Previous Page Next Page 
పాఠకులున్నారు జాగ్రత్త! పేజి 6


    "అదే హైదరాబాద్ కార్పొరేషన్ వాళ్ళు కాపీ కొట్టారేమో"
    "సరే అదంతా ఇదుగో ఈ పుస్తకంలో రాసివ్వు గుర్తుపెట్టుకోవడం నా వల్ల కాదు."
    "పూర్ రిమెంబరెన్స్ పవర్" అతని మీద జాలిపడ్డాడు సింహాద్రి.
    చిరంజీవి చేతిలోని పుస్తకం తీసుకుని నెంబర్ అంతా రాసిచ్చాడు.
    "ఆఖరి రెండునంబర్లూ కొంచెం డౌటుగా వుంది. అయినా ఫరవాలేదులే! ఆ వీధిలోనే వున్నాయి ఆ రెండు నెంబర్లు కూడా. కనుక పెద్ద ప్రాబ్లెమ్ ఏమీ వుండదు"
    "ఓకే సాయంత్రం అయిదున్నరకల్లా వచ్చేస్తాను" అన్నాడు చిరంజీవి.
    "సరే" ఇద్దరూ బయటకు నడిచారు.
    చిరంజీవి సైకిల్ ఎక్కేశాడు.
    
                     * * * * *
    
    సింహాద్రి మళ్ళీ రోడ్డుమీద నడవసాగాడు. హఠాత్తుగా అతనిని దిగులు ఆవహించింది మళ్ళీ. ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడాలో తెలీటం లేదు. శ్రీదేవి- శ్రీదేవి- శ్రీదేవి.
    ఆ అమ్మాయి ఫోటో ఆ అమ్మాయి పేరు. అంతే! ఈ రెండే గత రోజున్నరనుంచీ తనను చిత్రహింసలు పెట్టేస్తున్నాయ్.
    అలా ఎందుకు తను క్రుంగిపోతున్నాడో తనకే అర్ధం కావటం లేదు.
    రెండు రోజులక్రితం అసలు ఆ అమ్మాయి ఎవరో, ఆమె పేరేమిటో తనకు తెలీదు. అసలు అలాంటి అమ్మాయి బాంబ్ నిలయం, రెడ్ ఫీల్డ్, విశాఖపట్నంలో నివసిస్తోందనీ తెలీదు.
    కాని ఈరోజు ఆ పిల్ల లేన్దే తన జెవెఇథమె లేదు అనుకునే స్థితికొచ్చేశాడు.
    ఎంత తమాషాగా వుంది?
    ఆహా... విధి ఎంత లబీయమైనది- ఊహ! లభీయమైనది కాదు. గభీయమైనది అని వుండాలి. ఊహూ అది కూడా కాదు. ఇంకేదో వుండాలి. టెన్త్ క్లాస్ లో చదివాడు తను. ఊహు టెన్త్ క్లాసులో కాదు. నైన్త్-నో- ఎయిత్ యస్. ఎయిత్ క్లాసులో ఏ సబ్జెక్ట్ లో? ఇంగ్లీష్ లోనో, తెలుగులోనో? హార్నీ ఇంగ్లీష్ లో అదెందుకుంటుంది? తెలుగులోనే అవును ఆరోపాఠంలోనో ఎనిమిదో పాఠంలోనో వుండాలి ఆ వాక్యం. విధి ఎంత భగీయమైనది. అవును గుర్తుకొచ్చేసింది. విధి ఎంత భలీయమైనది. కరెక్ట్ తనకు తెలుసు. తనేదీ అంత ఈజీగా మర్చిపోడు!
    రెండ్రోజుల క్రితం ఆ ఉత్తరం రాకుండావుంటే ఇవాళ తనకి దిగులు, బాధ నిరుత్సాహం ఇవేమీ వుండేవి కాదు గదా!
    పోనీ కవరు చింపేముందయినా తను దానిమీద అడ్రస్ తనదో కాదో ఒకసారి చూసి వుంటే - ఆ కవర్ చింపేవాడే కాదు గదా!
    పోనీ చింపెనుబో... చింపినవాడు ఆ ఉత్తరంలోనుంచి కిందపడిన ఫోటో చూసి తనకు సంబంధించినది కాదని తెలుసుకుని మళ్ళీ కవర్లో వుంచి మళ్ళీ పోస్ట్ లో పడేస్తే దాన్దారిన అది పోయేది కదా!
    అదీ చేయలేదు తను.
    ఉత్తరం మొదట్లో శ్రీ ధనుంజయ్ గారికి అన్న సంబోధన చూసినప్పుడయినా తను చదవడం ఆపి ఆ ఉత్తరం అంతకుముందు వరకూ ఆ రూమ్ లో అద్దెకువుండి మరో ఇంటికి మారిపోయిన ప్రఖ్యాత రచయిత ధనుంజయ్ కి ఎవరో రాసిన ఉత్తరం అని తెలిసికొని రీడైరెక్ట్ చేస్తే ఎంత బాగుండేది!
    అదీ చేయలేదు తను.
    ఆ ఫోటో పట్టుకుని రెండుగంటలు అలా నిలబడి చూస్తూ నిలబడిపోయాడు, ఆ తరువాత వుత్తరం చదివాడు.
