తల్లి మాటలకు కొద్దిగా బాధపడినా, మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చినట్లు నవ్వుకుంటూ దొడ్లోకి వెళ్ళిపోయింది రాధ.
కూతురు నవ్వుకోవటం చూచిన శారదాంబకు మరీ చిన్నతనంగా వుంది. కాని రాధని చూసి అప్పుడు కోపం రాలేదు. జాలి కలిగింది దాని జీవితం ఎట్లా వుంటుందో ఆని ఆమె నిరంతరం తలపోస్తూనే వుంటుంది. ఇంతవరకూ రాధకు పెళ్ళికాలేదు. ఇహ ముందు మాత్రం ఏ విధంగా జరుగుతుంది - ఎవరూ పూనుకోకుండా వుంటే? ఉదయం లేచింతర్వాత ఆమెకు ఎప్పుడైతే యిలాంటి ఊహలు కలిగాయో ఇహ ఆ రోజంతా చికాకుగానే వుంటుంది. ప్రతి చిన్న సమస్యా పెద్ద సమస్యలాగానే కనిపిస్తుంది.
తరువాత నారయణకూడా లేచి వచ్చాడు. అతను తల్లితో ఏమీ మాట్లాడకుండానే పెరట్లోకి వెళ్ళిపోయాడు. ఛాయను కేకేసి వాసుగాడ్ని లేపు తల్లీ" అంది శారదాంబ.
"వరేయ్ అన్నాయ్!"
వాసుకు మెలకువ రాలేదు.
చాయ అతన్ని పట్టుకుని కుదుపుతూ "లేవరా అన్నాయ్ "అంది.
వాసు బద్దకంగా కళ్ళు విప్పి "అబ్బ, ఉండవే" అన్నాడు.
"అమ్మ రమ్మంటుందిరా?"
"అబ్బ ఇంకాస్సేపు పడుకుంటానే."
"సరే, యీ విషయం అమ్మతో చెబుతానుండు" అంటే, నెత్తిమీద ఒక మొట్టికాయ వేశాడు. "అమ్మా చూడవే!" అంటూ ఛాయ తల్లి దగ్గరకు వెళ్ళింది.
మధ్యాహ్నం పన్నెండయినా చిదంబరం ఆటలోంచి లేవలేదు. అప్పుడప్పుడూ భోజనం చేయకుండానే ఆటలో కూర్చోవటం ఆయన అలవాటు. ఇవాళ కూడా అంతే జరిగింది.
పన్నెండూ అయిదు నిమిషాలకి ఛాయ పరుగెత్తుకుంటూ వచ్చి "అమ్మ భోజనానికి రమ్మంది నాన్నా" అంది నాల్గోసారి.
చిదంబరం విసుక్కుంటూ "ఉండవే ఆట రసపట్టులో వుంది" అన్నాడు.
"తొందరగా రమ్మంది నాన్నా!"
ఈసారి చిదంబరానికి అంతులేని కోపం వచ్చింది, పేకముక్కల్ని గభాలున క్రిందపడేసి, చెబుతుంటే బుద్ధిలేదూ? అవతల పెద్దమనుషులున్నారని లేకుండా. వెయ్యి, గోడకుర్చీ వెయ్యి" అని గద్దించాడు.
చిన్న పిల్ల గజగజమని వణుకుతూ బిక్కమొహం వేసి నిల్చుంది.
"ఊఁ చూస్తావేం?"
ఈ గర్జనకు హడలిపోయి తడబడే కాళ్ళతో గోడ దగ్గరకు పోయి గోడకుర్చీ వేసింది. ఆ పిల్ల చిన్న పాదాలు వణుకుతున్నాయి. తెల్లని శరీరం నుండి స్వేద బిందువులు ముత్యాల్లా ప్రవహించసాగాయి.
