నిజంగానా!" అంది అనుమానంగా.
"నిజంగానే! నీకోసం ఆమాత్రం ధైర్యం చేయలేకపోతే ఇంకెందుకు జీవితం!' అన్నాడతను ఇంకొంచెం ఫోర్స్ గా!
"అయితే రేపు సాయంత్రమే మా ఇంటి కెళ్దాం!" అందామె ఉత్సాహంగా.
ఆమెకు ఎడ్వంచెర్స్ అంటే చాలా ఇష్టం!
అసలు తను దీప్ చంద్ ని లైక్ చేయటానికి కారణం అతని నవలల్లో అతను రాసే ఎడ్వెంచర్స్!
అంత సాహసోపేతమైన పాత్రల్ని సృష్టించే వ్యక్తీ ఇంకెంత డాషింగ్ గా, ఇంకెంత ధైర్యంగా ఇంకెంత ఎడ్వంచరస్ గా ఉంటాడో అన్న గ్లామర్ తో అతనికి దగ్గరయింది.
అయితే ఎడ్వెంచర్స్ కి సంబంధించినంతవరకూ అతని సామర్ధ్యం అతమెకు అంతగా సంతృప్తి కలిగించటం లేదు.
దీప్ చంద్ ఉలిక్కిపడ్డాడు. ఆ ప్రోగ్రాం ఇంత త్వరగా ముంచు కొచ్చేస్తుందనుకోలేదతను.
"రేపా?" అన్నాడు తనలోని ఖంగారు కనబడనీయకుండా.
"అవును! రేపయితేనే డాడీ మంచి మూడ్ లో ఉంటారు. సాయంత్రం ఏదో సన్మానసభకు అధ్యక్షత వహించి ఏడుగంటల కల్లా ఇంటికొచ్చేస్తా నన్నారు.అప్పుడు ఇద్దరం కలిసి 'కింగ్స్ క్లబ్ లో డిన్నర్ కేళతమన్న మాట! కనుక...."
'అల్ రైట్! రేపు సాయంత్రం మీ ఇంటి కెళ్దాం'! మీ డాడీతో మాట్లాడతాను!' ధైర్యంగా అనబోయాడతను. కాని ఆ గొంతులో ధైర్యం కంటే ఆవేశం కంటే భయమే ఎక్కువగా ధ్వనించింది.
అమ్మాయికి కొంత సంతృప్తి కలిగింది.
"దీప్...." అంది ఆప్యాయంగా.
"యస్ డియర్!"
"నువ్వింకొంచెం ఎడ్వంచరస్ గా ఉంటె ఎంత బావుండేది ?" అంది ఆశగా.
"రేపు మీ డాడీతో మాట్లాడానికి వప్పుకున్నాను కదా!' నిష్టూరంగా అన్నాడు దీప్ చంద్.
అమ్మాయి చాలా స్లోగా నిట్టూర్చింది.
"అయ్యో! వప్పుకోవడం వేరు - సాహసంతో నీ అంతట నువ్వే దూకేయడం వేరు దీప్ చంద్!' అంది చిరాకుగా.
దీప్ చంద్ ఆమె డైలాగ్స్ నచ్చటం లేదు. అలాంటి ఇష్టం లేని సంభాషణలు జరుగుతున్నప్పుడు టాపిక్ ఎలా డైవర్ట్ చేయాలో కూడా రచయిత గ్రిస్టన్ క్రీస్ట్ ఫర్డ్ తన 'నేటి పిచ్చి వాళ్ళే - రేపటి ప్రేమికులు" అనే ఇంగ్లీషు పుస్తకంలో రాశాడు.
అంచేత ఆ పుస్తకంలో కిటుకు ప్రకారం టైం చూసుకుని ఎదురుగ్గా కూర్చున్న అమ్మాయి కళ్ళలోకి చూసి చిరునవ్వు నవ్వాడతను.
"అమ్మాయి" అంటూ పిలిచాడు ప్రేమగా.
"ఊ! అతనేదో చాలా రొమాంటిగ్ గా చెప్తాడని ఊహించింది అమ్మాయి.
'ఆకలేస్తోంది ! హోటల్ కెళ్ళి ఫలహారం చేద్దామా?"
అమ్మాయికేం మాట్లాడాలో తెలీలేదు. నవ్వూ వస్తోంది. కోపం వస్తోంది, చికాకు గానూ ఉంది.
ఆ నవల్లో అంత చక్కని రోమాన్స్ రాసేది ఇతనేనా?
నమ్మలేనట్లు అతని వంక చూసింది.