    "శ్రీ ధనుంజయ్ గారికి!
    నమస్తే. ఎవరా అనుకుంటున్నారు కదూ? నేనేనండీ! మీ అభిమాన పాఠకురాలు శ్రీదేవిని! ఏమిటీ! కోపం వచ్చిందా ఫోటో పంపలేదని! సారీ- ఈ మధ్య పరీక్షలుండడం వల్ల మీకు ఉత్తరం రాయలేకపోయాను. ఈ మధ్యే మీరు రాసిన "గతి తప్పిన మతి" నవల చదివాను. ఇటీజ్ రియల్లీ సూపర్బ్! అందులో హీరో విలన్ ని హిప్పటైజ్ చేయడం- తద్వారా అతను చేసిన కిరాతకాలన్నీ తెలుసుకోవడం- నిజంగా అద్భుతంగా వుంది. ఈ నవల చదివాక ఎలాగయినాసరే మిమ్మల్నోసారి కలుసుకుని పర్సనల్ గా అభినందించాలని నిశ్చయించుకున్నాను. నేనూ, మా డాడీ వచ్చే శుక్రవారం పనిమీద హైదరాబాద్ వస్తున్నాం. అక్కడ ఆ ఒక్కరోజే వుంటాము కనుక ఆ రోజు సాయంత్రం వీలు చూసుకుని మీ ఇంటికి వస్తున్నాం, దయచేసి నాకోసం ఎదురు చూస్తుంటారని ఆశిస్తాను. మీరు లేకపోతే చాలా డిజప్పాయింట్ అవ్వాల్సి వస్తుంది- వుంటారు కదూ! శ్రీదేవి"
    ఆ క్షణంలో తనకు ఆ రచయితగాడి మీద ఎక్కడలేని ఈర్ష్యా కలిగింది. అంత అందమయిన అమ్మాయి అభిమానం సంపాదించుకోవడం ఎంత అద్బుతం! ఇంతకాలం స్పోర్ట్స్ మెన్ కీ, సినిమా స్టార్స్ కీ మాత్రమే గ్లామర్ వుందనుకుంటూ వచ్చాడు తను. రచయితలకు కూడా గ్లామర్ వుంటుందని తెలిస్తే తనూ కాలేజ్ డేస్ లోనే రచయిత అయిపోయేవాడు. ఇప్పుడు మాత్రం మించిపోయిందేముందీ! త్వరత్వరగా అయిదారు నవలలు రాసేయవచ్చు! కానీ అర్జెంటుగా శ్రీదేవి అభిమానం సంపాదించటం కష్టం కదా!
    తనకు శ్రీదేవి కావాలి ఎలా?
    ఆమె వచ్చే శుక్రవారం తన రూమ్ కొస్తుంది.
    "నమస్తే" అంటుంది.
    తనూ "నమస్తే" అంటాడు.
    "మీరేనా ధనుంజయ్ గారు?" అంటుంది.
    "కాదు" అంటాడు తను.
    "మరి మీరెవరు?" అంటుంది.
    "నేనీ రూమ్ లో కొత్తగా అద్దెకు వచ్చాను. నా పేరు సింహాద్రి. బిజిలీ అండ్ బిజిలీ కంపెనీలో క్లర్క్ ని. అహహ-మేనేజర్ ని!"
    "ఓ... అయామ్ సారీ! ఇప్పుడు రచయిత ధనుంజయ్ గారు ఎక్కడుంటున్నారో మీకు తెలుసా?" అనడుగుతుంది.
    "సారీ! తెలీదు" అంటాడు తను.
    "థాంక్స్" అనేసి ఆమె వెళ్ళిపోతుంది.
    ఆ దుఃఖం భరించలేక తను మూర్చపోతాడు. అంతే! ఇక ఆమె కనిపించదు. ఆ సీన్ తల్చుకోడానికే దారుణంగా వుంది.
    ఆఫీస్ కి చేరుకున్నాడు సింహాద్రి.
    
                        * * * * *
    
    సాయంత్రం అయిదున్నరకల్లా ఓ చేతిసంచీ తీసుకుని రూమ్కొచ్చేశాడు చిరంజీవి.
    "మిగతా సామానేది?" ఆశ్చర్యంగా అడిగాడు సింహాద్రి.
    "మిగతా సామానేమిటి?" ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు చిరంజీవి.
    "అదే- నీ మిగతా సామాను!"
    "నా మిగతా సామానేముంది?"
    "అదేమిటి? ఇంకేం సామానులేదూ?"
    "ఇదిగో- సామానంతా ఈ సంచీలోనే వుంది"
    "మరి పక్కబట్టలూ వగయిరా"
    "పక్కబట్టలా?" పగలబడి నవ్వాడు చిరంజీవి. "మాకు పక్కబట్టలెందుకు?"
    "అంటే?"
    "ఎప్పుడూ నైట్ డ్యూటీలు చేసేవాళ్ళకు పక్కబట్టలెందుకురా?"
    "మరి రెస్ట్ రోజున ఏం చేస్తావ్?"

 Previous Page Next Page