇంక లాభంలేదని మళ్ళా అదే రిక్షాలో తన రూముకు బయల్దేరాడు. ఆ రాత్రి ఎంత తొందరగా గడిచి తెల్లవారుతుందా అనుకున్నాడు.
    కాలానుగతంగానే తెల్లవారింది. తొందర తొందరగా కాలకృత్యాలు తీర్చుకుని ఎప్పుడు కాలేజీ టైమవుతుందాని నిముషాలు లెక్క వేసుకుంటూ కాలక్షేపం చేశాడు.
    కాలేజీ ఆవరణలోనే కనిపించింది జయలక్ష్మి. "ఎప్పుడొచ్చావు మురహరీ. మీ అమ్మగారు పోయినందుకు చాలా విచారం. ఆవిడ రోజులు అంతటితో చెల్లిపోయినయ్యి. ఏ క్షణంలో ఏం ముంచుకొస్తుందో మనం చెప్పలేం కదా" అన్నది జయలక్ష్మి సానుభూతి సూచకంగా.
    అంతరించిన దుఃఖం అంతలోనే హృదయపుటంచులను తాకినట్లయింది. ఆమె అంత్య ఘడియలూ, భౌతిక కాయమూ ఒక్కసారిగా కళ్ళకు కట్టినట్లు కనిపించింది మురహరికి. కళ్ళలో కన్నీటి ధారలు సుళ్ళు తిరగగా ఒక్క క్షణం మనస్సు గతుక్కు మనిపించింది. ఒక్కసారి బరువుగా శ్వాస పీల్చి "వెళ్ళిపోయింది జయా, అమ్మ వెళ్ళిపోయింది. నాన్న పోయి రెండేళ్ళు దాటింది. ఇప్పుడు నేను ఏకాకిని" అన్నాడు మురహరి. జయలక్ష్మి మరి మాట్లాడలేకపోయింది. ఇద్దరూ ఎవరి క్లాసులకు వాళ్ళు వెళ్ళిపోయారు.
    సాయంత్రం ఇద్దరూ బీచికి వెళ్ళారు. ఆరోజున జయలక్ష్మి రోజూ కన్న చక్కగా ముస్తాబయింది. కొత్త చీరె, జాకెట్టు ధరించింది. ఎంతో ఉత్సాహంగా ఉంది.
    ఇద్దరూ సముద్రపు టలలు చూస్తూ కూర్చున్నారు. కాసేపు ఎవరూ మాట్లాడుకోలేదు.
    కొందరి మానవుల ప్రకృతి మరింత విచిత్ర మైనది. ప్రతి సన్నివేశానికీ ఆవేశపడతారు. ఆ క్షణాన ఆ వ్యక్తి లేకపోతే నా జీవితం ఏమయ్యేదో నని అనుకుంటారు. మళ్ళీ ఆ వ్యక్తి రంగం నుంచి తప్పుకోగానే తమ పనులు తామే యధేచ్చగా చేసుకుపోతారు. నిన్నటి రోజున ఆ వ్యక్తి తన ఎదురుగా ఉండటంచేతనే తానా ఘనకార్యం సాధించగలిగానని అనకున్న తనే. ఈరోజున ఆ వ్యక్తి లేకపోయినా తేలికగా ఆ ఘనకార్యం సాధించగలుగుతాడు.
    మురహరి మనస్తత్వం ఇదే. తల్లిదండ్రుల చాటున పెరుగుతున్న రోజుల్లో అమ్మా, నాన్నాలేకపోతే నేను జీవించనేలేను అనుకునేవాడు. తండ్రి పోగానే "నే నెట్లా బ్రతకను నాన్నా, అమ్మను నామీదకు త్రోసి పోతున్నావా, అమ్మను నేను పోషించగలనా" అని వాపోయాడు. ఆ రోజుల్లో తల్లి పరిస్థితి చూసి ఎంతో విచారపడేవాడు. ఏమయినా సరే అమ్మను నా పోషణలోనే ఉంచుకోవాలి ఎవరి పంచన చేర్చకూడదు. అమ్మ బరువు ఎవరి నెత్తినా వెయ్యకూడదు, అనుకునే వాడు. తండ్రి పోయిన మూడు నెల్లు వెళ్ళాక మేనమామ కేశవరావు వచ్చి "తల్లిగా ఆవిడ బాధ్యత నీ కెంత ఉందో, చెల్లెలుగా నాకూ అంత బాధ్యతా ఉన్నది. నువ్వు విశాఖపట్నం వెళ్ళి అవర్సు చదువుకో. నీ చదువు పూర్తయ్యేవరకూ మీ అమ్మ నా దగ్గరే ఉంటుంది. అన్నగా నా బాధ్యత నెరవేర్చు కోవాలి" అన్నాడు.
    మేనమామ ఈ మాటలనంగానే సగం బరువు తీరి నట్లుగా తృప్తిపడ్డాడు మురహరి. వెంటనే తల్లిని మేనమామ ఇంటికి పంపి తను అవర్సు ప్రథమ సంవత్సరంలో చేరాడు విశాఖపట్నంలో.
    ఈ రెండేళ్ళూ తల్లి తనకు సామాన్యంగా గుర్తుకు వచ్చేదే కాదు శలవలకు మేనమామ యింటికి వెళ్ళినప్పుడు తప్ప. మళ్ళీ రైలెక్కేసరికి అమ్మనే మర్చిపోయేవాడు మురహరి.
