Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 7

    "కానీ నేను నిజంగానే బావను పెళ్ళి చేసుకోబోతున్నాను."
    సూర్యముఖి ఆశ్చర్యంగా, "మీ యిద్దరికి జంట కుదరదు మసిబొగ్గు పక్కన మాణిక్యం పెట్టినట్లుంటుంది" అంది.
    "షటప్!" అంది సుహాసిని ఒక్క నిముషమాగిన తరువాత తమాయించుకుని, "క్షమించండి! నోరు జారాను. మా బావను ఎవరైనా ఏదైనా అంటే నాకు వళ్ళు తెలియని ఆవేశం వస్తుంది. అది సరే! మా బావ నాకు బాగోడని తోస్తే మీకు మాత్రం ఎలా వచ్చాడో చెప్పండి!" అంది.
    సూర్యముఖి ఆశ్చర్యంగా, "వాటం చూస్తూంటే మీ బావ మీకు నిజంగానే వచ్చినట్లు అనిపిస్తుంది. ఆయన నాకు నచ్చడంలో ఆశ్చర్యంలేదు. నేనొక క్లబ్బు డ్యాన్సర్ని. డబ్బు కోసం మగాళ్ళ ముందు నా వంపు సొంపులు ప్రదర్శిస్తూ నృత్యం చేస్తాను. ఆయనకు నా అందం నచ్చింది. నాకీ జీవితం నుంచి విముక్తి ప్రసాదించి పెళ్ళి చేసుకుంటానన్నారు నా జీవితానికి అదే గొప్ప అవకాశం. నన్నలా ఆదరించే మగాడు దొరకడమే అరుదు. నాకింక అందం గురించి ఆలోచించే ప్రసక్తేలేదు కానీ మీ సంగతి అలా కాదు. పెళ్ళిచేసుకుంటానంటే మగాళ్ళు మీ యింటి ముందు క్యూలో నిలబడతారు" అంది.
    "బావ నిన్ను పెళ్ళి చేసుకుంటానన్నాడా?" ఆశ్చర్యంగా అంది సుహాసిని.
    "అనడమేమిటి? మేమిద్దరం కలిసి కాపురం చేస్తున్నాం?" అంది సూర్యముఖి.
    "పెళ్ళి కాకుండానే!"
    "ఆయనిచ్చిన మాట నమ్మాను" అంది సూర్యముఖి.
    "పెళ్ళి కాకుండా మగాడితో కలిసి కాపురం చేస్తున్నావా? అందుకే బావ నిన్ను పెళ్ళి చేసుకోడు. నన్నే చేసుకుంటాడు" అంది సుహాసిని.
    సూర్యముఖి ఆశ్చర్యంగా సుహాసిని వంక చూసి, "నా మాటలు విన్నాక కూడా ఇంకా నువ్వు ప్రభాకరాన్ని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నావా? ఇంకా నాకు సాయపడతావేమో అనుకున్నాను" అంది.
    "పెళ్ళి విషయాల్లో నేను కలగజేసుకోను. అంతా పెద్దల యిష్టం. వాళ్ళెలా చేస్తే అలాగ?" అంది సుహాసిని.  
    "పెద్దల యిష్టమని చెప్పి, పెళ్ళికి ముందే పరాయి ఆడవాళ్ళను మరిగిన మగాణ్ణి పెళ్ళిచేసుకుంటావా, నాలాంటి ఆడదానికి అన్యాయంచేస్తానంటావా? చదువుకున్న దానివి. ఇదేనా నీ వివేకం?" అంది సూర్యముఖి.
    "నేను నీకేమీ అన్యాయం చేయడంలేదు. నీకు నువ్వె అన్యాయం చేసుకుంటున్నావు. డబ్బుకోసం క్లబ్బులో డ్యాన్సులు చేసే నీవంటి ఆడది బావకు భార్య కావడం నేనే సహించలేను. ఇంకా బావ సంగతంటావా, ఆయన  చెడు తిరుగుళ్ళు తిరుగుతాడనీ, వ్యభిచార గృహాలకు వెడతాడనీ కూడా నాకు తెలుసు అందుకు నాకు బాధలేదు బావనాకు చిన్నప్పటినుంచీ తెలుసు. మా యిద్దరికీ ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. చిన్నప్పుడే మా పెళ్ళి నిశ్చయమైపోయింది. జ్ఞానం తెలిసినప్పట్నించీ బావ అంటే నా భర్త అనే అభిప్రాయం నాలో నిలబడిపోయింది. మరోపురుషుణ్ణి నేను భర్తగా ఊహలోకూడా భరించలేను. చిన్నప్పటినుంచీ మా బామ్మ నాకు పతివ్రతల కథలు నూరిపోసింది. నాకూ ఆ పతివ్రతల్లా జీవించి పేరుతెచ్చుకోవాలని సరదా ఉంది. బావ నా కళ్ళకు ఎంతో అందంగాకనబడతాడు. కానీ అంతా అతను కురూపి అంటారు. బావ ఈ సంగతి నా దగ్గర చాలామార్లు అని బాధపడుతూండేవాడు, "బావా! నీ బాధను నేను ఎలా పోగొట్టగలను?" అని నేను అడిగాను. ఆ బాధ మరిచిపోవాలంటే తాగుడు ఒక్కటే మార్గమని బావ అన్నాడు. అప్పుడు నేనే బావను తాగుడుకు ప్రోత్సహించాను. తాగుడు మంచి అలవాటు కాదని నాకు తెలుసును. కాని మా పెళ్ళి జరిగేక బావను నేను మార్చుకోగలనని నా నమ్మకం. అలా మార్చుకోవడం నాకు సరదా కూడా మా బామ్మ కూడా బావ తాగుతాడని విని ఎంతో సంబరపడింది. అన్నీ మంచి లక్షణాలుంటే, పెళ్ళయ్యాక పెళ్ళానికి పేరెలాగొస్తుందీ? అంది. అతడికి తాగుతు బాగా అలవాటు కావాలి. ఆ అలవాటు నేను మానిపించాలి. అందుకని నేను ఇప్పుడు ఎవరైనా బావ తాగుతున్నాడని చెబితే సంతోషిస్తాను తప్పితే బాధపడను ఇంకా వ్యభిచారం సంగతి. మా బామ్మ అస్తమానం అంటూండేది. బామ్మ పెళ్ళి మా తాతగారు భోగందానింటి నుంచి వచ్చి తాళికట్టి మళ్ళీ భోగందానింటికే వెళ్ళిపోయారట అలాంటి మనిషి రెండేళ్ళు తిరిగేసరికి __ భోగందే స్వయంగా ఇంటికి వస్తే మెడపట్టి గెంటించాడుట. మా ప్రభాకరం బావ గురించి అన్నీ మా యింట్లో తెలుసు. బావ ఓసారి నాచేయి పట్టుకున్నాడు రెండేళ్ళక్రితం. తప్పు బావా అని చెప్పాను. మనమెలాగూ పెళ్ళి చేసుకుంటాం గదా అన్నాడు బావ పెళ్ళి కాకుండా మనమిలా కలుసుకోకూడదని చెప్పాను. పోనీ పెళ్లయ్యేదాకా భోగం వాళ్ళింటికి వెళ్ళనా అనడిగాడు బావ. నాకు జాలేసింది మగాడు పెళ్ళికి ముందు కాస్త అల్లరిచిల్లరిగా తిరగాలిట. ఇది కూడా మా బామ్మే చెప్పింది. మా పెళ్ళి జరిగితే అతన్ని మార్చుకోవలసిన అవసరం నాకుంది. అదే నాకు సంతోషం. నువ్వింక మా బావ గురించి మరిచిపో! మా పెళ్ళిజరిగేక బావ నీవైపు కన్నెత్తి కూడా చూడడు" అంది సుహాసిని.
    సూర్యముఖి ఆశ్చర్యంగా సుహాసిని వంక చూసి__"నువ్వు చాలా అమాయకురాలిలాగున్నావు. నీలాంటి ఆడపిల్లలు మగాడికి వరం" అంది.
    "ప్రభాకరం కూడా ఆ మాటే అన్నాడు. నన్ను తప్ప ఇంకెవరికీ పెళ్ళి చేసుకోనని అన్నాడు" అంది సుహాసిని.
    సూర్యముఖి నిరుత్సాహంగా అక్కణ్ణించి లేచింది. ఆమె వెళ్ళిన కొద్ది నిముషాలకు రామగోపాల్, మోనికూడా అక్కణ్ణించి లేచారు.
                                                6
    "సూర్యముఖి అంతా నిజమే చెప్పింది. మోనికా రాసిందీ, సూర్యముఖి చెప్పిందీ సరిగ్గా సరిపోయాయి" అన్నాడు రచయిత.
    "సరిపోవడం బాగానే ఉందయ్యా! కానీ ఈ సుహాసిని కిదేం బుద్ది? ఇలాంటి పిల్లలు మనకింతవరకూ ఏ కథలోనూ తగల్లేదు" అన్నాడు రాయుడు.
    "ఇలాంటి పిల్లలు కథల్లో తగలరండి. కానీ నిత్యజీవితంలో ఉంటారు. ఆ విషయం నాకు బాగా తెలుసు" అన్నాడు రచయిత - "మధ్య తరగతి కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్ళికి మించిన సమస్య మరోటిలేదు. పెళ్ళంటూ కుదరాలిగానీ - ఎంత అందమైన పిల్లయినాసరే-పరమ వికార రూపున్ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తుంది. అదీ ఈ సమాజం నడిచేతీరు! చాలామంది ఆడపిల్లలు అమాయకులు. చిన్నప్పటినుంచీ పురాణ గాధలతో, పతివ్రతల కథలతో వాళ్ళ మెదడును కలుషితం చేసేస్తారు. దాంతో వాళ్ళు మగాడు ఏ తప్పు చేసినా అది సహజమేనన్న భ్రమలో పడిపోతారు. వాళ్ళ మెదడు ఎదగదు. ఫలితంగా వాళ్ళ ఆలోచనలు డబ్బుచుట్టూ చీరలచుట్టూ, నగలచుట్టూ తమ కుటుంబం అనే స్వార్ధం చుట్టూ పరిభ్రమించడం ప్రారంభిస్తాయి. స్త్రీని ఈ సంకుచిత భావంలోకి దింపి పురుషుడు హాయిగా ఈ విశాల ప్రపంచం లోని సుఖాలన్నీ పొందుతున్నాడు. ఇది తరతరాలుగా నడుస్తోంది. నడుస్తుంది."

 Previous Page Next Page