"కొంచెం ఘాటుగా రాశాను ఏమీ ఫర్వాలేదుగా?" అడిగింది నవ్వుతూ.
అతను బిడియంగా నవ్వాడు. "మీరు ఎలా రాసినా ఫరవాలేదండీ! చక్కగానే ఉంటుందది!"
హేమనవ్వేసింది గట్టిగా.
"మాకు ట్రాన్స్ ఫర్ అయిపోయిందండీ! వారం రోజుల్లో హైద్రాబాద్ వెళ్ళిపోతున్నాము....." అన్నాడు చంద్రకాంత్ కొద్ది క్షణాల తర్వాత.
హేమ ఆశ్చర్యపోయింది.
'అరె! ఇంత హఠాత్తుగానా?" అన్నది అతని వంకకళ్ళు పెద్దవిచేసి చూస్తూ.
"అవును! నిజం చెప్పాలంటే మాకెవ్వరికీ ఈ ఊరు వదలడం ఇష్టంలేదు!" అన్నాడతను. ఆ మాట చెప్పుతుంటే అతని మనసంతా బాధతోనిండిపోయింది. "ముఖ్యంగా నాకు అసలు ఇష్టం లేదు హేమగారూ! మిమ్మల్ని చూడకుండా ఉండడం నాకు ఎలా సాధ్యమో అర్ధంకావడంలేదు...." అనాలనుకొన్నాడతను. కానీ ఆ మాట మనసులోనే ఆగిపోయింది.
"అలాగయితే నాకు వసుంధర కంపెనీ ఉండదన్న మాట ఇక....." నిరుత్సాహంగా అందామె. స్నేహం కలసి కొద్దికాలమె అయినా ఆమె తనకెంతో ఆప్తురాలయిపోయింది.
"వస్తానండీ! వెళ్ళేలోపు మళ్ళీ కలుస్తాను" అంటూ లేచి బయటకు నడిచాడతను. చాలాసేపు వసుంధరతో పాటుగడిపిన రోజులు తల్చుకొంటూ అక్కడే కూర్చుండిపోయిందామె.
"ఏమిటమ్మా ఆలోచిస్తున్నావ్?" అంటూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన తండ్రి పలుకరించే వరకూ ఈ లోకంలోకి రాలేదు.
"మా ఫ్రెండ్ వసుంధర వాళ్ళకు హైదరాబాద్ ట్రాన్స్ ఫర్ అయిపోయిందిట డాడీ!" బాధగా అందామె.
రామరాజు నవ్వేశాడు. "ఓశ్! అదేనా? దాంట్లో ఆశ్చర్యమేముందీ? వాళ్ళ నాన్నగారి ఉద్యోగం అలాంటిది. ఎక్కడా పట్టుమని పదేళ్ళు ఉండడానికి వీల్లేదు" అన్నడు తనూ ఆమె కెదురుగ్గా కుర్చీలో కూర్చుంటూ.
ప్లాస్కులోని 'టీ' తీసుకొచ్చి ఇద్దరికీ చెరోకప్పులోనింపింది హేమ.
"ఏమో డాడీ! వసుంధర దూరమవుతోందంటే నాకు అదోలా ఉంది!" బాధగా అందామె. రామరాజు గ్రహించాడది. "అయినా మీ ఇద్దరూ దూరంగా ఉండేది ఎన్ని రోజులని? మరోరెండు నెలల్లో నీకు పెళ్ళి అవనే అవుతుంది. అప్పుడిక ఎలాగూ హైద్రాబాద్ లో మీ అత్తయ్య ఇంటిదగ్గరే ఉంటావుగా! రోజు వసుంధరని కలుసుకోవచ్చు....." అన్నాడు ఆమెను తేలికపర్చడానికి. ఆమెకు చటుక్కున సుధీర్ తనతో బస్ స్టాండ్ దగ్గర జరిపిన సంభాషణ గుర్తుకొచ్చింది.
తను మర్చేపోయింది. అతని అభిప్రాయం తన తల్లిదండ్రులకు తెలియజేయాల్సిణ బాధ్యత తనమీదుంది." సుధీర్ నేనూ పెళ్ళి చేసుకోబోవటంలేదు డాడీ!" సూటిగా చెప్పేసిందామె.
రామరాజు తృళ్ళిపడ్డాడు. "ఏమిటి?" అన్నాడు తను విన్న విషయం నమ్మలేక.
