Previous Page Next Page 
ఎండమావులు పేజి 8


    "కరెక్ట్. పందొమ్మిది, పద్దెనిమిది, పదిహేడు, పదహారు ఇట్లా ఏ యేటి కాయేడు తగ్గుకుంటూ వెళ్ళి చివరికి జీరో వరకూ వెళ్ళుతుంది వయస్సు. అవునా" అన్నది జయలక్ష్మి.
    "అవును జయా నువ్వు ఆరోజుకన్న ఆరోజు పెద్దదానివై పోతుంటే ఏం బావుంటుంది" అన్నాడు.
    అంతలోకే మెల్లిగా వచ్చి ప్రతాప్, నిర్మల అక్కడ నిల్చున్నారు. ఒక్కసారిగా వాళ్ళని చూసే సరికి ఆశ్చర్యం కలిగింది మురహరికి.
    "ఏం మురహారీ, ఎప్పుడు రాక. సారి, మీ అమ్మగారు పోయార్టగా" అన్నాడు ప్రతాప్.
    సానుభూతివాక్యాలు నిర్మల కూడా పలికింది. ప్రతాప్, నిర్మల జయలక్ష్మి వైపు ఒక్కసారి చూసి,
    "ఏం జయలక్ష్మీ, మీ ఏకాంతానికి మేం అంత రాయమేమో. వెళ్ళొస్తా" అన్నారు ఒక్కసారిగా.
    "ఇదేమాట నేనూ అడుగుతున్నాను. మేం యిక్కడుంటం నుంచే మీ విహారానికి మేం అడ్డువస్తున్నట్లుగా మీరు భావిస్తున్నారని మేమూ ఎందు కనుకోకూడదు" అన్నది జయలక్ష్మి ఆమె ముఖంలో, మాటల్లో చిరుకోపం కనుపించింది. నిర్మల ఏం మాట్లాడలేక తల వంచుకున్నది. ఏమన్నా మాట్లాడితే మళ్ళా తల ఎత్తకుండా జయలక్ష్మి మాట్లాడుతుందని తెల్సు. ప్రతాప్ మాత్రం ఆ సంభాషణ అంతటితో ఆపి వెయ్యా లనుకోలేదు. ఆ రోజున నాటకం విషయంలో తనతో ఏకీభవించినప్పట్నుంచి అతనికి జయలక్ష్మి మీద కొంతవరకు కోపంగానే ఉంది. ఏ చిన్న అవకాశం కలిగినా అది పురస్కరించుకుని ఆమెను దుయ్యబట్టా మనుకున్నాడు. నిర్మల మాదిరి జయలక్ష్మి భోళా వ్యక్తి కాదని తెల్సు.    
    "సంక్రాంతి వెళ్ళాక పరిషత్తు నాటకాలు నాటికలూ ప్రదర్శింపబడతాయి జయలక్ష్మీ. మనం ఇంకా బాగా రావాలి. ఈసారి ఫస్టు పైజు తెచ్చుకోవాలి. అందుకు నీ సహకారం చాలా అవుసరం" అన్నాడు ప్రతాప్.
    "నాటకంలో నా కిచ్చిన పాత్ర విషయంలో న్యాయం చేస్తాననీ, పాత్రోచితంగా నటించగలననీ నాకు ధైర్యం ఉంది ప్రతాప్" అన్నది.
    "నాటకంలో కొన్ని సన్నివేశాలు, మార్పు చెయ్యబడ్డయి జయా. ఆ మార్పులకు అంతా వప్పుకున్నారు. నువ్వు అంగీకరించి ఆ సన్నివేశాలకు తగినట్లుగా నటించటం మళ్ళా రెండు, మూడు సార్లు రిహార్సల్సు చెయ్యాలి" అన్నది నిర్మల.
    "మార్పులకూ, చేర్పులకూ నాటక రచయిత వప్పుకున్నారా" అన్నది జయలక్ష్మి కోపంగా.
