Previous Page Next Page 
రెండోమనసు పేజి 6


    ఎవరిదాకానో ఎందుకు? ఇన్ని కబుర్లు చెపుతోంది గాని ఈ రాక్యలక్ష్మి గారేం చేసిందో తెలుసా? ఇంటిలో తెలీకుండా రైల్వే స్టేషన్ కొచ్చేయ్యవే అని చెపితే రైలింజన్ లాగా అందరికీ తెలిసేటట్లు చేరుకుంది స్టేషన్ కి! దాంతో పోలీసులు ఇద్దర్నీ తీసుకెళ్ళి లాకప్ లో పడేశారు" నవ్వుతూ చెప్పాడు నర్సరాజు.
    

                                                               * * *

    "ఆ! పాడు రైలు ......అంత కరెక్ట్ టైం కి అఘోరిస్తాయని ఎవరనుకున్నారు!" అంది రాజ్యలక్ష్మి.
    "అదేమిటి? అయినా మా రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తె భగ్గుమంటుంది కదా. అందుకని పారిపోక తప్పలేదు."
    "పోలీసు స్టేషన్ లో ఏమయింది?"
    "ఇద్దరం మైనారిటీ తీరిన వాళ్ళమేనని చెప్పాక వాళ్ళు వదిలేశారు. ఇంక చేసేది లేక మావాళ్ళు కూడా వదిలేశారు."
    "ముందు భోజనం కానిండి! నా ఇంతర్య్వు కి టైముండదు మళ్ళీ" అంది రాజ్యలక్ష్మి నవ్వుతూ.
    ఇద్దరూ భోజనానికి లేచారు.


