పెదవి విరిచి ముఖం చిట్లించింది గౌతమి. శ్రీ లక్ష్మి వంట ఇంట్లోకి వెళ్ళింది. అత్తగారు పూజా మందిరం ఉన్న గదిలో వెళ్ళింది. జానకిరాం అప్పుడే శివాలయానికి వెళ్ళి వస్తున్నాడు తనలో తనే చిరునవ్వు నవ్వుకుంటూ వస్తున్న భర్తను చూచి గౌతమి ఏమిటో అర్ధంకాక గది గుమ్మం ముందే నిల్చుంది. భార్యను చూసి ఏమిటన్నట్టుగా మందహాసం చేశాడు కుర్చీలో కూర్చుంటూ.
"ఎందుకో నవ్వు కుంటూ వస్తున్నారు" అన్నది గౌతమి.
"నిన్ను చూసే" అన్నాడు జానకిరాం.
"నన్ను చూశా! అంత నవ్వొచ్చేటట్లున్నావా! పోనీలెండి నన్ను చూస్తే అందరికీ నవ్వుగానే ఉంది. నవ్వులాట కాక మరేముంది. భర్త సంపాదన వరుడు కానప్పుడు భార్యని చూసి అంతా నవ్వుతారు. ఎందుకు నవ్వరు. అంతా మిమ్ము చూసి నవ్వు తుంటే మీరు నన్ను చూసి నవ్వుతున్నారు. అంతేకదూ" అన్నది గౌతమి.
గౌతమి మనస్సు మహా సముద్రం వంటిది. కాంక్షలనే ఉత్తుంగ తరంగాలు ఉవ్వెత్తున వచ్చి జానకిరాంను చూడంగానే పటా పంచలై పోతయ్యి. మనస్సులో ఎన్నో కోరికలనూ, మమతలనూ పెంచుకుని వాటిని ఆచరణలో పెట్టాలనే తహతహలో భర్తకు ఇష్టమయ్యే తీరుగా లాలనగా కబుర్లు చెప్పి అతన్ని ప్రసన్నుడ్ని చేసుకుని తన కోరికలను చెప్పి తీర్చుకోవాలనే ఆరాట పడుతుంది. భర్తను ప్రసన్నుడ్ని చేసుకునే తీరుగాని, స్త్రీ సహజమైన లాలిత్యంగాని ప్రేమను సూచించే తీరుగా మాట్లాడే విధానం గాని గౌతమికి తెలియవు. ఏదో సంగతి మృదువుగా, లాలనగా, మాధుర్యాన్ని ఒలక పోస్తూ అలవోకగా, చిరుసిగ్గుతో చెప్పాలనుకుంటుంది. మనస్సులో ఎన్నో అనుకుని, ఎంతో ఆలోచించి ఆ తీరుగా భర్తతో ఆ సంగతి ముచ్చటించాలని తయారై వచ్చే సరికి జానకిరాం ఏం పుస్తకం చదువుకుంటూనో, ఏ పురాణం చదువుకుంటూనో ఉంటాడు. అక్కడితో ఆమె పుణికి పుచ్చుకుని తెచ్చుకున్న ఊహలన్నీ అలా గాలిలో తేలి పోయినట్లయి, అంతలోకి చిరుకోపం ముంచుకొచ్చి, అదంతా ప్రణయ కోపంగా మార్చాలనుకుని, గోముగా తేనెలూరే టట్లుగా మాట్లాడాలనుకుని, అసలు విషయాన్ని మర్చిపోయి కర్కశంగా ఎవరి మీదనో, ఏదో ఒక చిన్న పితూరీ చెపుతుంది, అప్పుడు గౌతమి మాట్లాడే తీరు చూస్తే జానకిరాం కు కోపం రాకుండా నవ్వొస్తుంది. అంతటితో తన మాట నెగ్గలేదనే కోపంతో చురచురా చూస్తూ, కొర కొర లాడుతూ అవతలికి వెళ్ళిపోతుంది గౌతమి.
ఇది నిత్యమూ ఆ భార్యా భర్తల మధ్య నడిచే గ్రంథమే.
