"అది కాదయ్యా! నాదగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదేలాగా అని ఆలోచిస్తున్నాను."
"పోనీ రేపు తీసుకుంటాన్లే! దానికింత ఆలోచనేందుకు?"
"ఏమో! మళ్ళీ మీ అన్నయ్యతో "వదిన డబ్బివ్వనంది" అని ఫిర్యాదు చేస్తావేమోనని భయం ---"
సృజన్ కి ఆమె మాటల్లోని వ్యంగ్యం అర్ధమయింది.
తను పదోతరగతి చదివేటప్పుడోకసారి ఇలాగే అవసరం వచ్చి వదినను డబ్బు అడిగాడు.
"నలుగురు ఫ్రెండ్స్ తో సినిమా కెళ్ళాడానికి యాభయ్ రూపాయలెందుకయ్యా! పాతిక రూపాయలు చాలవూ -" అందామె మందలింపుగా.
తనకు కోపం వచ్చింది.
"అసలేమీ అక్కరలేదులే! అంటూ విసురుగా స్కూలు కెళ్ళి పోయాడు. సాయంత్రం స్కూలు నుంచి ఫ్రెండ్సు తో తిన్నగా అన్నయ్య కంపెనీ కెళ్ళాడు.
అన్నయ్య తనను చూసి ఆశ్చర్యపోయాడు.
"ఏమిట్రా ఇలా వచ్చావ్?" అడిగాడు.
"నేను మా ఫ్రెండ్స్ తో సినిమాకు వెళ్ళాలన్నాయ్.......! వదిన డబ్బివ్వనంది" కోపంగా చెప్పాడు.
శ్రీధర్ కి నవ్వొచ్చింది.
"మీ వదిన డబ్బివ్వనందా?"
"పాతిక రూపాయలే యిస్తుందట!"
"సరే నేనిస్తాన్లే!" జేబులోంచి వందనోటు తీసి ఇచ్చాడతను.
"చాలా! ఇంకా కావాలా?"
"చాలన్నయ్యా! థాంక్యూ!" అనేసి బయటకు పరుగెత్తాడు. ఆ రాత్రి అన్నయ్య వదినెను మందలించటం తనే స్వయంగా విన్నాడు.
"వాడేప్పుడడిగినా లేదనకు సుభద్రా! దుబారా చేసే తత్త్వం కాదు వాడిది. అమ్మా, నాన్న లేని లోటు ఏ పరిస్థితిలోనూ ఫీలవకూడదు వాడు."
సుభద్ర అప్పుడప్పుడూ ఆ విషయం గుర్తు తెచ్చి సృజన్ ను హేళన చెస్తుంటుంది.
సృజన్ ఆమె దగ్గరగా జరిగాడు.
"వదినా! అప్పుడంటే చిన్నతనం. తెలీక చేసాను. లేపోతే మా బంగారు వదిన మీద చాడీలు చెప్తానా? మా వదినంటే ఇలయి----"
"మళ్ళీ పొగడ్తలా ?వద్దు బాబూ......"
వాళ్ళు మాట్లాడుతుండగానే బయట కారు హరన్ మోగిన చప్పుడయింది."
"ఆ.....వచ్చేశారు. మా వదిన ప్రియసఖి సరోజినీ గారు......." నవ్వుతూ చెప్పాడు సృజన్.
సుభద్ర వంటింటిలో నుంచి బయటకు నడిచింది. ఆమె తో పాటు సృజన్ కూడా వచ్చాడు.
"నువ్వెండుకూ నాతొ........నీకాబోయే భార్యామణిని చూసుకుందామనా?"
"చట్! ఆ అమ్మాయి నెవరు చేసుకుంటారోదినా? తెగ గర్వం!"
సరోజినీ, ఆమె వెనుకే దీప ఇంట్లో కొచ్చేశారు.
"హయ్" అంది సృజన్ ని చూడగానే ఉత్సాహంగా.
"హయ్" తనూ పలకరించాడతను.
"ఏమిటి పొద్దున్నే బయల్దేరారు?" సోఫాలో కూర్చున్నాక అడిగింది సుభద్ర.
"దీపకు సృజన్ తో ఏదో పని వుందట! సరేనని నేనూ బయల్దేరాను" అంది సరోజినీ.
"ఏమిటీ నాతొ పని?" అడిగాడు సృజన్.
"మా ఫ్రెండ్స్ "వోమేన్స్ లిబరేషన్ వింగ్" ఒకటి ప్లాన్ చేశారు . ఫండ్స్ కోసం డొనేషన్స్ కలెక్టు చేసున్నాము. ఇదిగో ఈ బుక్ నీ కోటా!" ఓ పుస్తకం అతని కందించింది.
చూస్తూనే అడిరిపడ్డ్డాడు సృజన్.
"మైగాడ్! వంద కూపన్లూ.........ఒకో కూపనూ యాభై రూపాయలా?"
"అప్టరాల్ అయిదువేలు పోగుచేయలేవూ! పోనీ అది ప్రిస్టేజ్ కి చాలా తక్కువనుకుంటే ఇంకో నాలుగు బుక్స్ తీసుకో --" ఉడికిస్తూ అంది.
"నీకో నమస్కారం -- నీ పుస్తకాలకో నమస్కారం."
దీప గలగల నవ్వేసింది.
నవ్వుతుంటే మరింత సమ్మోహనకరంగా మారిన ఆమె రూపం తదేకంగా చూస్తుండిపోయాడతను.
"అయితే ఒక్క పుస్తకం అమ్మటం నీకు చేతకాదంటావ్! అంతేనా?"
"అల్ రైట్! ట్రై చేస్తాను! ఎన్ని రోజులు టైం?"
"వచ్చే ఆదివారం మాణింగ్ కల్లా కంప్లీట్ చేసుకుని మా ఇంటికి రా! నీకోసం వెయిట్ చేస్తాను----"
"ఓ.కే!"
వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సృజన్ వెంటనే పుస్తకం, పెన్నూ తీసుకుని వాళ్ళ వదిన పక్కనే కూర్చున్నాడు.
"ఆ! నీ పూర్తీ పేరెంటీ వదినా!" అన్నాడు మొదటి కూపన్ తెరిచి.
"ఆదేమిటి? నా కంటగడుతున్నావా?"
"అవునోడినా! నీ చేత బోణీ మహా గొప్పదని స్వరూప్ గాడూ, రంగాగాడూ ఎప్పుడూ అంటుంటారు."
"పొగడ్తలు వద్దన్నానా?"
"పొగడ్తలా! ఎవరయినా నువ్వుతారోదినా వీటిని పొగడ్తలంటే! ఇవి ఫాక్ట్స్! నా మాట అబద్దమైతే మహేష్ టెక్స్ టైల్స్ షాపతను స్టాకు రాగానే ముందు మంచి చీర నీకే ఎందుకు పంపిస్తాడు?"