Previous Page Next Page 
జీవాత్మ పేజి 7


    
    ఆ గాలికి భయంకరంగా వూగుతున్న చెట్లు ప్రేతాలు నృత్యం చేస్తున్నట్లున్నాయి. కపాలాల సందుల్లోకి ప్రవేశించిన గాలి "ఊఁ...." అంటూ- దెయ్యాలు ఏడుస్తున్నట్లుంది!
    
    ఏ ఆధారాలూ లేకుండా ఓ మనిషిని హతమార్చే భయంకర క్షుద్ర ప్రయోగం చేశాడతను. అదే... ఆర్దవటీ ప్రయోగం. దీనికి శత్రువు వాడిన దుస్తులుగానీ, వాళ్ళు తొక్కిన మట్టికానీ, తల వెంట్రుకలు గానీ సేకరించి, ఓ చెక్కబొమ్మకి వాటిలో ఏదో ఒకటి జత చేసి, ఏకాగ్రతతో సాధన చేసి, క్షుద్ర దేవతల సాయంతో ఇరవై ఒక్క రోజులు అతడు నరకయాతన పడి మరణించేలా చేయవచ్చు.
    
    అలాంటి భయంకర కార్యం నిర్వహించి అతి మామూలుగా ముందుకు సాగిపోతున్నాడతను. హఠాత్తుగా ఆకాశం మెరిసింది. ఆ మెరుపులో జడలు కట్టిన జుట్టు భుజాల వరకూ జీరాడుతూ, అస్తవ్యస్తంగా పెరిగిపోయిన గెడ్డం, మీసాలతో, శుష్కించైనా దేహంతో మొలకు చిన్న అంగీతో అరవై ఏళ్ళు పైబడిన అతని రూపం కాలక్షేపం కోసం స్మశానంలో తిరుగాడుతున్న దెయ్యంలా కన్పించింది.
    
    అతడు రెండడుగులు నడిచాడో లేదో ఆకాశం పెద్దగా ఉరిమింది. అతను నడక వేగం కాస్త పెంచాడు.
    
    'టప్....'
    
    ముందుగా ఒక వాన చినుకు పడింది. చెట్టుతొర్రలలోని పక్షులు కువకువలాడుతూ మారిన వాతావరణానికి సిద్దపడసాగాయి.
    
    అతడు మరికొంచెం ముందుకు నడిచాడు. ఇంతలో అతని కలికి మెత్తగా ఏదో తగిలింది.
    
    అప్పుడే ఆకాశంలో మెరిసిన మెరుపు వెలుగులో కనిపించింది. అదొక మనిషి అరచేయి, పాతిపెట్టిన శవాన్ని నక్కలు తవ్వి తినగా మిగిలి పోయిన ఏ శవానిదో అది. అడుగున ఎముక వరకూ ఎవరో రంపంతో కోసేసినట్టు వుందది. అక్కడక్కడా చర్మం వుందింకా. నల్లగా కమిలిపోయి అసహ్యంగా వుంది. భయంకరమైన చెడు వాసన కొడుతోంది.
    
    కాలితో దాన్ని పక్కకి తోసేసి వడివడిగా ముందుకు నడిచాడతను చినుకులు ఉధృతమై వర్షంగా మారింది. ఏనుగు తొండాలతో గుమ్మ రిస్తున్నట్లూ, సమ్మెటలతో మోదుతున్నట్లూ, భూమ్యాకాశాలను ఏకం చేస్తున్నట్టు కుంభవృష్టి కురుస్తోంది. మరుభూమే ఉదన్వంతంలా మారేట్టుంది.    

    అయినా అతడు తల దాచుకోవడానికి ఏ చెట్టునీ ఆశ్రయించలేదు. తన గమ్యం వైపు సాగిపోతూనే వున్నాడు. కాలిన కపాలాల మీద చినుకు పడి అది రవమై, భీకరమై, ఉద్ఘోషమై, సరోచ్చితమై భూనభోంతరాలని ఏకం చేసేలా వుంది.
    
                                                        *     *    *    *    *
    
    చటుక్కున చేతిలోంచి పుస్తకం ఎవరో లాక్కోవటంతో ఉలిక్కిపడి తలెత్తి చూశాడు అభిరాం.
    
    ఎదురుగా మహదేవ్!
    
    "అభిరాం! నీకెన్నిసార్లు చెప్పాను ఇటువంటి పుస్తకాలు చదవొద్దని" అభిరాంకి ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ అన్నాడతను.
    
