బాలూ చేతిని తన చెక్కిలి కానించుకుని తన్మయత్వంతో కళ్ళు మూసుకున్న సుశీలను చూసి "నీకు పేరు పెడతాను" అన్నాడు బాలూ.
"పెట్టండి.?"
"సుశీల!"
ఉలిక్కిపడింది సుశీల.
"నన్ను వెటకారం చేస్తున్నారా?"
"లేదు! లేదు! నిన్ను నిజంగా అలా పిలుచుకోవాలని అనిపించింది."
సుశీల వెక్కివెక్కి ఏడ్చింది. సుశీల ఏడుపు మరిచిపోయి ఎన్నో రోజులయింది అన్ని రోజులుగా పేరుకున్న దుఃఖమంతా పొంగివచ్చింది.
"ఒకప్పుడు నేను నిజంగా ఆ పేరుకు తగినదానినే ఒక దుర్మార్గుడు అమాయకురాలిని నన్ను ప్రేమ పేరుతో మోసగించాడు. గుళ్ళో స్నేహితులందరి ముందూ పెళ్ళి కూడా చేసుకున్నాడు. ఆ తరువాత ఈ ఊరు తీసుకొచ్చి ఈ బ్రోతల్ కి అమ్మేసాడు. ఎన్నెన్నో ప్రణయ కలాపాలకూ, అంతులేని వాగ్దానాలకూ తీయని అనునయాలకూ మూల్యం ఇది!"
"బాధపడకు! పోనీ, ఇప్పుడు బయటపడాలని అనుకుంటున్నావా?"
"ఇప్పుడా? ఎందుకు? ఆ బయటి సమాజంలో బాధలకంటే ఈ బ్రతుకే నయం! చెడిపోయినదాన్ని అని నన్ను తరిమి తరిమి పీక్కు తినరూ! మీరు 'సుశీల' అంటున్నారు..."
"నాకు మాత్రం నువ్వు సుశీలవే! అంతకంటే నే నేంచెయ్యగలను?"
"ఏం చెయ్యలేరూ? మీరు మంచివారు. చదువూ, సంస్కారమూ ఉన్నవారు. ఇప్పటికైనా అలాంటి దుర్మార్గుల్ని నాశనం చెయ్యలేరూ? సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను ఎదుర్కోలేదూ?"
బాలూ ముఖం పాలిపోయింది.
తను సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను ఎదుర్కోగలడా అంత శక్తి తనకు ఉంటే...
* * *
బాలూ కమర్షియల్ టేక్స్ ఇనస్పెక్టరయ్యాడు. ఇంచుమించు ప్రతి ఒక్కరూ అతని అదృష్టానికి అసూయపడుతూ కంగ్రాట్యులేట్ చెయ్యసాగారు. బాలూ ఆశ్చర్యపడుతూ "ఇది మామూలు ఉద్యోగమే కదా! అందులో అంతగా అభినందించవలసింది ఏముంది!" అన్నాడు.
"చాల్లేవయ్యా! ఉద్యోగం మామూలుదే కానీ ఈ మామూలు ఉద్యోగంలో వచ్చే మామూళ్ళు మాత్రం మామూలుగా ఉండవు-" అని వచ్చింది సమాధానం...
లంచాలుపట్టే అవకాశం ఉన్న ఉద్యోగం దొరకటం అదృష్టంగా భావించటం...ఆ విషయాన్నీ బాహాటంగా ప్రకటిస్తూ అభినందించటం... ఇంకా పూర్తిగా బండబారని బాలూ మనసుకు విడ్డూరంగానే తోచింది. తనను అభినందించే ఇందరిలో ఒక్కరికైనా 'లంచం పట్టని వాళ్ళుకూడా ఉండవచ్చు-" అనే ఊహకూడా రావటంలేదు.
ఉద్యోగంలో చేరాక ఈ లంచాలు తీసుకోవడం ఎంత 'మామూలు' విషయమో మరింత బాగా అర్ధంకాసాగింది బాలూకు.
మొదటిసారి బాలూ ముఖం చిట్లించుకుని "నా దగ్గర ఈ ప్రస్తావన తేకండి" అన్నప్పుడు అవతలి వ్యక్తి బాలూ లంచం వద్దని అంటున్నాడని ఊహించుకోలేక పోయాడు.