    "ఆ, అదెంత పని రెండు గోల్డు ఫ్లేక్ సిగరెట్టు పెట్టెలు కొనిచ్చి రెండు ఖారా కిళ్ళీలు ఇచ్చామంటే తెల్లవారేసరికి నాటకమంతా మార్చేస్తారు. అది ఎప్పుడో జరిగిపోయింది." అన్నాడు  ప్రతాప్ సగర్వంగా సిగరెట్టు వెలిగిస్తూ.
    "ఈ మార్పులతో సరా, లేక పరిషత్తుకు వెళ్ళేలోగా మళ్ళా మార్పులు జరుగుతయ్యా.    అయితే నా పోర్షన్ లో జరిగిన మార్పేమిటి."        
    "హీరో వళ్ళో పడుకుని అతని ముఖంలోకి చూస్తూ కొన్ని డైలాగ్సు చెప్పాలి" అన్నాడు ప్రతాప్.
    ఈ సంభాషణంతా విసుగ్గా ఉంది మురహరికి. జయలక్ష్మికి మనస్సులో కోపం రగులుతున్నా ఎక్కువగా బయటపడతల్చుకోలేదు.
    "అట్లాగా సరే ఆ డైలాగ్సు చూసి, చదివి నా అభిప్రాయం అప్పుడు చెప్తాను" అన్నది జయలక్ష్మి.
    "అబ్బా, మేం వెళ్ళొస్తాం. రా నిర్మలా" అన్నాడు ప్రతాప్. నిర్మలతో కలిసి ప్రతాప్ వెళ్ళిపోయాడు.
    "ఈ నాటకాల పిచ్చి నీకు వదిలేటట్లుగా లేదు జయలక్ష్మీ కళాసేన, కళాపోషణ, కళారాధన పేరుతో ఎన్ని అవతవకలు జరుగుతున్నయ్యో ఆలోచిస్తే కొంతమంది వ్యక్తుల మనస్తత్వాలు అర్ధమౌతయ్యి. తడవకి ఒక రీతిగా స్క్రిప్టు మార్చేసే ఘటికులతో కలిసి నాటకం వేస్తున్నావంటే వాళ్ళ సంకుచితభావాలు అర్ధంచేసుకోవచ్చు. నీ బాగోగులు నువ్వు ఆలోచించుకో. నే చెప్పేదేమీ లేదు" అన్నాడు మురహరి.
    "మురహరీ నిన్ను చూసే నాకు ఏం చెప్పాలో తోచటంలేదు. ప్రపంచంలో ఏ జీవీ ఏకాకిగా బ్రతకలేదు. ఏ మనిషితో ఏ అవసరం వస్తుందో ననే దూరదృష్టితో ఆలోచించి ఏ వ్యక్తితో ఎంత వరకూ ఎట్లా మసులుకోవాలో తెల్సుకుంటేనే ఈ సంఘంలో చెలామణి అవుతాము. లేకపోతే అనేక అనర్ధకాలకు గురికావాల్సొస్తుంది" అన్నది జయలక్ష్మి.
    "అట్లాగని ప్రతివారి అభిప్రాయాలకూ అనుగుణ్యంగా వాళ్ళకు తాళంవేస్తూ పతితులమై పోగలమా, ఆలోచించు జయా" అన్నాడు మురహరి ముభావంగా. ఏదో భావన అతని మనస్సులో అంతర్లీనమై పోయింది.
    ఆ స్థితిలో మురహరి ముఖంలోకి మార్పులు చూసేసరికి జయలక్ష్మి కన్నులు అశ్రుపూర్ణము లైనవి. అభిమాన విషయమైన చిరు సిగ్గుతో ఆమె ముఖం ఎరుపెక్కింది. ఆమె హృదయం అపూర్వమైన అవ్యక్త వేదనతో కంపించింది. కళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరగగా నాలుగు కన్నీటి బొట్లు ఆ ఇసుకరేణువుల్లో కలిసిపోయినయ్యి.