అలా కొంచెంసేపు గడిచింది, కాళ్ళు నొప్పులు పెడుతున్నా తండ్రి అంటే భయంతో అలాగే కూర్చుని వుంది. ఆ దృశ్యాన్ని ఎవరూ చూడకుండా వుంటే అలా యెంతసేపు జరిగేదోగాని, ఎక్కడో పెత్తనాలు సాగించి యింట్లోకి వస్తున్న ముసలమ్మగారి కళ్ళు యీ చిన్నపిల్ల దుస్థితిని చూడనే చూశాయి. "అయ్యో తల్లీ, అయ్యోయ్యో ఏమిటి యిది?" అంటూ అక్కడ ఎవరెవరు వున్నారో చూడకుండా చప్పున గదిలోకి జొరబడి, రానని ఆ పిల్ల యెంత మొత్తుకుంటున్నా బలవంతంగా యివతలకు లాక్కువచ్చింది, లాక్కువచ్చి అంతటితో ఊరుకోలేదు. పెద్ద పెట్టున ప్రారంభించింది. " ఏళ్ళు రాగానే సరా? జ్ఞానం అనేది ఒకటుండాలి. ఇంతకీ అదేం తప్పు చేసిందని అంత శిక్ష? చిన్నపిల్ల యెలా వొణికిపోతూందో అయినా చూడక్కర్లేదూ? అసలు యివాళ దీనికి ఎంత గండం తప్పిందీ" అంటూ "కృష్ణకి రానన్నదని చీవాట్లు వేశాను. కాని రాకపోవటం ఎంతమంచి పనయింది. దీని ఈడుపిల్ల నా ప్రక్కనే స్నానం చేస్తూ , చూస్తూ చూస్తూండగానే బుడుంగుమని మునిగిపోయింది గదా! మళ్ళీ లేచిందా! ఉహూ! దీన్ని తీసుకెడితే అంత ప్రమాదమూ దీనికే సంబంవించేది గదా! మళ్ళీ లేచిందా! ఉహూ! దీన్ని తీసుకెడితే అంత ప్రమాదమూ దీనికే సంబంవించేది కదా! అదేమన్నా ఆలోచించేనా యింతటి శిక్ష విధించటం?" అని "నా చిట్టితల్లి! ఎంత పిచ్చిదానివే" అంటూ ఆ పిల్లను అక్కున జేర్చుకుంది.
ఇదంతా విని అన్యమనస్కంగా చిదంబరం కొంతసేపట్లో వస్తానని, అప్పటిదాకా వూరికే కూర్చోబెడుతున్నందుకు పెద్ద మనుషులకు క్షమాపణ చెప్పుకుని లోపలకు వచ్చాడు.
"అయితే మరి, పెద్దవాళ్ళ మాటకి ఎదురు చెప్పమని యెక్కడ వుంది?" అతను తల్లిని సూటిగా ప్రశ్నించాడు.
నిజానికి జరిగిందేమిటో ముసలమ్మగారికి కూడా తెలీదు. అయినా ఆవిడ తొణక్కుండా "పెద్దరికం, పెద్ద కబుర్లు చెప్పటం మటుకు వచ్చు. ఏ విషయంలో నీ పెద్దరికం నిలబెట్టుకుంటున్నావు నాయనా?" అని అడిగింది.
తల్లి యిలా అనేసరికి చిదంబరం మారు సమాధానం చెప్పకుండా లోపలి పోయి చేతులూ, కాళ్ళూ కడుక్కువచ్చి బుద్ధిమంతుడిలా పీటమీద కూర్చున్నాడు, శారదాంబ మాట్లాడకుండా వడ్డించింది.
చిదంబరం కొంచెంసేపు అయాక నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ "నా కిటువంటి విషయాలే నచ్చవనుకుంటాను. నేను భోజనానికి రాక కొంచెం ఆలస్యం చేస్తే యింతమంది కంగారుపడి నానా రగడా చేయటం ఎందుకో? ఆకలైతే బాధపడేది నేనేగా" అన్నాడు.
ఆయన వయసులో వున్న ఏ వ్యక్తికూడా ఆలోచిస్తే యింత తెలివితక్కువగా మాట్లాడి వుండడు. చిదంబరం ఏ కొంచెం ఆలోచించినా అవతలి వాళ్ళ మనస్సుకు యీ మాట ఎలా నాటుకుందో గ్రహించి వుండేవాడు.
మబ్బులు పట్టిన ఆకాశంలా వున్న ముఖంలోకి కళాకాంతులు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తూ "వేళ ప్రకారం భోజనం చెయ్యాలని డాక్టరుగారు చెప్పారు కదా" అంది శారదాంబ.
చిదంబరం విసుగ్గా "ఆ డాక్టరుకి మనం ఫీజు యిస్తేకదా నిజం చెప్పటానికి? పందెం వేస్తాను. ఇవాళ ఒక పదిరూపాయల ఫీజు యిచ్చి మళ్ళీ పరీక్ష చేయమంటాను. అప్పుడేమంటాడో తెలుసా? అసలు భోజనం చెయ్యవద్దంటాడు. నా మాట అబద్ధం అయితే చూసుకో" అంటూ తన చిన్న కళ్ళను పైకి ఎత్తి భార్య ముఖంలోకి చూశాడు.