"అవును డాడీ! నేనిక్కడకు వచ్చేముందు బస్ స్టాండ్ లో ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకొన్నాం! మా ఇద్దరివీ విభిన్నమనస్తత్వాలు. చాలా విషయాల్లో ఇద్దరికీ అభిప్రాయ భేదాలున్నాయి. అంచేత వివాహం చేసుకోవడం అవివేకమవుతుందని నిర్ణయించుకొన్నాం!" శాంతంగా మాట్లాడింది హేమ. రామరాజు కొద్ది క్షణాల వరకూ మాట్లాడలేకపోయాడు. అతను ఇలాంటి పరిస్థితి బొత్తిగా ఊహించలేదు. ఆమె విషయంలో తను నిశ్చింతగా ఉన్నాడు ఇన్నాళ్ళూ! ఆమెకు కాబోయే భర్త సుధీరేనన్న ధీమాతో వేరే సంబంధాలు వచ్చినా తిరగ్గొట్టేశాడు. తన స్నేహితుడు రంగారావ్ ఆమెను చూసి ముచ్చటపడి అతని కోడలిగా చేసుకొంటానని అడిగినా తను అంగీకరించలేదు. అతని కొడుకు సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు. అలాంటి అవకాశాలు నాలుగయిదు వచ్చాయి. మరి సుధీర్ గానీ, హేమగానీ ఇలాంటి నిర్ణయానికొస్తారని తెలుస్తే వాటిల్లో ఏదో ఒకటి నిశ్చయమయిపోయేది. ఈపాటి కి ఓ బిడ్డ తల్లి కూడా అయేది.
"మీకు కోపం వచ్చిందా డాడీ?" తండ్రి మౌనంచూసి అడిగింది హేమ.
"కోపంకాదమ్మా! ఈ విషయం అప్పుడే తెలిస్తే నిన్ను కావాలని చేసుకోవడానికి ముందుకొచ్చిన సంబంధాల్లో ఏదో ఒకటి నిశ్చయించేవాడిని కదా అని ఆలోచిస్తున్నాను....." అని కొద్ది క్షణాలాగి...." అది సరేగాని హేమా! ఇది నీ నిర్ణయమా, సుధీర్ నిర్ణయమా?" అనడిగాడతను.
"ఎవరిదయితే మాత్రమేం డాడీ! ఏమయినా తేడా వుంటుందా?" చిరునవ్వుతో తండ్రినడిగిందామె.
"ఊహు! అదికాదమ్మా! ఇందులోనాకేదో కపటం కనబడుతోంది. నిజం చెప్పు! ఇది సుధీర్ నిర్ణయమే కదూ? అతని ఆలోచనలే కదూ?" సూటిగా కూతురివంకే చూస్తూ అడిగాడు రామరాజు.
"అవును డాడీ! ముందు బావే తన మనసులో అభిప్రాయం చెప్పాడు. ఆలోచించి చూస్తే బావ ఆలోచనలు సహజమైనవనిపించింది నాకు కూడా! మా ఇద్దికీ ప్రతి విషయంలోనూ చుక్కెదురే! మీకూ తెలుసుగా! అందుకేనెమో అదే మంచిదనుకొన్నాను...." నిర్మొహమాటంగా చెప్పిందామె.
"అయితే అవ్వచ్చు! కానీ నాకో అనుమానం కలుగుతోంది. సుధీర్ ఇంకెవరినయినా అమ్మాయిని ప్రేమించి నిన్ను వివాహం చేసుకోకుండా తప్పించుకోడానికి ఈ నాటక మాడుతున్నడేమోనని!" కొంచెం కోపంగా అన్నాడు రామరాజు.
హేమ నవ్వేసింది. "మీరు భలేవారే డాడీ! సరే పోనీ ఒకవేళ మీ అనుమానం నిజమేననుకోండి! ఆ పరిస్థితుల్లో కూడా మా వివాహం జరగదు కదా! అతనికి మనసయిన అమ్మాయిని చేసుకొనే హక్కులేదంటారా?"
"ఉహు! అదికాదమ్మా నా ఉద్దేశం! ఇలా డొంకతిరుగుడు వ్యవహారంకాకుండా సూటిగా మనసులోని విషయాలు చెప్తేబావుండేదని? అంతే!" నిట్టూరుస్తూ అన్నాడు రామరాజు.
హేమ టీపాయ్ మీదున్న ఇంగ్లీష్ మాగజైన్ తీసుకొని పేజీలు తిరగేయసాగింది.
"మీ అమ్మేదీ?" అడిగాడు రామరాజు.
"క్లబ్ కెళ్ళింది డాడీ! రాత్రికిగాని రానంది! ఏదో పార్టీ ఉందట!"
"ఓహో...." చికాకుగా అన్నాడతను. హేమ వివాహం విషయం వెంటనే ఆమెతో చర్చించాలని ఉందతనికి. తనకి ఆవేదన కలిగించే విషయాలన్నీ ఆమెతో పంచుకొంటే సగం భారం తగ్గినట్లనిపిస్తూంటుంది అతనికి. ఇలాంటి సమయంలో ఆమె క్లబ్ కెళ్ళటం అతనికి మరింత చికాకు కలిగించింది. లేచి తన గదిలో కెళ్ళిపోయాడతను.
