Previous Page Next Page 
మిస్టర్ రాంగో పేజి 5

    "జాజీ...."
   
    "ఏమిటి బామ్మా..."
   
    "తప్పదు...నువ్వూ వినాల్సిందే"
   
    "నో బామ్మా..."
   
    "తప్పదమ్మా జాజీ.... తాతగారి గురించి మూడ్ వచ్చాక... ఆ గత స్మృతినీ తనివితీరా నెమరు వేసుకుంటూ ఎవరికో ఒకరికి చెబితేనే నా మనసు శాంతిస్తుంది. నా వీక్ నెస్ నీకు తెలియదా చెప్పు....?"
   
    "ఓకే....బామ్మా.... కానీ ఒక షరతు..."
   
    "ఏమిటది?"
   
    "జరిగిన కథ కట్ చేసేయ్.... అలాగే చెప్పే కథను. కూడా అడ్వర్ టైజ్ మెంట్స్ అవీ లేకుండా బ్రీఫ్ గా ఐ మీన్ సంక్షిప్తంగా చెప్పాలి....సరేనా?"
   
    "ఓ.కే...ఐయామ్ ఎ గ్రేడ్..."
   
    బామ్మ ఆరవ తరగతి వరకే చదువుకున్నా మాటల్లో ఇంగ్లీషు పదాలు స్పష్టంగా వుపయోగిస్తుంది.
   
    రాంగో భారంగా ఒక నిట్టూర్పు విడిచి నిటారుగా కూర్చున్నాడు.
   
    బామ్మ గొంతు సవరించుకుని మొదలుపెట్టింది.
   
    "అలా శివరాత్రి తిరణాలలో ఆయన నా చేయి పుచ్చుకుని వెళుతుంటే ఆ దృశ్యం ఎలా వుందనుకున్నారు? రుక్మిణిని శ్రీకృష్ణుడు తీసుకువెళుతున్నంత బ్యూటీగా వున్నది. సీతమ్మను శ్రీరాముడు ఆలంబనగా నడిపిస్తున్నంత మార్వ లెస్ గా వున్నది. తిరుణాలకు ఎన్నో ప్రభలు...రికార్డింగ్ డాన్స్ లతోనూ....భజనలతోనూ ఆ ప్రాంతమంతా మార్మోగిపోతున్నది. వున్నట్లుండి అప్పుడు జరిగిందొక విచిత్రం...."
   
    "ఏమిటి?"
   
    ఇద్దరూ కథలో ఇన్ వాల్వ్ అయి ఒకేసారి ప్రశ్నించారు.
   
    "వెయిట్ ప్లీజ్....చెబుతున్నాగా! అప్పుడు జరిగిన విచిత్రమేమిటంటే....కరెంటు పోయింది"
   
    జాజిబాల తెల్లబోయింది.
   
    రాంగో మాత్రం...
   
    "కరెంటు కోత అప్పటి నుంచే వుందన్నమాట...." మెల్లగా గొణిగాడు.
   
    "ఇష్...అది ఔట్ ఆఫ్ కొశ్చన్ రాంగో....కమ్ టుది పాయింట్ అంతా గాడాంధకారం ఒక్కసారిగా పెనుగాలులు....జనమంతా హాహాకారాలు.... ఆ వెంటనే వాన.... అది వానకాదు....పిడుగుల్లాంటి వడగళ్ళతో కూడిన జడివాన.... ఆ హడావుడిలో ఆయన నా చేయి వదిలేశారు!"
   
    "మైగాడ్"
   
    జాజిబాల భయంతో ముడుచుకుపోయింది.
   
    "ఇష్...మధ్యలో అడ్డురాకండి.... నా మూడ్ చేంజ్ అవుతుంది. అలా ఆయన నా చేయి వదిలేసరికి...చీకట్లో జనం అటు, ఇటు గోల గోలగా తిరగటం మొదలుపెట్టారు జడివాన వళ్ళంతా తడిపేస్తున్నది. ఆయన ఎటు వెళ్ళిపోయారో తెలుసుకోలేకపోయాను. నా ఒళ్ళు జలదరించింది....
   
