Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 6

   

    కిరణ్మయి నవ్వేసింది. అతడు లైటార్పాడు. బెడ్ లైట్ కాంతి ఆ గదిలో మందంగా పరుచుకుంది. నిశ్శబ్దపు కెరటం మసక వెలుతుర్ని సుతారంగా స్పృశించి వెళ్ళిపోయిన వేళ-
   
    "ఆదివారం పూట దూరదర్శన్ చూస్తావా?" పక్కన వత్తిగిల్లుతూ అడిగాడు.
   
    సంబంధంలేని ఈ ప్రసక్తి అర్ధంకాక, "అప్పుడప్పుడు చూస్తాను. ఏం?" అని అడిగింది.
   
    "ఇక This part of the programme is sponsered by-"
   
    "చాల్చాలు ఇంకేమీ చెప్పొద్దు. నాకు తెలుసు."
   
    "ఏది తెలుసు నీకు? ఏమీ తెలీదు ఆడమ్ అండ్ ఈవ్ లు-" అంటూ చెప్పబోయాడు.
   
    "ఇప్పుడు వాళ్ళగురించేమీ చెప్పక్కర్లేదు. నాకు తెలుసు."
   
    "చూశావా మనసులో దురుద్దేశ్యం వుంటే అన్నీ అలాంటి ఆలోచనలే వస్తాయి. నిజానికి నేను చెప్దామనుకున్నది బుక్ కీపింగ్ గురించి."
   
    ఆమె అనుమానంగా, "బుక్ కీపింగ్ కీ ఆడమ్ ఈవ్ లకీ సంబంధం ఏమిటి' అంది.
   
    "లూజ్ లీఫ్ సిస్టమ్ కనుక్కున్నది వాళ్ళేగా-ఇలా."
   
    ఆమె చప్పున బ్లాంకెట్ కప్పుకుంటూ "మైగాడ్ - మాటల్లో పెట్టి ఏం చేస్తున్నారు మీరు" అని గద్దించింది.
   
    "ఎస్కవేషన్- కపిల్ దేవ్ కి ద్రోహం చేయకు. అతనేమన్నాడో తెలుసా?"
   
    "ఏమన్నాడు?"

    "A girls geography reveals her History అన్నాడు. చరిత్ర శోధించే వాళ్ళని అడ్డుకునేవాళ్ళు ఎన్టీ రామారావు గవర్నమెంటులో ప్రభుత్వాధికారులుగా పుట్టి, నానా బాధలు అనుభవిస్తారట."
   
    "కపిల్ దేవ్ చచ్చినా అలా అని వుండడు. ఇదికూడా ప్లేబోయ్ జోక్ అయివుంటుంది."
   
    "చెప్పినా నమ్మకపోతే నీ ఖర్మ..."
   
    "మీరింకేం చెప్పనవసరంలేదు."
   
    "ఇలా చెప్పటం నాకిష్టమనుకున్నావా ఏమిటి? ఇదంతా మా సదాశివశాస్త్రి సలహా."
   
    "అతనెవడు?"
   
    "నా స్నేహితుడు నీలాగే కాస్త సైకాలజీ చదివాడు. చిన్న పిల్లలకి చందమామ కథలు చెపుతూ అమ్మ అన్నం తినిపించినట్టు, అమ్మాయిలకు కబుర్లు చెప్తూ విస్తరి సిద్దం చేయాల్ట."
   
    "నేను చదివిన అయిదు సంవత్సరాల సైకాలజీలోనూ ఇటువంటిదేమీ చెప్పినట్టులేదే."
   
    "అదేమరి మీకూ మాకూ తేడా మీరంతా ఏదో గుడ్డెద్దు చేలోపడ్డట్టు చదివేస్తారే కానీ లోతులకి వెళ్ళి శోధించరు."
   
    "ఒహో! ఇంతకీ మీ సదాశివశాస్త్రి యే యూనివర్శిటీ?"
   
    రాయన్న గంభీరంగా, "సర్వజనీన శాస్త్రాన్ని చదవటానికి యే యూనివర్సిటీలూ అక్కర్లేదు కిరణ్మయీ విశ్వవ్యాప్తమయిన ప్రకృతే చాలు కోయిలకు పాటెవరు నేర్పారు? కొట్టబోయే క్రికెట్ బ్యాట్ కు తిరగబోయేది స్పిన్ అని ఎవరు చెప్పారు? దర్భరాసింగ్ చాచిక్కొట్టకపోయి వుంటే మా సదాశివశాస్త్రి ఇంకా ఇలాంటి జీవిత సత్యాల్ని చాలా చెప్పేవాడు."
   
