"వీధిలో నిలబడి అరుస్తానూ, ఇల్లెక్కి అరుస్తానూ, అన్యాయంగా నా సొమ్ము తీసుకుంటే ఊరుకుంటానా?" అని శాంత రెచ్చిపోయి అరిచింది.
"సొమ్మా? ఏం పోయిందీ?" అడిగాడు.
"మామిడి చెట్టు పిందె పెట్టింది మొదలు ఈ పక్కింటి వాళ్ళ కళ్ళన్నీ దానిమీదే! ఈ ఏడాది ఆవకాయకి ఒక్క కాయ కొనక్కర్లేదనుకున్నానా... ఏదీ ... నేను అలా మార్కెట్ కి వెళ్ళి వచ్చి చూద్దును కదా.... ఒక్క కాయ లేకుండా కోసేశారు! ముదనష్టపు మూక! అయినా చూస్తూ ఊర్కోమంటారా? చెట్టు నాదా వాళ్ళదా? నా చెట్టుమీద చేయ్యేసే అధికారం వాళ్ళకి ఎవరిచ్చారూ? చెప్పండీ?" ఉక్రోషంగా అరిచింది శాంత.
"పక్కింటాయనతో నేను మాట్లాడ్తాను. నువ్వు లోపలికి పద!" అన్నాడు అనునయంగా భార్యతో.
"మాట్లాడ్తానంటే కాదు. బాగా బుద్ది వచ్చేట్లు చెయ్యాలి.....ఆ!" అక్కసుగా అంది శాంత. శాంత పెద్దగా చదువుకోలేదు. మానవహక్కుల గురించి ఆమెకేం తెలీదు. కాని అన్యాయం జరిగిందంటూ ఆవేదన పడ్తోంది. మరి చదువుకున్న ధరణిలాంటి ఆడపిల్ల ఎలా ఊరుకోగలదూ!
"సరే.....పద" అని ఆమె భుజం మీద చెయ్యేసి లోపలికి నడిచాడు. శాంత భర్తకోసం కాఫీ కలుపుతూ కూడా పక్కింటి వాళ్ళు అమానుష ప్రవర్తన గురించే చెప్పింది.
భార్య ధోరణి మార్చడానికి విక్రం "శాంతా ఈవేళ ఏమైందనుకున్నావూ?" ఒక ఆమాయి చాలా విచిత్రమైన కేసొకటి పట్టుకొచ్చింది" అన్నాడు.
"ఏవిటీ?" అతనికి కాఫీ కప్పు అందించింది. సోఫాలో పక్కనే కూర్చుంటూ అడిగింది.
"ఎవడో బస్ లో ఆమె ఒంటిమీద చెయ్యేసి తడిమాడట! 'నా శరీరం నా ఆస్తి కాదా? నా పర్మిషన్ లేకుండా ముట్టుకున్నవాడిని శిక్షించాలి' అంటూ ఫిర్యాదు చేసింది.
"మీరేమన్నారూ?" ఆసక్తిగా అడిగింది.
"ఇందాక ఆ అమ్మాయికి ఏదో సర్ది చెప్పి పంపించేసాను గానీ.... ఇప్పటి నీ ప్రవర్తన చూశాక ఆ అమ్మాయి ఎంత బాధపడిందో అర్ధమౌతోంది" అన్నాడు.
"నిజమేనండీ! బస్సుల్లో, అక్కడా ఈ పోకిరీ వెధవలు గొడవ ఎక్కువైపోతోందిట. తాకటం, అసహ్యమైన సైగలు చేయటం, ఇంకా అనేకమైన వెధవ చేష్టలు చేస్తారట" చివరి మాటలు గొంతు తగ్గించి చెప్పింది శాంత.
"అమ్మాయిలు ఇలాంటి విషయాలు నలుగురిలో చెప్పుకోలేక అభిమానపడి ఊరుకుంటారని వాళ్ళకీ తెలుసు! అలా కాకుండా చెప్పుతీసి తన్నేస్తే ఇంకొకసారి చెయ్యరు. వాడెవడో అంతకు ముందు ఓ కాలేజీ అమ్మాయిని కూడా అలాగే చెయ్యడం, ఆ అమ్మాయి అసహాయంగా కంటతడి పెట్టడం ఈ అమ్మాయి చూసిందట!" అన్నాడు.
"మరి ఆ కాలేజీ అమ్మాయి రాలేదా స్టేషన్ కి?" అడిగింది శాంత.
"ఆహా! భయపడి వుంటుంది".
"అఘోరించింది. దానికీ ఇష్టం ఉండే ఉంటుంది అలా వాడిచేత నిమిరించుకోవడం! ఇప్పటి ఆడపిల్లలకి సిగ్గూ శరం తక్కువ!" ఈసడింపుగా అంది శాంత.
"తప్పు! ఎవరింటి పిల్లో ఏవిటో అనవసరంగా నోరు పారేసుకోకు" అన్నాడు.
