ఊరంచున మిట్టమీద ఒక పాతభవనం ఉంది. అది ఆ ఊరి జమీందారు గారిది. కాని, ఇప్పుడందులో కాపురం ఎవరూలేరు. ఆ ఇంటి వాళ్ళంతా హైద్రాబాద్ లోనో, బెంగుళూరులోనో ఉంటారట. నౌకర్లు మాత్రం రోజూ ఊడ్చిశుభ్రంగా ఉంచుతుంటారు. రాజేశ్వర్రావని ములవి జమీందారు అప్పుడప్పుడూ వచ్చి, నాలుగైదు రోజులుండి వ్యవహారాలు చక్కబెట్టుకొని పోతూ ఉంటాడు.
భవనం వెనుకభాగంలో పెద్దతోట ఉంది. మామిడి సపోటాలాంటి పళ్ళచెట్లు, పొగడ సంపెంగలాంటి పూలచెట్లు ఉన్నాయి. వాటికంతా నౌకర్లు కాపలా ఉంటారు తోటమధ్యలో పెద్దకోనేరులాంటి దిగుడుబావి ఉంది. ఊళ్ళో పిల్లలు చాలామంది ఆ బావిలో ఊతపడేవాళ్ళు.
జమీందారుగారి భవనం, తోట అపురూపవాళ్ళ ఆట స్థలాలు.
తినడానికి ఇంట్లో చేసినవి ఏవేవో తెచ్చేది. ఆఖరికి ఏం లేకపోతే మామిడి కాయలయినా తెచ్చేది.
జమీందారుగారి భవనం చాలా పెద్దది. మనుషులెవరూ ఉండక పోవడంవల్ల నిశ్శబ్దంగా ఉండి భయం గొల్పేది. పైగా భవనం పైభాగంలో గూళ్ళలో కాపురముంటున్న పావురాల కువకువలొకటి. శిశిర్ చిన్న గుండెలో చిత్రమైన భయాన్ని కలుగజేసేవి! చిన్నప్పటినుండి ఆ పరిసరాల్లో తిరిగిన పిల్లలు కనుక అపూవాళ్ళకి ఏం భయంవేయదు. భవనానికి బయటినుండి ఉన్న మెట్లగుండా పైకి తీసికెళ్ళేది. పైన పెద్ద పెద్ద బాత్ రూంలూ, పెద్ద పెద్ద వరండాలూ ఉండేవి. వెంటిలేటర్స్ నుండిచూస్తె లోపల పాలిష్ బండలు వేసిన పెద్ద పెద్ద గదులుండేవి. పెద్ద పెద్ద పందిరి మంచాలూ , సింహాసనంలాంటి కుర్చీలూ ఉండేవి. గోడలకి తుపాకులూ, కత్తులూ, పులి , దున్న తలకాయలుండేవి. వాటికి కళ్ళుండేచోట గోళీలు మెరిసేవి.
భవనం పైభాగం మీదికి ఒంగివున్న పొగడచెట్టు కొమ్మ ఒకటి పువ్వులను రాల్చేది. అపురూపకు ఆ పువ్వులను ఏరుకోవడం ఒక దిన చర్య. శిశిర్ కూడా సాయంచేసేవాడు. ఆ పువ్వుల్ని ముట్టుకొంటే సుతి మెత్తగా సువాసనలు వెదజల్లుతూ ఉండేవి.
అపురూప స్నేహితుల్లో మురళి వాళ్ళ అమ్మమ్మగారింటికి వెడితే, ప్రభు మంచమెక్కాడు టైఫాయిడ్ జ్వరంతో. ఇకఇద్దరే మిగిలారు ఆడుకోడానికి. ఆ వీధిలో ఇంకా ఆడపిల్లలున్నా అపురూప వాళ్ళతో ఆడేది కాదు.
"ఇది ఆడపిల్లయి పట్టిందేగాని దీనికన్నీ మగరాయుడి బుద్దులు. ఆడుకోవడానికి ఆడపిల్లలు పనికిరారు. మగపిల్లలేకావాలి! చెట్లెక్కడం మిద్దెలెక్కడం, బిల్డింగోడి ఆడడం ఇదంతా ఏమిటి? అరుణా! దీనికి కాస్త భయం చెప్పవే! నెత్తిమీదికి పదేళ్ళొచ్చాయి! ఆకాశంలో గాలి పటంలా స్వేచ్చగా వదిలేశావు! ఒక్క పనీ నేర్పలేదు! మరో రెండు మూడేళ్ళలో పెళ్ళయ్యి ఒకింటికి పోయేపిల్ల! పనిపాట రాకపోతే కన్న వాళ్ళని నాలుగూ కడిగేస్తారు దాని అత్తగారు!" అని సణిగేది అనంతలక్ష్మమ్మ.
"పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు చాకిరి! పసిపిల్ల! ఈ నాలుగు రోజులైనా సుఖపడనీ!" అనేవాడు సుప్రసన్నాచారి. తండ్రి ఆ పిల్లకి అపురూప అనిపేరు పెట్టుకోవడమేకాదు, అతి అపురూపంగా చూసేవాడు. జీవితంలో మొదటిసారిగా తండ్రిని చేసిన ఆ పిల్లంటే ఆయనకి ఎక్కడలేని ఆపేక్ష!
ఒకరోజు ఉదయం శిశిర్ వెళ్ళేసరికి అపురూప తండ్రితో బావికి వెళ్ళబోతూంది బావిలో ఈత పడడానికి.
"నేనూ వస్తాను అప్రూపా!"
"ఈతొస్తుందా?"
"రాదు రవి మామయ్య ఈత నేర్పుతానని చెప్పి నేర్పలేదు!"
అక్కడే వున్న ఆచారి "మీ మామయ్య పెళ్ళికొడుకు అయ్యాడుగా? ఇక నీ కెక్కడ ఈత నేర్పుతాడు గాని నేను నేర్పుతాను. మీ అమ్మమ్మగారి నడిగి కొబ్బరికాయకు డబ్బులిప్పించుకురా పో! అలాగే కాస్త పటిక బెల్లం కూడా పట్రా"
"వేసుకోడానికి బట్టలు కూడా తెచ్చుకో" అపురూప చెప్పింది.
శిశిర్ తూనీగలా వెళ్ళి వేసుకోవడానికి బట్టలు, కొబ్బరికాయకు డబ్బులు, ఒక కాగితంలో పటిక బెల్లమూ తెచ్చాడు. మాణిక్యమ్మ మనముడితో పాటు గేటు బయటికి వచ్చి "జాగ్రత్త ఆచార్లూ!" అని చెప్పి వెళ్ళింది.
కొట్టుకు వెళ్ళి కొబ్బరికాయ తెచ్చి "ఇక పదండ్రా!" అన్నాడు ఆచారి.
"మునగ బెండు తెచ్చేడు నాన్నగారూ!"
"చేతులమీద నేర్పితేనే త్వరగా వస్తుంది ఈత! అయినా మొదటి సారి కదా? బెండు ఉంటేనే నయం పట్రా!"
అపురూప ఇంట్లోకి వెళ్ళి మునగ బెండు చంకన పెట్టుకుని వచ్చింది.
జమీందారుగారి తోట బావిలోనే గంగకి పూజ చేసి, కొబ్బరికాయ కొట్టి, శిశిర్ నడుముకి మునగ బెండు కట్టి నీళ్ళలో వదిలాడు ఆచారి.