"నా గురించి చెప్పుకోవడానికేముంది? నాపేరు ధాన్య. మాకు సిరి సంపదలన్నీ ధాన్యమే కాబట్టి నాన్న నాకా పేరు పెట్టారు. ఇంటర్ వరకు సిటీలో వుండే చదువుకున్నాను. ఆపైన చదివించడం నాన్నకు ఇష్టం లేకపోవడంతో ఇక్కడకు వచ్చేశాను. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఇంత పెద్ద ఇంట్లో నేనూ నాన్న తప్ప ఎవరూ లేరు. ఆయనకు నేను తోడు, నాకు ఆయన తోడు."
"నీ పేరు చాలా బావుంది."
"థాంక్స్" ఆ పదాన్ని చాలారోజుల తరువాత ఉచ్ఛరించింది ధాన్య.
అంతలో సర్పంచ్ శివరామయ్య అక్కడికి వచ్చి కూతురితోపాటు మరో అమ్మాయిని చూసి, ఎవరన్నట్టు కళ్ళతో అడిగాడు.
ధాన్య వర్ష వివరాలు చెప్పి "ఈయనే మా నాన్న" అంటూ పరిచయం చేసింది.
వర్ష రెండు చేతులూ ఎత్తి నమస్కరించింది.
"నువ్వు కొత్త టీచర్ వన్న మాట. ఇంతకు ముందున్న టీచర్ నెలరోజులు పనిచేసి ఈ మారుమూల గ్రామంలో వుండలేక ఉడాయించాడు. నువ్వు అలా చెయ్యవని నాకనిపిస్తోంది" అంటూ ఆయన అక్కడున్న సిమెంట్ చప్టా మీద కూర్చున్నాడు.
ఆయనకు ఏభై ఏళ్ళుంటాయి. ఎప్పుడూ తెల్లటి బట్టల్లో హుందాగా వుంటాడు. ఇరవై ఏళ్ళుగా ఆయనే ఆ వూరికి ఏకగ్రీవంగా సర్పంచ్.
"నాకు పల్లెటూర్లంటే ఇష్టం. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు తిరిగి ట్రాన్స్ ఫర్ చేస్తే తప్ప వెళ్ళను."
"అయితే ఇకనయినా మా ఊరి పిల్లలు నాలుగక్షరాలు నేర్చుకుంటారు. ఆడకూతురివి గనుక ప్రత్యేకంగా ఎక్కడుంటావ్? మా ఇంట్లోనే వుండు. మనుషుల్లేక ఈ ఇల్లు బోసిపోయి వుండడం గమనించావ్ కదా. కాబట్టి నువ్వు ఓగదిని వాడుకోవచ్చు. అంతే కాదు. భోజనం కూడా ఇక్కడే చేసెయ్. నువ్వుంటే మా అమ్మాయికీ కాలక్షేపం అవుతుంది."
ఆమె మొహమాటపడతూ ఏదో చెప్పబోయింది. దీన్ని గమనించిన ధాన్య "ఇక నువ్వేమీ చెప్పకు. మా నాన్న మాట జవదాటినవారు ఇంతవరకూ ఈ గ్రామంలో లేరు. కొత్తగా ఆయనకు అప్రతిష్ట తేవద్దు" అంది నవ్వుతూ.
ఎక్కడో ఒంటరిగా వుండటం కన్నా అక్కడే వుండడం మంచిదనిపించింది. వర్షకు. నెలకు ఎంతో కొంత ఇచ్చి పెయింగ్ గెస్ట్ లా వుందామని నిర్ణయించుకుంది.
"అలానే" అంది ధాన్యవైపు చూస్తూ.
ఆమె ముఖంలో ఆనందం చిమ్మింది, తనకు చక్కటి తోడు దొరికి నందుకు.
శివరామయ్య పైకి లేచి "నేనలా పొలాలవైపు వెళ్ళొస్తానమ్మా" అని ఒకడుగు ముందుకేసి ఏదో గుర్తొచ్చినట్టు ఆగి కూతురివైపు తిరిగి "ఏమంటున్నాడమ్మా గోపాలకృష్ణ? త్వరగా కరుణించమణి చెప్పు. ఎలానో ఓలా అతని దృష్టిని ఆకర్షించు. మూడేళ్ళయింది పొలాలు పండి. ఏం శని చుట్టుకుందో ఏమో? పుట్లు పుట్లు ధాన్యం పండాల్సింది పోయి గింజ రాలడం లేదు. మీరిద్దరూ ఒకటైతే తప్ప మనకు మంచికాలం రాదు" అని నిస్పృహతో వెళ్ళిపోయాడు ఆయన.
"వారు గోపాలకృష్ణ? మీకు కాబోయే భర్తా" అంటూ చిలిపిగా చూస్తూ అడిగింది వర్ష శివరామయ్య కనుమరుగు కాగానే.
ధాన్య పడీ పడీ నవ్వింది. కొంతసేపటికి బలవంతంగా నవ్వాపూకుని గోపాలకృష్ణ నాక్కాబోయే భర్త కాదు. ఈ గ్రామంలో మదనకామరాజు వంశానికి చెందిన పురుషుడు, ఆయనతో పౌర్ణమి రోజు గడిపితే" అంటూ ప్రారంభించి మొత్తం ఆచారం గురించి చెప్పింది.
