శర్మ నవ్వాడు.
"నీ కేస్ ఇంకా ఏమీ తేల్లేదు మూర్తీ! పెన్షన్ రిలీజ్ చేయించేందుకు ప్రయత్నిస్తున్నాను. కానీ ఏదో ఓకే అడ్డు తగులుతోంది."
"అవును మరి! నా చరిత్ర లాంటిది. మరీ దేశభక్తి పిచ్చి ఎక్కువయితే ఎవరూతుకుంటారు?వస్తా!" నాలుగడుగులు వేశాడు. వెనుకే వచ్చాడు శర్మ వడివడిగా.
"ఒకవేళ నీకేమయినా ఇబ్బందిగా వుంటే నా దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకోవచ్చు నువ్వు."
"ఏనుగు పడిపోతే దానంతట అదే లేవాలి గానీ ఎంతమంది సహాయం చేయడానికి ప్రయత్నించినా ఉపయోగం వుండదు శర్మా! థాంక్యూ !" అక్కడినుంచి అతను అబిడ్స్ లో వున్న ఓ కంపెనికీ చేరుకున్నాడు. డక్కన్ క్రానికల్ పేపర్లో ఆ కంపెనీ వాళ్ళు ఎకౌంటెంట్స్ కావాలని ప్రకటించారు. ఆరోజు ఏకాఏకీని ఇంటర్యు కి రావాలని రాశారు.
హల్లో అంతా పాతికేళ్ళలోపువారే కూర్చుని వున్నారు. అందరూ అతని వేపు అనుమానంగా చూడసాగారు. చివరకు ఓ కుర్రాడు అడగనే అడిగాడు.
"ఏం పని మీద వచ్చారు సార్?"
"ఉద్యోగం కోసం!" అతను ఉలిక్కిపడ్డాడు.
"ఈ వయసులో ఉద్యోగమా? అంటే రెండో ఉద్యోగమా లేక ఇంతవరకూ అసలు ఉద్యోగమే దొరకలేదా?"
"దేశం అంత దారుణమయిన పరిస్థితిలో ఉందనుకోను. పేపర్లలో ఎప్పుడు చూసినా ఉద్యోగ ప్రకటనలూ కనపడుతూనే వుంటున్నాయి కదా?"
"మీ ఓల్డ్ జనరేషన్ తో ఇదే ప్రాబ్లం సార్! ఇంకా అంతా మీ రోజుల్లో వున్నట్లు ఉందనుకుంటారు. ఇదిగో చూడండి! ఉద్యోగ ప్రకటన లేలాంటివో, డిప్యుటీ జనరల్ మేనేజర్ కావలెను. ఏమ్ .ఇ. , ఎమ్.బి.ఏ. మేనేజర్ కేడర్ లో కనీసం పదిహేనేళ్ళ అనుభవం. అంటే ఈ ఈ ప్రకటన మీ లాంటి ముసలివాళ్ళ కోసమన్న మాట! ఇది చూడండి ఫైనాన్షియల్ కంట్రోలర్ పోస్ట్ కి అర్హత గల అభ్యర్ధులు కావాలెను. ఎమ్. ఎ. స్టాటిస్టిక్స్, సి.ఏ. ఏం.బి.ఏ , కనీసం పదేళ్ళ అనుభవం. ఏమంటారిప్పుడు? అన్నీ ఇలాంటివే. మామూలు మిడిల్ క్లాస్ చదువులు చదువుకున్న మాబోటి వాళ్ళ సంగతేమిటి?"
"అందరూ ఉద్యోగాల కోసం ఎగబడే బదులు ఏదో ఒక బిజినెస్ చేసుకోవచ్చు కదా?"
"దానికి పెట్టుబడి ఎవరిస్తారు?"
"బ్యాంకులు."
"మేమేం హర్షద్ మెహతాలనుకుంటున్నారా? వాళ్ళకు కోట్లకు కోట్లు లంచాలిచ్చి డబ్బు కొట్టెయ్యడానికి. "ప్యూన్ రామచంద్రమూర్తి పేరు పిలిచేసరికి హడావుడిగా లోపలకు నడిచాడతను.
"ప్లీజ్ టేక్ యువర్ సీట్!" రామచంద్రమూర్తి కూర్చున్నాడు.
"ఇంతకు ముందున్న ఉద్యోగం ఎందుకు పోయింది?"
"నాకు అవినీతి పనులిష్టం లేదు. అందుకని పోయింది."
"మీరు గవర్నమెంట్ సర్వెంట్ కదా! అవినీతి యిష్టం లేకపోవటమేమిటి?"
"నేననుకోవటం నాకు మానసిక రుగ్మత అని."
అతను నవ్వాడు.
"అలాంటి రుగ్మత వున్నప్పుడు మరి మా కంపెనీలో ఎలా పని చేస్తారు? మా ప్రైవేట్ కంపెనీల్లో ఎన్నో రకాల ఫ్రాడ్ లు చేయందే బిజినెస్ చేయలేం!"\
"గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అనేక రంగాల్లో ఎన్నో ఫ్రాడ్ లు చేస్తోంది. వాటితో నాకు సంబంధం లేదు. నా వరకూ నేను సిన్సియర్ గ పనిచేయగలిగితే చాలు."
"అది కూడా సాధ్యమని నేననుకోను! మీరు చేయబోయేది ఎకౌంటెంట్ పోస్ట్ గనుక దొంగలెక్కలు రాయాల్సి వుంటుంది. దొంగ రిటర్న్ సబ్మిట్ చేయాల్సి వుంటుంది. దొంగ ఎస్టిమేట్స్ వేయాల్సి వుంటుంది. బ్యాంక్ లతో లాలుచీ పడి డబ్బు కాజేయాల్సి వస్తుంది."
రామచంద్రమూర్తి నవ్వాడు.
"అయితే మీరు ఎకౌంటెంట్ పోస్ట్ కి అనుభవం వున్న దొంగ కావాలని వేస్తె బాగుండేది. నాలాంటి వాళ్ళు వచ్చే అవసరం వుండేది కాదు.
"దొంగలు అని ఓపెన్ గా ప్రకటిస్తే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపి లు, మినిస్టర్లు కూడా అప్లయ్ చేసే ప్రమాదం ఉంది. అంత గజదొంగలు మా కవసరం లేదు!" అతనూ నవ్వుతూ అన్నాడు.
"మిమ్మల్ని నొప్పిస్తే క్షమించండి! సరదాగా జోక్ చేశాను."
"మీ వయసుకి మీకా అధికారం వుంది."
"థాంక్యూ ! వస్తాను" బయటి కొచ్చేశాడతను."
కుర్రాళ్ళందరూ అతని చుట్టూ మూగారు.
"ఎమాడిగారు సార్?"
"నన్ను మెంటల్ హాస్పిటల్లో ఎడ్మిట్ అవమన్నారు!"
"మీరున్నది అందులోనేగా? కాకపోతే కొంచెం పెద్ద హాస్పిటల్ పేరు భారతదేశం."