Previous Page Next Page 
న్యాయానికి అటూ-ఇటూ పేజి 6

   

    శ్రీలక్ష్మి హాస్పిటల్ కాంపౌండ్ లో కారాగింది. మెయిన్ గేటువద్ద గూర్ఖా, లోపలకు బారులుగా వెళుతున్న ఖరీదైన కార్లు, వాటిలో పేషెంట్లుగా వుండికూడా మెరిసిపోయే మనుషులు, హడావుడిగా అటూ ఇటూ పరుగులు తీస్తున్న స్టాఫ్ వంక విస్మయంగా చూసి లోపలకడుగుపెట్టింది శ్వేతబిందు.
   
    ఇద్దరూ ఆబ్ స్ట్రెటిస్ విభాగం ఎక్కడుందో కనుక్కుని అటుకేసి వెళ్ళారు.
   
    గైనకాలజీ ఎండ్ ఆబ్ స్ట్రెటిస్ శాఖకు హెడ్ డాక్టర్ మైథిలి, ఎమ్.ఆర్.సి. ఓ.జీ.తో బాటు యింకా చాలా ఫెలోషిప్స్ వున్నాయి. వివిధ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ గా పనిచేసి క్రితం ఏడాదే రిటైరయింది. రిటైరైన కొద్దిరోజులకే శ్రీలక్ష్మి హాస్పిటల్ నుంచి ఆహ్వానం వచ్చి యిక్కడ చేరింది. ఆమె నేతృత్వంలో ఆ విభాగం చాలా ప్రతిభావంతంగా పనిచేస్తూ, హాస్పిటల్ కి మంచి పేరుకూడా తీసుకొచ్చింది.
   
    అతను ముందుగానే ఫోన్ చేసి ఎపాయింట్ మెంట్ తీసుకోవటంవల్ల ఎక్కువ సేపు వెయిట్ చెయ్యవలసిన అవసరం లేకుండానే లోపలనుంచి పిలుపు వచ్చింది.
   
    డాక్టర్ మైధిలి శ్వేతబిందును ఎగ్జామిన్ చేశాక, రొటీన్ బ్లడ్ టెస్ట్ లూ, అవీ రాసిచ్చి రిపోర్టు వచ్చాక కలుసుకోమని చెప్పింది.
   
    "మావారు ఒకసారి మీతో మాట్లాడటానికి వీలవుతాందాండి" అనడిగింది బిందు కొంత బిడియంగానే.
   
    "ఎందుకు?"
   
    "వారికేవో కొన్ని అనుమానాలుంటాయి కదా! మీతో స్వయంగా మాట్లాడితేనే తృప్తిగా వుంటుంది."
   
    ఆమె కొంచెం అయిష్టంగానే తల ఊపి సిస్టర్ని పిలిచి బయటవున్న ప్రదీప్ ని పిలవమని చెప్పింది.
   
    అరవైఏళ్ళ వయసు, ముఖంలో తేజస్సు, మేధస్సుతో ప్రకాశించే కళ్ళు, ఆమెను చూడగానే ప్రదీప్ కు గౌరవభావమే కలిగింది. నమస్కారం చేశాడు.
   
    "కూర్చోండి" అన్నది మర్యాదగానే.
   
    ప్రదీప్ కూర్చుని "నా మిసెస్..."
   
    "ఎగ్జామిన్ చేశాను. షి యీజ్ ఆల్ రైట్."
   
    "అన్నీ సక్రమంగా వున్నాయా?"
   
    "అన్నీ అంటే?" అని ఆమె  ఎదురుప్రశ్న వేసింది.
   
    "తల్లి ఆరోగ్యం, లోపల శిశువు పొజిషన్."
   
    "ఆమె యింకా తల్లికాలేదు. గర్భిణీస్త్రీగానే వుంది. ఫీటస్ హెల్దీగానే వుంది."
   
    ఆమె ముఖంవంక ఒకసారి చూసి ఏమాత్రం అధికంగా మాట్లాడినా ఆమెకు రుచించదని తెలుసుకున్నాడు.
   
    "మీరు చాలా జాగ్రత్తగా చూస్తారని మీ దగ్గరకు తీసుకొచ్చాను. ఆమెను పూర్తిగా మీచేతుల్లో వుంచుతున్నాను" అన్నాడు.
   
    ఈసారి ఆమె నవ్వింది. "ఐ నో మై రెస్పాన్స్ బులిటీ" అంది.
   
    "మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారు?"
   
    "టెస్ట్ లు రాసిచ్చాను రిపోర్టులు వచ్చాక."
   
    ఇంకా మాట్లాడేదేమైనా వుందా అన్నట్లు అతనివంక చూసింది డాక్టరు మైథిలి.
   
    అతను లేచి నిలబడి సెలవు తీసుకొని భార్యతో బయటకు వచ్చేశాడు.
   
    కారులో తిరిగి వస్తుండగా భర్త ముభావంగా వుండటం చూసి శ్వేతబిందు అంది. "ఆవిడ అలా అంటీ అంటనట్లు మాట్లాడటంవల్ల మీకు బాధ కలిగింది కదూ!"
   
