అవి లభించవని తెలుసు. అయినా అప్పుడప్పుడూ ఆశిస్తూ వుండడం అతనిలోని బలహీనత. జవాబు చెప్పకుండా, ఫ్రిజ్ లోంచి బాటిల్ తీసి గ్లాసులోకి నీళ్ళు వంపుకుంటున్నాడు.
"అడుగుతూంటే జవాబు చెప్పరేమిటి?" అంది మళ్ళీ.
అతను మొదట సౌమ్యంగా, ప్రేమగా వుందామనుకున్నాడు. కాని ఆమె అలా రెట్టించడంతో తిక్కరేగింది.
"ఏముంది అందులో జవాబు చెప్పడానికి?" అన్నాడు.
"నా మాటల్లో జవాబు చెప్పటానికే ఏమీలేదా? నేనంటే అంత చులకన అన్నమాట నీకు?"
"ఇలా మాట్లాడేముందు అవతలివారికి బాధ కలిగిస్తున్నానేమో అన్న ఆలోచన రావటంలేదా నీకు?"
"ఎందుకు? నువ్వేమంత కష్టపడ్డావని నీ గురించి బాధ?"
"కష్టపడలేదా? ప్రొద్దుట్నుంఛీ యిప్పటిదాకా తల బద్దలు కొట్టుకునే అనేక సమస్యల్లో తలక్రిందులయి రావటం కష్టపడటం కాదా?"
"ఏమిటి నీ కష్టం? నా కోసం కష్టపడుతున్నావా? నీ ప్రమోషన్ లకోసం, డబ్బు సంపాదించడంకోసం ఆఫీసుకు వెళ్ళివస్తున్నావు. నాకోసం ప్రత్యేకంగా కష్టపడుతున్నావా? నన్ను కాకపోతే ఇంకోదాన్ని పెళ్ళిచేసుకుంటే కష్టపడవా? అయినా ప్రపంచంలో నువ్వొక్కడివేనా ఉద్యోగంచేసే మొగాడివి? నువ్వు తప్ప ఇంకెవరూ ఉద్యోగాలూ, వృత్తులూ చెయ్యడం లేదనుకుంటున్నావా? వాళ్ళంతా వేళకి ఇళ్ళకి రావడంలేదా?"
ఆమె మాట్లాడుతుంటే సీనారేకుడబ్బాలో కంకరరాళ్ళు పోసి ఒకటే పనిగా చప్పుడు చేసినట్లు గల్లుమనిపించి శరీరమంతా కంపరం పుట్టినట్లయింది.
"నేను పడే కష్టాన్ని ఇంతచక్కగా అర్ధంచేసుకునే నువ్వు ఆడదానివేనా?"
"ఏం, నీ కళ్ళకెలా కనబడుతున్నాను? మనిషిలా కనిపించడంలేదా? చెప్పు నామీద నీకు ఎవరో నూరిపోస్తున్నారు."
అతని కసహ్యమేసింది.
"నీమీద నాకు నూరిపొయ్యడమా? ఊళ్ళో ఎవరికీ ఇంకేమీ పని లేదనుకున్నావేమిటి?"
"నూరిపొయ్యకుండానే నువ్విలా మారిపోతావా? పెళ్ళయిన మొదట్లో నువ్వే నా దేవతవు అంటూ ఇరవై నాలుగుగంటలూ నన్నంటి పెట్టుకొని వుండలేదా? ఆ రోజులు మరచిపోయావా?"
"అది కొత్తమోజులే అప్పుడు నువ్వింతగా మనుషుల్ని కాల్చుకు తినేదానివని తెలీదు."
"నేను రాక్షసినా, నీ కళ్ళకలా కనబడుతున్నానా? వ్యవహారం అంతవరకూ వచ్చిందన్నమాట అయితే నే విన్నది నిజమేనన్నమాట?"
"ఏమిటి నువ్వు విన్నది?"
"నువ్వు ఎవత్తినో వెంటేసుకొని తిరుగుతున్నావని..."
"ఇలా మాట్లాడటానికి నీకసహ్యంగా లేదూ?"
"నువ్వు తిరిగితే లేదుగాని నేనంటే వచ్చిందా? చెప్పు ఎవరిది? దేంతో కులికి రాత్రుళ్ళు ఇంత ఆలస్యంగా వస్తున్నావు?"
అతనికి తిక్కరేగింది చేతిలోని సీసా, గ్లాసు నేలమీద విసురుగా కొట్టాడు. భళ్ళుమని పగిలి గాజుముక్కలు నేలమీద చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఆమె లేచి అతనికెదురుగా వచ్చింది. కోపంతో అతని కళ్ళు నిప్పులు క్రక్కుతున్నాయి. అలా కోపంతో జేవురించి వున్న ఆమె మొహంచూస్తే అతనికి నిజంగా అసహ్యం వేసింది. ఈ మనిషితో ఇన్నేళ్ళు ఎలా కాపురం చేశానా అనిపించింది.
"నువ్విలా గ్లాసులూ, సీసాలూ పగలకొడితే నేను హడలిపోతాననుకున్నా వేమో ఇలాంటివి చాలా చూశాను చెప్పు ఎవరు అది?"
"ఎవరో వుంది. దాంతోనే రోజూ తిరిగి ఆలస్యంగా వస్తున్నాను" అన్నాడు కసిగా.
"ఎవరది?"
"అదీ ఇదీ అంటున్నావు. నిన్నెవరైనా అలా అంటే ఎలా వుంటుంది?"
"చెప్పు తీసుకుని పళ్ళు రాలకొడతాను."
"ఆ పనే ఆ అమ్మాయికూడా చేస్తుంది."
"పదిమందితో తిరిగే అలగావాళ్ళు వాళ్ళకూ నాకూ సాటేమిటి? అయినా అలాంటివాళ్ళని వెనకేసుకొస్తూ నన్ను తిడతావా? నాకంటే వాళ్ళే ఎక్కువయ్యారా?"
"ఇదిగో అలా అనొద్దు చెబుతున్నా."
"అబ్బో! దాన్నెవత్తినో అంటే అంత కోపమొస్తూందే చెప్పు ఎన్నాళ్ళనుంచి కొనసాగుతోంది యీ నాటకం?"
"చాల రోజులబట్టి."
"అంటే పెళ్ళికాక ముందునించి కూడానా?"
"ఆ!"
"అయితే నన్ను పెళ్ళెందుకు చేసుకొన్నావు? నా గొంతు కొయ్యటానికా?"
"ఆ!"
"ఇన్నాళ్ళూ నువ్వు ఆలస్యంగా రావడానికి చెప్పిన కారణాలు కుంటీ, గ్రుడ్డి సాకులు అన్నీ అబద్దమేనన్నమాట."
"ఆ"
"ఇలా అనటానికి నీకు సిగ్గనిపించటంలేదూ?"
"దేనికి సిగ్గు?"
"నన్ను మోసం చెయ్యటానికి"
"నీలో ఏముందని నిన్ను మోసం చెయ్యకుండా వుండమంటావు?"
"నాలో ఏంలేదా?"
"ఏముంది? పైనుంచి క్రిందిదాకా అహం, పొగరు యివి తప్ప."
"నేనంటే నీకసహ్యం పుట్టింది. నేనూ ఓ కంట కనిపెడుతూనే వున్నాను. నేనంటే నీకు అంత అసహ్యమైనప్పుడు ఈ ఇంట్లో ఒక్కక్షణంకూడా వుండను."
"ఉండక ఏంచేస్తావు?"
"వెళ్ళిపోతాను."