Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 8

   

     ఈ వాదన అందరికీ నచ్చింది. రాఘవరెడ్డి కూడా ఏమీ మాట్లాడలేకపోయాడు. ఈ ఏర్పాటువల్ల "తన మనిషి" ఎన్నిక కావటానికి ఎంత ఛాన్సుందా అని ఆలోచించాడు. తన మనిషైన విజయకుమార్ గాలివాటం ఆటగాడు. విజ్రుంభిస్తే వంద పరుగులూ చేస్తాడు. రాయన్న అలాకాదు. స్టడీగా ఆడతాడు. ఒక్కమాటలో చెప్పాలంటే-
   
    అదృష్టం బావుండి ఏదైనా అద్భుతం జరిగితే, విజయకుమార్ భారతజట్టులో వుంటాడు. కానీ రాయన్నకే ఎక్కువ ఛాన్సుంది.
   
                                    *    *    *
   
    "నేను చేయగలిగినదంతా చేశాను. ఇక నిన్ను నువ్వు నిరూపించుకోవలసిన బాధ్యత నీదే-" అన్నాడు రాఘవరెడ్డి- విజయకుమార్ తో.
   
    ఇద్దరూ అదే వూళ్ళో ఒక ఖరీదైన హోటల్ రూమ్ లో కూర్చుని వున్నారు. ఆ వూళ్ళో ఫైనల్ సెలెక్షన్ జరుగుతుందని- విజయకుమార్ రాఘవరెడ్డితో కలిసి వచ్చాడు. రాఘవరెడ్డి క్రికెట్ బోర్డ్ సెలెక్షన్ మెంబరు- బాగా లంచగొండి. విజయ కుమార్ అతడిని బాగా  'తదిపాడు'. దానికి ప్రతిఫలంగా రాఘవరెడ్డి తనవంతు పని తను చేశాడు. టెస్ట్ లో స్థానం కల్పిస్తే - అతడికి దొరికేది మారుతీకారు.
       
    బేరర్ విస్కీ తీసుకొచ్చి పెట్టాడు.

    ఖరీదైన విస్కీ గ్లాసులో మెరుస్తూంది. విజయ్, రాఘవరెడ్డి ఇద్దరే వున్నారు. విజయ్ అంత సంతృప్తి చెందినట్టు కనపడటం లేదు. మొదటి మ్యాచ్ లో రాయన్న ఏ మాత్రం బాగా ఆడినా రెండోదాంట్లో కూడా అతడిని చేరుస్తారు.
   
    అదీగాక తను సీనియరు. తనతో పోల్చుకుంటే రాయన్న చాలా చిన్నవాడు. అతడుగానీ టెస్ట్ లకి ప్రవేసించేడంటే ఇక తను జీవితంలో ఆ ఆశ పూర్తిగా వదిలేసుకోవటం మంచిది. వయసు పెరుగుతోంది.
   
    ప్రతిరంగంలోనూ అది జరిగేదే! కొంతమంది స్థిరనివాస మేర్పర్చుకుని ప్రముఖులుగా చెలామణి అవుతూ వుంటారు. పక్కనుంచి తారాజువ్వలా చిన్నవాళ్ళు వాళ్ళని అధిగమించి వెళ్ళిపోతే చాలా చిరాకుచెందుతూ వుంటారు. అప్పుడు వాళ్ళుచేసే విమర్శలకీ, వెలిబుచ్చే అభిప్రాయాలకీ అర్ధమే వుండదు. అలాంటి అభిప్రాయమే వెలిబుచ్చాడు-

    "తన గురించి క్రికెట్ బోర్డులో ఇంత చర్చ జరుగుతుందని రాయన్న కలలో కూడా ఊహించి వుండడు. అయినా అప్పుడే అతడికి టెస్టేమిటి?" కసిగా అన్నాడు విజయ్.
   
    రాఘవరెడ్డి మాట్లాడలేదు. ఏం మాట్లాడాలన్నా మారుతీకారు అడ్డొస్తూంది.
   
    రాష్ట్రపు లెవల్లో పైకి తోయటం సులభం. అక్కడ ఎన్ని రాజకీయాలు నడిపినా ఫర్వాలేదు. ఎంత డబ్బు చేతులుమారినా ఎక్కువ పట్టించుకోరు. టెస్ట్ సంగతి అలాకాదు. మొత్తం దేశంలో కళ్ళన్నీ ఆ పదకొండుమంది మీదే వుంటాయి. ఎ మాత్రం అటూ ఇటూగా ఆడిన స్థానం నిలబడటం కొత్తవాళ్లకి కష్టం. అయినా మొదటిసారి ఛాన్సు రావడమే అదృష్టం. ఆ మాటే రాఘవరెడ్డితో అన్నాడు.