"పరువుగల ఇంటి పిల్లయితే అలా పరాయి మగాడు తన శరీరం పాముతూ ఆనందిస్తూంటే నోర్మూసుకుని ఊర్కుంటుందా? దానికీ తిమ్మిరిగా ఉంటే తప్ప!" ఎదురు ప్రశ్న వేసింది శాంత. అంతలో పక్క గదిలోంచి సన్నగా వెక్కిళ్ళు వినిపించాయి.
"ఎవరూ? నవజా?" లేచి చెల్లెలి గదిలోకి వెళ్ళాడు విక్రం.
వనజ పక్కమీద బోర్లా పడుకుని ముఖం దిండులో దాచుకుని ఏడుస్తోంది.
"వనజా ఏవైందమ్మా?" అంది శాంత.
వనజ లేచి "వదినా!" అంటూ శాంతని కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ "నువ్వు అన్నట్లు వాదు చేసే వెధవ పనులు ఎంజాయ్ చెయ్యడంవల్ల నోర్మూసుకోము. ఆ తర్వాత జరిగే రచ్చకీ, నలుగురూ చూసే చూపులకీ భయపడి నోర్మూసుకుంటాం!" అంది.
"ఏమిటమ్మా నువ్వు అనేది?" అంది శాంత.
"మీరు అనుకుంటూన్నదంతా విన్నాను. ఆ కాలేజీ అమ్మాయిని నేనే!" వెక్కుతూ అంది. ఇద్దరికీ షాక్ తగిలినట్లు అయింది.
"ఔను అన్నయ్యా వాదు ప్రతిరోజూ సిటీ బస్ లో నేను వచ్చేటప్పుడు అలాగే చేస్తుంటాడు. నేను బాధపడటం తప్ప ధైర్యంగా ఎదురు తిరగలేకపోయాను. ప్రతిరోజూ వాడి చేష్టలకి నా శరీరం, మనసూ ఎంతగా నలిగిపోయి నరకం అనుభవిస్తున్నానో తెలుసా? ఈ రోజు ఆవిడ ఈ విషయం గమనించి కేసు పెడ్తానంటే సాక్ష్యం ఇవ్వడానికి స్టేషన్ కి రావడానికి కూడా ఈ పరువే అడ్డొచ్చింది! వదిన చెట్టు కాయలు కోసారని అరిస్తే 'ఛ.... అందరూ ఏమనుకొంటారు?' అన్నావు. మరి నేను వాడితో గొడవ పడి నలుగురిలో 'వీడు నా శరీరాన్ని తడుముతున్నాడు' అని చెప్తే 'ఛ అసహ్యంగా అలా నలుగురిలో పరువు తీస్కుంటావా?' అనవని గ్యారంటీ ఏముందీ? అందుకే నాకు ధైర్యం చాలలేదు! నేను నోర్మూసుకుని ఊరుకున్నాను కాబట్టి నాకు సిగ్గు లేదంటోంది వదిన. సిగ్గు ఉండటం వలనే నోర్మూసుకున్నాను అనుకుంటూ వచ్చాను ఇన్నాళ్ళూ! ఇందులో ఏది నిజం? నువ్వైనా చెప్పు అన్నయ్యా?" అన్నగారి చేతిని పట్టుకుని ఆర్తిగా అడిగింది.
విక్రం జవాబు ఇవ్వడానికి కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు.... "వదిన చెప్పిందే నిజమమ్మా! ఆ అమ్మాయిలా ధైర్యంగా వాడికి బుద్ది చెప్పాలి. లేకపోతే నీకు ఇష్టమే అనుకుంటాడు వాడు! నీ వాదన పట్ల నీకు నిజాయితీ వుంటే ధైర్యం దానంతట అదే వచ్చేస్తుంది!"
"అన్నయ్యా!" అన్నగారిని అబ్బురంగా చూసింది వనజ.
"పిరికితనాన్ని మించిన అంగవైకల్యం లేదు! తప్పుచేసింది నువ్వు కాదు. నిన్నిలా పెంచిన నేను! కళ్ళు తుడుచుకో అవి చెమ్మగిల్లేట్లు చేసినవాడి కళ్ళు, చేసిన తప్పు తెలుసుకుని వర్షించేట్లు చేద్దాం" అంటూ టేబుల్ మీద పెట్టిన హేట్ తీసి పెట్టుకున్నాడు.
"మళ్ళీ ఎక్కడికండీ?" అంది శాంత.
ధరణి ఇచ్చిన విజిటింగ్ కార్డులో వున్న వ్యక్తి ఎడ్రెస్ చూస్తూ "రేపటి పని ఈ రోజూ, ఈవేల్టి పని ఇప్పుడూ చెయ్యాలన్నారు బాపూజీ! చేసొస్తా!" అన్నాడు.
