Previous Page Next Page 
రాయుడిగారి సినిమాకథ పేజి 8

    "ఓహో, నీకు ఆవేశం వచ్చినట్లుంది" అన్నాడు రాయుడు-"మనం తీసే సినిమా స్త్రీ సమస్యల మీద కాదు. అందువల్ల నీ బుర్రలోకి ఆ సమస్యల్ని రానివ్వకు. మన కధ గురించి ఆలోచించు."   
    "మీరలా ముక్కుకు సూటిగా పోతానంటే కుదరదు సమస్యల మీద మనం సినిమా తియ్యం. కానీ అవసరమైనప్పుడు సమస్యల గురించి ఏమీ మాట్లాడ్డానికి వీల్లేదంటే కుదరదు. సుహాసిని ప్రభాకరాన్ని ఎలా ప్రేమించింది? అతడి తప్పులన్నింటినీ ఎలా భరించగల్గుతోంది? కాస్త లోతుగా ఆలోచిస్తే ఇది బానిస మనస్తత్వం, ఇదే బానిస మనస్తత్వం పాలేర్లలో ఉంటుంది. కూలీలలో వుంటుంది. ఆడవాళ్ళలో ఉంటుంది. సుహాసిని సాదారణ మధ్యతరగతి కుటుంబీకురాలు. ప్రభాకరం ఆస్తిపరుడు సుహాసినిని ప్రభాకరానికి కట్ట బెట్టాలనుకున్నారు పెద్దలు. ఎందుకు? డబ్బు కోసం అయితే సుహాసినికి కాస్త వయసొచ్చిన జ్ఞానం తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అందుకు ఏం చేయాలి? చిన్నప్పట్నించీ ఆమె మెదడును ఈ పెళ్ళికి అనుకూలంగా తయారు చేయాలి. అలాంటి విషయాల్లో ఈ బామ్మలున్నారు చూశారూ - వాళ్ళు సర్వసమర్ధులు....సుహాసిని బామ్మ సుహాసినిని తాను కోరినట్లు తయారు చేసింది. ఇప్పుడు సుహాసిని ప్రభాకరాన్ని తప్ప ఇంకా ఎవ్వరినీ కోరదు..."   
    "బాగుందయ్యా-కథ ప్రారంభించడానికి ఇది బాగానే ఉంది. కానీ ఈ కథకి ముగింపు మాత్రం వేరే విధంగా ఉండాలి. ఈ కథలో ప్రభాకరం హీరో కాకూడదు. విలన్! హీరోయిన్ కి విలన్ తో పెళ్ళయితే ఎలా? అందుకోసం ఏదైనా ఉపాయం చూడాలి. త్వరగా నువ్వు ఏదైనాచెప్పాలి" అన్నాడు రాయుడు.   
    "అవునూ__మీరు హీరోయిన్ సంగతీ, విలన్ సంగతీ మాట్లాడుతున్నారు. కానీ హీరో సంగతి చెప్పడం లేదు. ఇంతకీ హీరో ఎవరూ?" అన్నాడు రచయిత.   
    "అవును. హీరో ఎవరూ?" అన్నాడు రాయుడు.   
    "అసలు సుహాసిని గురించి మీకెలా తెలిసింది? మీ మేనల్లుడు శంకర్ కారణంగానే కదా - అతన్నే హీరోని చేద్దామా?"   
    "అప్పుడు సుహాసిని గతి పెనం మీంచి పొయ్యిలో పడ్డట్లవుతుంది. ప్రభాకరానికైతే డబ్బు సంపాదించే తెలివైనా వుంది. మా వాడికి అదీ లేదు" అన్నాడు రాయుడు.   
    "అయితే హీరో ఎవరు మరి?" అన్నాడు రచయిత.   
    రాయుడు కాసేపు ఆలోచించి "ఈ ఊరంతా గాలిస్తే మనకో హీరో దొరక్కపోడు. రేపట్నుంచి హీరో కోసం అన్వేషిద్దాం" అన్నాడు.   
    "ఆ సుహాసిని ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. రాయుడి గారంతటి వారు ఆమె కోసం వరుణ్ణి అన్వేషిస్తున్నారు" అన్నాడు రచయిత.   
    "వరుణ్ణి అన్వేషించే ముందు ఓసారి మా మేనల్లుడితో మాట్లాడతాను. వాడి ఎరుకలో సుహాసినికి మంచి సంబంధం చెప్పగలిగితే మనకు తిరిగే బాధ తప్పుతుంది" అన్నాడు రాయుడు.   
    ఆయన శంకర్ని పిలిచాడు. శంకర్ రాయుడు చెప్పింది విని "చాలా బాగుంది నేను సుహాసిని ఒకరి కోసం ఒకరం పుట్టాం. ఈ ఊళ్ళోనేకాదు. ఆమెకు తగినవాడు నేను తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు" అన్నాడు.   
    "నిజమైన ప్రేమికుడు ప్రేయసి సౌఖ్యాన్ని కోరుకుంటాడు. నువ్వు నిజంగా సుహాసినిని ప్రేమిస్తే ఆమెకు మంచి వరుణి కూడా నువ్వె వెతికి పట్టుకుంటావు" అన్నాడు రాయుడు.   
    "మామయ్యా! నా ఆలోచనలు నీ సినిమాల్లా అసహజంగా ఉండవు. నిజమైన ప్రేమికుడు కోరుకునేది ప్రేయసి సౌఖ్యాన్ని కాదు. ప్రేయసితో సౌఖ్యాన్ని. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సుహాసిని వదులుకోలేను" అన్నాడు శంకర్.   
