"ఓహో, ఆయనా!" అని__"ఆయన నాకు ఎక్కువ డబ్బిస్తాడని మీకెలా తెలుసు?" అనడిగింది సూర్యముఖ ఆశ్చర్యంగా.
"ఇందులో విశేషమేముంది? నీలాంటి వాళ్ళుఅలాంటి వాణ్ని భరించాలంటే, అందగాడని పొగడాలంటే డబ్బెక్కువిచ్చి తీరాలి కదా."
"ఇంతకీ ప్రభాకరంతో మీకేం పని?"
రచయిత గలగజేసుకున్నాడు, "ఓ ప్రొడ్యూసర్ గారు సినిమాలకు సుహాసిని అనే కొత్త అమ్మాయిని పరిచయం చేయాలనుకుంటున్నారు. ఆ సుహాసిని తను అప్సరసాలా ఉండి కూడా ఈ ప్రభాకరాన్ని ప్రేమించింది. ఇలాంటి భర్త ఉన్న యువతిని హీరోయిన్ గా ప్రేక్షకులామోదించరు. ఈ పెళ్ళి ఆపాలనుకున్నారా ప్రొడ్యూసర్ గారు. ఆ ప్రభాకరం ప్రవర్తన మంచిది కాదన్న విషయం ఆ అమ్మాయికి నువ్వె చెప్పాలి."
"నే నెందుకు చెప్పాలి?" అంది సూర్యముఖి.
"సుహాసిని పిక్చర్లో బుక్కయితే నువ్వూ పిక్చర్లో బుక్కయినట్లే- సూర్యముఖి జయముఖి కావాలనుకుంటే నువ్వీ పని చేయాలి!" అన్నాడు రచయిత.
"జయముఖి అదే నేను కలలుకనే పేరు" అంది సూర్యముఖి.
రచయిత ఆమెకు సుహాసినితో ఏమేం మాట్లాడాలో చెప్పాడు. రాయుడు సూర్యముఖికి అడ్వాన్సుగా వంద రూపాయలు కూడా ఇచ్చాడు.
"ఇంతటితో ముగియలేదు. వాళ్ళిద్దరూ ఏమేం మాట్లాడుకున్నారో మనకు తెలిస్తే, ఆ డైలాగులు తర్వాత ఎందుకైనా పనికి వస్తాయి. అందుకు మరో ఏజంటు కావాలి వాళ్ళ సంభాషణలంతా అప్పటికప్పుడు షార్టుహ్యాండులో రాసుకుని మొత్తం మనకు చెప్పగలిగె మనిషి కావాలి" అన్నాడు రచయిత.
షార్టుహ్యాందుకు తెలుగు భాష పనికి రాదు. ఇప్పుడలాంటి మనిషి ఎక్కడ దొరుకుతాడు?" అన్నాడు రాయుడు విచారంగా.
"మీరు బెంగ పెట్టుకోకండి. హైదరాబాదులో నా స్నేహితుడొకడు వున్నాడు. అతడు జర్మనీ వెళ్ళి జర్మన్ వనితను వివాహం చేసుకుని ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ జర్మనీ వనితకు జర్మనీ భాషలో షార్టు హ్యాండ్ వచ్చును" అన్నాడు రచయిత.
"బావుందయ్యా! ఆమె కోసమని సుహాసిని, సూర్యముఖి జర్మనీ భాషలో మాట్లాడుకోమంటావా?" అన్నాడు రాయుడు కోపంగా.
"మీరు నామాటలు పూర్తిగా వినకుండా కంగారుపడి పోతున్నారు. సుహాసిని, సూర్యముఖి ఎక్కడ కూర్చున్నారో- అక్కడకు కాస్త దూరంగా నా స్నేహితుడు రామగోపాల్, అతడి భార్య మోనికా కూర్చుంటారు. వాళ్ళ సంభాషణను ఎప్పటికప్పుడు రామగోపాల్ జర్మన్ భాషలోకి అనువదించి చెబుతూంటే, అదే డిక్టేషన్ గా తీసుకుని మోనిరా షార్టు హాండ్ లో రాస్తూంటుంది" అన్నాడు రచయిత.
"అయిడియా బ్రహ్మాండంగాఉంది. కానీ, ఆ మోనికా పిల్ల తెలుగువాణ్ణి కట్టుకుంది కదా - తెలుగు నేర్చుకోలేదా?" అనడిగాడు రాయుడు.
"ఎద్న్హుకు నేర్చుకోలేదండీ - ఆమెకు కొంత భాషవచ్చు. తెలుగులో ఏం తిట్టినా ఆమెకు అర్ధమైపోతుంది. అయితే ఎదుటి వాడు చెప్పేది విని దాన్ని మరో భాషలోకి తర్జుమా చేసుకుని అప్పుడు షార్టుహాండ్ లో రాసుకోవడం చాలా కష్టం. అదీకాక తెలుగు భాషను తెలుగువాడు అర్ధం చేసుకున్నట్లు మరొకడెలా అర్ధం చేసుకోగలడు? అయినా మోనికా ఒకర్తి వాళ్ళు చెప్పేవన్నీ విని రాసుకుంటూంటే నలుగురికీ ఏదైనా అనుమానం రాగలదు. ఇప్పుడైతే వాళ్ళొక జంటగా కూర్చుంటారు. రామగోపాల్ జర్మనీ భాషలో ఏం మాట్లాడుతున్నాడో అక్కడి వాళ్ళకు అర్ధం కాదు. ఎవరికీ అనుమానంకలక్కుండా ఇది చక్కటి ఏర్పాటు ఏమంటారు?" అన్నాడు రచయిత.