    "అదేం లేదే?"
   
    "మరి ఎందుకలా ముభావంగా వున్నారు."
   
    "నీ గురించే ఆలోచిస్తున్నాను."
   
    ఆమె నవ్వి ఊరుకుంది.
   
    "మనకి ఒక్కరు చాలు. తర్వాత ఆపరేషన్ చేయించేసుకుంటాను" అన్నాడు ప్రదీప్.
   
    "మీరెందుకు నేను చేయించేసుకుంటాను."
   
    "నీ శరీరం అంత హింసకు తట్టుకోలేదు. ఇప్పుడు అనుభవిస్తున్నది చాలు."
   
    ఆమె మళ్ళీ నవ్వింది. "నన్ను మరీ అంత గారాబం చెయ్యకూడదండీ."
   
                                       4
   
    రో రెండునెలలు గడిచాయి.
   
    ఒకరోజు తెల్లవారుఝామునే శ్వేతబిందు నిద్రలో అటునుంచి యిటు కదలబోతుండగా కడుపులో ఏదో ప్రళయం జరిగినట్లుగా అయి "అమ్మా!" అని మూలిగింది బాధగా.
   
    ప్రదీప్ కు మెలకువ వచ్చింది "బిందూ! ఏమిటి?" అన్నాడు ఆదుర్దాగా.
   
    "నొప్పి భరించలేనట్లు వచ్చింది."
   
    అతనికి కొంతవరకూ అర్ధమయింది. బిందుకు నెలతప్పినప్పట్నుంచీ అతను వంటమనిషిని పెట్టాడు. ఇంట్లో పనిచేసే కుర్రాడు రాముకూడా వున్నాడు. ఇద్దరూ ఓ గంటపోతే కానీ రారు.
   
    "బిందూ హాస్పిటల్ కు పోదామా?"
   
    "కాసేపు చూద్దామండీ."
   
    అన్నదిగాని తెరలు తెరలుగా పెయిన్స్ వచ్చినప్పుడు తట్టుకోలేక ఆపసోపాలు పడిపోతుంది.
   
    ఇహ ఆలస్యం చెయ్యటం మంచిదికాదని ఆమెను తీసుకుని బయటికి వచ్చి ఇంటికి తాళంపెట్టి ఆమెను కారులో ఎక్కించుకొని శ్రీలక్ష్మి హాస్పిటల్ వైపు బయల్దేరాడు.
   
                                    * * *
   
    ఒక్కొక్క గంటా గడుస్తుంది.
   
    మెంబ్రేన్స్  రప్ చర్ అయాయి.
   
    డాక్టర్ మైథిలి చాలా జాగ్రత్తగా ఎగ్జామ్ చేసింది.

    బోర్డర్ లైన్ సి.పి.డి.
   
    ఇదివరకు చూచినప్పుడు ఫీటస్ ఎల్.ఓ.పీ. పొజిషన్ లో వుంది. ఎల్.ఓ.పీ. నార్మల్ పొజిషన్, శిశువు వెన్నముక యుటెరస్ ఎడమభాగంలో వుంటుంది. తల బాగా ఎగువగా వుంటుంది.
   
    కాని ఇప్పుడు ఆర్.ఓ.పి. పొజిషన్ లోకి వచ్చింది. శిశువు వెన్నెముక యుటెరస్ కుడిభాగంలో వుంది.
   
    అప్పుడప్పుడు అలా జరుగుతూ వుంటుంది.
   
    సర్ విక్స్ రెండు సెంటీమీటర్లు డైలేట్ అయింది.
   
    డాక్టర్ మైథిలి ఎంత జటిలమైన కేసులోకూడా తొణకదు. ఎటువంటి పరిస్త్య్తిలో కూడా ఆమె ఆత్మవిశ్వాసం చెదరదు.
   
    ఇలాంటి చిన్న చిన్న మార్పులు జరుగుతుండటం ఆమెకు మామూలే.
   
    ఆమెదృష్టిలో యిది చాలా సింపుల్ కేసు.
   
    ట్రయల్ లేబర్ యిచ్చి చూస్తే - సామాన్యంగా జరిగిపోతుంది.
   
    సింథోసినాన్ టూ యూనిట్స్ ఐ.వి. యిచ్చేసింది. ఫైవ్ పర్సెంట్ డెక్స్ట్రోజ్ డ్రిప్ స్టార్ట్ చేసింది.
   
    సింథోసినాన్ వల్ల యుటెరస్ కంట్రాక్ట్ అవుతూ వుండాలి.
   
    ప్రైమీ కాబట్టి కాన్పు రావటానికి చాలా టైం పడుతుంది. ఒక్కోసారి ఎన్నో గంటలు పట్టవచ్చు.
   
    శ్వేతబిందు పెయిన్స్ వచ్చినప్పుడు బాధ భరించలేకపోతుంది. వర్ణించనలవికాని ఆ బాధకు ఆమెకు శోషవచ్చినంత పనవుతుంది.

 Previous Page Next Page