హేమ కొద్ది సేపు నిశ్చలంగా కూర్చుండిపోయింది. మనసునిండా ఏవేవో ఆలోచనలు ముసురుకొన్నాయి. తన వివాహవిషయం మూలంగా తండ్రి అంతగా అప్సెట్ అవడం బాధగా ఉందామెకి. ఇందులో అంతగా ఆలోచించాల్సిన అవసరమేమిటో తనకు అర్ధం కావడం లేదు. సుధీర్ చేసుకోకపోయినంత మాత్రాన మునిగేదేమిటి? సుధీర్ కాకపోతే ఇంకొకరు! వారుకాకపోతే మరొకరు. ఒకవేళ ఎవ్వరూ చేసుకోకపోతే మాత్రం నష్టమేమిటి? మగవాళ్ళు ఎంతమందిజీవితాంతం బ్రహ్మచర్యంపాటించడంలేదు? అలా స్త్రీలు మాత్రం ఎందుకుండలేరు? ఉండగలరని తనే ఋజువుచేస్తుంది. రోషంగా అనుకొందామె. ఆమె మొఖం మరింత ఎర్రబడింది. పెదాలు కోపంతో అదిరినయ్.
ఆ రోజు శ్రీనివాసరావ్. ఆఫీస్ పని కల్పించుకొని సుధీర్ వాళ్ళ సెక్షన్ కి చేరుకొన్నాడు. అతనిని చూస్తూనే ఆప్యాయంగా పలకరించాడు సుధీర్.
"అవేవో సర్క్యులర్స్ తెమ్మనిపంపించాడు మా బాస్! అందుకని వచ్చాను....." అన్నాడు శ్రీనివాసరావ్.
"పద! కాంటీన్ కెళ్దాం!" అన్నాడు సుధీర్ లేచి అతనితోపాటు బయటకునడుస్తూ.
ఇద్దరూ కాంటీన్ లో కౌంటర్ దగ్గర రెండు కప్పులు 'టీ' తీసుకొని ఓ టేబుల్ ముందు కూర్చున్నారు.
"ఏమిటి మీ డ్రామా విశేషాలు? కొత్తదేమయినా టేకప్ చేశారా?" అడిగాడు శ్రీనివాసరావ్. వెంటనే హేమ విషయం అడిగితే అతను మరోలా భావిస్తాడేమోనని సంశయంగా ఉందతానకి. "అవును!' ఆచార్య నాగార్జున' అనే చారిత్రాత్మక నాటకం రిహార్సల్సు ప్రారంభించాము. చాలా బావుంటుందిలే అది! నీక్కూడా ఓపికుందంటే చెప్పు! ఇంకా రెండు కారెక్టర్స్ కి మనుష్యులు కావాలి" అడిగాడు సుధీర్.
శ్రీనివాసరావ్ అతనికి రెండు చేతులెత్తి నమస్కరించాడు. "బాబ్బాబు! నాకు మళ్ళీ లేనిపోని ఆశలు పెట్టకు!" అన్నాడు నవ్వుతూ.
"సరే! నీ ఖర్మ! అలాంటి గొప్ప నాటకం వేసేరాత నీకు లేదు. ఏం చేస్తాం?" తనూ నవ్వుతూ అన్నాడు సుధీర్.
"అది సరేగాని, ఇంకా ఎప్పుడూ ఈ నాటకాలూ వేషాలూ వేయడమేనా? పెళ్ళీ పెటాకులూ చేసుకోవా?" సంభాషణని తనక్కావలసిన విషయంవేపు మళ్ళిస్తూ అడిగాడు శ్రీనివాసరావ్. సుధీర్ గట్టిగా నవ్వేశాడు.
"నాపెళ్ళి మీద అంత శ్రద్దపుట్టుకొచ్చిందేమిటి? మీ తరపున ఎవరయినా పెళ్ళి కావలసిన అమ్మాయిలున్నారా?"
"అదేంకాదులే! ఊరికే అడుగుతున్నాను. అయినా నీకు వేరే అమ్మాయిలెందుకింకా? మీ హేమసిద్దంగానే ఉందిగా!" గుండెలువేగంగా కొట్టుకొంటూండగా అన్నాడతను సుధీర్ ఏం జవాబు చెబుతాడోనని ఆందోళనగా ఉందతనికి.
"హేమా! ఆమెను నేను పెళ్ళిచేసుకుంటానని ఎవరు చెప్పారు నీకు?" అడిగాడు సుధీర్ తాపీగా.
శ్రీనివాసరావ్ తడబడిపోయాడు. "అబ్బే! ఎవరూ చెప్పలేదు. ఆమె మీ మావయ్య కూతురు గదా! అందుకని ఒకవేళ వివాహం చేసుకుంటున్నావేమోనని అనుకున్నాను".
"మావయ్య కూతురయినంత మాత్రాన వివాహం చేసుకుతీరాలని రూలుందా ఏమిటి? అసలీదగ్గర సంబంధాలు చేసుకోవడం మంచిదికాదని మన శాస్త్రజ్ఞులు నెత్తిన నోరు పెట్టుకుని మోగుతున్నారు అవునా కాదా?"