Previous Page Next Page 
బెస్ట్ జోక్స్ పేజి 7


    కొంచెం బాగా డ్రస్ చేసుకున్న ఓ వ్యక్తి బిజీగా ఉన్న ఓ హోటల్ తాలూకూ మేనేజర్ దగ్గర కొచ్చాడు.
    "సార్! మాది అంబాజీపేట! నా పేరు అప్పారావ్! ఇవాళ పొద్దున్నే సిటీకొచ్చాను. సిటీ బస్ ఎక్కేసరికి ఎవడో నా పర్స్ కొట్టేశాడు. ఉదయం నుంచీ టిఫిన్ కూడా చేయలేదు. ఆకలితో కళ్ళు తిరుగుతున్నయ్. దయచేసి ఉచితంగా భోజనం పెట్టించారంటే మీకు రుణపడి ఉండిపోతాను-"
    మేనేజర్ అతన్ని చూసి జాలిపడ్డాడు.
    "ఓ.కే! లోపలికెళ్ళి భోజనం చేయండి! బేరర్ తో చెప్తాను" అంటూ బేరర్ ని పిలువబోయాడు.
    "అహహ! ఇక్కడొద్దుసార్! ఆ చివరున్న రెడ్డీ హోటల్లో భోజనం బాగుంటుందని చెప్పారు. అందుకని మీరు భోజనం ఖరీదు నాకిచ్చేస్తే- ఆ రెడ్డి హోటల్లో భోజనం చేస్తాను-" అన్నాడా వ్యక్తి చిరునవ్వుతో-

    ఒక టూరిస్ట్ గ్రూప్ కి ఒక పాతకాలం నాటి పాడుబడిన కోటను చూపిస్తున్నాడు టూరిస్ట్ గైడ్. అందరూ కోటముందున్న ఓ శిలా విగ్రహం దగ్గర ఆగారు.
    "ఈ విగ్రహం ఈ రాజవంశాన్ని ప్ర్రారంభించి విస్తరింపజేసిన మహానుభావుడిది-" అంటూ చెప్పాడు టూరిస్ట్ గైడ్.
    "ఈయన ఏ వృత్తిలో ఉండేవాడారోజుల్లో?" అడిగాడు ఓ సందేహాల్రావ్.
    "చెప్పాను కదా! ఈ రాజరిక వంశాన్ని నెలకొల్పి విస్తరింపజేసిన మొట్టమొదటి మహనీయుడు-"
    "ఆ సంగతి అర్ధమయ్యిందయ్యా! పగటిపూట ఏం చేస్తూండేవాడు అనడగుతున్నా!"

    ఓ కమిటీ ఉద్యోగాల కోసం ఇంటర్ వ్యూకి వచ్చినవారిని ఇంటర్ వ్యూ చేస్తోంది.
    "నీకు ఫలానా ఉద్యోగం అయితే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా?"
    "ఇంటర్ వ్యూ కెళ్ళినప్పుడల్లా అలాంటి ఫీలింగ్స్ కలుగుతూనే ఉంటాయ్ సార్-"
    "ఇంతకూ ఇప్పుడు ఈ కంపెనీలో ఎలాంటి జాబ్ చేయాలనిపిస్తోంది?"
    "ఈ కంపెనీ జనరల్ మేనేజర్ గా పనిచేస్తే బాగుండుననిపిస్తోంది"
    కమిటీ వాళ్ళు ఉలిక్కిపడ్డారు.
    "నీకేం పిచ్చెక్కిందా?"
    అతను తలదించుకున్నాడు.
    'ఓ! సారీ సార్! జనరల్ మేనేజర్ అవ్వాలంటే ఆ కండిషన్ ఉంటుందని తెలీదు-"

    కె.కె రావుగారు పాజిటివ్ థింకింగ్ మీద అరడజను పుస్తకాలు రాసేశారు. ఆ తరువాతి పుస్తకం కూడా కాపీ కొట్టటం పూర్తిచేసి ఆ రోజు సాయంత్రం భార్యతో కలిగి షాపింగ్ కెళ్ళారు.
    ఓ షాప్ లో ఆయన భార్య ఒక అయిస్ క్రీమ్, ఒక కేకూ పాక్ చేయిస్తూంటే సేల్స్ గాళ్ మర్యాద పూర్వకంగా పలుకరించింది.
    "ఇవాళ మేడమ్ ఏదో సెలబ్రేట్ చేస్తున్నట్లున్నారు" అందామె.
    "అవును! మావారి పుస్తకం ఇప్పటికి పూర్తయింది-"
    సేల్స్ గాళ్ ఆమెమీద జాలిపడింది.
    "ఒకోళ్ళు అంతే ఆంటీ! చదవటం బాగా  వీక్! మా బాయ్ ఫ్రెండ్ కూడా అంతే- ఒక్క లైన్ చదవటానికి మూడు గంటలు పడుతుంది-"