    "చూడు, నేను చేయగలిగినదంతా చేశాను. రేపు టెస్ట్ టీమ్ లో కూడా ప్రయత్నిస్తాను. నీ వంతు ప్రయత్నం చేయటం ఇక మిగిలింది. నువ్వే మాత్రం బాగా ఆడినా నీ తరఫున వాదించటానికి నాకు బలం వుంటుంది. అందుకని ఈ పదిరోజులూ డ్రింక్ మానేసి ఆటమీద ఏకాగ్రత నిలుపు మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఇక నేను వెళ్ళొస్తాను."
   
    చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు విజయకుమార్.
   
    అతడికి ఎవరిమీదో తెలియని కసి పేరుకుపోతోంది.
   
    అతడు సామాన్యమైన ఆటగాడు కాదు. సందీప్ పాటిల్, శ్రీకాంత్ స్థాయిలో ఆడగలడు, వాళ్ళలాగే నిలకడలేదు. ఈసారి రాకపోతే ఛాన్సు మరిరాదు అని అతడికి తెలుసు. దీనికి ఎంత డబ్బు ఖర్చయినా వెనుకాడదల్చుకోలేదు. జీవితంలో ఒక టెస్టయినా ఆడాలి. (ఒకసారి ఆడితే నా సత్తా ఏమిటో నేను చూపించగలను అని అందరిలాగే అతడూ మనసులో చాలాసార్లు అనుకున్నాడు) ఇంతవరకూ వచ్చాక అటోఇటో తేలిపోవాలి.
   
    రాయన్న ఆటగురించి తనకి బాగా తెలుసు. ఇద్దరూ ఆంధ్రాతరపు నుంచే ఆడేవారు.
   
    రాయన్నకన్నా తనకే ఎక్కువ అభిమానులున్నారు. మ్యాచ్ పూర్తయ్యాక బయటకొస్తుంటే తన దగ్గిరే ఆటోగ్రాఫుల కోసం ఎక్కువ మంది గుడిగూడతారు. పేపర్లో కూడా తన గురించే ఎక్కువ వ్రాస్తారు.
   
    కానీ ఇదంతా తను బాగా ఆడి సెంచరీ చేసినప్పుడు. ఒకసారి బాగా ఆడితే, నాలుగుసార్లు విఫలమవుతూ వుంటాడతను. అభిమానులకివన్నీ తెలియవు. ఒకసారి బాగా ఆడగానే వరదలా చుట్టుముడుతుంటారు. పాత సంగతులు మర్చిపోతూ వుంటారు.
   
    రాయన్న ఆట అలా వుండదు. శిల్పి ప్రతి బొమ్మనీ ఎంతో ఏకాగ్రతతో చెక్కినట్లు ప్రతి ఇన్నింగ్సూ జాగ్రత్తగా ఆడతాడు. సునీల్ చౌదరిలాంటి ప్రతిభావంతులు అతడి నైపుణ్యాన్ని అందుకే సులభంగా పట్టుకోగలుగుతారు. తనకి ప్రత్యర్ధి అవుతే అవ్వొచ్చుగాక, అతడి విషయంలో ఇది మాత్రం నిజం!
   
    అతడి కీమధ్యే పెళ్ళి అయిందనో, అవుతుందనో వార్త విన్నాడు. ఆ సంతోషంలో వుండి వుంటాడు. ఇప్పుడీ సెలక్షన్ సంగతి కూడా తెలిసిందంటే ఇక .....
   
    రాఘవరెడ్డి అన్నట్టు ఏదో అద్భుతం జరుగుతే తప్ప లాభంలేదు.
   
    అవును ఏదో అద్భుతం జరగాలి!
   
    దానికి దేవుడే సాయం చేయాలి.
   
    విజయ్ మొట్టమొదటిసారి దేవుడిని ప్రార్ధించాడు.

    23. 52. 37 Hrs.
   
    "నిజమే! మరింత కృషి చెయ్యాలి. ఇప్పుడు చేస్తున్నది సరిపోదు" అన్నాడు రాయన్న. ఆమె మాట్లాడలేదు.
   
    "ఇక ఈ టాపిక్ వదిలేద్దాం! టైమ్ వృధా" అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. అతడి పెదవులు ఆమె చెంపనుంచి మెడమీదకు పాకాయి.
   
    "ఎందుకు మీలో మీరే నవ్వుకుంటున్నారు?" మెడ వంపునుంచి దూరంగా జరిగాక అతడు నవ్వుకోవడం చూసి అడిగింది.
   
    "ఏదో గుర్తొచ్చి."
   
    "ఏమిటి?"
   