*****
మర్నాడు సాయంత్రం నాలుగు గంటలకు ఆర్. భీమారావ్ (మెంబర్ ఆఫ్ పార్లమెంట్) తన గదిలో అద్దం ముందు నిలబడి గట్టిగా మాట్లాడుతున్నాడు.
"సోదర సోదరమణుల్లారా! ఈ రోజు నిజంగా నా జీవితంలో మరుపురాని రోజు! ఎందుకంటె ఓ మహా రచయితను సన్మానించే అవకాశం నాకు లభించింది కనుక! నిజానికి ఈరోజు ఉదయం నేను అత్యవసరమైన పార్టీ పనిమీద డిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. అయినా వెళ్ళలేదు. ఎందుకని? ఎందుకని? ఎందుకని?......"
ఆ తరువాతేం చెప్పాలో గుర్తుకిరాక మళ్ళీ కాగితం తీసి చూశాడు.
"ఆ! ఎందుకని? కేవలం అంద్ర్హుల అభిమాన రచయిత అయినా శ్రీ ...శ్రీ... శ్రీ...." ఎంత ఆలోచించినా ఆ రచయిత పేరు గుర్తుకు రావటం లేదు బీమారావ్ కి. అతనికి ఒక్కసారిగా చిరాకేసుకొచ్చింది.
అసలు ఇలాంటి చెత్త సన్మానసభలకు అధ్యక్షత వహించటం తన తప్పు! రచయితలకు కొంతమంది అభిమానులుంటే ఉండవచ్చు గాక! కానీ అది సాకుగా తీసుకుని సన్మానాలు చేయించుకోవటం -
ఎంచేతో తెలీదు గానీ, అసలు రచయితలూ, జర్నలిస్ట్ లూ అంటే తనకే మాత్రం సదభిప్రాయం లేదు.
అలారం టైం పీస్ కొంపలు మునిగిపోయినట్లు మోగటం మొదలు పెట్టేసరికి ఓ సారి ఫైనల్ గా తను రూపం అద్దంలో చూచుకొని బట్టతల ఓసారి సవరదీసుకొని హడావిడిగా బయటికొచ్చి కార్లో సన్మానసభకు బయల్దేరాడు.
*****
రవీంద్రభారతిలో సన్మాన కార్యక్రమం ప్రారంభమయిపోయింది.
రచయిత మెడలో దండలు పడగానే చప్పట్లు మార్,మోర్మోగిపోయినాయ్.
సరిగ్గా ఆ సమయంలోనే అరడజను టమాటో పళ్ళు బులెట్స్ లాగా యెగిరి వచ్చి స్టేజి మీద ఉన్న వారి వివిధ శరీర భాగాల మీద తగిలి పచ్చడి అయిపోయాయి.
ఆర్. బీమారావ్ కి మాత్రం అతని తాలూకూ టమాటో అతని ముఖానికి తగిలి మొఖమంతా టమాటో జూస్ తో నిండిపోయింది.
ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి నిలబడ్డాడతను.
"ఎవరు? ఎవరా టమాటాలు విసిరేసింది?" అన్నాడు జనంలోకి కోపంగా చూస్తూ.
దానికి జవాబుగా రెండు కోడిగ్రుడ్లు యెగిరి వచ్చి రచయిత భుజానికి కొట్టుకుని సొనను శరీర మంతా పాకించినాయ్. ఆ తరువాత అరడజను పాత చెప్పులు, ఎగిరివచ్చాయ్. దాంతో రచయిత మెరుపు వేగంతో స్టేజి దూకి బయటకు పరుగెత్తాడు.
"పదండి! మనమూ పారిపోదాం'!" అన్నాడు ఆర్గనైజర్ హడావుడిగా వచ్చి.
"ఎందుకు? అసలా గొడవ చేస్తున్నదేవరు?" అవమానంతో దహించుకుపోతూ అడిగాడు ఆర్ . భీమారావ్.
"మరేం లేదండీ! ఈ రచయిత ఈ మధ్య రాసిన ఓ నవలలో ఓ వెనుకబడిన కులం గురించి కొంచెం ఇదిగా రాశాడట! వాళ్ళకు అది నచ్చలేదు. అందుకని ఇక్కడ తమ నిరసన తెలియజేస్తున్నారు.....మనం త్వరగా వెళ్తే మంచిదని....."
అతనంటుండగానే మరో రెండు టమాటోలు, కోడిగుడ్లు వచ్చి బీమారావ్ ని తాకి లిక్విడ్ గా మారిపోయినాయ్.