    అభిరాం, మహదేవ్ మంచి స్నేహితులు.
    
    ఇద్దరి వయస్సూ ముఫ్ఫై ఏళ్ళలోపే! ఇద్దరూ అవివాహితులే.
    
    అభిరాంకి, 'సృష్టి' అనే ఏడ్ ఏజెన్సీ వుంది. తెలుగులో వస్తున్న దిన, వార, మాస పత్రికలతో పాటు, కొన్ని ఆంగ్లపత్రికలకి కూడ అతని కంపెనీ నుంచే ఏడ్స్ డిజైన్ చేయబడి అందించబడుతుంటాయి.
    
    అతని కింద అయిదారుగురు ఏడ్స్ ఎగ్జిక్యూటివ్ లు, ఇద్దరు గ్రాఫిక్ డిజైనర్లు, ఓ రిసెప్షనిస్ట్ పని చేస్తున్నారు. బేగంపేటలోని జబ్బర్ ఎస్టేట్ బిల్డింగ్ లో ఓ విశాలమైన భవంతిలో వుందతని ఆఫీస్.
    
    కంప్యూటర్లో డిజైన్ వచ్చిన ఏడ్స్ ని పరిశీలించటం, ఎక్కడన్నా ఒకటి అరా కరక్షన్స్ వుంటే దిద్దటమే అతని పని.
    
    తయారయిన ఏడ్స్ ని అభిరాం 'ఇలా వుండాలి' అని చెప్పనవసరం లేకుండానే అధ్భుతంగా డిజైన్ చేయగల సమర్ధవంతులైణ డిజైనర్లు అతనికి లభించటంతో అతనెక్కువగా తన ఛాంబర్లో కూర్చుని పుస్తక పఠనంలో మునిగిపోతాడు.
    
    అవి కూడా మానవాతీత శక్తుల మీద రాసిన పుస్తకాలూ, హర్రర్, మంత్ర తంత్రాలతో వున్న పుస్తకాలే చదువుతాడతను. మానవాతీత శక్తులు, మంత్రతంత్రాలు వున్నాయని నమ్ముతాడు.
    
    ఇక మహదేవ్ ఆర్కిటెక్చర్.
    
    వాళ్ళిద్దరూ ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు పక్కపక్క ఇళ్ళల్లోనే వుండేవారు. అప్పట్నుంచీ వాళ్ళ స్నేహం అలా కొనసాగుతూనే వుంది.
    
    అభిరాం ప్రస్తుతం జూబ్లీహిల్స్ లో వుంటే, మహదేవ్ సైనిక్ పురీ కాలనీలో వుంటున్నాడు.
    
    అభిరాం తల్లిదండ్రులు మూడేళ్ళక్రితం ఓ రోడ్ ఏక్సిడెంట్లో చనిపోతే ప్రస్తుతానికి అతనితోపాటు అతని అమ్మమ్మ వుంటుంది. అభిరాం ఒక్కడే సంతానం అతని తల్లిదండ్రులకి.
    
    మహదేవ్ కి మాత్రం తల్లీ, ఓ చెల్లీ వున్నారు. తల్లి గుంటూర్లో వుంటుంది. ఆమె భర్త అయిదేళ్ళ క్రితం హార్టెటాక్ తో చనిపోయిన తర్వాత పట్నం జీవితమంటే విసుగొచ్చేసి, ప్రశాంతత కోసం గుంటూరు జిల్లాలోని సొంత వూరైన ఓ పల్లెటూరిలో వుంటుందామె. మహదేవ్ ఒక్కగానొక్క చెల్లెలి పెళ్ళి లాస్ట్ ఇయరే అయిపోయింది.
    
    "ఏమిటిలా వచ్చావ్? నికిత ఎలా వుంది?" తన కెదురుగా కూర్చున్న మహదేవ్ ని అడిగాడు అభిరాం.
    
    "బిల్డింగ్ ప్లాన్ లు గీసి గీసి బోర్ కొట్టింది. కాస్సేపు నీతో గడిపి వెళదామని వచ్చాను. నికిత వాళ్ళమ్మా నాన్నలని చూడటానికి వైజాగ్ వెళ్ళింది..." అభిరాం చేతిలోంచి లాక్కున్న నవలని టేబుల్ మీద వుంచి అన్నాడతను.
    
    "నవల చాలా ఇంట్రెస్టింగ్ గా వుంది. ఆపబుద్ది కావటం లేదు" తిరిగి నవలందుకుంటూ అన్నాడు అభిరాం.

 Previous Page Next Page