    "వెన్నులోకి భయం ప్రవహించింది. పిచ్చిదానిలా ఆ కటిక చీకటిలో... జోరు వానలో ఎటుపడితే అటు తిరుగుతున్నాను... 'ఏమండీ, ఏమండీ' అని పిలుస్తున్నానే కానీ ఆయన పేరు పెట్టి పిలవలేక పోతూన్నాను. అందుక్కారణం మనకున్న సెంటిమెంటు.... ఏ భార్యా....భర్తను పేరుపెట్టి పిలవకూడదు కదా....
   
    అందుకే....నేను అలాగే ఆ భయంకరమైన గాలి వానలో, చీకటి నరకంలో వెర్రిగా తిరుగుతున్నాను.... ఇంతలో ఒక చేయి నన్నుతాకింది. ఉలిక్కిపడ్డాను. చనువుగా నా చేతిని పట్టుకొని తనతోపాటు బరబరా ఈడ్చుకుపోతున్నది. జనమంతా ఎటువాళ్ళు అటు ఏదో ఒక నీడకు పారిపోయారు.
   
    "బహుశా ఆయనే వచ్చి ఈడ్చుకుపోతున్నారు అనుకున్నాను. ఆ చేయి నన్ను సరాసరి ఒక పాడుపడిన సత్రంలోకి తీసుకువెళ్ళింది. ఆకాశంలో వాన తగ్గి మెరుపులు....ఉరుములు ఒకటీ అరా తళుక్కుమంటున్నాయి.... ఉన్నట్టుండి ఒక పెద్ద మెరుపు మెరిసింది. అది క్షణకాలమే అయినా ఆ మెరుపు వెలుగులో అప్పటిదాకా నా చేయిపుచ్చుకుని ఈడ్చుకు వచ్చిన ఆకారాన్ని చూసి కెవ్వున అరవబోయాను.
   
    "నా గొంతు భయంతో బిగుసుకు పోవడంతో శబ్దం బయటకు రాలేదు. తాటి చెట్టు లాంటి కారు నలుపున్న మనిషి...మిడిగుడ్లు వేసుకుని మీదకు వస్తున్నాడు. వాడికళ్ళల్లో కోరిక....దగ్గరికి.... ఇంకా దగ్గరికి....బాగా దగ్గరికి.... నేను వెర్రిగా అరచి స్పృహ కోల్పోయాను."
   
    చెప్పడం ఆపి శ్రద్దగా వింటున్న ఇద్దరి వైపూ చూసింది బామ్మ.
   
    టెన్షన్ తో ఇద్దరూ బిగుసుకుపోయి కనిపించారు.
   
    జాజిబాల కళ్ళల్లో భయం....
   
    రాంగో సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ సినిమా చూసి దడుసుకున్న వాడిలా వున్నాడు.
   
    "ఆ మిడిగుడ్ల కామంధుడు బాగా దగ్గరకు వచ్చేసాడు. ఒక చేయి ఎత్తి నన్ను అందుకోబోయాడు. సరిగ్గా అప్పుడు పడింది ఒక భయంకరమైన ముష్టిఘాతం. ఆ దెబ్బకు వాడు దొర్లుకుంటూపోయి ఆరడుగుల దూరంలో పడిపోయాడు...."
   
    "ఇంతకూ వాడిని కొట్టింది ఎవరు బామ్మా....."
   
    "ఆయన...."
   
    బామ్మ సిగ్గుపడింది.
   
    "ఆయనంటే ఎవరు? పోలీసా?"
   
    "ఛీ కాదు...ఆయన...మా ఆయన...ఎక్కడయినా భర్తపేరు భార్య చెబుతుందా ఏమిటి?"
   
    "ఆహా....ఏం సెంటిమెంట్ రా భగవంతుడా.... ఇలాంటి అర్ధం కాని బామ్మను జాజిబాల ఇంట్లో ఎందుకు పుట్టించావురా మహానుభావా!"
   
    "రాంగో...ఏమిటో నీలో నీవే అనుకుంటున్నావ్?"
   
    "అబ్బే....ఏమీలేదు బామ్మగారూ....పాతకాలం వాళ్ళలో ఎంత పతిభక్తి వుందో కదా....అనుకుంటున్నాను...."
   
    అతని పొగడ్తకు బామ్మ గర్వంగా ఫీలయింది.
   
    జాజిబాల ఈసారి భారీగా ఆవులించింది.

 Previous Page Next Page