"ఊఁ" అన్నాడు రాజేంద్ర.
"యౌవనంలో ఉన్న మగాడికి చుట్టూ వున్న ప్రపంచం అరణ్యం వంటిది. ఆ అరణ్యంలో తిరుగాడే లేడిపిల్లలు కన్నెపిల్లలు. వాళ్ళను మనం వేటాడాలి. మనలో యౌవనమున్నంతకాలం వేటాడుతూనే వుండాలి"
"ఊఁ" అన్నాడు రాజేంద్ర.
"ఊఁ అంటావేమిటి?" విసుగ్గా అన్నాడు రవీంద్ర.
"ఇదేమంత అల్లాటప్పా వ్యవహారమనుకున్నావా?"
"ఎందుక్కాదు?"
"మనం అడవిలో లేము. సభ్యసమాజంలో వున్నాం. ఆడపిల్లల్ని అడవిలో వేటాడినట్టు వేటాడ్డం అంత సులభం కాదు...."
"అయితే మనకీ బాధంతా ఎందుకు?"
"అడ్వెంచర్....అదే మజా!"
"ఆడపిల్లల్ని వేటాడ్డం ఓ అడ్వెంచర్! ఏం మనిషివిరా నువ్వు?" అన్నాడు రాజేంద్ర.
"అయితే నీ పాత అనుభవాలు మర్చిపోయావా?"
అప్రయత్నంగా చెంపలేసుకున్నాడు రాజేంద్ర.
నడిరోడ్డు మీద పదిమందిలోనూ ఉఫ్ మని ఊదితే ఎగిరిపోయేలాంటి ఆడపిల్ల కండలు తిరిగిన వస్తాదులాంటి రాజేంద్రని తన ఎడమకాలి చెప్పుతో ఆ చెంపా, ఈ చెంపా వాయించింది.
"ఇంకా గుర్తుచేసుకో" అన్నాడు రవీంద్ర.
"వద్దులే అర్ధమైపోయింది" అన్నాడు రాజేంద్ర.
"బలంలో భీముడులాంటి వాడివి. కానీ ఏం లాభం? ఈ సభ్య సమాజంలో కన్నెపిల్ల సివంగి కూన. మగాడు ఏనుగే అయినా కన్నెపిల్ల వాడి కుంభస్థలాన్ని కొట్టగల సమర్ధురాలు......అందుకే వేట గురించి చెబుతున్నాను...."
"త్వరగా చెప్పు...."
"మనిషి సర్కస్ కెందుకు వెడతాడు? మనిషిని శాసించగల కౄర జంతువుల్ని మనిషే శాసించడం చూడ్డానికి. సర్కస్ కంటే తేలికయిన వ్యాపారాలెన్నో ఉన్నాయి. ఐనా కొందరు సర్కస్ నెందుకు నడుపుతున్నారు? అదీ అడ్వెంచరస్ స్పిరిట్...."
"నీ ఉపోద్ఘాతం ఎక్కువయిపోయింది...."
"ఉపోద్ఘాతం గునపంలాంటిది. కొందరి బుఱ్ఱలో మట్టిని తవ్వడానికది ఎంతగానో అవసరం"
అంతవరకూ యీ సంభాషణ మౌనంగా వింటున్న దేవేంద్ర అప్పుడు కలగజేసుకుని....
"బుర్రలో మట్టిలేని నాబోటివాళ్ళకి ఉపోద్ఘాతం గునపపు పోట్లే కదా!" అంటూ నవ్వాడు.
"అయితే పాయింటుకొచ్చేస్తున్నా. మన వేటలో దేవేంద్ర ఎర. ఎందుకంటే వాడు బలహీనంగా, అమాయకంగా, అందంగా కనిపిస్తాడు"
"నాకేమీ అర్ధం కాలేదు. కానీ పాపం మన దేవేంద్రను ఎరగా చేయడం నాకిష్టం లేదు...."
"వెర్రినాయనా! ఎరకావడం నా అదృష్టం. అంతా అర్ధమైపోయేలా నేను తర్వాత చెబుతాను కానీ.... మన వేట స్పాట్ ఎక్కడ?"
"ఇలాంటి వేటలకి కాలేజీలే అనువు. అందులోనూ రాణీ గంభీరా కాలేజీ అయితే బెస్టు. అక్కడ యీ వూరికి బెస్ట్ లేడీసుంటారు"
"ఓకే బాస్....డన్...." అన్నాడు దేవేంద్ర.
6
ఎందుకో ఉలిక్కిపడి కళ్ళు తెరిచిన గౌతమ్ రెప్పవేయలేకపోయాడు.
అతడి ఎదుట సీత.
ఆమె యీ రోజు రవిక ముడి వేసుకోవటం లేదు. రవిక వేసుకుంటోంది.
"సీతా! ఏమిటిది?" అందామనుకున్నాడతడు.
మాట రాలేదు.
సీత తన పని పూర్తి చేసుకొని అతన్ని చూసి నవ్వి దగ్గరగా వెళ్ళింది.
"రంగమ్మకు మళ్ళీ వంట్లో బాగోలేదా?" అన్నాడు గౌతమ్.
"దానికేం నిక్షేపంగా వుంది. ఈ రోజు నాకిక్కడకు రావాలనిపించి వచ్చాను. నిజం చెప్పాలంటే నాకు మీ మీద జాలిగా వుంది. అంతవరకూ వచ్చేక ఎవ్వరూ నన్నొదిలి పెట్టలేదు. పాపం ఒక్కసారయినా మీ మనసు తీర్చాలనిపించింది...."
"పది రూపాయలకోసం...." అన్నాడతడు.
"పోనీ డబ్బివ్వద్దులెండి...."
"నేను నమ్మను. నువ్వు డబ్బు మనిషివి. నువ్వేదో చాలా పైఎత్తున వున్నావ్...."
సీత కళ్ళు ఎర్రబడ్డాయి. నేను వ్యభిచారిణిని కాదు. నా ఇష్టమయిన చోటే వప్పుకుంటాను. బాబూ! సమాజంలో నా అంతస్థు తక్కువ అందుకని అంతా డబ్బిచ్చి నన్ను కొనాలనుకుంటారు. ఆ తర్వాత డబ్బుకే నేను లొంగుతాననుకుంటారు. మీరు నన్ను పెళ్ళి గురించి అడిగిన మొదటి అంతస్థు మనిషి. నిజంగా అన్నారో, మోసం చేయాలనుకున్నారో నాకు తెలియదు. మీ మాట నాకు నచ్చింది. ఆ మాటన్నందుకయినా మీ దగ్గరకు రావాలనిపించి వచ్చాను"
"అలా కూర్చో" అన్నాడు గౌతమ్.
"సీత నేలమీద కూర్చుంది.
"సీతా! వారంరోజులుగా నేనాలోచిస్తున్నాను. ఈ సభ్య సమాజపు విలువల్లో నాకేదో తేడా కనుబడుతోంది. ఎవ్వరూ చేయనిది చేసి విప్లవం తేవాలనుకుంటున్నాను. ఇంతవరకూ నువ్వెలాంటి దానివాయినా నాకు ఫర్వాలేదు. ఇక ముందు నీతిగా వుంటానని మాటివ్వు. నిన్ను పెళ్ళిచేసుకుంటాను" అన్నాడతను.
సీత అతడివంక అబ్బురంగా చూసింది.
గౌతమ్ కూడా ఆమెనే చేస్తున్నాడు.
వారంరోజుల్లో గౌతమ్ సీత గురించి నిజంగానే చాలా ఆలోచించాడు.
సీత పనిమనిషే కావచ్చు కానీ చూడ్డానికలా వుండదు. సినిమాల్లో హీరోయిన్ పనిమనిషిలా వుంటుంది. మంచి బట్టలు వేసుకుంటే పెద్దింటి మనిషిలాగే వుంటుంది. నవల్లు చదవగలదు. ఉచ్ఛారణ బాగుంటుంది. ప్రవర్తనలో తను కోరే సంస్కారం తక్కువ. క్రమంగా అదీ అలవడుతుందని అతడి నమ్మకం.