దేనికి భార్య సమాధానంగా "అలా అయితే మీ ఇష్టం. మీకు తోచినట్టే చేయండి" అంది.
చిదంబరం కొంచెం బెదిరి "అంటే, నేను నాకు తోచినట్లే చేస్తాననా నీ ఉద్దేశ్యం? కాకపోతే ఇవాళ ఆట మరీ పసందుగా వుండటంవల్ల ఆలశ్యం అయింది" అన్నాడు.
"మీకు పేకాట ఏ రోజు పసందుగాలేదో కాస్త చెప్పండి" అందమనుకుంది శారదాంబ. కాని వెంటనే ఆ సమయంలో ఈ మాట అనటం చాల అనుచితంగా భావించి వూరుకుంది.
తర్వాత ఎటువంటి సంభాషణా జరగలేదు. తల్లి గొణుక్కోవటం చిదంబరానికి చాలాసేపటి వరకూ వినిపిస్తూనే వుంది. చెయ్యి కడుక్కుని ఎవరితోనూ మాట్లాడకుండానే మళ్ళీ పేకగదిలోకి వెళ్ళిపోయాడు.
తరువాత శారదాంబ భోజనానికి కూర్చుంది. కాని ఏమీ తినలేకపోయింది. ఆమెకు ఏమీ సహించదు. నాలుగు మెతుకులు కొరికి, వంటిల్లు శుభ్రం చేశాక ఇవతలి గదిలో చాప వేసుకుని పడుకుంది.
రాత్రిదాకా శారదాంబకు చాలా మామూలు గడిచింది. కానీ ఆ రాత్రి భర్తను ఒక విషయం అడక్కుండా వుండలేకపోయింది. అతనిపాదాల దగ్గిర కూర్చొని, పాదాలు వొత్తుతూ "మీరు బొత్తిగా ఆ విషయం మర్చిపోయారు" అంది.
ఆయన ఆశ్చర్యంగా "ఏ విషయం?" అని అడిగాడు.
"రాధ పెళ్ళి విషయం" అంది శారదాంబ.
"పెళ్ళి విషయమేమిటి?" భర్త ఇలా తెలియనట్లు మాట్లాడేసరికి ఆమె కొంచెం గాయపడి "రాధకు పెండ్లి సంబంధాలు చూస్తానని కొన్ని రోజుల క్రితం మీరు చెప్పారు" అంది.
ఆయన ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవిచేసి "ఏమిటి? నేనా? నేనెప్పుడూ అటువంటి మాటలు చెప్పి వుండలేదు" అన్నాడు.
"కాదు........" అని ఆమె ఇంకా ఏదో అనబోయేసరికి "అయితే నీ ఉద్దేశ్యం నే నబద్ధం ఆడుతున్నాననేగా? ఇంత పెద్ద వయస్సులో అబద్ధం ఆడవలసిన అవసరం నాకేముంది? నువ్వే పొరబడి వుంటావు" అని కొంచెం ఆగి "నీ వెర్రికాకపోతే ఆడపిల్లలకు సంబంధాలు అవంతటమే రావాలిగాని మనం ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి?" అన్నాడు.
భర్త మాటల్లోని నిజం స్త్రీ అయిన శారదాంబకు తెలుసు. కాని ఆవిడ ఆయనతో వాగ్వివాదాలు పెటుకొని ఎటువంటి లాభమూ లేదని తెలుసుకొని చాలా సంవత్సరాలైంది. మాట్లాడలేదు.
ఆ రాత్రి శారదాంబ పడుకోబోతూ" ఇవాళ ఏం రోజు? నా జీవితంలో ఇటువంటి ప్రత్యేకతలేని రోజులు ఎన్నివేలు గడిచాయి? ఇలా ముందు ఎన్ని గడవాలో" అనుకొని నిట్టూర్పు విడిచింది.
6
ఏ రోజైతే శారదాంబకు స్వాభావికంగా గడిచిపోయిందో, ఏ రోజైతే ఏమీ ప్రత్యేకత లేకుండా ఆమెకు గడిచిపోయిందో అదే రోజు రాధకు చాలా విచిత్రమైనదిగా పరిణమించింది. ఉదయం ఇంచుమించు తల్లితోబాటు లేచింది. తల్లి ఏడుస్తుంటే చూసింది. ఒక మాటకూడా విసిరింది. చివాట్లుకూడా తింది.
