Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 6

 

       వైజయంతి పొలంనుంచి బయటకు వచ్చింది. నలుగురు పోలీసుల కళేబరాలు బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వాళ్ళను వెంటనే క్యాంప్ కు పంపేశారు.
   
    ఇరవై ఇద్దరు దొంగలు బందీలయ్యారు. చనిపోయిన వాళ్ళు పన్నెండుమంది అందులో తెల్లజెండా పట్టుకున్న వ్యక్తి చేతిలో జెండా లాగే వుంది. దాదాపు యాభైఏళ్ల వయసుంటుందతనికి. పోలికలు సరిగ్గా సరిపోయాయి. అతడే భభీరామ్.
   
    కరమ్ వీర్ సింగ్ వచ్చి సెల్యూట్ చేశాడు. అతడి మొహం సంతోషంతో వెలిగిపోతోంది.
   
    "మేడమ్, భభీరామ్ శవం దొరికింది". అతడి సంతోషం దేనికో ఆమెకు బాగా తెలుసు. భభీరామ్ ని ప్రాణాలతోగాని, శవంగాగాని అప్పగించిన వాళ్ళకు లక్షరూపాయలు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం. శవం దొరికింది యు.పి. లో కాబట్టి ఆ ఘనత వాళ్ళకే దక్కుతుంది.
   
    పేరుకోసం ఆమె ఎప్పుడూ ప్రాకులాడలేదు కాబట్టి ఆమెకు ఏ బాధలేదు. బాధంతా ఒక్కటే, అతడిని ప్రాణాలతో పట్టుకుంటే బావుండేదని ఇంతకాలం న్యాయం వేరు, చట్టం వేరు అనుకుంటూ వచ్చింది. ఇప్పుడు న్యాయంవేరు, ధర్మం వేరు అని అర్ధమైంది. ఆటవిక న్యాయంలో ధర్మానికి అర్ధం మారిపోతుంది.
   
    "అతడు తెల్లజెండా చూపించాడుగా, ఎందుకు ఫైరింగు మొదలు పెట్టారు?" అడిగింది కాస్త తీవ్రంగానే.
   
    "మీకు తెలీదు మేడమ్! అదంతా ప్లాను! ఓ పక్క తుపాకీ ఎత్తి లొంగిపోయినట్లు చూపిస్తూనే మరోపక్క కాల్పులు మొదలుపెట్టారు. మొదట ఫైర్ చేసింది వాళ్ళే మా కానిస్టేబుల్ అక్కడికక్కడే చచ్చిపోయాడు".
   
    అతడు చెప్పేది నిజంకాదని ఆమెకు తెలుసు. కాని రుజువు చేయలేని విషయం అతడి నవ్వులోనే ఆ విషయం తెలుస్తుంది.
   
    ఆమె తనకోసం వేసిన టెంట్ లో కూర్చుంది. పోలీసులు బందిపోట్ల దగ్గర దొరికిన ఆయుధాలను లోపల పెట్టారు. శవాలన్నింటిని వరుసగా పడుకోబెట్టారు. ట్రక్కులని దగ్గరగా తీసుకురమ్మని క్యాంప్ కి ఆదేశాలెళ్ళాయి.
   
    వైజయంతి అలసటగా కుర్చీలో జారగిలబడి కూర్చుంది. నాలుగు రోజుల్నుంచి సరియైన నిద్రలేదు. అలసట అయినా నిద్రపట్టేలా లేదు. గుండెల్లో ఏదో ముళ్ళు గుచ్చుకుంటున్న బాధ.
   
    బయట పెద్దగా గోల వినిపించటంతో బయటకు పరుగెత్తింది.
   
    జనం... గుంపులు గుంపులుగా వస్తున్నారు నినాదాలు చేసుకుంటూ.

    "కెప్టెన్ సాహెబ్ కి జై- పోలీసుల జులుం నశించాలి!"
   
    అరగంటలో నేల ఈనినట్లు వచ్చేశారు. చిన్నా, పెద్దా, స్త్రీలూ, పురుషులూ, నడవలేని వాళ్ళు బళ్ళలో వస్తున్నారు. కొంతమంది బాహాటంగానే ఏడుస్తున్నారు. కొందరు పోలీసులమీద అరుస్తున్నారు!
   
    వైజయంతి వాళ్ళను చూస్తూ నిలబడింది.
   
    బండి దిగి వచ్చారు ఓ నూతన దంపతులు! కాళ్ళపారాణి యింకా ఆరలేదా అమ్మాయిది.
   
    ఒక్కసారి భభీరామ్ కాళ్ళకు మొక్కనివ్వమని, కళ్ళనీళ్ళు కారుస్తూ వేడుకుంటున్నారు! పోలీసులు వాళ్ళను ముందుకు రానివ్వడంలేదు.
   
