భూషణం మున్సబును చూసి నవ్వేడు. మున్సబు కరణాన్ని చూసి నవ్వలేదు ప్రిస్టేజికి భంగమని.
రచ్చబండమీద నుంచి అందరూ లేచేరు. అప్పటికే అన్యాయం జరిగినోళ్ళు నాలుగొందల గజాలు వెళ్ళిపోయారు.
న్యాయం చెప్పినవాళ్ళు ఇళ్ళవైపు సాగిపోతున్నారు.
అప్పుడో శబ్దం వినిపించింది. ఫెళా ఫెళా విరిగిన శబ్దం.
అటు వాళ్ళూ, ఇటు వాళ్ళూ వెనుదిరిగి చూసేరు.
అప్పటివరకూ పచ్చగా కళకళలాడిన ఆ చెట్టు యెవరో తోసినట్టు పైకి లేచి పెద్ద శబ్దంతో పక్కకి ఒరిగిపోయింది.
* * *
ఇరాని హోటల్లో కూర్చుని వున్నాడు రమణ. జేబులో అర్ధరూపాయుంది. 'టీ' కి ఆర్డరిచ్చాడు. హోటల్లో ఎవరూ లేరు. ఎవరో పొట్లంలో భోజనం చేస్తున్నారు.
భరించలేనంత నిస్సహాయత!! ఈ ఉద్యోగమూ రాలేదన్న భావం మనసుని పరపరా కోస్తూంది..... చదివిన చదువు వ్యర్ధం అయిపోతూంది......ఇంట్లో తండ్రికి బాగాలేదు.....అన్నయ్య జీతం ఇంట్లో రెండు పూటలా తిండికే సరిపోవటం లేదు. ఎలా? అవునెలా?
ప్రశ్న చాలా చిన్నది.
సమాధానం విశ్వమంత పెద్దది.
చెంపమీద ఏదో జారినట్టు అనిపిస్తే తడిమేడు. కన్నీటి చుక్క అంత బాధలోనూ నవ్వొచ్చింది.
"ఏమిటి-? ఏడుస్తూ నవ్వుకొంటున్నావ్?"
హఠాత్తుగా వినిపించిన ప్రశ్నకి తలెత్తి చూసేడు. ఒక ముసలివాడు......యాభై అయిదేళ్ళవాడు ...... చిరుగడ్డం.....తెల్లబడిన బట్టతల..... ఒక లాంగ్ కోటు..... పైజామాలాటి లూజుప్యాంటూ....తైల సంస్కారం లేని జుట్టు.....కొద్దిగా మాసిన గడ్డం....పీక్కుపోయిన దవడలు......
"వాతావరణంలో ఆక్సిజనుంది. వంట్లో హైడ్రోజనుంది. ఆ రెండూ కలిస్తే కంట్లో నీరుంది. బైదిబై ఒక టీ కొట్టించు" అని చొరవగా ఒక కుర్చీలో కూర్చున్నాడు.
రమణికి నవ్వొచ్చింది. తన దగ్గరున్నదే అర్ధరూపాయి. వదిన్ని అడుక్కొన్నది. అడుక్కొన్న వాడిదగ్గర అడుక్కొనే వాడు.
"కూర్చో" అన్నాడు రమణ.
"కూర్చునే వున్నాను" అన్నాడు. "బైదిబై నీ వయసెంత? ఇరవై అయిదు వుండవూ? నాకు డెబ్బై అయిదు. అఫ్ కోర్స్.......అంతలా కనబడననుకో. కానీ నీకన్నా మూడు రెట్లు ఎక్కువ. అందుకని మూడక్షరాలతో పిలువు. 'కూర్చోండి' అను. వెధవ సెల్ఫ్ రెస్పెక్కొకటి ఏడిచింది కదా?"
"సారీ!" అన్నాడు రమణ నొచ్చుకుంటూ, "ఏదో పరధ్యానంలో వున్నాను."
"నీ సమస్య ఏదైనా లవ్వెఫైరా- లేక ఉద్యోగమా! యూత్ ని బాధిస్తున్నవి అవి రెండే."
"ఉద్యోగం" అన్నాడు రమణ "ఇప్పుడే ఇంటర్వ్యూనుంచి వస్తున్నాను."
"ఏమడిగేరు?"
అడిగిన ప్రశ్నలూ..... తను చెప్పిన సమాధానాలు వివరించేడు. ఒక్కొక్కటీ చెబ్తూంటే అతడు ఆసక్తిగా ముందుకు వంగి విన్నాడు. అంతా విని. "నువ్వు అస్ట్రానమీ స్టూడెంటువా?" అని అడిగేడు.
కాదన్నాడు రమణ.
"మరింత కరెక్టుగా సమాధానం ఎలా చెప్పేవ్?"
"ఈ కాలంలో ఇంటర్వ్యూల కెళ్ళాలంటే ఎన్ సైక్లోపీడియా అంతా కంఠతా వచ్చి వుండాలి" నిర్లిప్తంగా అన్నాడు రమణ.
ఇంతలో టీ వచ్చింది. ఇద్దరూ టీ తాగి బయటికొచ్చేరు.
"నువ్వు నా దగ్గరెందుకు ఉద్యోగం చెయ్యకూడదూ? బైదిబై ఒక చార్మినార్ సిగరెట్టుకి డబ్బులుంటే చూడు. టీ తాగింతర్వాత వెధవది సిగరెట్ ఉండకపోతే ప్రాణం నిలబడదు. అన్నట్టు.... ఏం చెబ్తున్నానూ.....ఉద్యోగం గురించి కదూ ఎస్ నువ్వు నా దగ్గర ఉద్యోగం ఎందుకు చెయ్యకూడదూ?"
అకస్మాత్తుగా అతడి మెదడు గురించి అనుమానం వచ్చింది రమణికి దాన్ని ప్రదర్సించకుండా "మీరేం చేస్తూ వుంటారు!" అని అడిగేడు.
"ఆకాశంకేసి చూస్తూ వుంటా."
"నేనేం చెయ్యాలి?" నవ్వాపుకొంటూ అడిగేడు.
"నాతోపాటూ నువ్వు చూడాలి"
"జీతం?"
"ఎంతకావాలి గ్రాడ్యుయేటూ?"
"వెయ్యి రూపాయలు" ఎంత ఆపుకుందామన్నా నవ్వాగటం లేదు.
"అంత ఇచ్చుకోలేను. నాలుగొందలు యిస్తాను. ఒకచోట నుంచి రావల్సిన డబ్బు వుంది. అది రాగానే వెయ్యి చేస్తాను."
"ఎక్కడ్నుంచి రావాలి?"
"స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స్ నుంచి, ఆల్ ఫ్రైడ్. బి. నోబుల్ అనే ఆయన పంపాలి."
"ఎంత?"
"లక్ష పౌండ్లు. సుమారుగా ఇరవై లక్షల రూపాయలు."
"నోబుల్ ప్రైజా?"