"ఏం సాధించినా ఇంకో రెండు మూడు ఏళ్ళలో సాధించాలి. వయసు ఎక్కువయ్యేకొద్దీ ఛాన్సులు తక్కువ" అన్నాడు.
"రోజూ ప్రాక్టీసు చేస్తారా?"
"మొదట్లో చేసేవాడిని. అసలు తెల్లవారుజామునే లేచి ఓ రెండు గంటలు పరిగెత్తి, ఎండలో, నీడలో ప్రాక్టీసు చెయ్యాలి. కానీ నేను పనిచేస్తున్నది ఒక చిన్న ప్రైవేటు కంపెనీ. రంజీ ఆటగాడికి ఆంధ్రాలో గుర్తింపు అంతగా వుండదు. నా శక్తంతా ఆ కంపెనీయే పీల్చేస్తుంది."
"కానీ మీకు మధ్యాహ్నం వెళ్ళి ప్రాక్టీసు చేసుకోవడానికి అనుమతి దొరుకుతుందనుకుంటానే-"
"అది బ్యాంకుల్లో....అక్కడైతే గోటీబిళ్ళ స్థాయిలో ఆడేవాడు కూడా క్రికెట్ పేరు చెప్పి మధ్యాహ్నమే వెళ్ళిపోవచ్చు."
"మీకు శలవు దొరుకుతుందా?"
"ఇస్తారు. కానీ జీతం నష్టంమీద..."
"మీరో రెండు సంవత్సరాలు శలవు పెట్టండి."
"పెట్టి?" అన్నాడు అతడు విస్మయంతో.
"ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ - ప్రాక్టీస్ అంతే.....చూద్దాం ఎందుకు టెస్ట్ ప్లేయర్ అవరో" దృఢంగా అంది.
"కానీ జీతం లేకపోతే...."
"మీ కభ్యంతరం లేకపోతే నేను ఉద్యోగం చేస్తాను."
అతడు కననర్పకుండా ఆమెవైపు చూశాడు. ఆమె అంది- "మన కులానికీ, నాకున్న చదువుకీ ఏదో ఒక ఉద్యోగం దొరక్కపోదు. ఒకవేళ జీతం తక్కువాయినా ఎలాగో ఒకలా సర్దుకుందాం" ఆమె కంఠంలో నిజాయితీ, భవిష్యత్తుపట్ల ఆశా ధ్వనించాయి.
"ఇది మరీ ఆకాశానికి నిచ్చెనలు వేయటం అవుతుందేమో-"
"అది పాత సామెత. కొత్తసామెత ఏమిటో తెలుసా? వెంట్రుకని కట్టి కొండని లాగటం! వస్తే కొండ కదిలివస్తుంది. పోతే వెంట్రుకపోతుంది. అంతేగా.....ఈ కాలంలో ఈ కొత్త సామెతని ప్రతివాళ్ళు గుర్తించాలి. ఏదో ఒకటి చేయకుండా మన చుట్టూ వున్న పరిస్థితుల్ని తిట్టుకుంటూ కూర్చుంటే ఎలా? మీరిక మిగతా విషయాలన్నీ మర్చిపోండి. క్రికెట్ మీదే ఏకాగ్రత నిలపండి. చాలాకాలం క్రితం ఫెస్టివల్ లో నేనొక సినిమా చూశాను. పదిమైళ్ళ పరుగుపందెం నెగ్గటంకోసం ఒక యువకుడు పడే కష్టం....సముద్రపు ఇసుకతిన్నెల మీద పరుగెత్తాడు. అలసిపోయి రొప్పుతూ ఆగకుండా చెమట తుడుచుకుంటూ...అలా పరిగెడ్తూనే వుంటాడు. అతడి పాదాలు పగిలిపోతాయి. అడుగుజాడల్లో రక్తపు మరకలు పడతాయి. చివరికి కాళ్ళు యంత్రాలవుతాయి. మీరూ అంత కష్టపడండి. చివరికి సెలెక్ట్ అవ్వలేదనుకోండి. మళ్ళీ ఉద్యోగంలో చేరిపోండి. నేను నా అట్లకాడ, వంట గిన్నెలతో తిరిగి నా వంటింట్లోకి వెళ్ళిపోతా."