    వైజయంతి ఆగలేకపోయింది. వాళ్ళని పిలిపించింది.

    "అతడు మీకు బంధువా?" అడిగింది.
   
    "అవును మేడమ్! ఆత్మబంధువు మాకు చుట్టరికం లేదుగాని మా పాలిట దేవుడతడు! మీ పోలీసుల్లాగా స్త్రీలమీద అత్యాచారాలు చేయలేదెప్పుడూ స్త్రీలను ఎంతో గౌరవిస్తాడు! ఈ రోజు అతడు చచ్చిపోవడానికి నేనే కారణం! నా పెళ్ళికోసమే ఈ ప్రాంతానికొచ్చాడు!" అతడి కళ్ళలో నించి నీళ్ళు ధారగా కారుతున్నాయి.
   
    "అతడెన్ని హత్యలు చేశాడో, ఎంతమందిని కిడ్నాప్ చేశాడో మీకు తెలుసా?"
   
    "తెలుసు పోయిన వారం నేను నడిపే బస్సునుంచే ఒకబ్బాయిని ఎత్తుకుపోయాడు. మీకు తెలుసా మేడం! ఆ అబ్బాయి తండ్రి వ్యాపారంలో లక్షలు గడించాడు. మేడలమీద మేడలు కట్టాడు! అదంతా బట్టలవ్యాపారంలో సంపాదించాడా? వడ్డీ వ్యాపారంచేసి, పేదప్రజల రక్తాన్ని పీల్చి కట్టాడా మేడలు అతని దగ్గర అరడజనుమంది రౌడీలున్నారు! వంద రూపాయల కోసం భభీరామ్ ని నడిబజారులో ఎముకలు విరిగేలా తన్నేరు. ఏ పోలీసయినా పట్టుకున్నాడా వాళ్ళని? ఎప్పుడైనా శిక్ష విధించారా అలాంటి వాళ్ళకి లేదు మేడమ్! మీ చట్టానికి కళ్ళూ లేవు, చెవులూ లేవు" ఆవేశంగా అన్నాడు హరీష్.
   
    కరమ్ వీర్ కోపంగా ముందుకు రాబోయి వైజయంతి చూపులకి ఆగిపోయాడు హరీష్ ని పంపేసింది.
   
    కరమ్ వీర్ తో చెయ్యాల్సిన పనుల గురించి చర్చించి అప్పుడే వచ్చిన జీపులో కూర్చుని భింద్ బయలుదేరింది.
   
    ఏదో చెయ్యాలనే తపనతో బయలుదేరి ఏదోచేసి, మరేదో చేసినట్లు గుండెల్లో బాధ.
   
    ఈ విజయానికి ప్రభుత్వంనించి మెప్పు లభించవచ్చు. మెడల్సూ దొరకవచ్చు. కాని అంతరాత్మ వేసే ప్రశ్నలకు జవాబు లిచ్చుకోవటం సాధ్యమా?
   
    ట్రైనింగులో ఉన్నప్పుడు రిటైర్డ్ ఆర్మీ ఛీఫ్ జనరల్ మానిక్ షా యిచ్చిన ఉపన్యాసం గుర్తుకొచ్చిందామెకు.
   
    "పోలీసు ఆఫీసరు ఉద్యోగం కత్తిమీద సాములాంటిది. ఒక వ్యక్తిని హత్యచేసే చట్టరీత్యా నేరం. కాని యుద్దంలో ఎంతమందిని హత్యచేస్తే అంత ఘనత. దేశంలో యిప్పటి అరాచకత్వాన్ని బట్టి పోలీసులు యుద్ధం చేయక తప్పడం లేదు. కర్తవ్య నిర్వహణలో న్యాయాన్యాయాల విచక్షణ వుండకూడదు. కాని మనసులో అంతర్యుద్దం మొదలవుతుంది. దాన్ని జయించడమే అసలైన విజయం. ఒక పోలీసాఫీసరుకు సదా గుర్తుండవలసిన విషయం బాధ్యత! న్యాయపరిరక్షణ అనే ఆ బాధ్యతలో అన్యాయాన్ని అంతం చెయ్యడం ముఖ్యం. ఆ ప్రాసెస్ లో అనుకోకుండా హత్యలూ చెయ్యవలసి వస్తుంది. ఒక వ్యక్తి మరణంతో వందమందికి మేలు జరుగుతుంది అనుకుంటే అనివార్య పరిస్థితుల్లో హత్య చేయడానికి వెనుకంజ వేయకూడదు. ఈ విషయంలో ముఖ్యంగా కావల్సింది ఆత్మస్థయిర్యం. దాన్నెప్పుడూ కోల్పోకండి".
   