"ఈ రేటు మీకు గిట్టుబాటు కాదా? పోనీ మీ మనసులో ఏముందో చెప్పండి-ఆలోచిద్దాం;" అన్నాడు దర్జాగానే.
"దయచేసి మరొకసారి ఇలాటి మాటలు మాట్లాడకుండా వెళ్ళిపోండి-లేకపోతే ఈ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది." అన్నాడు కోపంగా.
అప్పటికి అవతలి వ్యక్తి కొంచెం ఆశ్చర్యంగా "మీ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా చెపితే..." అంటూ నాన్చాడు.
"గెటవుట్" అని అరిచాడు బాలూ గట్టిగా, ఆఫీస్ ప్రతిధ్వనించేలా...
అప్పటికికాని ఆ పెద్దమనిషికి బాలూ నిజంగా లంచం వద్దంటున్నాడని అర్ధంకాలేదు-అర్ధమయ్యేక "వెధవ్వేషాలు!" అని సణుక్కుంటూ వెళ్ళిపోయాడు బాలూ మామూళ్ళు తీసుకునే మనిషి కాదని అందరికీ తెలిసిపోయింది. అందరికీ బాలూ అంటే ఒక చులకన భావం ఏర్పడిపోయింది-అంతటా అవినీతి విచ్చల విడిగా నాట్యంచేస్తున్న మాట నిజమే! కానీ ఇటీవల కొందరు పనికిమాలిన అధికారులు బాలూ లాంటి పైత్యకారులూ....అవినీతిని నిర్మూలించటానికీ...లంచగొండులను పట్టుకోవటానికీ కూడా పూనుకుంటున్నారు! బాలూ లాంటి వాళ్ళ మూలంగా పట్టుబడితే పరువుపోతుంది. ఉద్యోగమూ పోతుంది.
ఒకసారి బాలూకు కొంచెం తలనొప్పిగా ఉండి ఫ్యూన్ ని కాఫీ తెమ్మన్నాడు. "నేను తేలేను సార్! అది పావని కాదు!" అన్నాడు వాడు విసురుగా.
పక్కకు వెళ్ళి బాలూకు వినపడేలాగానే "రూపాయి మామూలు దక్కనియ్యడు కాని కాఫీ కావాలట, కాఫీ..." అన్నాడు అక్కసును.....మిగిలిన వాళ్ళంతా ఘోల్లున నవ్వారు...
తనను చూసి ఎందురు నవ్వుతున్నారో బాలూకు తెలుసు-ఎందుకు నువ్వుతున్నారో అర్ధంకావటంలేదు.
మొదటి నెల జీతం అందుకుని తల్లి చేతిలో పెట్టినప్పుడు బాలూ ఆనందానికి అంతులేదు-అతనికి ఈ లోకంలో ఉన్నది తల్లి ఒక్కత్తే!
బాలూ తల్లి అందమైనదే! గుణవంతురాలు కూడా! అయినా బాలూ తండ్రి మరొకతను తెచ్చుకున్నాడు -బాలూతల్లిని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశాడు. ఈ కథ తల్లినోటనే విన్నాడు బాలూ. ఆ సంగతి చెప్తున్నప్పుడు బాలూ తల్లి ఏనాడూ భర్తను నిందించేది కాదు....ఏదో కథ చెప్తున్నట్లు చెప్పేది-ఆ తర్వాత బాలూ తల్లి అన్నగారి పంచనచేరింది. అన్నగారికీ, వదినగారికీ కూడా బాలూతల్లిపట్ల ఎలాంటి ఆదర భావమూ లేదు. ఆర్ధికంగా బాలూ తల్లి అన్నమీద ఆధారపడిలేదు-ఆవిడ సంగీతం నేర్చుకుంది. మెట్రిక్ పాసయింది. భర్త దగ్గరనుండి విడిపోగానే ఒకస్కూల్ లో సంగీతం టీచర్ గా చేరింది-తన మావ, అత్త అనే మాటలు భరించలేక, బాలూ "అమ్మా, ఇక్కడినుండి వెళ్ళిపోదాం!" అనేవాడు జ్ఞానం వచ్చిన దగ్గరనుండే...
"వద్దు బాలూ! వయసులో ఉన్న ఆడదాన్ని ఒంటరిగా ఉండటం మంచిది కాదు-ఎన్ని గొడవలున్నా మనం మామయ్య దగ్గరే ఉండాలి?" అనేది.