చెప్తూ ఆమె సగంలో ఆపుచేసింది. అప్పటికి అతడి కళ్ళు భాష్పనిలయాలయ్యాయి. ఆమె మొహాన్ని ఒక్కఉదుటున చేతులమధ్యకు తీసుకుని కళ్ళతో ఆమె చెంపలకు తగిలేలా - ఆర్తిగా - అదేదో వెంటనే కోల్పోయే నిధిలా ఆమె గట్టిగా ముద్దుపెట్టుకున్నాడు. ఆ తరువాత ఆమె మెడవంపులో అలాగే మొహం దాచుకుని నిశ్చలంగా వుండిపోయాడు. ఆమెకూడా కదిలే ప్రయత్నం ఏమీ చేయలేదు.
మొదటిరోజు భర్తనుంచి ఆమె ఆశించేది అదే..... కోర్కెలేని ముద్దు! మల్లెపూలు, మూసిన తలుపులు, తెల్లటి పక్క..... ఎద్దులు, గాడిదలు, పక్షులు, పాములు- అన్ని జీవాలు కోర్కె కలిగినప్పుడు ఒకేలా ప్రవర్తిస్తాయి. అటువంటి కోర్కెకి ఇంత పెద్ద రంగస్థలపు హంగులు అవసరం లేదు. వాటికన్నా పెద్ద అర్హతలు మనిషికి కొన్ని వున్నాయి.
కమ్యూనికేషన్.
ఫీలింగ్.
ఆర్ద్రత.
స్పందన.
వీటన్నిటినీ వదిలేసి - తలుపులు మూయగానే అదే ఒక గొప్ప అవకాశంలా ముందుకు దూకటం ఆమెకిష్టం లేకపోయింది. ఈ చివరి ముద్దుతో తామిద్దరూ ఎంతో దగ్గిరయిన భావం ఆమెలో కలిగింది.
వాడ్డూయూసే ఆఫ్టర్ యూసే హల్లో - కిరణ్మయీ?
అవతలి వారేం మాట్లాడతారో పదినిమిషాలు విని - నేనేం మాట్లదాలనుకుంటున్నానో ఒక వాక్యం చెపుతాను.
AFTER YOU SAY HELLOW - MY ONLY ANSWER IS THAT SENTENCE.
* * *
సరిగ్గా ఈ సంభాషణ అక్కడ జరుగుతున్న సమయానికి, ఒకరోజు ముందు ఇక్కడికి వెయ్యికిలోమీటర్ల దూరంలో, క్రికెట్ క్లబ్ మేడ మీద విశాలమైన గదిలో భారతజట్టు ఎంపిక విషయమై, తీవ్రమైన చర్చ జరుగుతూంది. చందూబోర్డే తన వాదనని వినిపిస్తున్నాడు.
"కపిల్ దేవ్ ..... నిజమే ప్రపంచ చరిత్రలో అతడు ఒక మైలురాయిలా నిలబడిపోతాడు. కానీ తడి వయసు నలభై సమీపిస్తూంది. మనం ఇప్పటి నుంచే కొత్తరకాన్ని ప్రోత్సహించకపోతే, ఇంకొ నాల్గయిదు సంవత్సరాలు పోయాక కాస్త నిలబడి అడగలిగేవాళ్ళు మనకెవరూ మిగలరు."
"అందుకని?..... బాగా ఆడేవాళ్ళని తీసేద్దామా?" రాఘవరెడ్డి వెటకారంగా అన్నాడు.
క్రికెట్ సెలెక్షన్ బోర్డు అధ్యక్షుడు శ్రీరామన్ మాట్లాడకుండా ఏ సంభాషణని వింటున్నాడు.
బోర్డే అన్నాడు. "మనం ఎంతో నమ్మకం పెట్టుకున్న శివరామకృష్ణన్, అతుల్ వాసన్ లు అనుకున్న స్థాయికి చేరుకోక పోవటంవల్ల వచ్చిన చిక్కు ఇది. రవిశాస్త్రి మంచి బ్యాట్స్ మెనేకాక, ఆపదలో ఆదుకునే బౌలర్. మనం ఇప్పుడు సెలెక్ట్ చేయబోయే ఆటగాడు కూడా అలాటివాడే అయితే మంచిదని నా వుద్దేశ్యం."
రాఘవరెడ్డి కల్పించుకుని "అలాటి ఆల్ రౌండర్ ఆంద్రప్రదేశ్ జట్టులో ఒకరున్నారు. పేరు విజయకుమార్" అన్నాడు.
