"అదేమిటి- పేరు రాయకుండా ఇలా రాశారేమిటి?" ఆశ్చర్యంగా అన్నాడు బొమ్మయ్.
"రాస్తే రాశార్లేగానీ- పోస్టర్ వాళ్ళు ఈ లెటర్ నాకెందుకు పంపినట్లు?" కోపంగా అన్నాడు లాలూ.
ఓ చిన్న కుర్రాడు ఓ గజదొంగ జేబుకొడుతూ పట్టుబడిపోయాడు.
"ఇంత చిన్న వయసులోనే జేబులు కొట్టేస్తున్నావా?" అడిగాడా గజదొంగ.
"ఇప్పటి నుంచీ ఇలా కష్టపడితే గానీ పెద్దయ్యేటప్పటికి కోట్లు సంపాదించలేమని మా డాడీ చెప్పారు-"
"ఒరేయ్- పిచ్చి సన్నాసీ! ఇలా చిల్లర దొంగతనాలు వందలు, వేలూ చేసినా కోట్లు సంపాదించటం కష్టం రా! ఒకే ఒక్కసారి బాంక్ దోపిడీ చేశావనుకో! ఇప్పుడే కోట్లు దొరుకుతాయ్-"
"పోరా వెర్రీ సన్నాసీ! ఆ సంగతి నాకు తెలీదేంటి? చాలాసార్లు ట్రై చేశానుకూడా! కానీ మా స్కూలు వదిలేసరికి బాంక్ లు క్లోజ్ అయిపోతున్నయ్ అందుకని కుదరటంలా-"
ఓ కంజూసీ కనకారావ్ సిమ్లా వెళ్తోన్న టూరిస్ట్ బస్ లో ప్రయాణం చేస్తున్నాడు. పక్కసీట్లో కూర్చున్న సరదాల్రావ్ టైమ్ పాస్ కోసం అతనిని పలుకరించాడు.
"ఎందాకా వెళ్తున్నారు?"
"సిమ్లా-"
"సిమ్లాలోనే ఉంటారా?"
"అహహ! అక్కడికి హనీమూన్ కెళ్తున్నా-"
"హనీమూన్ కా? మరి మీ మిసెస్ పక్కన లేరేం?"
"పక్కనేలా కూర్చుంటుంది? సీట్ నెంబర్లు వేరు కదా!"
"దాన్దేముంది? కండక్టర్ తో చెప్తే అడ్జస్ట్ చేస్తాడుకదా!"
"అడ్జస్ట్ చేసినా మా మిసెస్ కి ప్రాబ్లెమ్ కదా!"
"ప్రాబ్లెమ్ ఏముంటుంది? మీ మిసెస్ ఏ సీట్లో ఉందో చెప్పండి. నేను ఆ సీట్లో కూర్చుంటా-మీ మిసెస్ మీ పక్కన కూర్చోవచ్చు-"
"సీట్ నెంబర్ థర్టీన్-"
"థర్టీనా? ఆ సీట్లో ఇద్దరూ జెంట్సే ఉన్నారు కదా?"
"థర్టీన్ నెంబర్ ఈ బస్ లో కాదు- వేరే బస్ లో"
"వాట్? మీ మిసెస్ వేరే బస్ లో ఉందా? అదేంటి? ఇద్దరూ ఒకే బస్ లో వెళ్ళొచ్చుగా?"
"ఒకే బస్ లో ఎట్లా వెళ్తామయ్యా! నేను వెళ్ళేది సిమ్లాకి- నా మిసెస్ వెళ్ళేది డార్జిలింగ్ కి కదా?"
"ఆ ఒకళ్ళు సిమ్లాకి ఒకళ్ళు డార్జిలింగ్ కా? మీరు హనీమూన్ కెళ్తున్నారన్నారు కదా"
"అవును! కాదని ఎవరన్నారిప్పుడు?"
"మరి ఇద్దరూ ఒకే చోటకెళ్ళాలిగా?"
"చెరో చోటకీ వెళ్ళకూడదని రూలేమయినా ఉందా?"
"రూలేంట్రా దేవుడా! హనీమూన్ అంటే కలసి ఎంజాయ్ చేయటం కదా!"
"కలసి ఎలా చేస్తామండీ! నేనేమో సిమ్లా చూడలేదు. నా మిసెసేమో డార్జిలింగ్ చూడలేదు. అందుకని చెరో చోటకీ వెళ్ళామనుకో! ఆ ప్రదేశాలు చూసినట్లవుతుంది. అటూ హనీమూన్ ఇటూ మనీసేవింగ్!"
"కానీ ఇద్దరికీ కంపెనీ ఉండదు కదా!"
"ఎందుకుండదు? నేను నా గాళ్ ఫ్రెండ్ ని తీసుకెళ్తున్నా! తను తన బాయ్ ఫ్రెండ్ ని తీసుకెళ్తోంది"
"ఓర్నాయనో- మరిక్కడ ఎక్ స్ట్రా ఖర్చవటం లేదూ?"
"ఎలా అవుతుంది మా నలుగురి టిక్కెట్లూ మా మిసెస్ బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటున్నాడుగా?
సరదాల్రావ్ బే హోష్ అయిపోయాడు.
ఒక కమెడియన్ ఆడియన్స్ కి ఛాలెంజ్ విసిరాడు.