తనతో స్నేహ సంబంధాలున్న ప్రతి వ్యక్తి మనస్తత్వమూ జానకిరాం బాగా తెలుసు. ఎదుటి వారు నాలుగు మాటలు మాట్లాడటం వినగానే వారి మనస్తత్వాన్ని ఇట్టే గ్రహిస్తాడు. జానకిరాం అటువంటి వాడికి భార్య మనస్తత్వం ఎప్పుడో తెల్సుకోవటంలో ఆశ్చర్యం లేదు.
"నేను ఉద్యోగం ఎందుకు చెయ్యటంలేదో తెలుసా" అన్నాడు జానకిరాం.
"ఎందుకని" ఆశ్చర్యంగా అడిగింది గౌతమి.
"నీ నుంచే"
"నా నుంచా"
మనస్సు ఆందోళనతో నిండిపోయింది.
"అసలు నేను ఏ ఉద్యోగం చెయ్యాలని నీ ఊహ"
"ఎమ్మే ఫస్టు, క్లాసులో పాసయారుగా. కాలేజీ లెక్చరరుగా చేరి కనీసం యూనివర్శిటీ కాలేజి ప్రిన్సిపాలుగానైనా చేసి రిటైరవాలని నా కోరిక"
చిరునవ్వుతో, ఇంత కళ్ళు చేసుకుని సగర్వంగా చెప్పింది గౌతమి.
"అవునా, ఆ హోదాకు తగినట్లుగా నా భార్య కూడా ఉండాలా, నా గౌరవానికి తగినట్లుగా నువ్వూ పర్చుకోవాలా. ప్రిన్సిపాలుగారి భార్య వట్టి మందమతి, ఆవిడకు ఎట్లా మాట్లాడాలో కూడా తెలీదు. చదువు సంస్కారం లేని ఇల్లాలు అంటారనుకో, అప్పుడు మనస్సు ఎట్లా ఉంటుంది." అన్నాడు జానకిరాం.
స్తబ్దురాలైంది గౌతమి. జానకిరాం అట్లా అంటాడని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఈ ఎత్తి పొడుపు మాటలు ఎందుకంటున్నాదో గ్రహించ లేదు. తను ఏం తప్పుచేసింది. భర్త గౌరవ ప్రతిష్టలు పోయేటంత పాతకం తనేమీ చెయ్యలేదే. తనను ఇంత చిన్న తరహాగా, విలువ లేకుండా ఎందుకు చూడాలి. కట్టుకున్న భర్తనోటంటనే ఇలాంటి మాట్లు వింటుంటే ఇంకా ఇతరులు ఎంత లేసిగా మాట్లాడతారు. చదువుకున్న వారైనా, చదువుకోని వారయినా, సంపాదన పరుడయినా కాకపోయినా, ప్రతి మగవాడూ తన భార్య మీద ప్రతి చిన్న విషయానికీ విలువ లేకుండా మాట్లాడుతాడు. అదో గొప్పవనుకోవటమా, తెలివి తేటలనుకోవటమా, తాళి కట్టిన బానిసగా అర్ధం చేసుకోవటమా, భర్త అనే డిగ్రీలు, అక్కర్లేని హోదా తమ మీద చూపించటమా? ఎందుకింత కోపం? ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడే తనమీద ఇంత అధికారం చెలాయి స్తుంటే, రేపు నిజంగా లెక్చరో, ప్రిన్సిపాలో అయితే ఇంక తనకు దెబ్బలు చివాట్లూ కూడా తప్పవేమో?
అప్పటి కప్పుడే ఇన్ని రకాలుగా ఆలోచించింది. గౌతమి దుఃఖం పొంగి పొర్లుకొస్తున్నది. ముక్కులు ఎగ బీలుస్తూ కళ్ళొత్తుకుంటూ తన గదిలోకి వెళ్ళింది గౌతమి.
జానకిరాం నవ్వుకుంటూ పుస్తకం మూసేశాడు.
"ఇంటరు పాసయినా ఇంగిత జ్ఞానం లేని ఇల్లాలు" అనుకున్నాడు జానకిరాం తన మనస్సులో.