    "ఈ డైలాగు చాలా బాగుంది. నోట్ చేసుకోవయ్యా" అన్నాడు రాయుడు రచయితతో రచయిత వెంటనే అది నోట్ చేసుకుని, "మీ మేనల్లుడిగారిని మీ రాబోయే చిత్రానికి మాటల రచయితగా తీసుకుంటే బాగుంటుందండి" అన్నాడు.
    "అప్పజెప్పిన పనేదీ చెయ్యలేడు వాడు. చిన్నప్పటినుంచీ వాళ్ళమ్మపడే బాదే అది ఏరా_శంకర్! పోనీ నాకు నీ సుహాసిని ఫోటో ఒకటిస్తావూ?" అని అడిగాడు రాయుడు.   
    "సుహాసిని ఫోటోయా? అడిగిన వాళ్ళందరికీ ఫోటో యివ్వడానికి ఆమె ఏమైనా సినిమా తార అనుకున్నావా? నా దగ్గర ఆమె ఫోటో ఎందుకు వుంటుందీ?" అన్నాడు శంకర్.   
    "సరేలే-అదీ నేనే సంపాదించుకుంటాను. అడిగినదేదీ ఇవ్వలేవు నువ్వు. ఈ సంగతి రుజువు చేయడానికే నిన్ను ఫోటో అడిగాను" అన్నాడు రాయుడు.   
    మర్నాడు రాయుడు ఓ ఫోటోగ్రాఫర్ కు డబ్బిచ్చి సుహాసినికి తెలియకుండా ఆమె ఫోటో తీయించాడు. ఆ ఫోటో తీసుకుని ఆయనా, రచయితా కలిసి ఊళ్ళో విహారం మొదలు పెట్టారు. సుహాసినికి ఓ మంచి వరున్ని అన్వేషించాలి వాళ్ళు   
    మొదటిరోజు సాయంత్రం వాళ్ళిద్దరూ బీచ్ దగ్గర కాశారు. సాధారణంగా వయసులోఉన్న కుర్రాళ్ళు ఆడపిల్లల్ని చూడ్డం కోసం బీచ్ దగ్గర తిరుగుతూంటారు వాళ్ళలో సుహాసినికి వరుడయ్యే అర్హత ఉన్న వాడు వుండక పోడు.   
    బీచ్ దగ్గర అలాంటి కుర్రాడొకడు తగిలాడు వాళ్ళకి. చూడ్డానికి చాకులా ఉన్నాడా కుర్రాడు. ఎర్రగా, బుర్రగా-అచ్చం సుహాసిని మొగుడిలా ఉన్నాడు. రాయుడు, రచయిత. ఆ కుర్రాణ్ణి సమీపించి "హలో!" అని పలకరించారు.   
    "ఎవరండీ మీరు?" అనడిగాడా యువకుడు ఆశ్చర్యంగా.   
    రాయుడికి వెంటనే ఏం చెప్పాలో తెలియలేదు. ఇలాంటి పని ఆయనకు అలవాటు లేదు అందుకని చటుక్కున తన జేబులోంచి ఫోటోతీసి ఆ యువకుడికి చూపించి, "ఈ అమ్మాయి యెలా వుంది?" అని అడిగాడు.   
    యువకుడు రాయుడివంకా ఫోటోవంకా ఎగాదిగా చూసి, "అబ్బే నేనలాంటి వాణ్ని కాదండీ" అని వెళ్ళి పోయాడు.   
    "అదేంటీ అలా అని వెళ్ళిపోయాడు" అన్నాడు రాయుడు ఆశ్చర్యంగా.   
    "ఏమో - అదే నాకూ అర్ధంకావడంలేదు" అన్నాడు రచయిత.  
    "ఈ కుర్రాడు మొహమాటస్థుడిలా వున్నాడు కాస్త చలాకీ అయినవాణ్ని చూద్దాం. పెర్సనాలిటీ ఉంటే చాలదు. చలాకీతనం కూడా ఉండాలి" అన్నాడు రాయుడు. రచయిత తలాడించాడు. ఇద్దరికీ కాసేపు గడిచాక పెర్సనాలిటీతోపాటు చలాకీతనం కూడా వున్న ఓ యువకుడు కనిపించాడు.   
   "మళ్ళీ ఇద్దరూ కలిసి "హలో!" అంటూ అతన్ని పలకరించారు.   
    "ఎవరండీ మీరు?" అన్నాడా యువకుడు.   
    రాయుడు తన దగ్గర ఫోటో చూపించి, "ఈ అమ్మాయెలాగుంది?" అనడిగాడు.   
    ఆ యువకుడు ఫోటోవంకే తీక్షణంగా చూసి హుషారుగా ఈలవేసి "పిల్ల చాలా బాగుంది. రాత్రికి రేటెంత?" అనడిగాడు.   
    రాయుడికి బుర్ర తిరిగిపోయింది. చటుక్కున ఆయన ఆ యువకుడి కాలరు పట్టుకుని "ఏమన్నావ్?" అన్నాడు.
    ఆ యువకుడు ఈ హఠాత్పరిణామానికి ఆశ్చర్యపడి తేరుకునేలోగా రచయిత ఆ యిద్దర్నీ విడదీసి "బాబుగారికి మతి స్తిమితం లేదు. మీరేమీ అనుకోకండి" అని సర్ది చెప్పి ఆ యువకున్ని పంపించి వేశాడు.

 Previous Page Next Page