    "దర్భరాసింగా? మళ్ళీ వాడెవడు?"
   
    "నాలాగే పెళ్ళికిముందు మా శాస్త్రి సలహా పొందినవాడు కానీ పాపం ఆ సలహా సరిగ్గా ఫలించలేదు."
   
    కిరణ్మయి ఆసక్తిగా, "ఇంతకీ మీ వాడిచ్చిన సలహా ఏమిటి?" అని అడిగింది.
   
    రాయన్న గాభరాగా, "వద్దు కిరణ్మయీ, అలాంటివి తెలుసుకోవాలన్న ఆలోచన కలలోకి కూడా రానివ్వకు" అన్నాడు.
   
    "ఇంతకీ ఏమిటది?" రెట్టించింది. ఆమె ఉత్సుకత ఎక్కువ అవగా, మామూలు విషయమైతే అంత ఆసక్తి చూపించకపోవునేమో కానీ, సైకాలజీ ఆధారంగా భార్యాభర్త దగ్గిరయ్యే విధానం ఏమిటబ్బా అని ఆమెలో కుతూహలం పెరిగింది.
   
    "చెప్పక తప్పదా?"
   
    "ఊహూ?"
   
    "సరే అయితే చెపుతాను, విను. 'ఎప్పుడైతే నువ్వు ముద్దుపెట్టుకుంటావని నీ భార్య అసలు కలలో కూడా వూహించదో, హఠాత్తుగా అప్పుడామెని ముద్దుపెట్టుకో. వద్దన్నా వినకు, గింజుకున్నా వదలకు. మనసులో ఇష్టం వుండే ఆడాళ్ళు ఇలా బింకం నటిస్తారని తెలుసుకో ఒకటి మాత్రం గుర్తుంచుకో ఇలాంటి థ్రిల్స్ వల్లే భార్యలు భర్తలకి దగ్గిరవుతారు" అని సలహా యిచ్చాడు. పెళ్ళయిన మొదటిరోజు నుంచి మా దర్భరాసింగ్ ఈ సలహా పాటించాడు."
   
    "ఇదేమీ మరీ చావచితక్కొట్టాల్సినంత చెడ్డ సలహా కాదే."
   
    "కాకపోవచ్చు. కానీ మా వాడికి "ప్పు" అనే అక్షరం "క్క" లా వినిపించింది. ఉదాహరణకి -"ఆగాడు.
   
    "ఏమిటీ?"
   
    "చెప్పాగా, ఒకటి మరోలా వినిపించిందని ఉదాహరణకి- 'ఎప్పుడయితే' అన్నది. 'ఎక్కడయితే' అన్నట్టు వినిపించిందనుకో."
   
    కిరణ్మయికి ఒక క్షణం అర్ధంకాలేదు. అతడు చెప్పినట్టు అన్వయించి చూసుకుంది. అర్ధం అవగ్నే ఆమె మొహం నవ్వుతో ఎర్రబడింది. ఆ నవ్వు దాచుకోవడానికి ఆమె పక్కకి తిరిగి తలదిండులో మొహం దాచుకుని నవ్వసాగింది.
   
    "ప్చ్.... పెళ్ళయిన మూన్నెళ్లకే వాళ్ళావిడ విడాకులు ఇచ్చింది. ఆ తరువాతెప్పుడో శాస్త్రి వాడిని కలిసి, తనులు తిన్నాడు. ఆ తరువాత సలహాలివ్వటం మానేశాడనుకో- కాబట్టి ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే మాటల్లో పెట్టి మనపని పూర్తి చేసుకోవాలన్నమాట. బ్లాంకెట్ పైన లేదన్న విషయం కూడా తెలియనంతగా నవ్వించాలి...."
   
    ఆమె తనవైపు చూసుకుని కెవ్వున అరిచింది.
   
    23.50.10 Hrs.
   
    "ఈ గంటన్నరలోనూ ఇద్దరం దాదాపు ఆరుసార్లు కెవ్వున అరిచి వుంటాం. బయట వినేవాళ్ళకు అది అంత శుభప్రదంకాదు" అన్నాడు.
   