    "ఒకబ్బాయెవడో తన గర్ల్ ఫ్రెండ్ ని గట్టిగా ముద్దుపెట్టుకుని ఆ తదాత్మ్యతలో కొంచెంసేపు కళ్ళు మూసుకుని తెరిచి, ఆ అమ్మాయివైపు ఆప్యాయంగా చూస్తూ "....నిన్ను ముద్దుపెట్టుకున్న మొదటి మొగవాడిని నేనేనా" అని అడిగాడట. ఆ అమ్మాయి అవునని తలూపి, అతడిని పరీక్షగా మళ్ళీ మరొకసారి చూసి, 'పోలికలు అలాగే కనపడుతున్నాయి' అందట. అది గుర్తొచ్చి నవ్వొచ్చింది...."

    కిరణ్మయికి సర్రున కోపం వచ్చింది. "ఆ జోక్ ఇప్పుడు గుర్తుకు రావడం ఏమిటి? నా కెవరైనా బోయ్ ఫ్రెండ్స్ వున్నారనుకుంటున్నారా?" అంది.
   
    రాయన్న తెల్లమొహం వేసి, "నా ఉద్దేశ్యం అదికాదు" అన్నాడు.
   
    "ఏమిటి కాదు. ఇప్పుడా జోకు గుర్తుకు రావటం ఏమిటి?"
   
    "శోభనం గదిలో ప్లేబోయ్ జోక్ గుర్తురాక భగవద్గీత గుర్తొస్తుందా?"

    "మీరేమీ చెప్పకండి. నేను మాట్లాడను."
   
    అతడు చాలాసేపు బ్రతిమాలాడాడు. ఆమె మాట్లాడలేదు. అతడికి ఏం చెయ్యాలో తోచలేదు.
   
    చివరికి వప్పుకుంటున్నట్టు అన్నాడు. "నీ గురించి కాది కిరణ్మయీ! ఇది నాజీవితంలో జరిగిన సంఘటనే! నేను ముద్దు పెట్టుకున్న అపురూపలక్ష్మి అలాగే అంది."
   
    ఆమె చప్పున మౌనం సడలించి, "అపురూపలక్ష్మి ఎవరు?" అంది.
   
    "హమ్మయ్య మాట్లాడావు కదా."
   
    "అపురూపలక్ష్మెవరు? ముందది చెప్పండి."

    అతడు లేచి కూర్చుని, "ఇంతవరకూ వచ్చాక ఇక చెప్పేస్తాను. నా జీవితంలో అది అత్యంత విషాదకరమైన సంఘటన. ఎంత మరిచిపోదామనుకున్నా మరిచిపోలేను. లేడీస్ హాస్టల్ రూమ్ నెంబరు 13లో అపురూపలక్ష్మి అనే అమ్మాయి ఉండేది. ఆ రోజు రాత్రి...... ఉహు..... వద్దు" అని మౌనం వహించాడు.
   
    "ఏం? ఎందుకొద్దు? చెప్పండి ఏం జరిగిందో" గద్దించినట్టుగా అడిగింది.
   
    అతడు ఆ రోజుని గుర్తుకు తెచ్చుకున్నవాడిలా కొంచెంసేపు మౌనంగా వుండి "ఆ రాత్రి కూడా ఇలాగే టైమ్ పదిన్నర పదకొండు మధ్య అయివుంటుంది. ఆ రోజు రాత్రి బాగా వర్షం కురుస్తోంది. అపురూపలక్ష్మితో పదమూడో నెంబరు గదిలో వున్నాను. ఉన్నట్టుండి తలుపుకొట్టిన శబ్దం వినిపించింది. "అపురూపలక్ష్మీ తలుపుతియ్యి" అని బయట్నుంచి వార్డెన్ కంఠం వినిపించింది. కంగారే కంగారు- నాకేం చెయ్యాలో తోచలేదు. వంటిమీద బట్టలస్సల్లేవు. దాక్కోవటానికి గదిలో బీరువాలు కూడా లేవు...." అంటూ ఓరగా భార్యవైపు చూశాడు.
   
    క్రమక్రమంగా ఎర్రబడుతూన్న భార్య మొహంకేసి చూస్తూ కొనసాగించాడు. "బైట తలుపు చప్పుడు ఎక్కువైంది. బట్టలు వేసుకోవటానిక్కూడా టైమ్ లేదు. చటుక్కున కిటికీలోంచి అవతలికి దూకి గోడ పట్టుకుని గాలిలో వ్రేలాడసాగాను. వార్డెన్ వెళ్ళిపోయాక తిరిగి గదిలోకి వెళ్దామని నా వుద్దేశ్యం! కానీ వార్డెను అపురూపలక్ష్మిని ఏదో పనుందని తీసుకెళ్ళిపోయింది. వర్షం వస్తూందని కిటికీ కూడా వేసింది. ఇక చూసు బయట నేనేమో గాలిలో వేలాడుతూ - హోరున వర్షం..... బట్టలు లోపలుండిపోయాయి."

 Previous Page Next Page