Previous Page Next Page 
మధురమైన ఓటమి పేజి 7


    ధృతికి ఏం చేయాలో పాలుపోక అటూ యిటూ తిరుగుతోంది. చలికాలం తల్లికి ఇది  మామూలే. చిన్నప్పటినుంచీ చూస్తున్నదే అయినా ఒక మనిషి మరణవేదన పడుతూంటే చూస్తూ భరించడానికి మించిన శిక్ష లేదు. ఆ బాధ తగ్గించలేం, పంచుకోలేం!ఛీ! ఏం జన్మ! అనుకుంది బాధగా.
    
    ఇంతలో తండ్రి వచ్చాడు. ఒక్కడే! ధృతి ఆశగా ఆయన వెనకాల వెతికి, "నాన్నా డాక్టర్ గారూ...." అంది.
    
    ఆయనొకసారి ధృతివైపు నిస్సహాయంగా చూసి లోపలికి నడిచాడు. వెళ్ళి భార్య పక్కన కూర్చుని, రెండు చేతులమధ్యా తల పెట్టుకుని లోలోన దుఃఖిస్తూ వుండిపోయాడు. అంతకన్నా ఏం చేయగలడు? ఆమెకి డాక్టర్ రాకపోవడానికి గల అసలు కారనం తెలిసింది. ఇప్పటికిది ఎన్నోసారో! తండ్రి ఆయన్ని బ్రతిమాలి తీసుకువచ్చి డబ్బులివ్వకుండా వట్టి చేతులతో పంపించేయడం.
    
    ఆమె ఆలస్యం చేయలేదు. నవీన్ కోసం బయలుదేరింది. అదృష్టవశాత్తూ నవీన్ ఇంకా ఇంట్లోనే వున్నాడు. సంగతి వినగానే హుటాహుటీ డాక్టర్ కోసం పరిగెత్తాడు.
    
    డాక్టర్ వచ్చి ఇంజక్షన్ చేశాక సుభద్ర బాధ కాస్త ఉపశమించింది.
    
    డాక్టర్ని సాగనంపి "చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దణ్ణం పెట్టాలయ్యా! అంతకంటే ఏం చేయడానికీ చేతకానివాడ్ని" అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు సీతారామయ్య.
    
    "అంతంత మాటలెందుకండీ?" అన్నాడు నవీన్ ఆయన్ని వారిస్తూ.
    
    ధృతి చెప్పులు వేసుకుంటూ "పద....వెళ్దాం" అంది.
    
    కొంచెం దూరం నడిచేవరకూ ఇద్దరూ ఒకరితో ఒకరు ఏమీ మట్లాడుకోలేదు.
    
    "టైం ఎంతయిందీ?" అడిగాడు నవీన్.
    
    "పదకొండున్నర....అదేమిటీ నీ వాచీ ఏదీ?" అడిగింది ఆమె అతని చేతివంక చూస్తూ.
    
    "అమ్మేశాను" తాపీగా చెప్పాడు.
    
    "ఎప్పుడూ?" ఆశ్చర్యంగా అడిగింది.
    
    "ఇందాకే....డాక్టర్ గార్ని తీసుకొచ్చేటప్పుడు."
    
    ఆమెకి అర్ధమైంది. తను వెళ్ళి "డాక్టర్ని తీసుకురావాలి" అని చెప్పింది. ఆ తీసుకురావడానికి ఏం కావాలో తెలిసినా ఆ నిమిషంలో ఆలోచించలేదు. అందుకు అతను తన వాచీ అమ్మెయ్యాల్సొచ్చింది. పదోక్లాసు ఫస్ట్ క్లాసులో పాసయినందుకు అతని తల్లి కొనిచ్చిన బహుమానం. అదంటే అతనికి ప్రాణం.
    
    "ఎంతకి అమ్మావు?"
    
    "యాభై రూపాయలకి."
    
    "అదేమిటి? కేవలం యాభైకా!"
    
    "ఏం చేయనూ? తాకట్టుపెడితే ఇరవై ఇస్తానన్నాడు. అది డాక్టరుగారి ఫీజుకే సరిపోదు. ఇక మందులెలా కొనాలి?"
    
    "అయినా అంత తక్కువకి...."
    
    ఆమె మాట పూర్తిచేయకుండానే అతను "పిచ్చిగా మాట్లాడకు! అవసరం ఆ మార్వాడీది కాదు, మనది. నువ్వు మమ్మల్ని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్నావు అని గొడవపెట్టుకుని కూర్చుంటే నష్టం అతనిది కాదు, మనది" కాస్త గట్టిగా అన్నాడు.
    
