Previous Page Next Page 
ప్రయాణంలో పదనిసలు పేజి 6

    ప్రస్తుతం ఆయన టూర్ మీద వెడుతున్నాడని రాజారావు గ్రహించాడు. ఈశ్వర్రావీ సంభాషణ గురించి ఆలోచించడంలేదు. అతని బుర్రలో తన వుద్యోగ సమస్య మెదుల్తోంది. అతను రీసెర్చిఫెలోగా భువనేశ్వర్లో చేరాడు. డాక్టరేట్ అయిపోయింది కాబట్టి ఎక్కడైనా వుద్యోగంలో ప్రవేశించాలని అతని కోరిక. భువనేశ్వర్లో త్వరలో వుద్యోగం దొరుకుతుందో దొరకదో చెప్పడం కష్టమని రాజారావే అతనితో అన్నాడు.   
    పక్క బెర్తులో ముసలాయన నిద్రపట్టక ఇంగ్లీషులో గొణుగుతున్నాడు. ఆయన గొణుగుడు ఈశ్వరరావు చెవిలో పడగా అతను రాజారావుతో- ఆ ముసలాడు భారతీయుడేగదా గొణుక్కునేటప్పుడైనా మాతృభాష వుపయోగించవచ్చుగా..." అన్నాడు.   
    హిం.మా.తె. పెద్దమనిషి నవ్వి- "ఆయన గొణుగుడు తనకోసం కాదు, మనకోసం. ఇక్కడెవరు ఏయే భాషల వాల్లో తెలియక అందరికీ అర్ధం కావడం కోసం ఇంగ్లీషులో గొణుక్కుంటున్నాడు..." అన్నాడు. ఆయన చాలా త్వరగానే అక్కడ పాపులర్ అయ్యాడు. ముసలాయన ఎవరిమీద విసుక్కున్నావాళ్ళనాయిన పలకరించి- "పోనిద్దురూ, ముసలాడు మరోచోట సర్దుకోండి" అనేవాడు.   
    కండక్టరు లేకపోయినప్పటికీ కంపార్టుమెంటులో ఇంచుమించు అందరికీ బెర్తులున్నాయి. క్రమంగా ఒక్కొక్కరే నిద్రలో పడ్డారు.   
    రాజారావోసారి బాత్రూంకి వెళ్ళివచ్చాడు. చాలా అసహ్యంగా వుంది బాత్రూం. అతనికి డోకు వచ్చినంత పనయింది. కంప్లయింట్ చేయడానికి కండక్టరుకూడా లేడు. అతను నెమ్మదిగా నిద్రకు పడ్డాడు.   
    కండక్టరు లేకుండానే ఆ రిజర్వేషన్ డిపార్టుమెంటు వాల్తేర్ చేరుకుంది. ఈశ్వర్రావూ, రాజారావూ వాల్తేర్ ఫ్లాట్ ఫారం రాకముందే హడావిడిగాలేచి బోగీ ఎంట్రన్స్ దగ్గరనిలబడ్డాడు. సుమారు నాలుగుంపావు ప్రాంతాలకి ట్రయిన్ ప్లాట్ ఫారం చేరుకుంది కానీ అక్కడ ఈశ్వర్రావు స్నేహితుడు కనబడలేదు.
                                               3   
    "ఇప్పుడేమిటి చేయడం?" అన్నాడు రాజారావు.   
    బాగా వానపడ్డ లక్షణాలు కనబడుతున్నాయి. ఈశ్వరరావు ప్లాట్ ఫారమంతా ఒక పర్యాయం కలయతిరిగివచ్చాడు. ఎక్కడా అతని స్నేహితుడు కనబడలేదు, రాజారావు ఆశగా వాల్తేరు టూ బొంబాయి రిజర్వేషన్ పొజిషన్ కనుక్కున్నాడు. అసలు లిస్టులో కానీ వెయిటింగు లిస్టులో కానీ ఎక్కడా తమ పేర్లు కనబడలేదు.   
    "నేను వెళ్ళి బొంబాయి టికెట్ కొనుక్కుని వస్తానండి..." అన్నాడు ఈశ్వరరావు.   
    తను భయపడినంతా జరిగిందని రాజారావు గ్రహించాడు. కనీసం హైదరాబాదు వరకైనా సుఖంగా వెళ్ళేయోగం లేదని అతను మనసులో బాధపడ్డాడు. ఈలోగా ఈశ్వరరావు వెళ్ళి బొంబాయికి రెండు టికెట్లు కొనుక్కుని వచ్చి- ప్లాట్ ఫారంమీద ఉన్న క్యూలో నిలబడ్డాడు. వున్న కాళీలను బట్టి అప్పటికప్పుడు బయల్దేరేబండిలో రిజర్వేషన్ సదుపాయాలు చూసే కౌంటర్ ఒకటి ఫ్లాట్ ఫారంమీద వుంటుంది. దాని ముందున్న క్యూలో ఈశ్వరరావు నిలబడ్డాడు. క్యూ అట్టే పెద్దదిగా లేదు.  
    ఈశ్వరరావు కౌంటర్ వద్దకు రాగానే అతని పరిస్థితి తెలుసుకుని-" మీ పేరు వెయిటింగు లిస్టులో వుందా-" అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. లేదని చెప్పాడు ఈశ్వరరావు.   
    "అయితే లాభంలేదు-"
     ఈస్వరరావు క్యూలోంచి పక్కకు తప్పుకున్నాడుకానీ కౌంటర్ వద్ద నిలబడి రాజారావుకు సైగ చేశాడు. రాజారావు దగ్గరకు రాగానే- "కొంత డబ్బు నాకివ్వండి...." అనడిగాడు.   
    ఈశ్వరరావు తన డబ్బంతా రాజారావువద్ద దాచుకున్నాడు. తను అజాగ్రత్తగా మనిషినని అతని భయం. రాజారావుని అశ్రద్ధమనిషని వసుంధర తిడుతూంటుందని అతనికి తెలియదు.  
    రాజారావు ఓ పదిరూపాయలనోట్లు తీసి ఈశ్వరరావుకి అందించాడు. ఈశ్వరరావని అందుకుని చేత్తో పట్టుకున్నాడు. కౌంటర్లో వ్యక్తికవి కనపడేలా చేస్తూ- "అలాగచేస్తే ఎలాగా సార్- బొంబాయి బోగీలో రెండు బెర్తులకు దారిచూపించాలి..." అన్నాడు.   
    కౌంటర్లోవ్యక్తి అతని చేతిని చూశాడు కానీ చలించలేదు. క్యూలో వున్న మనిషిని- "మీరెక్కడికండీ-" అనడిగాడు.  
    "బొంబాయి బోగీ- నాది వెయిటింగులిస్టు నంబరు వన్..." అన్నాడతను.  
    "సారీ- ఏమీ కాళీ లేదండీ...." అన్నాడు కౌంటర్లోని వ్యక్తి. ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. ఈశ్వరరావు స్వరంతగ్గించి రాజారావుతో - "ఇందాకా మనని మీ పేరు వెయిటింగు లిస్టులో వుందా అనడిగాడు. ఇప్పుడు ఇంకో అతన్ని వెయిటింగు లిస్టులో నంబరు వన్ గా వున్నా లాభంలేదన్నాడు. అంటే నా చేతిలోని నోట్లు పనిచేశాయన్నమాట. అవసరమైతే బెర్తుకు పదిహేనురూపాయలదాకా బేరం పెట్టిస్తాను. ఏమంటారు?" అన్నాడు. మీ ఇష్టం అని వూరుకున్నాడు రాజారావు.

 Previous Page Next Page