    ఆ బ్యాచ్ లో లేడీ ఆఫీసర్ తనొక్కతే ఉపన్యాసం ముగించి ఆయన తనవైపు చూసి నవ్వాడు. ఉపన్యాసం ముఖ్యంగా నీ కోసమేసుమా అన్నట్లు.
   
    ఆయన మాటలు నచ్చాయి ఆ రోజు. అనుభవంలోకి వచ్చాయి ఈ రోజు. కర్తవ్య నిర్వహణలో తను వెనుకంజ వేయలేదు. ఆ విషయంలో తృప్తిగానే వుంది కాని.... ఏదో దిగులు.
   
    ప్రాణం తీయడం తేలిక. ప్రాణం పోయడం సాధ్యంకాని విషయం. ఆలోచిస్తున్నకొద్దీ తలనెప్పి ఎక్కువవుతోంది.
   
    ఆమె ఇల్లు చేరేసరికి రాత్రి ఎనిమిదయింది. హాల్లోనే కూర్చున్నాడు శరత్.
   
    "ఎప్పుడొచ్చారు?" ఉత్సాహంగా తన వాళ్ళంటూ ఒకరు మనసు విప్పి మాట్లాడుకునేందుకు దొరికారన్న సంతోషంతో అడిగింది.
   
    "రెండు రోజులయింది" అన్నాడతడు ముక్తసరిగా.
   
    తన మనసులో చెలరేగుతున్న సంఘర్షణని అర్ధం చేసుకుని ఒక ఓదార్పు మాట చెప్పేవ్యక్తి తోడు దొరికారన్న ఆనందం ఆ ఒక్కమాటతో పటాపంచలయింది.
   
    పదిహేను రోజుల తర్వాత భర్తని చూసిన ఉత్సాహం, అభిమానం అణగారిపోయాయి.

    "స్నానం చేసొస్తాను" లేచి వెళ్ళిపోయింది.
   
    చల్లటి నీళ్ళు షవర్ లోంచి పడుతుంటే అలాగే నిలబడిపోయింది అయిదు నిమిషాలపాటు.
   
    భర్త ఊర్నుంచి వచ్చి రెండు రోజులయింది. అతను వచ్చేటప్పటికి తను లేదు. రాగానే అతడిమీద మరింత ఆదరణ చూపించి వుండాల్సిందా? తనెంతో ప్రేమించి పెళ్ళి చేసుకున్న వ్యక్తి! ఇదివరలో రెండు రోజులు కనిపించక మూడోరోజు కనిపిస్తే అల్లుకుపోయేది. గుండె స్పందించేది. ఆ రాత్రి మళ్ళీ మొదటి రాత్రే అయ్యేది. ముఖ్యంగా తను టెన్షన్ తో నిండి యింటికి వచ్చినరోజు మరీ సెక్సులో తనని పూర్తిగా సంతృప్తి పరచగలడు అతను. కాని ఈ మధ్యన ఎందుకిలా జరుగుతోంది?
   
    తన ప్రేమ పరిపూర్ణమయినది కాదా?
   
    బహుశా కాదేమో! యవ్వనపు వేడిలో ఇద్దరూ ఒకరినొకరు అర్ధం చేసుకోలేకపోయారు పూర్తిగా వేడి చల్లారింది. ఆవేశం అణగారింది. కేవలం సెక్స్ ఒక్కటే బంధంగా మిగిలిపోయింది. రెండు నిముషాల పెళ్ళి చూపులతో వివాహం చేసుకున్న దంపతులకీ, తమకూ తేడా లేదిప్పుడు రక్తంలో జీర్ణించుకుపోయిన భారతీయ సంప్రదాయం, సంస్కృతీ భర్తని ఆదరించాలని ఎంతగా చెపుతున్నాయో అతడి ప్రవర్తన అంతగా వ్యతిరేకించేలా చేస్తోంది.
   
    స్నానం ముగించుకుని బయటకు వచ్చింది వైజయంతి.
   
    వంటమనిషి డైనింగ్ టేబుల్ మీద అన్నీ అమరుస్తున్నాడు. మౌనంగా భోంచేశారిద్దరూ.
   
    "ట్రాన్స్ ఫర్ విషయం ఏమయింది?" అడిగింది.
   
    "వచ్చేసింది. పదిహేను రోజులు లీవుపెట్టి వచ్చాను. నువ్వులేవు. ఎప్పుడొస్తావో తెలియదు. అందుకే లీవు కాన్సిల్ చేసుకుని డ్యూటీలో జాయినయ్యాను".
   
    "ఓ, అయామ్ సారీ!"

 Previous Page Next Page