భోజనం అయిపోయాక ఆమెకు ఇంట్లో వుండబుద్ధి కాలేదు. కాస్త కాలక్షేపం అవసరం అనిపించింది. చాలామంది స్త్రీలలాగ తోచినా తోచకపోయినా ఇంట్లోనే కూర్చొని వుండే స్వభావం ఆమెది కాదు. ఎవరింటికి పోదామా? అని ఓ క్షణంసేపు ఆలోచించి, తనకున్న స్నేహితురాళ్ళలో ఎక్కువగా చనువుగా వుండేది ప్రమీల ఒక్కత్తే. ఆమె ఇంటికే పోదామని బయలుదేరింది ఇవాళకూడా.
మెట్లు ఎక్కి రెండడుగులు లోపలివేసి, మూడో అడుగు వేయబోతూ విద్యుచ్ఛక్తి తగిలినట్లుగా ఆగిపోయింది. ప్రమీలతో ఇన్నాళ్ళనుంచి స్నేహం చేస్తున్నా ఈ స్థితిలో ఆమెను ఎప్పుడూ చూడలేదు. భర్త విశాలమైన కౌగిలిలో ఒదిగిపోతూ అతని కళ్ళలోకి అమాయకంగా చూస్తూ నవ్వుతోంది. రాధకు శరీరమంతా సిగ్గుతెరలు క్రమ్మినాయి. ముఖమంతా ఎర్రబడిపోయింది. ఒక్కక్షణంపాటు ఏమి చెయ్యటానికి కూడా ఆమెకు పాలుపోలేదు. ఒక్కసారిగా ఆమె ఎంత ముగ్ధరాలయిపోయిందో, అంతే బాధతో కుమిలిపోయింది కూడా. ఈ మధ్య ప్రమీలగారింటికి రావటానికి, ఆమె భయపడటానికి కారణం ఇప్పుడు తనే ప్రత్యేక్షంగా తెలుసుకోగలిగింది. ఆ భార్యభర్తల మధ్య తను తరచురావడం అంతరాయంగా వుంటుందని కొన్ని రోజుల్నుంచీ అనుమానించసాగింది. అక్కడ నిలబడ్డ ఒక్క నిమిషం లోనూ ఇవన్నీ గిర్రుమని తలలో తిరగగా, మరునిమిషంలో తన తప్పు తెలుసుకుని మరింత సిగ్గుపడి వెళ్ళిపోదామని గిరుక్కున వెనక్కి తిరిగింది.
అదృష్టవశాత్తూ ప్రమీలగాని, ఆమె భర్తగాని ఈమె రావటం, వెళ్ళిపోవటం ఏదీ చూడలేదు. ఒకవేళ చూడటమే సంభవిస్తే అది రాధని తలవంచుకునేటట్లు చేసేది. మెల్లగా నడుస్తూ ఇందాక చూసిన దృశ్యాన్ని నెమరువేసుకొనసాగింది. ఆ దృశ్యం తాలూకు చిహ్నాలు మనసులో చిత్రించుకొనేటప్పుడల్లా ఆమె శరీరం పులకించసాగింది. పెదాలమీద చిన్న నవ్వు అవతరించింది. ముఖమంతా ప్రపుల్లమానమై మనసంతా సంపుల్లమానమైనట్లుగా తోచింది.
ఆమె ఇంకా ఇలాంటి ఏదో అనుభూతుల్లో వుండగానే, "వదినా" అన్న పిలుపు ఈ లోకంలోకి తీసుకు రాగలిగింది.
ఈ పిలుపు ఎవరిదో ఆమెకు తెలుసు. ఆవరించిన ఆలోచనలను పారద్రోలేపాటి చిన్న త్యాగం ఆమె చేయటానికి సిద్ధపడి, ఈ వేళ కృష్ణుడికి బాగా బుద్ధి చెప్పాలనిగూడా అనుకుంది. "ఏమిటి?" అనడిగింది.
"ఒకసారి మా ఇంటికి రాగూడదా?"
"సరే వస్తాను" అని, రాధ ఏ మాత్రం సంశయించకుండా లోపలకు నడిచింది. "మీ అమ్మగారు ఎక్కడున్నారు?" అనడిగింది కృష్ణుడ్ని చూసి.
"లోపల వుంది."