5
ధరణి పనులన్నీ పూర్తి చేసేసి, స్నానం చేసి ఫ్రెష్ గా తయారయ్యి టి.వి. ముందు వచ్చి కూర్చుంది. ఏదో చిన్న పిల్లల ప్రోగ్రాం వస్తోంది. ధరణికి హాస్టల్ లో వున్న పిల్లలు గుర్తొచ్చారు. "ఏం చేస్తున్నారో .... అభీ బాత్ రూంకి వెళ్ళి వచ్చి పడుకున్నాడో లేదో!" అనుకుంది.
టీవీలో పిల్లలు డాన్స్ చేస్తున్నారు. ఆ హావభావాలు కానీ విన్యాసాలు కానీ చిన్నపిల్లల్లా లేవు. జడ్జీలు ఉతాహంగా చప్పట్లు కొడ్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. ద్వంద్వార్దాలతో ఉన్న పాటకి అశ్లీలమైన భంగిమలతో చేసే నృత్యం అది. వారి తల్లితండ్రులు కాబోలు ఆనందంతో తల మునకలవుతున్నారు. నెక్స్ట్ రౌండ్ లో పిల్లలు మెమరీ, ఐ.క్యూ. టెస్ట్ అంటూ జడ్జీలు ప్రశ్నలు వేశారు. కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తూ 'ఆ కాళ్ళు ఏ హీరోవీ?', 'ఈ నడుము ఎవరిదీ?' అంటూ అడిగితే పిల్లలు తడుముకోకుండా ఆ హీరో, హీరోయిన్ల పేర్లు ఠక్కున చెప్పారు. ప్రేక్షకుల్లోంచి పెద్ద పెట్టున హర్షద్వానాలు చెలరేగాయి. ఆ తర్వాత 'ఫలానా హీరోయిన్ అసలు పేరేమిటి? ఫలానా సినిమాలో హీరోయిన్ అసలు పేరేమిటి? ఫలానా సినిమాలో ఆ హీరో ఎన్నిసార్లు హీరోయిన్ అసలు పేరేమిటి? ఫలానా సినిమాలో ఆ హీరో ఎన్నిసార్లు హీరోయిన్ ని వెనకనుంచి కొట్టాడు?' లాంటి ప్రశ్నలు అడిగారు. పిల్లలు పిడుగుల్లా జవాబులిచ్చారు. అందులో ఎక్కువ మార్కులు స్కోర్ చేసినపిల్లలకి చిన్న కిరీటం పెడ్తూ ఆ జడ్జి ఆ అమ్మాయిని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఆడియన్స్ అందరూ చప్పట్లు కొట్టారు.
ధరణికి ఎందుకో అతను ముద్దు పెట్టుకున్న పద్దతి నచ్చలేదు. పిల్ల చిన్నదే, చూసేవాళ్ళకి తప్పుగా కూడా అనిపించదు. కాని ఆ పని చేసేటప్పుడు అతను చూసిన చూపు ధరణికి ఏదోగా అనిపించింది. దాదాపు పూజ వయసే ఆ పిల్లకి అనుకుంది. కూతురికి, ఆ ఫ్రైజ్ రావడం పట్ల వారి స్పందన ఏవిటని యాంకర్ ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని అడుగుతున్నాడు. "అంతా వాళ్ళ మమ్మీ క్రెడిటే. తను చిన్నప్పటినుండీ మా అమ్మాయికి సినిమాల పట్ల మంచి అభిరుచి కలగజేసింది. ఏ నటుడు ఏ సినిమాలో ఎన్ని డ్రెస్సులు మార్చాడో కూడా ఒక్కసారి సినిమా చూడగానే మా అమ్మాయి గుర్తుంచుకోగలదు...." ఆ తండ్రి పొంగిపోతూ చెప్తున్నాడు.
ధరణికి చాలా ఇరిటేటింగ్ గా అనిపించి టి.వి. ఆఫ్ చేసింది.
ఫోన్ రింగ్ అయింది.
ధరణి లిఫ్ట్ చేసి "హలో" అంది.
"ఇది ధరణిగారి రెసిడెన్సేనా" కాస్త ముద్దగా వినిపించిందో గొంతు.
"ఎస్.....మీరెవరూ?" అడిగింది ధరణి.
"నేను ఆవిడ హజ్బెండ్ ని. శ్రీధర్ అంటారులెండి" ఇంకా ముద్ద ముద్దగా పలికాడు.
ధరణి ఓసారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలి "ఏమిటీ?" అంది.
"నేను ఈ వీధి చివర ఉన్న పబ్లిక్ బూత్ నుండి మాట్లాడుతున్నాను. మన ఇల్లు ఇక్కడనుండి మూడోదో, నాలుగోదో తెలియడం లేదు. కాస్త, చెప్తావా?" అడిగాడు శ్రీధర్.
"ఏం మళ్ళీ మందెక్కువైందా?" అడిగింది ధరణి.