Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 6

    తల్లి నవ్వు చూసి విమల స్థిమిత పడింది.    
    సరిగ్గా తను చెప్పిన సమయానికి-తొమ్మిది గంటలకి విమల ఇంటి ముందు ఆటో దిగాడు శర్మ ఎన్నడూ లేనిదీ అతని ముందుకు రావటానికి ఏదో సిగ్గు కలిగింది విమలకి ఇంతలో ఓ అనుకోని సంఘటన జరిగింది.    
    శర్మని చూడగానే శకుంతల, "డాడీ!" అంటూ వెళ్ళి అతడి కాళ్ళను చుట్టుకొంది. అతడు ఒక్క నిముషం కంగారుపడి సర్దుకొని, శకుంతలని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు.    
    విమల పాలిపోయిన ముఖంతో అక్కడికొచ్చి, "శకూ! దిగు తప్పు కదూ?" అంది.    
    శకుంతల బిక్కముఖం వేసింది శర్మ పాపని బుజ్జగిస్తూ, "ఫరవాలేదమ్మా! తప్పులేదు" అన్నాడు. తను తెచ్చిన బిస్కట్ పాకెట్ ఇచ్చి క్రిందకు దింపాడు.    
    విమల సంజాయిషీ ఇచ్చుకుంటున్నట్లు, "దీనికిప్పుడే మాటలొస్తున్నాయి. ఇంటివాళ్ళ పిల్లల్ని చూసి 'డాడీ!' అనే మాట నేర్చుకొంది. మొన్నంతా 'డాడీ! డాడీ!' అని అంటోంటే ఆ మాట వినలేక, 'మీ డాడీ ఇక్కడ లేరు. ఆ మాట అనకు' అన్నాను. 'పిలు!' అంది. అంతే అనగలదు అది. ఏం చెప్పాలో తెలియక 'రేపు వస్తారు' అన్నాను. దాని పసి మనసుకు ఆ మాట ఇంత బాగా గుర్తుంటుందని అనుకోలేదు. రెండు రోజులయింది కదా, మరిచిపోయి ఉంటుందని అనుకొన్నాను. మిమ్మల్ని చూసి డాడీ అనుకొంది. క్షమించండి!" అంది.    
    "క్షమాపణలు దేనికి? బేబీ అలా అనుకోవటం నాకు సంతోషమే!" అర్ధవంతంగా నవ్వుతూ అన్నాడు.    
    విమల ముఖంలో సంతోషమూ, భయమూ ఒక్కసారిగా కానిపించాయి. "అమ్మని పిలుస్తాను" అని లోపలికి వచ్చింది.    
    అనసూయమ్మ బయటకు వచ్చింది. తనను చూసి లేవబోతున్న శర్మని, "కూచో బాబూ!" అంది.    
    శర్మ కూచున్నాడు. అనసూయమ్మ తిన్నగా విషయానికే వచ్చింది. విమలను మీ ఇంటికి రమ్మన్నారుట కదా?"    
    "అవునండీ!"    
    "విమల ఉన్న పరిస్థితి నీకు తెలుసుకదా! ఇట్లాంటి పరిస్థితిలో ఉన్న ఆడపిల్లని లోకం ఇనుప ముక్కులతో పొడుస్తుంది. అంచేత మిగిలిన వాళ్ళకంటే మరింత జాగ్రత్తగా ఉండాలి!"    
    "ఆ విషయం నేను అర్ధం చేసుకున్నాను."    
    "విమలను మీ ఇంటికి రమ్మనటంలొ మీ ఉద్దేశం ఏమిటి చెప్పండి!" స్పష్టంగా అడిగింది.    
    "ఏముంది? విమలను నేను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను."    
    అదేదో సామాన్యమైన విషయమన్నట్లు మామూలుగా అన్నాడు.    
    అనసూయ ముఖంలో చాలా రోజుల తర్వాత వికాసం కనిపించింది కానీ ఆమె మనసులో ఎన్నో సంకోచాలు.    
    "మీ అమ్మ, నాన్నగారూ ఒప్పుకొంటారా?"    
    "ఒప్పుకొంటారు! వాళ్ళిద్దరూ నేను పెళ్ళిచేసుకుంటే చాలని ఎదురుచూస్తున్నారు."    
    "విమల కులం....గోత్రం అడగరా?"    
    "అడుగుతారు."    
    "ఏమని చెపుతారు?"    