ఆర్. భీమారావ్ ఇంకా ఆలస్యం చేయలేదు. తన చేతికర్ర తీసుకుని స్టేజీ వెనుక నుంచీ బయట కొచ్చీ కార్లో వేగంగా ఇంటికి బయల్దేరాడు. అతనికి ఎంతో అవమానంగానూ, కోపంగానూ కూడా ఉంది - జరిగినదానికి.
అలాంటి చెత్త రాతలు రాసే రచయితగాళ్ళు సన్మాన సభలకు ఇంక జన్మలో అధ్యక్షత వహించకూడదని శపథం చేసేసుకున్నాడు.
అంతేకాదు తనేప్పటికయినా ప్రధాన మంత్రి అయితే రచయితలందర్నీ షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ ఇచ్చి ఫినిష్ చేసి పారేయాలని కూడా అనుకున్నాడు.
కంగారుగా తన కార్లో కూర్చొని డ్రైవర్ కోసం చూశాడు గానీ, డ్రైవర్ కి బదులు థియేటర్ లోని జనం రాళ్ళతో కర్రలతో రచయిత వెంటపడి తరుముతూ తన కారు వేపు రావటం కనిపించింది. ఆలశ్యం చేస్తే వాళ్ళు తన కారుకి నిప్పు పెట్టడం తప్పదని అర్దమయిపొయిందతనికి. దాంతో తనే కారు స్టార్ట్ చేసుకొని శరవేగంతో నడపసాగాడు. వెనక అరుస్తూ జనం -
సరిగ్గా అదే సమయంలో అయన కారు సహాయ నిరాకరనోద్యమం ప్రారంభించింది. పెద్ద పెద్ద శభ్దాలు చేస్తూ వేగం తగ్గిపోయి, చివరకు నారాయణ గూడ దగ్గర కొచ్చేసరికి టోటల్ స్ట్రయిక్ మొదలు పెట్టింది.
*****
కాళ్ళు నొప్పులు పుట్టేస్తున్నా గానీ ముఖం మీద చిరునవ్వు చెరగలేదు భవానీశంకర్ కి. ఇంకొంచెం నడిస్తే చాలు! నారాయణగూడా లోని "రైజింగ్ స్టార్" అనే ఇరానీ హోటల్ చేరుకోవచ్చు! ఆ హోటల్లో రెండు 'బన్' లు తిని ఒక పౌనా తాగటమే తన తక్షణ కర్తవ్యం. లేకపోతే శరీరంలో అవయవాలు తనకు ఎదురు తిరిగే ప్రమాదం ఉంది.
మరో అయిదు నిమిషాల్ల్లో రైజింగ్ స్టార్ చేరుకున్నాడతను.
సర్వర్ వచ్చి చిరునవ్వుతో పలకరించాడు.
"ఏం కావాల్సర్?"
"రెండు బస్- మస్కా"
సర్వర్ బన్ లు తెచ్చి అతని ముందుంచాడు.
"పౌనా కూడా తేవాలా సార్?" అడిగాడతను ఆప్యాయంగా.
"యస్ మైడియర్ భాయ్. మొగలాయూ పౌనా తీసుకురా!"
"ఆ మొగలాయూ పౌనా ఏక్" అంటూ అరిచాడతను. నిజానికి ఆ పేరు గల పౌనా లేకపోయినా!
బన్ లు తిని పౌనా తాగాక శరీరంలోని పూర్తీ సత్తువ వచ్చేసినట్లనిపించింది భవానీ శంకర్ కి.
లేచి రోడ్డు మీద కొచ్చి పక్క షాపులో తాడుకి వేలాడుతోన్న "తెలుగు కిరణం" డెయిలీ న్యూస్ పేపర్ కొన్నాడు.
అందులో స్థానిక ఉద్యోగ ప్రకటనలుంటాయని - మరో నిరుద్యోగ పక్షి చెప్పడంతకు ముందు రోజు.
అయితే అలవాటు ప్రకారం అతని కళ్ళు న్యూస్ పేపర్ ని,దాని జర్నలిజం స్టాండర్త్స్ నీ పరిశీలించినయ్ ముందు.
"ది మోస్ట్ హోప్ లెస్ న్యూస్ పేపరాఫ్ ఇండియా" అనుకున్నాడు చివరి కంటా చూశాక హటాత్తుగా అతని దృష్టి కార్నర్ లో ఓ ఉద్యోగ ప్రకటన మీదకు మళ్ళింది.
పి.యం.బి.ఎక్స్ ఆపరేటర్ గా పనిచేయటానికి అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కావాలిట!