పగలు గడిచింది. ఆ రాత్రి గౌతమి భర్తతో మాట్లాడలేదు. ముభావంగానే ఉంది. ఒకసారి జానకిరాం పిలిచినా పలకలేదు. తానన్న మాటలకు గౌతమికి నిజంగానే కోపం వచ్చిందేమో ననుకున్నాడు జానకిరాం. గౌతమి మనస్సు కష్టపెట్టాలనే ఉదేశ్యంతో తనట్లా మాట్లాడలేదు. ఎ రకంగానైనా ఆమెకు లౌక్యంగా మాట్లాట్టం నేర్పుదామని తన భావన. తన ఆదర్శాలకు అనుకూలంగా మలుచుకుందామని తన ఉద్దేశ్యం. ప్రతి చిన్న విషయానికీ తప్పు పట్టించుకుని అత్తగారితో, ఆడబిడ్డతో అట్లా కోప తాపాలను ప్రసాదిస్తూ మాట్లాడకుండా చెయ్యాలని తన ఆవేదన మనసిచ్చి మాట్లాడుతూ నలుగురిలోనూ గౌతమి చాలా ఉత్తమురాలనే పేరు వచ్చేటట్లుగా చెయ్యాలని తన తహతహ. కానీ తన భావాన్ని గౌతమి అర్ధం చేసుకోలేదు. ఆ స్థితిలో ఉన్న గౌతమిని ఎట్లా ప్రసన్నురాల్ని చేసుకోవాలో తనకు తెలీటం లేదు ఆమె భావ ప్రకృతికీ, తన భావ ప్రకృతికీ ఎక్కడా పోలిక లేదు.
తన జీవితంలో గౌతమిని జానకిరాం ఎంత గానో ప్రేమిస్తున్నాడు. ఆమెలో మార్పు తీసుకు రావాలని ఎప్పుడూ తలపోస్తాడు. ఏ తీరుగా మాట్లాడితే తన భావాన్ని గౌతమి అర్ధం చేసుకుంటుందోనని అనేక మార్లు వెతుకుతాడు. కాని ఆ రెండు భావ ప్రవాహాలు ఈ అయిదేళ్ళ దాంపత్య జీవితంలోనూ ఎప్పుడూ ఒకటిగా కలువలేదు.
ఇద్దరి మనస్సులూ అవ్యక్త వ్యధంతో నిండిపోయినయ్యి.
గౌతమి మాట్లాడక పోయినా జానకిరాం ఆమెను తన వైపుకు తిప్పుకుని "పొరబాట్లనేవీ, విషయ పరిజ్ఞానం లేక పొవటమనేది మానవ జీవితంలో సహజమైన విషయమే. ఆ పొరబాట్లు దిద్దుకోగల రోజులు నీకు ఇంకా ఉన్నయ్యి, నిరుద్యోగినైన నన్ను ప్రేమించి జీవిత పర్యంతం నీ వాడినిగా మనస్ఫూర్తిగా చేసుకోవటానికి ప్రయత్నిస్తావని ఆశిస్తున్నాను. నీ జీవిత సోపానంలో అది మొదటి మెట్టు, రెండవది ఎదుటి వారి భావాలనూ, మనస్సులనూ అర్ధం చేసుకుని మాట్లాట్టమనేది నేర్చుకోవటం. ఈ రెండు మార్పులూ నీలో రానంతవరకు మనం లోకం కోసం, సంఘాన్ని మెప్పించటం కోసం, వారి దృష్టిలో హేయంగా చూడబడకుండా ఉండటం కోసం ఏకశయ్యాగతులమైనా నిరాశా జీవితం గడప వలసే వస్తుంది. నీలో నేను ఆశించిన సంస్కారం గగన కుసుమం కాకుండా ఉండేట్లుగా నడచుకుంటావని ఆశిస్తున్నాను. అప్పుడే నా ఉద్యోగాధ్యాయం కూడా ప్రారంభ మవుతుంది" అన్నాడు జానకిరాం.