బాలూ చదువు విషయంలో తల్లి ఏమాత్రమూ అశ్రద్ద చెయ్యలేదు-చదువు కోవటంలో బాలూకూడా అశ్రద్ద చెయ్యలేదు.
అన్న పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యాక, బాలూ ప్రయోజకుడయ్యాక, వృద్దాప్యం మీదపడ్డాక అప్పుడు అన్నదగ్గరనుండి విడిపోయింది బాలూతల్లి...
తల్లి చేతిలో తన జీతమంతా పెట్టిన ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు బాలూకి. ఆ మరునాడే తల్లి అందమైన నూటుబట్ట బాలూకోసం కొని తెచ్చింది.
"చూడు! బాగుందా?" అంది.
బాలూ చాలా బాధపడ్డాడు...
"అలా అయిపోయావేం? నా సెలక్షన్ నీకు నచ్చలేదా?" చిరునవ్వుతో అంది. అతడు ఎందుకు బాధపడుతున్నాడో అర్ధమయినా...
"అది కాదమ్మా! నిన్ను చీరలు కొనుక్కోమన్నాను..."
"అన్నావు-నాకు సూటుగడ్డ కొనాలనిపించింది, నేను స్వార్ధపరురాలినిరా! నా ఆనందమే నాకు ప్రధానం..." నవ్వుతూ అంది బాలూ తల్లి.
చిన్నప్పటినుండి కష్టాలనే అనుభవిస్తూ చిరునవ్వు నవ్వుతోన్న ఆ "స్వార్ధ పరురాలి' ముఖంలోకి చూస్తూ మరేమీ మాట్లాడలేకపోయాడు బాలూ.
తన తల్లి కళ్ళలో ప్రతిఫలిస్తోన్న ఆనందం....అది చాలు అతనికి!.
సేఠ్ రమణ్ లాల్ పేరు తెలియనివాళ్ళు ఉండరు-అతనికి అనేక రకాల వ్యాపారాలున్నాయి. లెక్కలేనన్ని మేడలున్నాయి. అందమైన కార్లు ఉన్నాయి-
అలాంటివాడు బాలూ దగ్గరకొచ్చాడు.
మొట్టమొదట అందరూ ఈర్ష్యపడ్డారు-కానీ మరుక్షణం బాలూ స్వభావం గుర్తుకొచ్చి స్థిమితపడ్డారు.
బాలూ జ్ఞానవంతుడే కాని లోకజ్ఞానం లేనివాడు-రమణ్ లాల్ పేరు విన్నాడు-అతని పలుకుబడి గ్రహించాడు-కానీ, అతన్ని ఎదిరిస్తే ఏమవుతుందో మాత్రం తెలుసుకోలేకపోయాడు.
అందరి ముందు లాగనే అతనిముందు తల అడ్డంగా ఆడించాడు.
రమణ్ లాల్ బాలూను పరిశీలనగా చూస్తూ చిరునవ్వు నవ్వాడు.
"నా పని నేను ఎలా అయినా సాధించగలను-చిన్నవాడివని దయతో చెప్తున్నాను-మరొకసారి ఆలోచించు..."
"ఇందులో ఆలోచించవలసింది ఏమీ లేదండీ! ఇలాంటి పనులు నావల్ల కాదు!"
కచ్చితంగా చెప్పాడు బాలూ.
రమణ్ లాల్ విసుగ్గా దర్జాగా వెళ్ళిపోయాడు. తర్వాత రమణ్ లాల్ కమర్షియల్ టేక్స్ ఆఫీసర్ నే డైరెక్టర్ గా కలుసుకున్నాడు. అతని పని నిముషాలలో తెమిలిపోయింది. బాలూ విషయం సూచనగా ఆఫీసర్ తో అన్నాడు రమణ్ లాల్.
ఆ తర్వాత కొంచెం రోజులలోనే బాలూమీద విపరీతంగా లంచాలు తీసుకుంటున్నాడని నేరం మోపబడింది. ఆఫీస్ లో అందరూ ఏకగ్రీవంగా బాలూ లంచగొండి అని సాక్ష్యం చెప్పారు. బాలూను ఉద్యోగంలోంచి డిస్ మిస్ చేసారు...