    ఆ పరిస్థితిలో ఏం మాట్లాడకుండా కూర్చున్న జయలక్ష్మిని చూసేసరికి మురహరికి మనస్సులో తీరని ఆవేదన బయలుదేరింది. తా నన్నమాటలకు జయలక్ష్మి బాధపడుతున్నదని తెల్సుకున్నాడు.
    "జయా సామాన్య మానవ మనస్తత్వాల్ని దృష్టిలో ఉంచుకుని, నీ బాగోగుల కోసం అట్లా అన్నాను గానీ, నీమీద నా కేమీ ద్వేశంచేత అట్లా అనలేదు జయా. అయినా నిన్ను శాసించేందుకూ, నిన్ను ఇన్ని మాటలూ అనేందుకూ నే వెవరిని. నాకు నీమీద అధికారం ఏముంది. నీ స్వంత విషయాలలోనేను జోక్యం కలుగజేసుకుంటూ, నీ మనస్సుకి ఇంత బాధ కలిగిస్తూ, ఎవరో నిన్ను ఏదో చేస్తా రనుకోవటం అర్ధం లేని సంగతి నీమీద నాకెంత అధికార ముందో, ప్రతాప్ కూ అంతే. ఇంకా అతని బాధ్యత ఎక్కువ. నాటకంలో నువ్వు నాయిక పాత్రధారివి. అతను నాయకపాత్రధారి, మీ రిద్దరూ సహకరించి నటిస్తేనే నాటకం రక్తికడుతుంది. ప్రేక్షకులు ఆనందిస్తారు. చప్పట్లు కొడతారు. హర్ష పులకాంకితులౌతారు. ప్రైజు వస్తుంది. మీ ఫోటోలు చక్కగా పత్రికల్లో ప్రకటిస్తారు" అన్నాడు ఉద్వేగంగా మురహరి.

    "నీ మనస్సు సరిలేనప్పుడు నేనేం చెప్పినా విని పించదు మురహారీ. పరిషత్తు అయిపోయాక నయినా అన్ని విషయాలు నువ్వు తెల్సుకుంటే నేను ధన్యురాలినే. ఈ సమయంలో ఇంతకన్నా నేను చెప్పగలిగిందేమీ లేదు. ఒక్క సంగతి మాత్రం గుర్తుంచుకో. స్త్రీ తన జీవితంలో ఒక్కసారే ఒక్కరికే లొంగిపోతుంది. పరేంగితజ్ఞానం కల స్త్రీ ఎన్నడూ ఎవ్వరికీ లొంగిపోదు ఒక్క భర్తకు తప్ప. అట్లా చేయలేనివారు స్త్రీలు కారు. స్త్రీత్వంతో జీవితం గడపాలని సాహసించే రాక్షసులు. వారికి డబ్బు విలువే తప్ప స్త్రీత్వంలోని విలువ తెలియదు" అన్నది జయలక్ష్మి.
    సజల నయనాలతో ఒకరి నొకరు చూసుకున్నారు.

                                   7

    ఉత్తరమైనా రాయకుండా హఠాత్తుగా ఒక్కర్తే వచ్చిన గౌతమిని చూసేసరికి తల్లి దండ్రులకు ఆశ్చర్యం కలిగింది. పండుగ రోజులు కావు. తాము రమ్మనమని ఉత్తరం రాయలేదు. అలాంటి స్థితిలో వచ్చిన గౌతమిని చూసేసరికి వారికి నిజంగా ఆశ్చర్యమే కలిగింది.
    రిక్షావాడు పెట్టె, బెడ్డింగు, టిఫిన్ క్యారియరూ. మరచెంబూ తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. గౌతమి చిరునవ్వుతో తల్లిదండ్రుల వైపు చూస్తూ.