    ఆమె జవాబు చెప్పలేనట్లు చూసింది. నిజమే! అతను చాలా ప్రాక్టికల్ గా ఆలోచించే మనిషి ఆ సమయంలో అంతకన్నా వేరే మార్గంలేదు. ధృతి మొదటిగా తేరుకుంటూ "ఇలా ఎన్నాళ్ళు నీకు భారంగా? నావల్ల నువ్వు పొందుతున్న ఆనందం ఏమీలేదు. కానీ, కష్టాలు మాత్రం బోలెడు" అంది రుద్దమవుతున్న గొంతుతో.    
    
    "ఏయ్ పిచ్చీ! ఐవో కష్టాలా?" అతను తేలిగ్గా నవ్వేస్తూ అడిగాడు.
    
    పక్కనే వున్న గుడిసెల్లో వుండే పిల్లలు కామోసు రోడ్డుమీద కొచ్చి గోళీకాయలు ఆడుతున్నారు. వంటిమీద ఒక్కడికి కూడా సరిగ్గా బట్టలు లేవు. కడుపులు వెన్నుకి అంటుకుపోయి అన్నంతిని ఏనాడయిందో అన్నట్లుగా వున్నారు. దుర్భరమైన పరిసరాల్లో వున్నా వారి కళ్ళల్లో అంతులేని ఆనందం ఎగిరి గంతులేస్తూ, పరమ ఉత్సాహంగా, అసలు ప్రపంచంలో కష్టాలు ఎలా వుంటాయో తెలియనంతటి సంతోషంగా ఆడుకుంటున్నారు. తనంతటి అదృష్టవంతుడు ప్రపంచంలో లేడే అన్నట్లుగా మెరుస్తున్నాయి. ఆటలో గెలుస్తున్నవాడి కళ్ళు.
    
    బస్ స్టాప్ లో నిలబడి వారినే కాసేపు గమనించిన ధృథీ, నవీన్ ఒకరివైపు ఒకరు చూసుకుని అర్ధవంతంగా నవ్వుకున్నారు.    

                                                             * * *
    
    "ఆయన మెడ్రాస్ వెళ్ళారు. రేపు ఉదయం వస్తారు" తియ్యని గొంతుతో చెప్పింది ధర్మా ఎలక్ట్రానిక్స్ లో రిసెప్షనిస్ట్.
    
    ధృతి నిరుత్సాహపడిపోతూ నవీన్ వైపు చూసింది.
    
    అతను వెంటనే "మెస్సేజ్ ఇచ్చేసి వెళదాం మళ్ళీ ఇంత దూరం రానవసరంలేదు" అన్నాడు.
    
    ఆమె వెంటనే ఉత్సాహంగా రిసెప్షనిస్టుని అడిగి పేపర్, పెన్ తీసుకుని వ్రాయడానికి ఉపక్రమించింది.
    
    నవీన్ అక్కడ మేగజైన్ ఏదో వుంటే చూస్తూ కూర్చున్నాడు.
    
    ధృతి రెండు నిమిషాలు ఆలోచించి, చకచకా వ్రాయడం ప్రారంభించింది.
    
    నమస్కారం!
    
    మీరు నాతో పందెం వేసినప్పుడు మీకు నా కుటుంబ పరిస్థితులు చెప్పాలనిపించలేదు. కానీ ఈరోజు నేను సగర్వంగా నా కుటుంబ ఆర్ధిక దుస్థితి గురించి అయినా డబ్బు కోసం నన్ను విడిచి వుండడానికి సుముఖత చూపించని నా కుటుంబ సభ్యుల గురించి తెలియజేయాలనుకుంటున్నాను.
    
    బడిపంతులు ఉద్యోగంచేసి రిటైరయిపోయి చాలీచాలని తన పెన్షన్ డబ్బులతో ఇల్లు గడపడానికి నానా కష్టాలూ పడుతుంటారు మా నాన్నగారు. మా అమ్మగారు ఆస్తమా పేషెంట్! వారంలో ఒకటి రెండుసార్లు పైదాకా వెళ్ళి మళ్ళీ 'క్రింద'కి వస్తుంటారు. ఆమెకి సరైన వైద్యం చేయించే స్తోమత మాకు లేక అలా ఆమె బాధని చూస్తూ కూర్చోవడం అలవాటు చేసుకున్నాం. మెరిట్ స్టూడెంట్ అయిన నా తమ్ముడు ఇంటి పరిస్థితి చూసి చదువు మానేసి కూలిపనికి సిద్దమవుతున్నాడు. ఇంకా లోకం తెలియని మా చిన్నారి చెల్లి, నేను ఉద్యోగం చేసి, బాగా సంపాదించి, తనని డాక్టర్ని చేస్తానని కలలుకంటూ వుంటుంది. ఇదీ మా పరిస్థితి!

 Previous Page Next Page