అప్పటివరకూ ఆసక్తిగా వింటూన్న శ్రీరామన్ అతడివైపు తీక్షణంగా చూశాడు. 'ఆంద్రప్రదేశ్' అనగానే శ్రీరామన్ లో ఏదో ఆశరేగింది. కానీ విజయకుమార్ పేరు వస్తుందనుకోలేదు. ఇక తను మాట్లాడవలసిన సమయం ఆసన్నమైనదని భావించి, ఆయన అన్నారు. "ఒక మంచి ఆల్ రౌండర్ ని ప్రస్తుత పరిస్థితుల్లో సెలెక్ట్ చేయటం అన్నది మంచి ఆలోచన. ఒకప్పుడు మనదేశం మంచి స్పిన్నర్లకు ప్రసిద్ది. మనదేశానికి వచ్చిన విదేశీ ఆటగాళ్ళు మన ఎడమచేతి బౌలర్లని సరీగ్గా ఎదుర్కోలేరని ఇంతవరకూ జరిగిన మ్యాచ్ లు తెలుపుతున్నాయి. విజయ్ కుమార్ మంచి ఆల్ రౌండరేగానీ, అతడి కన్నా బాగా బౌలింగ్ చేయగలవాడూ, పైగా ఎడమచేతితో స్పిన్ చేయగలవాడూ ఆంద్రప్రదేశ్ లోనే మరో ఆటగాడు వున్నాడు. అతడి పేరు .... రాయన్న."
రాఘవరెడ్డి మొహం వాడిపోయింది. "నేనొప్పుకోను విజయకుమార్ రికార్డుకీ రాయన్న రికార్డుకీ అసలు పోలికలేదు" అని అరిచాడు. శ్రీరామన్ నవ్వేడు. ఆ నవ్వులో, "నువ్వెందుకు ఇలా పట్టుబడుతున్నావో నాకు తెలుసులే" అన్న అర్ధం వుంది. నాలుగురోజుల క్రితమే రాఘవరెడ్డి మారుతీ కారు కొన్నాడు. విజయకుమార్ కి బాగా డబ్బుంది.
శ్రీరామన్ ఫైలు ముందుకు జరిపి అన్నాడు- "ఇదిగో ఇదీ రాయన్న రికార్డు. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతడు ముప్పై పరుగులకన్నా తక్కువ చేయలేదు. అలాగే విదేశీ మ్యాచిల్లో ప్రతి ఆటలోనూ రెండు మూడు వికెట్లకన్నా తక్కువ తీసుకోలేదు. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే, ఏదో ఒక మ్యాచిలో వందా రెండొందలు పరుగులు చేసేవారి మీదే మన దృష్టి పడుతుంది. ఏడెనిమిది వికెట్లు తీసుకుంటే తప్ప అతడి గురించి మనం ఆలోచించం అది తప్పు అని నా అభిప్రాయం. ఈ కుర్రవాడు మన నమ్మకాన్ని పాడు చెయ్యడు."
చందూబోర్డే సందిగ్ధంగా గెడ్డం గోక్కున్నాడు. అతడు కూడా రాయన్న వెస్ట్ ఇండీస్ తో ఆడుతున్నప్పుడు చూశాడు. శ్రీరామన్ చెప్పినట్టే రాయన్నలో 'నిలకడ' వుంది. కానీ దేశంలో ఎవరికీ పేరు తెలియని వ్యక్తికీ, కనీసం ఒక్కసారైనా వంద పరుగులు చేయనివాడికి జట్టులో స్థానం ఇవ్వటం విమర్శకి చోటు ఇస్తుందేమో అన్న భయం. రేపు మ్యాచ్ లో అతడు గానీ విఫలమవుతే ఇక ఎత్తిపొడుపులకు కొరత వుండదు.
"మనం ఒక పని చేద్దాం" అన్నాడు బోర్డే పరిష్కారమార్గం సూచిస్తున్నట్టు "-విదేశీజట్టు భారతదేశంతో టెస్ట్ ఆడబోయేముందు ప్రెసిడెంట్ జట్టుతో ఒక మ్యాచ్ ఆడుతుంది. అందులో రాయన్నని తీసుకుందాం. మరో చిన్న మ్యాచ్ లోకి విజయ కుమార్ ని తీసుకుందాం. ఆ ఆటల్లో వాళ్ళు చూపించే సామర్ధ్యం బట్టి మొదటి టెస్ట్ లోకి ఎవర్ని తీసుకోవాలా అన్నది ఆలోచిద్దాం."