    "మీరు చెప్పింది చెపుతాను."    
    "అయితే విమల తల్లి బ్రాహ్మిణీ, తండ్రి కోమటి."    
    ఒక్క గుటక మింగాడు శర్మ. అంతలో సర్దుకున్నాడు.    
    "ఫరవాలేదు. అవన్నీ నేను చెప్పి ఒప్పించగలను."    
    "మరో ముఖ్యమైన విషయం ఉంది_శకుంతల?"    
    దీనికి శర్మ వెంటనే సమాధానం చెప్పలేకపోయాడు.    
    "క్షమించండి! ఈ విషయం మాత్రం పెద్దవాళ్లకు వెంటనే చెప్పలేను. నెమ్మదిగా చెపుతాను ముందు పెళ్ళీ అయిపోనీయండి. ఆ తరువాత శకుంతలను ఏదో ఒక విధంగా మా దగ్గిరకు తీసుకుపోతాను."    
    అనసూయమ్మ తల దించుకుంది. దయనీయమైన స్వరంతో "నేను అర్ధం చేసుకోగలను బాబూ! శకుంతలను నా దగ్గిరే ఉంచుకొనేదాన్ని! కానీ నా ఆరోగ్యం...." అని ఆగిపోయింది.    
    అప్పటి వరకూ లోపలనుండి ఈ సంభాషణ అంతా జాగ్రత్తగా వింటున్న విమల వెంటనే బయటికి వచ్చేసి తల్లి చెయ్యిపట్టుకుని, "నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా? బాగానే ఉన్నావుగా!" అంది.    
    "బాగానే ఉన్నాను శకుంతల బాధ్యత స్వీకరించేటంతకాలం బ్రతికి ఉంటానో-ఉండనో అని అలా అన్నాను. అంతే విమలా! శర్మగారు చాలా మంచివారులా కనపడుతున్నారు. వాళ్ళ యింటికీ వెళ్ళిరా! జాగ్రత్తగా మసులుకో!"    
    విమల తల ఊపింది కానీ ఆమెకు ఉదయం కలిగిన ఉత్సాహం చాలావరకు తగ్గిపోయింది. అటు తల్లి, ఇటు శకుంతల, వీళ్ళను వదలి తన సుఖం తాను చూసుకోగలదా?"    
    అనసూయకు, శర్మకు కాఫీ ఫలహారం అందించింది. అతడు బాగుందని మెచ్చుకున్నాడు. ఆ తర్వాత శకుంతలకు "టా-టా" చెప్పి తల్లితో "వెళ్ళొస్తా"నని చెప్పి శర్మతో బయలుదేరింది విమల.    
    "ఆటో పిలవనా?" అన్నాడు శర్మ.    
    "వద్దు కొంచెం దూరం నడుద్దాం. నేను మీతో మాట్లాడాలి" అంది.    
    "సరే, మాట్లాడండి అది నాకు చాలా యిష్టం."    
    "మీకు శకుంతల గురించి__అదే నేను ఎలా తల్లి నయానో తెలుసుకోవాలని లేదా!"    
    "అందులో తెలుసుకోవటానికి ఏముంది? ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. నమ్మి మోసపోయి ఉంటారు. పాత కథేగా."    
    "అవును-యుగ యుగాలనాటి కధ. కొత్తదనం-నేను శకుంతలను ఏ అనాథ శరణాలయంలోనో వదిలెయ్యకుండా పెంచుకోవటం లోనే....."    
    ఈ ఆత్మ స్థైర్యం నాకిష్టమే!"    
    "కానీ నా పూర్వ ప్రణయగాధ మిమ్మల్ని బాధించదా?"    
    నడుస్తున్నవాడు ఆగిపోయాడు శర్మ.    
    "కొన్ని ప్రశ్నలకు నిర్భయంగా నిజాలు చెప్పండి. మీ వెనుకటి ప్రియుణ్ణి - సారీ! శకుంతల తండ్రిని పూర్తిగా మరిచిపోయారా?"    
    "ఎలా మరిచిపోతాను?"    
    "అంటే?"    
    "అంటే, నా జన్మలో ఎన్నటికీ మరచిపోలేనంతగా అతన్ని ద్వేషిస్తున్నాను."    
    "అదా?"    
    "మరొకటి అతడు తిరగి మీ జీవితంలోకి ప్రవేశించే ఆస్కారం ఉందా?"

 Previous Page Next Page