    రాజేష్ తన గాళ్ ఫ్రెండ్ భారతీ అగర్వాల్ తో ఓ రెస్టారెంట్ కెళ్ళాడు. బేరర్ వెంటనే మా మెనూ కార్డ్ తెచ్చి వారి ముందుంచాడు.
    తను ఆ కార్డ్ తీసుకున్నాక తన ప్రియురాలిక్కూడా ఆర్డర్ ఇవ్వడానికి ఛాయిస్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఇంకో మెనూ కార్డ్ తెచ్చిమ్మని కోరాడు రాజేష్.
    బేరర్ అతని వంక తెలివి తక్కువ వెధవాయిని చూసినట్లు చూశాడు.
    "మెనూ కార్డ్ ఏదయినా ఒకటిగానే ఉంటుందిసార్! అన్నింట్లోనూ ఆ అయిటమ్సే ఉంటయ్-"

    లాల్ బహదూర్ స్టేడియంలో రాష్ట్ర పోలీస్ క్రీడోత్సవాలు జరుగుతున్నయ్.
    మధ్యలో మైక్ లో ఓ గొంతు ఖంగున మోగింది.
    "ఇప్పుడు హండ్రెడ్ మీటర్స్ లాఠీ చార్జ్ పోటీ స్టార్టవుతుంది. దీని తర్వాత గాలిలోకి కాల్పులు- ఆ తరువాత క్రాస్ కంట్రీ ఎన్ కౌంటర్స్- ఆఖర్లో లాకప్ కిక్ బాక్సింగ్-"

    వుమన్స్ లిబ్ తాలూకూ మీటింగ్ ఫుల్ స్టీమ్ లో జరుగుతోంది.
    ఒకావిడ మగాడి నిరంకుశత్వం, ఆడదాని మీద దౌర్జన్యం గురించి ఆవేశంగా ప్రసంగిస్తోంది.
    "అంతెందుకు? ఆఖరికి జీవిత చరమాంకంలో కూడా మగాడు భార్యను బానిసగానే చిత్రహింసలు పెడుతున్నాడు. కావాలంటే మీరు అబ్జర్వ్ చేయండి. భార్యభర్తల్లో సాధారణంగా తొంభయ్ శాతం భర్తలే భార్యలకంటే ముందు పైకెళ్ళిపోతున్నారు! ఎందుకని?కేవలం ఆడది సుఖపడకూడదనే ఉద్దేశ్యంతోనే తను పైకెళ్ళిపోయాక కూడా భార్య నానా అవస్థలూ పడి, ఇంటి పనులూ, ఇంట్లో వ్యవహారాలూ అన్నీ చచ్చీచెడి పూర్తి చేసుకుని అప్పుడు పైకి రావాలని వాళ్ళ ఉద్దేశ్యం"

    ఓ పెద్ద కంజ్యూమర్ గుడ్స్ అమ్మేషాప్ లో పనిచేస్తున్న భార్యభర్తలిద్దరూ తరచుగా కీచులాడుకోవటం- ఆవిడ బట్టలు సర్దుకుని పుట్టింటికెళ్ళిపోవటం చాలా మామూలుగా జరుగుతోంది.
    ఓసారి అలాగే గొడవపడి పుట్టింటికెళ్ళి ఎంతకూ తిరిగి రాకపోయేసరికి రంగారావ్ కి అనుమానం వచ్చింది.
    వెంటనే భార్య సెల్ కి రింగ్ చేసి 'ఒకవేళ విడాకుల కోసం ఏమయినా ప్లానేస్తున్నావా?' అంటూ దబాయించాడు.
    "ఇంకా బోలెడు వారంట్రీ పిరీడ్ ఉండగా అలాంటి తెలివితక్కువ పనెందుకు చేస్తాను? హు!" అంటూ సెల్ డిస్కనెక్ట్ చేసిందామె.

    కొత్త కంపెనీలో ఉద్యోగంలో చేరిన తన భర్త ఆఫీస్ చూడ్డానికి వచ్చిందతని భార్య.
    అక్కడ బోలెడుమంది అమ్మాయిల మధ్య పనిచేస్తున్న భర్తను చూసేసరికి కొంచెం అసూయ కలిగింది.
    "ఒకవేళ మీ సెక్రట్రీ పిల్ల మీకు లైన్ వేసిందనుకోండి! ఏం చేస్తారు?" అడిగిందామె.
    "అనుకోండేమిటి? ఎప్పుడో లైన్ వేసేసింది-"
    ఆమె గాబరాపడింది.
    "మరి మీరేం చేశారు?"
    "ఇంకేం చేస్తాను? పెళ్ళి చేసుకున్నాను-"

    విన్ స్టన్ చర్చిల్ స్పీచ్ లు వినడానికి జనంతో హాల్స్ నిండిపోవటం చాలా మామూలు విషయం.
    ఆ విషయమే చర్చిల్ తో అన్నారొకరు.
    "మీ సభలకు అలా జనం విరగబడి రావటం మీకు థ్రిల్ కలిగించటం లేదూ?"
    "కాస్తా కూస్తావా? చాలా గొప్ప థ్రిల్! కానీ ఆ వెంటనే నాకింకో విషయం కూడా గుర్తొస్తూంటుంది-"
    "ఏమిటది?"
    "ఆ సభల్లో రాజకీయ ఉపన్యాసాలు కాకుండా ఇంకేమయినా మాట్లాడితే ఇంతకు పదింతలు జనం వచ్చేవారని-"

 Previous Page Next Page