                                                              * * *

    మర్నాడు పెట్టె తీసుకుని ఇంట్లోకి దిగాడు చలపతి. ఇల్లు చాలా బాగుందనిపించిందతనికి. సామానులన్నీ కొన్నాక సామాను ఎక్కడ పెట్టాలో కూడా ఆలోచించేశాడతను. కిటికీ దగ్గర మంచం....తలుపు అల్మారా.......వంటింటిలో ఓ షెల్ఫు...........గాస్ స్టవ్.
    అతని ఆలోచనలు అక్కడే ఆగిపోయినాయ్! అవును! అసలు తనకీ వస్తువులన్నీ ఏవి? ఇవన్నీ కొనడానికీ ఎంతలేదన్నా వెయ్యి రూపాయలు కావాలి! ఎక్కడి నుంచి వస్తాయ్ వెయ్యి రూపాయలు?
    ఒకటొకటి కొనాలంటే సంవత్సరం పడుతుంది! అంతవరకూ సావిత్రిని పెళ్ళాడకూడదు! సావిత్రి తన భార్యగా ఈ ఇంటిలో అడుగు పెట్టాలంటే అవన్నీ అమర్చక తప్పదు. సావిత్రి తన దగ్గర ఓ దేవతలా గడపాలి!
    ఆ రాత్రికి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు. వెంటనే సావిత్రిని పెళ్ళాడి తీసుకురావడమా, లేక కనీడ సౌకర్యాలన్నీ అమర్చే వరకూ అగటమా? ఆగితే అన్ని రోజులు వాళ్ళు సావిత్రి పెళ్ళి చేయకుండా ఊరుకొంటారా? ఈ లోపలే ఎవడో ఒకడికిచ్చి ముడి పెట్టేస్తారు!
    అంచేత అలా వీల్లేదు. ఈ నిర్ణయం మారదానికీ వీల్లేదు. తన యోగక్షేమాల గురించి అత్తయ్యాకు ఓ కార్డు రాశాడు చలపతి. ఆమెకు తన యోగక్షేమాల మీద శ్రద్ధ ఉందని కాదు. తన విషయాలు సావిత్రికి తెలుస్తాయని!
    మర్నాడు తన గోడు నర్సరాజుకి నివేదించుకోలేక తప్పలేదు చలపతికి. ముందుగా తనక్కావలసింది ఆర్ధిక సహాయం! నర్సరాజు దయతో రెండు వందల అప్పుగా ఇస్తే తను కొన్ని అత్యవసరమయినా సామానులు కొనుక్కోగలుగుతాడు. అడిగినంతా నరసరాజు ఇవ్వడంతో ఏనుగెక్కినంత సంబరమయింది చలపతి.
    నర్సరాజుతో కలిసి దుకాణాని కెళ్ళి ఓ సెకెండ్ హాండ్ మంచం కొనుక్కొచ్చాడు. దానికి నవ్వారు, దాని మీదకు రెండు దుప్పట్లు, కొన్ని వంటపాత్రలు, కొనుక్కొచ్చి ఇంట్లో పడేశాడు. అప్పుడే ఇంటికి కొంచెం కళ వచ్చినట్లు అనిపించింది.
    ఆ మర్నాటి నుంచీ ఇంట్లో వంట కూడా ప్రారంభించేశాడు. ఉదయం గీత వచ్చి కూర్చుంది కాసేపు. అతని వంటచూసి ఆమె నవ్వాపుకోలేకపోయింది.
    "అద్భుతంగా చేస్తున్నారు లేండి మన శత్రుదేశాల్లో మిమ్మల్ని వంటవాడిగా చేర్పిస్తే చాలు! ఒక్కరోజులో జయించవచ్చు వాళ్ళను.........."అందామె చలపతి కూడా నవ్వేశాడు.
    ఆ తరువాత గీతే అతనికి సహాయం చేసింది. వారం రోజులు గడిచేసరికి అతనికి చాలా వరకూ వంట చేయటం తెలిసిపోయింది. అయితే వంట మూలానా అతనికి ఊపిరి సలపని పని అయిపొయింది.
    ఆరోజు సాయంత్రం వంటపనిలో మునిగి ఉండగా గీత హడావుడిగా వచ్చింది.
    "త్వరగా రెడీ అవండి! సినిమా కెళ్దాం!" అంది చలపతితో.
    చలపతి ఆశ్చర్యపోయాడు. ఆమె తనతో చనువుగా ఉంటుంది గానీ ఇంత చనువుగా ఉంటుందనుకోలేదు. ఆమెతో సినిమా కెళ్ళడం తనకేమీ అభ్యంతరం లేదు. ఎటొచ్చీ ఆమెకే ఏమయినా ఇబ్బంది కలుగుతుందేమోనన్న అనుమానం.
    "మరి వంట?"
    "జీవితం అంటే వంట చేసుకుంటూ గడిపేయడం కాదు మాష్టారు! ఇంకా చాలా వుంది" అందామె నవ్వుతూ.
    చలపతి త్వరగా రడీ అయ్యాడు. ఇద్దరూ ఆటోలో సినిమా హాల్ కి బయల్దేరాడు. చలపతిని వారించి తనే టిక్కెట్లు తీసుకుంది గీత.
    ఆమె ప్రక్కనే కూర్చోవటం......ఆమె శరీరం తనకు తగలటం వింత అనుభూతి కలిగిస్తొందతనకి. అతని ఆలోచనలు పరి పరి విధాల పోతున్నాయ్.
    తననెందుకు సినిమాకు రమ్మందామే? ఆమెకు తన మీద "ఆ" అభిప్రాయం ఉందా? అంత అందంగా ఉన్న అమ్మాయి తనలాంటి మామూలు మనిషి ఎన్నుకుంటుందా?
    ఏ విధంగా చూసినా ఆమె కంటే తను తక్కువే! ఒకవేళ తననుకున్నదే నిజమయినట్లయితే ఏమిటి చేయటం? తనూ చొరవ తీసుకోవాలా తన శరీరం అప్పటికే ఎదురు తిరుగుతోంది.
    హటాత్తుగా అతనికి సావిత్రి గుర్తుకొచ్చింది.
    అతని ఆవేశమంతా చల్లారిపోయింది. తను ప్రాణాపదంగా ప్రేమించిన సావిత్రి ఉండగా గీత గురించి అలాంటి ఆలోచనలు ఎలా వచ్చాయ్? ఎందుకంత దూరం వెళ్ళిపోయాడు ? అతనికి నవ్వు వచ్చింది. మొట్టమొదటి సారిగా తనకు అనుభవమయిందిప్పుడు. ప్రేమ వేరు - సెక్స్ వేరు. దేని దారి దాందే! అందుకే తనంతగా చలించిపోయాడు గీత ఆకర్షణకి.
    గీత సినిమాలో లీనమయిపోయిందిగా చలపతి మాత్రం ఆమె శరీరం వంపులనే చూస్తూ కూర్చున్నాడు.
    ఇంటర్వల్ లో మాట్లాడటం ప్రారంభించిందామె "ఏమిటలా డల్ గా ఉన్నారు?"
    "ఏమి లేదు?"
    "మరి ఏమీ మాట్లాడరేం?"
    "ఏం మాట్లాడను?"
    "మిమ్మల్ని సినిమాకు ఎందుకు రమ్మన్నానో తెలుసా?"
    "ఏం? సినిమా చూడ్డానికి కాదా?" ఆశ్చర్యంగా అడిగాడతను.
    "ఊహు! అసలు సంగతి అది కాదు......."
    చలపతి గుండెలు వేగంగా కొట్టుకున్నాయ్.
    ఆమె ఏం మాట్లాడబోతుంది?
    "మీతో ముఖ్యమయిన విషయం మాట్లాడాలని....."
    "ఏమిటది....." నెమ్మదిగా గొంతు తగించి అడిగాడు . తను ఆమె వంక చూడలేక క్రిందకు చూడసాగాడు.
    "అదే ........మా సిస్టర్ విమల గురించి మీ అభిప్రాయం ఏమిటి?"
    చలపతి విస్మయంతో ఆమె వేపు చూశాడు.
    "విమలా?"
    "అవును! మీకు విమలలో నచ్చినదేమయినా ఉందా?"
    'అంటే?"
    గీత నవ్వేసింది.
    "సరిగ్గా అడగాలంటే ఏదోగా వుంది సరే - మీకు విమల నచ్చితే ఆమెను పెళ్ళి చేసుకోవడానికి అభ్యంతరం ఏమయినా ఉంటుందా?"
    చలపతి ఆశ్చర్యానికి అంతులేదు.
    "విమలా?" వేపు చూశాడు.
    "విమలా?"

 Previous Page Next Page