    ఇప్పుడు అమ్మ పోయాక కంటికి మింటికి ఏకధారగా ఏడ్చి, పలకరించిన ప్రతివారినీ కావిలించుకుని కంట తడి పెట్టి "అమ్మతోబాటు నేనూ పోతే ఎంత బావుండేది. అమ్మా, నాన్నా పోయాక నేను బ్రతికి ఎవర్ని ఉద్ధరించను. నన్నూ ఆ పరమాత్ముడు ఎత్తుకుపోతే ఎంత బావుండేది. అమ్మ పోయాక నే నెట్లా బ్రతకాలి, 'అమ్మా' అని ఎవర్ని పిలవను. నా కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకోను. నా గోడు ఎవరు ఆలకిస్తారు" అని ఆడవాళ్లకు మించి ఏడ్చాడు తల్లి పోయిన రోజున.
    స్మశానంలో చితి పేర్చి తల్లి భౌతికకాయానికి చితి అంటిస్తుండగా బావురుమని ఏడ్చి "ఈ చేత్తోనే నా తలకూ ఈ కొరివి పెట్టుకుంటాను" అన్నాడు. ఆ మాటలూ, ఆ దుఃఖమూ చూసే సరికి అక్కడ చేరిన పెద్ద లందరకూ కళ్ళు చెమర్చి "ఎంత బుద్ధి మంతుడు మురహరి, ఉన్న ఒక్కడూ రత్నంలాంటివాడు. కేశవరావూ ఇంక మేనల్లుడి బాధ్యతంతా నీదే. నువ్వే వాడ్ని ఒక ఇంటివాడ్ని చేసి నీ బిడ్డలతో బాటుగానే కడుపులో పెట్టుకోవాలి" అన్నారు.
    మేనమామ కేశవరావు పెద్దలమాట కాదన లేదు. మేనల్లుడ్ని తన కడుపులో పెట్టుకుని ఆదరిస్తా నన్నాడు. కర్మకాండలన్నీ చేసే తరుణంలో అప్పుడప్పుడూ చుట్టాలంతా తన పెళ్ళి విషయం ప్రస్తావించి జ్యోతిని తనకిచ్చి పెళ్ళి చెయ్యమని మేనమామతో చెప్పినప్పుడు ఏదో పోగొట్టుకున్న వాడిలా, ఎవరినో దూరం చేసుకుంటున్న వాడిలా మనస్సులో బాధపడినాడు. అనాలోచితంగా జ్యోతి ఒక్కతే ఎప్పుడయినా ఎదురుపడితే ఎందుకో అంతలోనే ఖంగారుపడి తలొంచుకుని పక్కగా తప్పుకుని వెళ్ళిపోయేవాడు. జ్యోతిని చూస్తే అతనికి ఏ భావమూకలక్కపోయినా మనస్ఫూర్తిగా ఆమెవైపు చూడలేక పోయేవాడు. జ్యోతితో మాట్లాడాలని ఎప్పుడయినా అనుకున్నా ఆ ఆలోచను ఆచరణలో పెట్టలేక పోయేవాడు.
    శలవు పదిహేను రోజులూ గడిచాక ఏదో పెద్ద బరువు బాధ్యతల్ని వదిలి వెళ్ళుతున్నట్లుగా తేలిక పడిన హృదయంతో రైలెక్కాడు. రైలెక్కింది మొదలూ మనిషి రైల్లో ప్రయాణం చేస్తున్నా మనస్సు ఎప్పుడో జయలక్ష్మివైపు మళ్ళింది.
    "జయా."
    మిలమిల మెరిసే నయనాలతో అతనివైపు చూసింది జయలక్ష్మి. ఎన్నడూ చూడని ప్రత్యేక ఆకర్షణ, ఆకర్షించే ఏదో ప్రత్యేక శక్తి ఆమెలో చూస్తున్నట్లుగా భావించాడు మురహరి. "ఇవాళ చాలా అందంగా ఉన్నావ్ జయా. ఎన్నడూ లేని ప్రత్యేకాకర్షణ నీలో దోబూచు లాడుతున్నది. ఏమిటో విశేషం."
    జయలక్ష్మి నవ్వుతూ "తెల్సుకో చూద్దాం. గత సంవత్సరం కూడా ఇదే తారీఖున ప్రత్యేకంగా అలంకరించుకుని నిన్ను 'టీ' కి కూడా పిల్చాను. గుర్తుందా" అన్నది. "అయితే ఇవాళ నీ పుట్టినరోజన్న మాట. నిన్ననే చెప్పలేదేం జయా. ఒకరోజు ముందుగా చెపితే అరిగిపోతావా" అన్నాడు ముందుగానే చెప్పి ఉంటే ఏదయినా చక్కని బహుమతి ఇద్దామనుకున్నారు. అదేమీ చెప్పీ చెయ్యకుండా అందులోనూ సాయంత్రంపూట ఒక్కసారి నా పుట్టింరోజివాళ అనేసింది. జయలక్ష్మి.
    "నిన్ననే పుట్టెడు విచారంతో నువ్వు వచ్చావా. తగుదునమ్మా అని మై డియర్ మురహరీ రేపే నా పుట్టిన రోజని ఎట్లా చెప్పను. పోనీలే, దానికేం గాని నీ ఆదరాభిమానాలు ఉంటే నా కదే పదివేలు." అన్నది జయలక్ష్మి.
    "ఇది ఎన్నో జన్మదినోత్సవమో చెప్పు జయా."
    "కనుక్కో చూద్దాం" నవ్వుతూ చూసింది జయలక్ష్మి.
    "పందొమ్మిది వెళ్ళి పద్దెనిమిది వచ్చిం దనుకుంటున్నా" అన్నాడు మురహరి.

 Previous Page Next Page