తమ మీదకు దూసుకువచ్చిన ఆ నల్లటి కారు మీద కెళ్ళినాయ్. ఆది మందు కొట్టడం వల్ల రాష్ డ్రయివింగ్ అనుకోవటానికి ఆస్కారం ఉంది గానీ తనకు వేరే అనుమానాలు కలుగుతున్నాయ్.
రాష్ డ్రయివింగ్ అయినట్లయితే అప్పుడే ఓ సైకిల్ ని తప్పించుకొచ్చి - తమను దాటాక మరో సైకిల్ ని తప్పించుకుని ఆ సందులో నుంచి మెయిన్ రోడ్ మీదకు తిరిగి ఆ ట్రాఫిక్ లో వెళ్ళటం ఎలా సాధ్యం? అది గాక తమ దగ్గర కొచ్చాక దాని వేగం ఎందుకు పెరిగింది?
హటాత్తుగా నిలబడిపోయడతను.
ఒకవేళ - ఒకవేళ- తనను గాని, స్మితను గాని కావాలని చంపటానికి ఎవరయినా ప్రయత్నించలేదు కదా!
గుండె వేగంగా కొట్టుకుందతనికి.
కాని తనను ఎవరూ చంపడానికి ఆస్కారం లేదు. తన పేర ఆస్తులు లేమీ లేవు. తనకు శత్రువులెవరూ లేరు. కాలేజీలో చదువుతున్నప్పుడూ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్స్ లో ఒకే ఒక్కడిని తను బాక్సింగ్ చేసి చావగొట్టాడు గాని వాడు దాని కోసమని ఇన్నేళ్ళ తరువాత తనను వెంబడించి ఈ సందులో ఎటాక్ చేశాడనుకోవటం మీనింగ్ లెస్.
"ఇకపోతే స్మిత."
ఆమెను చంపటానికి ఎవరికయినా ఏమయినా కారణాలున్నాయా?
"ఏమో? అది ఆమెకే తెలియాలి?
నెమ్మదిగా మళ్ళీ నడక ప్రారంభించాడతను. ఇంకెంతో దూరం లేదు శ్యామ్ ఇల్లు మరో ఫర్లాంగు.
అంతే -
అఖిల భాను ఇంటి ముందు ఆగి డోర్ బెల్ మీద ప్రెస్ చేసింది స్మిత. భాను తలుపు తెరచి ఆమెను చూసి ఆనందంతో పొంగిపోయింది.
"ఇప్పుడే అనుకుంటున్నా - ఇంకా రాలేదేమిటా అని " - అందామె చిరినవ్వుతో.
ఇంట్లోకి అడుగు పెడుతూ ఒకసారి రోడ్ చివరికంటా చూసింది స్మిత. దూరంగా భవానీశంకర్ ఆటే వస్తూ కనిపించాడు.
ఆమె కింకా కోపానికి పట్టపగ్గాలు లేకుండా పోయినాయ్.
"హు!" అంది మరోసారి.
అభిల భాను ఆశ్చర్యపోయింది.
"ఏమిటి హు! అంటున్నావ్! కాలేజీలో ఆ నరేష్ గాడి గాంగ్ ని చూసినప్పుడల్లా ఇలాగే కోపగించుకునే దానివి కదూ" అడిగిందామె.
"అటు చూడు - ఆ రోడ్ సైడ్ రోమియో గాడు మా ఇంటి దగ్గర్నుంచి వదలకుండా వెంబడిస్తూన్నాడు నన్ను" అంది స్మిత.
అభిల భాను కిలకిల నవ్వింది.
"ఈ మాత్రానికే అంత కోపమా? హైదరాబాద్ లో ఇలాంటి పనీ పాటాలేని కుర్ర సజ్జు చాలా ఎక్కువలే లోపలకు రా! వాడే పోతాడు." అందామె.
స్మిత లోపలకు రాగానే అభిల భాను తలుపులు మూసేసింది.