    "కులాసాగా ఉన్నావా అమ్మా" అన్నది రిక్షావాడికి డబ్బులిచ్చి పంపింది.
    "ఉత్తరమైనా రాయకుండా వచ్చావేం తల్లీ నువ్వొస్తావని తెలిస్తే స్టేషనుకు వచ్చేవాడ్నిగా" అన్నాడు తండ్రి.
    గౌతమి తల్లివైపు చూస్తూ "పరిస్థితుల్ని బట్టి వచ్చానమ్మా" అన్నది ముభావకంగా.
    తండ్రి ఇంకేం మాట్లాడలేదు.
    "ముందు స్నానం చేసి బట్టలు మార్చుకో, తరువాత మాట్లాడుకోవచ్చు" అన్నది తల్లి.
    "కులాసాగా ఉన్నారా వదినా" అంటూ నవ్వుతూ పలకరించింది వదినగారు ధాన్యలక్ష్మి.
    "ఆ కులాసానే మీ పసివాడు ఏమంటున్నాడు. కాస్త నడుస్తున్నాడా, మాట లొచ్చినయ్యా, అన్నయ్య ఆఫీసుకెళ్ళా డేమిటి అప్పుడే" అన్నది గౌతమి.
    "ఆ వెళ్ళారు. వారికి ఆఫీసే ఇల్లు. మేనల్లుడిప్పుడే నిద్రపోతున్నాడు" అన్నది ధాన్యలక్ష్మి.
    గౌతమి పెట్టె తీసి బట్టలు తీసుకుని స్నానానికి వెళ్ళింది.
    తండ్రి ఏదో ఆలోచిస్తూ ముందు గదిలోకి వెళ్ళిపోయాడు. తల్లి వంటింట్లోకి వెళ్ళింది. ధాన్యలక్ష్మి మనస్సులోనే నవ్వుకుంటూ తను గది లోకి వెళ్ళింది.
    మనలో కొంతమంది వ్యక్తులుంటారు. వారికి ఖంగారు జాస్తి. ప్రతి విషయానికీ ఆందోళన, చిరాకు, కోపమూ అసలు విషయాన్ని అర్ధం చేసుకోరు. వారిలో తమోగుణం జాస్తి. అనదల్చుకున్నదీ, అనేదీ ఎదురుగా ముఖంమీదనే అడిగేసి నాలుగు దులిపినట్లు మాట్లాడుతారు. దాంతో వాళ్ళ బరువు బాధ్యతలు తీరిపోయినట్లుగా అనుకుంటారు. తాము చాలా నిష్కల్మషహృదయుల మనీ, ఉన్నది ఉన్నట్లుగా ఎదురుగానే అడిగేది తను వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటామనీ అనుకుంటారు. తాము ముక్కుకు సూటిగా పోతున్నామనీ, న్యాయమార్గాన నగుస్తున్నామనీ వారి భావం. ఎంత ముక్కుకు సూటిగా పోయినా, ఎంత న్యాయంగా మాట్లాడినా ఒక్కోసారి ఆ ముక్కుకి దెబ్బ తగిలే పరిస్థితి వస్తుంది. అప్పుడైనా ఆ ముక్కు నలుపుకుని మళ్ళీ ముక్కుకి సూటిగానే పోతారుగానీ కాస్త మలుపుతిరిగి నడవాలనే అభిప్రాయం వారికి కలగదు. ఆ ముక్కు నెప్పి తగ్గాక మళ్ళా యధాప్రకారమే. ఎటువంటి యదార్ధ విషయాన్నయినా ఉన్నది ఉన్నట్లుగానే ముఖంమీద అడిగేస్తే వాళ్ళకు తృప్తి. కాని, ఎదుటివారి మనస్సు ఎంత బాధపడుతుందో, వారి మనస్సు చివుక్కుమంటుండదేమోననే విచక్షణా జ్ఞానం వారికి తెలీదు.

 Previous Page Next Page