Previous Page Next Page 
రాకోయి అనుకోని అతిథి పేజి 6

   

     "బిజినెస్ గా.... ఖాళీ వుండదు."
    
    "ఖాళీ ఎప్పుడూ ఎవరికీ వుండదు. ఖాళీ చేసుకోవాలి" పుస్తకంలోకి చూస్తూనే అంది.
    
    "అయితే నిజమే అన్నమాట" అన్నాడు వున్నట్టుండి.
    
    "ఏమిటి?"
    
    "ఏ బిజీమేన్ ఓన్లీ ఆల్వేస్ ఫ్రెండ్స్ టైమని నేను చదివిన నిజం"
    
    "తెలిసీ ఇప్పుడు నన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు?" చికాగ్గా అడిగింది.
    
    "ఇంకా ఇలాంటివే తెలీనివేమన్నా చెబుతారని."
    
    వశిష్ట ప్రసక్తిని పొడిగించే తీరు ఆమెకు ఎంత విసుగుని కలిగించిందంటే "మీలాంటివాళ్ళు చేయాల్సింది బిజినెస్ కాదు" అంది కోపంగా.
    
    "మరి?"
    
    "పోలీసు డిపార్టుమెంటులో జాబ్."
    
    "ఎందుకు?"
    
    "అక్కడ థర్డ్ డిగ్రీ ట్రీట్ మెంటని ఒకటుంది. అంటే పనిగట్టుకుని నేరస్థుల్ని హింసించడం..." ఇప్పుడు ఇంకా విడిచిపెట్టకూడదనుకుందేమో తనూ మంటగా అనాల్సిన నాలుగు మాటల్ని అనేసింది. "ఇలా ఏ నేరమూ చేయని నన్ను, అంటే మీ పక్కన కూర్చున్న పాపానికి ఈ స్థాయిలో హింసించే మీరు నిజంగా నేరస్థులు దొరికితే హేపీగా వాళ్ళని హింసిస్తూ ఎంజాయ్ చేయొచ్చు."
    
    పాతికేళ్ళ వయసులో వున్న వశిష్ట ఆ తర్వాతైనా ప్రసక్తిని త్రుంచేయలేక పోయాడు. "మీరన్నది నిజమే కాని నాకు ఆ పోలీస్ డిపార్టుమెంటంటే సదభిప్రాయమే లేదు"
    
    "ఎందుకో..."
    
    "ఇందాక మీరన్నట్టు ప్రజల్ని హింసించడం వాళ్ళ హాబీ కాబట్టి"
    
    "ఇందాక నేనన్నదో వాళ్ళు నేరస్థుల్ని హింసిస్తారని"
    
    "మీరేమన్నా పోలీసాఫీసరా?" అడిగాడు రెండు క్షణాల తర్వాత.
    
    ఆమె చెప్పలేదు.
    
    "కనీసం పోలీసాఫీసర్ల ఫేమిలీకి చెందిన అమ్మాయి అయినా అయ్యుంటారు" అసహనంగా తలతిప్పి చూసిన ఆశ్రితతో అన్నాడు. "కోపం తెచ్చుకోకండి....కరప్షన్ కి మారుపేరైన ఆ డిపార్ట్ మెంటంటే నాకు కాస్త అసహ్యం... అందుకు."
    
    "ప్లీజ్ బి కామ్ మిస్టర్ వశిష్ట....పోలీసు డిపార్ట్ మెంటుని ఎగతాళిగా మాట్లాడ్డం ఓ ఫేషన్ అయిపోయిన ఈ రోజుల్లో మీలాంటివాళ్ళ ఆర్గ్యుమెంట్స్ ని చాలా విన్నాను. కాబట్టి దయుంచి ఇక ఆ టాపిక్ మాట్లాడకండి."
    
    అసలు మీరెవరూ, ఏం చేస్తున్నారు అని అడిగే ధైర్యం చేయలేకపోయిన వశిష్ట ఆ తర్వాత ఎయిర్ హోస్టెస్ అందించిన రిఫ్రెష్ మెంట్సు  అందుకుని నిశ్శబ్దంగా వుండిపోయాడు.
    
    మరే ప్రసక్తి తెచ్చినా విరుచుకుపడేట్టుంది. అదికాదు.... అతడ్ని ఆకట్టుకున్నది....ఆమెలో స్పష్టంగా కనిపిస్తున్న బింకం.....మొండితనం.....ఎదుటివాడు ఎలాంటి మగాడైనా ఎదుర్కోగలనన్న ధీమా.
    
    ఎందుకో తనను తాను నిభాయించుకోలేకపోయాడు. అందుకే ఆమె ఏకాగ్రతగా పుస్తకం చదువుతుంటే మధ్య మధ్య ఆమెను గమనిస్తూ వుండిపోయాడు.
    
    ఫ్లయిట్ హైద్రాబాద్ లో లేండ్ అయ్యాక ఆమెను చివరిసారిగా పలకరించాలనుకుని విఫలుడయ్యాడు. ఉన్నట్టుండీ లాంజ్ లో ఆమె అదృశ్యం కావడంతో రెండు నిమిషాలపాటు చుట్టూ పరికించి తన కారువైపు నడిచాడు.
    
    ఆ తర్వాత పదిహేను నిమిషాలలో ఆశ్రిత ఆటోలో ఇంటిని చేరుకుంది. ఇంటిముందు జనం...
    