    "అందుకే పిచ్చి జోకులు వేయకుండా మామూలుగా మాట్లాడండి."
   
    "మామూలుగా అంటే?"
   
    "చూడండి. మీరన్నట్టు మనం కలుసుకుని పూర్తిగా రెండు గంటలు కాలేదు. ఇంకా బోలెడు జీవితం ముందుంది. తొందరెందుకు? ఏవైనా మామూలు కబుర్లు చెప్పండి."
   
    "అదే అడుగుతున్నాను ఏవైనా అంటే?"
   
    "మీ గురించి చెప్పండి."
   
    "సైకాలజీ స్టూడెంట్ వి. ఈపాటికే అంతా తెలుసుకుని వుంటావు. ప్రతీదాన్నీ తేలిగ్గా తీసుకునే మనిషివి అంతకన్నా ఏం చెప్పను?"
   
    "అదిగో అలాగే దగ్గిరకు రావొద్దు. మంచి మంచి విషయాలేమైనా చెప్పండి. మీ అమ్మగారి గురించి, నాన్నగారి గురించీ- మనం ఎక్కడుందాం- మన భవిష్యత్ ప్లాన్స్ ఏమిటి? ఇలాంటివి ఎన్నో మాట్లాడుకోవచ్చు ఒకర్నొకరు అర్ధం చేసుకోవచ్చు. అవునా?"
   
    "హతవిధీ- మొదటిరాత్రి అవన్నీనా."
   
    "అలా అర్ధం చేసుకుంటే తరువాత బావుంటుంది."
   
    "-'తరువాత' అంటే ఈ రోజేగా" అనుమానంగా అడిగాడు.
   
    "ఈ రోజే."
   
    "నీళ్ళపంపు వచ్చేలోపులో."
   
    ఆమె నవ్వాపుకుని- "కనీసం ఆగిపోయేలోపులో" అంది.
   
    "సరే నేను నీక్కావాల్సినట్లే అన్నీ మాట్లాడతాను. కానీ ఓ షరతు. ఇదంతా అయిపోయాక నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో, ఒక సైకాలజి స్టూడెంటుగా నీ అభిప్రాయమేమిటో చెప్పాలి. కేవలం మెచ్చుకోలు కోసం కాకుండా సిన్సియర్ గా చెప్పాలి."
   
    ఆమె ఇబ్బందిగా చూసి "మొదటి రెండు గంటల్లో ఏం తెలుస్తుంది?"
   
    "మొదటి ఇంప్రెషన్ బెస్ట్ అంటాను."
   
    "జీవితాంతం కలిసి వుండబోయే భార్యాభర్తల్లో కాదు."
   
    "అందుకే - ఒక భార్యలా కాకుండా ఒక సైకాలజీ స్టూడెంట్ గా చెప్పమన్నాను. నీ తెలివితేటలు, అంచనాలు ఎంత కరెక్టవుతాయో చూద్దాం" నవ్వేడు.
   
    "సరే- చెప్తాను. నాకు సాధ్యమైనంతలో."
   
    ఆమె వప్పుకున్నా అతడు తన భవిష్యత్ ప్రణాళిక వివరించాడు. భారతదేశం తరపున క్రికెట్ టీమ్ లో ఆడటానికి చేస్తున్న కృషి అక్కడ జరిగే రాజకీయాలు అన్నీ వివరంగా చెప్పాడు. ఆమె శ్రద్దగా విన్నది. ఇతడు పేరే రాయన్న. డిఫరెంట్ .... ఒక రంగంలో పైకి రావాలంటే, పైకి ఎంత మామూలుగా కనిపించినా, తప్పకుండా కృషిచేయాలి. మామూలుగా కృషికాదు. జాతీయ స్థాయిలో పైకి రావటం అంటే అంత సులభం కాదు. అందులోనూ అతడు స్పిన్నర్. మంచి బ్యాట్స్ మెన్నే. కానీ లెగ్ స్పిన్ కి చాలా పోటీ వుంది. అసలు స్పిన్నర్ అంటేనే కష్టం. రవిశాస్త్రి, మనీందర్ సింగ్ కాస్త వెనుకబడినా తిరిగి తప్పక వెనక్కి రాగలిగే శివరామకృష్ణన్, శివలాల్ యాదవ్- ఇంతమందిని అధిగమించి పైకి రావటం... అందులోనూ ఆంధ్ర జట్టులో ఆడుతూ...

 Previous Page Next Page