వింటున్న వర్షకు మతిపోయింది. హెడ్ మాస్టర్ తన చేతికి ట్రాన్స్ పర్ ఆర్డర్స్ ఇస్తూ ఈ గ్రామం గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చాయి.
ఆమె చాలాసేపటివరకూ ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయింది.
5
ఆ పౌర్ణమి రోజు పరమానందం ఇంట్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. కారణం ఆయన పెద్దకోడలైన లహరికి గోపాలకృష్ణ దగ్గర్నుంచి పిలుపొచ్చింది.
రేపటినుంచి తమ ఇంటి రూపురేఖలే మారిపోతాయని అనుకుంటూ తనకు రానున్న సిరిసంపదల గురించి కలలు కనడంతోనే ఆ ఇంటిల్లిపాదికీ సరిపోతోంది. అందరూ ఏదో ట్రాన్స్ లో వున్నట్లు కనిపిస్తున్నారు.
"మన్మధ దేవుడా! మా మొర ఇంత కాలానికి ఆలకించి గోపాలకృష్ణ నుంచి కబురొచ్చేట్టు చేశావయ్యా" అని పరమానందం ప్రతి అయిదు నిముషాలకో మారు తూర్పుకొండకేసి చూస్తూ నమస్కారాలు పెడుతున్నాడు.
లహరిని గోపాలకృష్ణ ఆ రాత్రికి రమ్మన్నాడని వినగానే పరమానందం రెండో కోడలు పద్మ తన భర్తను గదిలోకి లాక్కెళ్ళి "ఆ వగలాడికి పిలుపొచ్చింది. మనం ఒకే ఇంట్లో వున్నా వేరు వేరుగా వుంటున్నాం కదా. కొంపదీసి సిరి సంపదలన్నీ మీ అన్నకే వస్తాయేమో. అవునూ గోపాలకృష్ణ ఈ పిల్లను ఎన్నుకున్నాడేమిటి? ఏదో చూడటానికి కనుముక్కు తీరుబాగానే వుంటుందిగానీ ఒంటిమీద కండ ఎక్కడిదీ? అదే నన్ను చూడండీ.... వన్నె కాస్త తక్కువయినా వయసు బరువులకేం తక్కువలేవు. అప్పటికీ గోపాలకృష్ణ ఎదురుపడ్డప్పుడంతా బరువులన్నీ కనపడేటట్లు చూసుకున్నాను. కానీ ఛాన్స్ నాకు రాలేదు. ఏమిటో అతగాడి టేస్ట్" అని మూతిని మూడు వంకరలు తిప్పింది.
అదే సమయంలో పరమానందం చిన్నకోడలు చిత్ర తన భర్తతో చెబుతోంది. "ముప్ఫై ఏళ్ళదాన్ని సెలక్ట్ చేసుకున్నాడేమిటి గోపాలకృష్ణ? అయినా ఆ కులుకులాడి అంత వయసున్నదానిలా కనిపించదనుకో. ముసలాడికి దసరా పండగన్నట్టు మీ పెద్దన్నయ్యకు కలిసొచ్చింది అదృష్టం. తనకంటే సగం వయసున్న దానిని కట్టుకుని వేగలేక ఛస్తున్న ఆయనకు రేపటి నుంచి ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయేమో! నిండా ఇరవై రెండేళ్ళు కూడా లేని నన్ను పిలవలేదేమిటి చెప్మా."
"ఇంకానయం. నీ వయసు పదహారేళ్ళే అనలేదు" చిత్ర భర్త వ్యంగ్యంగా అన్నాడు.
"నేను అబద్ధం చెబుతున్నానంటారా? నా డేట్ ఆఫ్ బర్త్ ఎంతనుకున్నారు?"
"ఎంతయినా వుండనీ. నువ్వు చూడడానికి మాత్రం మా వదినకంటే పెద్దదానిలా కనిపిస్తావ్."
దాంతో కోపం వచ్చింది చిత్రకు. భర్తను చూపులతోనే ఈడ్చికొట్టి అక్కడి నుంచి లేచి బిరబిరా వెళ్ళింది.
ఇక లహరి, ఆమె భర్త చలపతి తమ గదిలో ఏకాంతంగా మాట్లాడు కుంటున్నారు.
"ఏది ఏమైనా రేపటి నుంచీ మన జాతకం మారబోతోంది. భూటాన్ లక్ష్మి లాటరీ ఒక్కటి తగిలితే చాలు. నా సామిరంగా ఈ ఊర్లో గొప్ప ధనవంతుడైన వెంకట్రామయ్యను మించిపోవచ్చు" అన్నాడు అతను భార్యవైపు ఆడ్మయిరింగ్ గా చూస్తూ.
ఆమె ఏమీ మాట్లాడలేదు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఎలాంటి గుర్తింపూ లేకుండా వున్న ఆమెను ఒక్కసారిగా కుటుంబమంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఉక్కిరిబిక్కిరైపోతోంది. తనను అందరూ గుర్తించడం, మెచ్చుకోలుగా చూడడం గొప్ప ఆనందాన్ని కలిగిస్తోంది. ఏదో తెలియని ఎగ్జయిట్ మెంట్ తో తుళ్ళిపడుతున్న ఆమెకు నోటమాట రావడం లేదు.