    మునిమాపువేళ జనాన్ని తోసుకుంటూ ముందుకు నడిచిన ఆశ్రిత అక్కడి దృశ్యాన్ని చూసి అవాక్కయి నిలబడిపోయింది.
    
    ఎదురుగా నేలపై తమ్ముడి శవం.... సమీపంలో నీళ్ళు ఇంకిన కళ్ళతో కూర్చున్న నాన్న...
    
    ముందు ఆశ్రిత కట్రాటగా మారింది. మరుక్షణం విరిగిన కెరటంలా తూలబోయి నిలదొక్కుకుంది. ఆ తర్వాత ప్రశ్నయింది. కలతకీ కలవరానికీ మధ్య విరామమై భాషలేని భాష్యమైంది.

    ఇదేమిటీ....
    
    రాజేష్ బ్రతికిలేడూ...
    
    ఏమయ్యాడు....
    
    తనను చూడగానే ఇంటిముందు బొంగరంలా తిరుగుతూ "అక్కా" అని చుట్టేస్తాడనుకుంటే చిరిగిపోయిన స్వప్నమయ్యాడేం? మావిచిగురు ఆరగించిన కోయిలలా అక్కా ఏమైందీ అంటూ ఆడపిల్లలా "కుశల ప్రశ్నలు" వేస్తాడనుకుంటే తననుతానే పోగొట్టుకున్న మౌనమైపోయాడేం...
    
    నెమ్మదిగా తమ్ముడికి నిద్రాభంగం కానంత నెమ్మదిగా కదిలి రాజేష్ శవాన్ని సమీపించింది.
    
    అమ్మ పోయాక జ్ఞానం తెలీని వయసులో ఒడిలో వుంచుకొని అపశ్రుతుల జోలపాటల్తో నిద్రపుచ్చింది ఈ పిచ్చికొండనే కదూ...
    
    బరువు పుస్తకాలు మొయ్యలేనే అని మారాంచేస్తబుంటే తను మోస్తూ అరచేతులు ఎర్రతామరల్లా కందిపోతున్నా బడిదాకా నడిచింది ఈ చిన్ని తమ్ముడికోసమే కదూ...
    
    జ్ఞాపకాల అరల్లోనుంచి ఒక్కోస్మృతీ అశ్రుకణమై చెంపల పైకి జారిపోతుంటే మగతగా తలతిప్పి తండ్రికేసి చూసింది.
    
    నాన్నేం అలా వున్నాడు... మొన్నెపుడో కలల్ని వర్షించిన పతాకం ఇప్పుడు గాయాలతో అవనతమైనట్టు నిర్జీవపు రంగులద్దుకుని కనిపిస్తున్నాడేం?
    
    "ఏమైంది నాన్నా?" చాలాసేపటి తర్వాత అడిగింది. మార్గరెట్ ఎందుకు అర్జెంటుగా పంపిందీ అర్ధమై ఇప్పుడు అర్ధంకాని ఏ పుటల్నో చదవాలనే ఆత్రుతతో ఉద్విగ్నంగా అడిగింది.
    
    "మాట్లాడు నాన్నా!"
    
    కదిపితే చాలు సితార సంగీతంలా ఇతిహాసాల గురించి విడమరిచి చెప్పగలిగే ఆ వృద్దుడే సంక్షుభిత సాగరమైతే ఏం జవాబు చెప్పగలడని...
    
    అప్పుడు జోక్యం చేసుకున్నారు సోమయాజులుగారు...నాన్న స్నేహితుడు "అమ్మా ఆశ్రితా! నిన్న కాలేజీలో..."    
    
    జరిగిన గొడవ గురించి క్లుప్తంగా... ఇంటికి వచ్చిన రాజేష్ ఉరి పోసుకోవడం గురించి వివరంగా చెప్పారాయన, ఉదయమే జరిగిన పోస్ట్ మార్టమ్ తో సహా. స్పష్టంగా అర్ధంకాలేదు కానీ తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నాడని బోధపడింది.
    
    అది బాధో... భ్రాంతో తెలీదు ఆమెక్కూడా!
    
    ఆర్తిగా తమ్ముడి చెంపలని నిమురుతూ వుండిపోయింది.
    
    రెప్ప రెప్పనీ తడుపుతున్న నీటిచుక్కల్లో తమ్ముడు శవంలా అనిపించడం లేదు. ఆలస్యం చేస్తే వాడిపోయి నేలపై పడి, ధూళిలో కలిసిపోతుందేమో అని దేవుడు కోసుకున్న పువ్వులా అనిపిస్తున్నాడు.
    
    ఆ తర్వాత ఆమెకేమీ గుర్తులేదు.
    
    తమ్ముడ్ని స్మశానానికి తరలించడం లీలగా గుర్తున్నా మరెన్నటికీ తిరిగిరాణి లోకాలకి తమ్ముడు వెళ్ళిపోతుంటే వీధీ వాడా విద్యార్ధులూ కంటతడి పెట్టుకోవటమూ చూస్తున్న ఆమెలో చలనం లేదు. అసలు జరుగుతున్నది నిజంకాదని ఇంకా అనిపిస్తుంటే ఓ సుషుప్తిలోలా చూస్తూంది అంతా.

 Previous Page Next Page