"పద - ముందు టీ తాగుతూ కబుర్లు చెప్పుకుందాం - మనం కలుసుకుని రెండేళ్ళయిపోయింది కదూ?" అడిగిందామె.
"అవును - కిందటి సారి వైజాగ్ లో ఇంటర్వ్యూ కెళ్ళినప్పుడు ట్రైన్ లో కలుసుకున్నాం" అంది స్మిత.
"అవును - రెండేళ్ళంటే ఈ మధ్య కాలంలో చాలా విశేషాలు జరిగాయ్- తెలుసా?"
"అవును మొన్న మీ వారుండగా అడగడం కుదరక ఊరుకున్నాను. నువ్ అదివరకు మీ బావను పెళ్ళి చేసుకుంటానని చెప్పావ్ కదా - మరి మధ్యలో ఈ హీరో తో ఎలా వ్యవహారం కుదిరింది!" అడిగింది స్మిత.
ఇద్దరూ చెస్ కుర్చీల్లో కూర్చున్నారు.
"మా బావ వట్టి ఇడియట్ అని తెలిశాక నేనే చేసుకోనని చెప్పెశాను- " స్టవ్ మీద "టీ" తయారు చేస్తూ అందామె.
'ఇడియట్ అని ఎలా తెలిసింది?"
"ముందే పిచ్చి చేష్టలన్నీ చేయబోయాడు. నాకు వళ్ళు మండిపోయింది."
"అలాంటివి ఈ రోజుల్లో మాములే కదే." నవ్వుతూ అంది స్మిత.
"అయ్యో - చెప్పటానికి నాకు సిగ్గుగా ఉందే - మా బావ చేయబోయినవి మామూలు చేష్టలు కాదు - అసహజమైనవి చేష్టలు - " సిగ్గుపడుతూ అందామె. "ఇంతకంటే ఇంకా వివరంగా ఎలా చెప్పను.!"
"నాకేమీ అర్ధం కావటంలేదు. "- అయోమయంగా చూస్తూ అంది స్మిత.
"ఇప్పుడు నేను చెప్పినా అర్ధంకాదు లేవే - పెళ్ళయాక నీకే తెలుస్తుంది - మీ అయన చెపితే -"
ఇద్దరూ నవ్వేశారు. "ఇంతకూ నువ్వెవరినయినా వరుడిని వెతుక్కున్నావా?" అడిగింది అఖిల భాను.
సరిగ్గా అప్పుడే బెల్ మోగింది.
అఖిల భాను బయటకు వెళ్ళబోతుంటే స్మిత చటుక్కున లేచి ఆమె కడ్డు వచ్చేసింది.
"నువ్విక్కడే ఉండు ! వాడే వచ్చాడేమో అని నా కనుమానంగా ఉంది - చూసి వస్తాను - అంటూ వడివడిగా నడిచి కిటికీ కర్టెన్ కొంచెం పక్కకు లాగి చూసింది.
గేటు పక్కనే దర్జాగా నిలబడి చిరునవ్వుతో తలుపు వేపు చూస్తూ కనిపించాడు భవానీశంకర్.
స్మితకు అరికాలి మంట నెత్తికెక్కింది.
"నేను చెప్పలేదూ! వాడే! ఎంతకు తెగించాడు. చూశావా! వెంబడించడం చాలక ఇంట్లోకి కూడా జొరబడుతున్నాడు" అంది వెనక్కు తిరిగి గొంతు తగ్గించి.
అభిల భాను క్కూడా కోపం వచ్చింది.
"అలాగేం?" వాడి పని చెప్తా. ముందు - పెరట్లో కర్ర ఉంది తీసుకొస్తాను." అంటూ పెరట్లోకి పరుగెత్తి కర్ర పట్టుకొచ్చింది అయితే ఆ కార్యక్రమమంతా జరగడానికి ఒక నిమిషం సమయం పట్టింది.