కానీ ఈ పెళ్ళి అతన్ని తల్లిదండ్రులనుంచి, బంధువులనుంచి దూరం చేస్తుంది. సమాజంలో అతడి అంతస్థు పడిపోతుంది. అతడి సంతానం ఎన్నో ఒడిదుడుకులు తట్టుకోవాల్సి వుంటుంది"
ఇవన్నీ అతడు భరించాలనుకున్నాడు. ఎందుకంటే అందువల్ల ఓ మనిషి జన్మ సార్ధకమవుతుంది. సీత మనిషే కావచ్చు కానీ మనిషిలా బ్రతకడం లేదు మరి!
"సీతా! నీకొచ్చిన యీ అవకాశం వదులుకోకు. నాతో పెళ్ళికి ఒప్పుకో. అప్పుడు నువ్వు పనిమనిషి జీవితం నుంచి బయటపడి మర్యాదగా మనిషిగా జీవించవచ్చు" అన్నాడు గౌతమ్ మళ్ళీ.
అంటూనే అతడాలోచిస్తున్నాడు. ఒక అట్టడుగు జాతి అమ్మాయినే కాదు. పతితను కూడా ఉద్దరిస్తున్నాడతను. ఈ త్యాగం సామాన్యమైనది కాదు. దీనికి సీత చలించిపోవాలి. ఆమె దృష్టిలో తను దేవుడు కావాలి.
సీత అతడివంక చూసింది. ఆ చూపుల్లో ఆరాధన లేదు, ప్రేమలేదు, జాలి వుంది. ఆ జాలి ఎంత రహస్యంగా వుందంటే మైకంలో, తన్మయత్వంలో వున్న గౌతమ్ కూడా దాన్ని గుర్తించి ఆశ్చర్యపడ్డాడు. అయినా అతడికింకా ఏమయినా సందేహం ముంటుందేమోనని, "బాబూ! మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది" అని మాటల్లో చెప్పింది సీత.
అతడు బదులివ్వలేదు. కానీ అతడి అణువణువూ జాలెందుకని ఆశ్చర్యంగా అడుగుతోంది.
సీత అతడి అణువణువుకీ నోటి మాటల్తో బదులిస్తోంది.
"బాబూ! మనుషుల్లో మూడు రకాలు. మనుషులని బ్రతికే వాళ్ళు, మనుషుల్లా బ్రతుకుతున్నామనుకునే వాళ్ళు, మనుషుల్లా బ్రతకని వాళ్ళు. నేను మూడో తరగతికి చెందుతాను. మీరు రెండో తరగతికి చెందుతారు. పెళ్ళంటూ చేసుకుంటే నేను మొదటి తరగతి వాళ్ళని చేసుకుంటాను. ఎందుకంటే అప్పుడు నేను నిజంగా మనిషిలా బ్రతకొచ్చు. బాబూ! మొదటి తరగతి వాళ్ళ దగ్గర నోట్లుంటాయి. మా దగ్గర ఓట్లుంటాయి. ఈ దేశాన్ని నడిపించేది మేమిద్దరమే! మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటే నా కొరిగేదేమిటి? జీవితాంతం మీ ఒక్కరికే పనిమనిషినవుతాను. అన్నీ మీ ఇష్టప్రకారం చేయాల్సిన యంత్రాన్నవుతాను. నేను కట్టుబాట్లునిచ్చి స్వతంత్రం పోగొడుతుంది. ఆ జీవితం నాకొద్దు బాబూ. ఇప్పుడు నేను మనిషిలా బ్రతక్కపోయినా స్వతంత్రంగా వుంటున్నాను. నన్నిలాగే బ్రతకనివ్వండి. మిమ్మల్ని కాదనడానికి నిజం చెప్పానని చిన్నబుచ్చుకోకండి. కలల్లో తేలిపోయే మీలాంటి బాబులకి నిజం తెలియాలనిపించింది."
గౌతమ్ మ్రాన్పడిపోయి ఆమెవంకే చూస్తూండిపోయాడు.
7
దేవేంద్ర ఠక్కున ఆగిపోయాడు.
ఎక్కడ చూసినా పకపకలూ, వికవికలూ!
ముందు తన్నెవరో వేళాకోళం చేస్తున్నారని అతడికి అనుమానం కలిగింది. కానీ అక్కడెవరూ అతన్ని గమనించడం లేదు.