"నేను చెప్పే జోక్స్ కి నవ్వకుండా ఎవరూ ఉండలేరు. ఒకవేళ అలాంటి వారెవరయినా ఉంటే వారికి లక్షరూపాయలు బహుమతిగా ఇస్తాను"
దాంతో ఆడియెన్స్ అందరూ లక్షరూపాయలు గెల్చుకోడానికి ఎగబడ్డారు.
కానీ అందరూ ఏదొక జోక్ కి పగలబడి నవ్వటం -బయటకు వెళ్ళిపోవటం జరిగింది.
ఆఖర్లో ఓ వ్యక్తి వచ్చాడు.
కమెడియన్ అతనికి రకరకాల జోకులు చెప్పాడు. మిమిక్రీలు చేశాడు. ఏం చేసినా ఆ వ్యక్తి ఏమాత్రం నవ్వకపోయేసరికి అతనికి లక్షరూపాయలు ఇవ్వకతప్పలేదు.
ఆ రాత్రంతా కమెడియన్ కి నిద్రపట్టలేదు. తను వేసిన జోక్స్ కి ఆ వ్యక్తి నవ్వకుండా ఎలా ఉండగలిగాడు? మనిషన్న వాడికి అది సాధ్యం కాదే! ఆ విషయం ఆ వ్యక్తినే అడగాలనిపించి అతనింటికి చేరుకునేసరికి అతను పగలబడి నవ్వుతూ కనిపించాడు.
"ఏమిటి ఇవాళ ఇలా పగలబడి నవ్వుతున్నావ్- మరి నిన్న నేను చెప్పిన జోక్స్ కి చిరునవ్వు కూడా రాలేదు నీకు" అడిగాడు కమెడియన్.
"భలేవారే సార్! మీరు నిన్న చెప్పిన జోక్స్ కే నవ్వుతున్నాను" అంటూ మళ్ళీ పగలబడి నవ్వసాగాడు-
ఒక డాక్టర్ గారు మధ్యాహ్నం లంచ్ కొచ్చేసరికి ఇంట్లో ఫోన్ మోగుతోంది. హడావుడిగా ఫోన్ తీశాడు.
"ఇందిరా పార్క్ దగ్గరున్నాను. అర్జంటుగా రావాలి! చాలా సీరియస్ - పది నిమిషాల్లో ఇక్కడకు రాకపోతే చావు ఖాయం! ప్లీజ్-అర్జెంట్-చాలా సీరియస్" అన్నాడో వ్యక్తి.
డాక్టర్ కంగారుగా ఫోన్ పెట్టేసి హడావుడిగా మళ్ళీ బయల్దేరబోయాడు.
"ఏమిటి భోజనం చేయకుండానే వెళ్ళిపోతున్నారు?" ఆశ్చర్యంగా అడిగింది భార్య.
"ఎవరో పాపం ఇందిరా పార్క్ దగ్గర చాలా సీరియస్ కండిషన్ లో ఉన్నాడంట. పది నిమిషాల్లో నేను అక్కడకు చేరుకోకపోతే ప్రాణాలు పోవటం ఖాయం అంటున్నాడు" చెప్పాడు డాక్టర్ జాలిగా.
వాళ్ళ మాటలు వింటూన్న డాక్టర్ గారమ్మాయి చిన్నగా నవ్వింది.
"అయ్యో! ఆ ఫోన్ కాల్ నాకోసం డాడీ! మీ కోసం కాదు-" అంది త్వరగా మేకప్ అవుతూ-
శ్రీకంఠయ్య భగవంతుడి భక్తుడు. అయితే అతనికి జీతం చాలక అప్పులు పెరిగిపోతూంటే, ఆ అప్పులు తీర్చే మార్గం తెలీక దిగులు పడిపోతూంటే ఓ స్నేహితుడు జాలిపడ్డాడు.
"వర్రీ అవకు శ్రీకంఠయ్యా! నువ్ వెంకటేశ్వర స్వామికి గొప్ప భక్తుడివిగదా! నీకేదయినా పెద్ద లాటరీ తగిలేట్లు చేయమని వేడుకో! అదే తగుల్తుంది-" అంటూ సలహా ఇచ్చాడు.
ఆ రోజు నుంచీ శ్రీకంఠయ్య రోజూ తనకు పెద్ద లాటరీ తగిలేట్లు చూడమని వెంకటేశ్వర స్వామిని ప్రార్దించటం మొదలుపెట్టాడు. ఎన్ని నెలలయినా లాటరీ తగలకపోయేసరికి శ్రీకంఠయ్యకి వెంకటేశ్వరస్వామి మీద కోపం వచ్చింది.
"ఏమిటి స్వామీ ఇది? నేను నిన్ను ఎంత భక్తితో పూజిస్తానో నీకు బాగా తెలుసు. ఇంతకాలానికి ఒక్క లాటరీ తగిలేట్లు చూడమని కోరితే నీకింత నిర్లక్ష్యమా స్వామీ? ఇది న్యాయమేనా?" అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు.
వెంటనే వెంకటేశ్వరస్వామి మాట్లాడాడు.
"నువ్వెక్కడ దొరకావయ్యా నాకు! లాటరీ తగిలేట్లు చూడమని తెగ ప్ర్రార్దిస్తున్నమాట నిజమేకానీ- నువ్వసలు లాటరీ టికెట్టే కొనకపోతే ఇంక నేనేం చేయగలను?" నిష్ఠూరంగా అన్నాడు స్వామి.