రాయుడు రచయిత భుజం మీద గట్టిగా తట్టి, "మంచి అయిడియా చెప్పేవయ్యా! ఇది చాలా బాగుంది. ఇలాంటి అయిడియా చెప్పినందుకు నువ్వేమడిగినా ఇవ్వొచ్చు-ఏమైనా అడుగు!" అన్నాడు.
రచయిత భుజం తడుముకుంటూ, "దయుంచి యింకెప్పుడూ ఇంత గట్టిగా కొట్టకండి. ప్రస్తుతానికి ఇదే నా కోరిక" అన్నాడు.
"సరేలే కానీ - నీ స్నేహితుడు, భార్య వచ్చేకనే కదా సూర్యముఖి సుహాసినిని కలుసుకుంటుంది?" అన్నాడు రాయుడు.
"అవునండి. కానీ అదెంతసేపు? ఈరోజే వెళ్ళి రేపటికల్లా వాళ్ళ నిక్కడికి తీసుకురానూ!" అన్నాడు రచయిత.
"మంచిది త్వరగా వెళ్ళిరా!" అన్నాడు రాయుడు.
సుహాసిని బీచ్ కే అందాన్నిచ్చింది. ఈ విషయం ఆమె ప్రాంతంలో తిరుగాడే యువకుల సందోహాన్ని చూసి తెలుసుకోవచ్చు. ఎంతోమంది యువకులు బీచ్ కి అందం తెచ్చిన సుహాసినివంక ఓరచూపులు చూస్తుంటే ఆమె మాత్రం ఎగిరిపడే అలలవంక సాలోచనగా చూస్తోంది. ఆమె ఈ లోకంలో ఉన్నదనిపించదు.
సరిగ్గా అప్పుడే సూర్యముఖ ఆమెను సమీపించింది. క్లబ్బులో ఆమెను చూచిన వారెవరైనా ఇప్పుడు చూస్తే గుర్తుపట్టలేరు. ఖరీదైన నేత చీరకట్టుకుని, పమిట నిండుగా కప్పుకుని చూడగానే పవిత్రత ఉట్టిపడుతూ కనపడుతున్నదామె.
సూర్యముఖికి కాస్త వెనుకగా రామగోపాల్, మోనికా ఉన్నారు. వాళ్ళు సూర్యముఖివంకే పరిశీలనగా చూస్తున్నారు. మోనికా భారతదేశపు పద్దతిలో చీర కట్టింది. కానీ అదామెకు అంతగా నప్పలేదు. ఆమె చేతిలో ఓ నోట్ బుక్కూ, పెన్సిలూ ఉన్నాయి. ఆ రెండూ మాత్రం ఆమెకు బాగా నప్పాయి.
సూర్యముఖి కూర్చోగానే రామగోపాల్, మోనికా కూడా కూర్చున్నారు.
"నమస్కారం!" అంది సూర్యముఖి.
"గ్యుటెన్ టాగ్" అన్నాడు రామగోపాల్. మోనికా వెంటనే అది రాసుకుంది.
సుహాసిని ఆశ్చర్యంగా ఆమె వంక చూసి "ఎవరు మీరు?" అంది.
"వేర్ సిండ్ జీ" అన్నాడు రామగోపాల్, మోనికా రాసుకుంది.
"నాపేరు సూర్యముఖి. మీ పేరు సుహాసిని కదూ?" అంది సూర్యముఖి. రామగోపాల్ వెంట వెంటనే అనువదిస్తున్నాడు. మోనికా రాసుకుపోతోంది.
"నేను మీకెలా తెలుసు?" అంది సుహాసిని ఆశ్చర్యంగా.
"అవసరం" అంది సూర్యముఖి. సుహాసిని అడగ్గా ఆమె వివరించి చెప్పింది. ప్రభాకరం ఆమెను ప్రేమించాడు. పెళ్ళిచేసుకుంటానని మాటకూడా ఇచ్చాడు. ఆ మాట నిజం కాదనీ, అతడికి సుహాసిని అనే మరదలుంటున్నదనీ ఎవరో చెప్పగా నిజం తెలుసుకుందామని వచ్చిందామె.
"మిమ్మల్ని చూడగానే అంతా అబద్దమని తేలిపోయింది. నా మనసు కూడా తేలికైపోయింది" అంది సూర్యముఖి.
"నాకేం అర్ధం కాలేదు" అంది సుహాసిని.
"మీరెంతో అందంగా ఉన్నారు. మీవంటి వారు ప్రభాకరాన్ని పెళ్ళిచేసుకుంటారంటే ఎవరూ నమ్మరు" అంది సూర్యముఖి.