Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 6


    
    ఉదయం తొమ్మిది గంటలవేళ అర్ధనారీశ్వరరావు ఆఫీసుకు వెళ్ళడానికని బయటికొచ్చాడు. డ్రైవరు కారు నిగనిగలాడేటట్లు తుడిచి గేటులోంచి బయటకు తీస్తున్నాడు.
    
    అర్ధనారీశ్వరరావు రోడ్డుమీదకొచ్చి నిలబడ్డాడు. అదే సమయానికి రాజాచంద్ర కూడా తన కారుని తానే డ్రైవ్ చేసుకుంటూ పోర్టికోలోంచి బయటకు తీస్తున్నాడు.
    
    "హలో!" అని పలకరించాడు అర్ధనారీశ్వరరావు. "ఆఁ ఈవేళ కొంచెం ఎర్లీగా వెడుతూన్నట్లుంది."
    
    రాజాచంద్ర సభ్యతకోసం కారాపుచేసి ఇంజన్ ఆన్ చేసే ఉంచాడు.
    
    "ఆఫీసులో చాలా పని ఉంది."
    
    "మీకేం? బిజినెస్ ఈ ఏడు బ్రహ్మాండంగా ఉన్నట్టుంది."
    
    రాజాచంద్ర నవ్వి ఊరుకున్నాడు. అతనికి డబ్బు, బిజినెస్-వీటి గురించి ఇతరులతో చర్చించటమంతగా ఇష్టం ఉండదు.
    
    "రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చినట్లున్నారు."
    
    "అవును ఓ పార్టీకి వెళ్ళి వచ్చాను."
    
    "పార్టీ అంటే వెట్ అని అనుకోవచ్చా?" అర్ధనారీశ్వరరావు నవ్వుతూ అన్నాడు.
    
    రాజాచంద్ర నవ్వి మౌనంగా ఊరుకున్నాడు.
    
    "మీ పిల్లలు కూడా ఆలస్యంగా వచ్చినట్లున్నారు?"
    
    రాజాచంద్రకు ఏం జవాబు చెప్పాలో తెలియలేదు.
    
    "ఒకరొకరుగా, విడివిడిగా వచ్చినట్లున్నారు- అన్నట్లు మీ అమ్మాయి కూడా."
    
    అర్ధనారీశ్వరరావు కారు డ్రైవరు కారుని బయటకు తీశాడు.
    
    "వస్తాను ఆఫీసులో బెంగుళూర్ నుంచి వచ్చిన కస్టమర్స్ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు" రాజాచంద్ర క్లచ్ మీద కాలు రిలీజ్ చేస్తూ యాక్సిలేటర్ నొక్కాడు. కారు ముందుకు కదిలింది.
    
    తన పిల్లలని గురించి అతను కల్పించుకుని మాట్లాడుతుంటే 'మా సొంత విషయాలు మీ కనవసర'మని ఎందుకనలేకపోయాడు?
    
    మనసులో అతన్ని ఏవగించుకున్నాడు. కోపగించుకున్నాడు. అయినా తన అభిప్రాయాన్ని బయటకు వ్యక్తం చెయ్యలేకపోయాడు.
    
    కారు డ్రైవ్ చేస్తూ పోతుంటే కొన్నాళ్ళ క్రితం వరకూ చాలా ప్లెజంట్ గా ఉండేది. ఇప్పుడు చాలా పెద్ద శిక్షగా అనిపిస్తోంది. ఈ దేశంలో ఒక మనిషి ఇంకో మనిషికి తలనొప్పి కలిగించటం జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తాడు. కారులో పోతుంటే రిక్షా అతని దగ్గర్నుంచీ సైకిలుమీద వెళ్ళేవాళ్ళూ, స్కూటర్ నడిపేవాళ్ళూ, రోడ్డుమీద నడిచేవాళ్ళూ, రోడ్లమీద జట్లు జట్లుగా నిలబడి ఉన్నవాళ్ళూ- అందరూ అనుక్షణం అడ్డు తగులుతూనే ఉంటారు. ఈ క్షణంలో ఎవర్ని గుద్ది యాక్సిడెంట్ జరుగుతుందోనన్న భయం కలిగిస్తూ ఉంటారు.
    
    అవతలివాడికి ఎక్కడ తగులుతుందోనని కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి హడలి చస్తూ ఉండాలిగాని, అవతలి వ్యక్తికి ప్రాణభయమున్నట్లు కనబడదు. పైగా కారులోపోతున్న వ్యక్తి వంక శత్రువునూ చూసినట్లు చూస్తారు.
    
    ఆఫీసుకు చేరేలోగా కనీసం ఇరవైసార్లు టెన్షన్లు, మరిన్నిసార్లు నిస్సత్తువలు.
    
    అతనిలో సున్నితత్వమే ఇంత లోతుగా రియాక్ట్ అవటానికి కారణమా?
    
    ఆఫీసులో తన ఏ.సి. రూమ్ లోకి వెళ్ళి నేప్ కిన్ తో ముఖంమీది చెమట తుడుచుకున్నాడు.
    
    బజరు నొక్కాడు- బాయ్ కోసం.
    
    రాలేదు.
    
    మళ్ళీ నొక్కాడు.
    
    ఇంకా రాలేదు.
    
    అతనికి కోపమొచ్చింది. చాలాసేపు చేతిని బజరుమీద నుంచి తియ్యకుండా నొక్కి ఉంచాడు.
    
    చివరకు బాయ్ వచ్చాడు.
    
    "ఎక్కడకు వెళ్ళావు?" అనడిగాడు.
    
    "ఇక్కడే ఉన్నానండీ."
    
    "ఇంతకుముందు రెండుసార్లు పిలిచాను."
    
    "ఇక్కడే ఉన్నానండీ."
    
    "నేను  పిలిచాను."

    'ఇక్కడే ఉన్నానండీ'భాయ్ తనమాట నుంచి పక్కకి మరలదల్చలేదు.

    "నువ్వు చెప్పేది అబద్ధం." అని గట్టిగా అరుద్దామనుకున్నాడు.

    కాని ఏమీ అనలేక "సరేలే వెళ్ళు. వెళ్ళి గోవిందరావుగారిని లోపలికి పంపించు" అన్నాడు.

    "ఇంకా రాలేదండీ."

    "ఇంకా రాలేదా? ఈవేళ  చాలా పని ఉంది, ఎర్లీగా రమ్మని చెప్పానుగా?"
    
    "ఇంకా రాలేదండీ."
    
    "సరే శ్యామలరావు గార్ని పంపించు."
    
    "వచ్చి బయటకు వెళ్ళారు."
    
    "బయటకు వెళ్ళారా? ఆఫీస్ టైమ్ లో బయటికెళ్ళటమేమిటి?"
    
    "బయటకు వెళ్ళారండి."
    
    "అదే ఆఫీస్ టైములో..."
    
    "బయటకు వెళ్ళారండీ" రాజాచంద్ర బాయ్ వంక విసుగ్గా చూశాడు.
    
    "ఊ కానియ్, శోభనాద్రిగారయినా ఉన్నారా?"
    
    "ఉన్నారండి."
    
    "ఆయన్ని పిలు."
    
    రెండు నిమిషాల్లో శోభనాద్రి లోపలకు వచ్చాడు.
    
    "నిన్న కలకత్తా కంపెనీకి సంబంధించిన ఎకౌంట్స్ పూర్తి చెయ్యమని చెప్పాను. చేశారా?"
    
    "లేదండీ"
    
    "ఎందుకని?"
    
    "కాలేదండీ."

 Previous Page Next Page