Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 6

    రంగయ్య చెప్తుంటే నోళ్ళు తెర్చుకుని వింటున్నారు రాంబాబు, చిన్నారావులు.

   
                                 *    *    *    *

   
    "ఆ...."

    డెన్ లోంచి వచ్చిన ఆ ఆర్త నాదంతో ఆ పరిసరాలు ప్రతిధ్వనించాయ్. ఆ శబ్దానికి ఆ ప్రాంతంలోని గజ్జికుక్కలూ, పిల్లులూ, ఎలుకలూ కంగారుగా అటూ ఇటూ పరుగులు తీశాయ్.

    ఓ బండరాయిమీద పాకుతున్న తొండ గుండె ఆగి నేలమీద ఠప్పున పది ప్రాణాలు వదిలేసింది.

    డెన్ లోపల....!

    గజదొంగ మంగులు  "ఓహోహోహో...హ్హొహ్హో..." అని ఏడుస్తూ నల్లగా కమిలిన చేతిని వూదుకుంటున్నాడు.

    మంగులు కుడిభుజం వీరూ జాలిగా అతని వంక చూశాడు.

    "బాగా కాలిందా బాస్?" అని అడిగాడు.

    "లేదు రా! చాలా చల్లగా వుంది.నేను వట్టినే ఏమీ తోచక ఏడుస్తున్నా తొట్టినాయాలా! ఓహ్హోహ్హోహ్హో...." ఏడుస్తూ అన్నాడు మంగులు.

    "సారీ బాస్" అన్నాడు వీరూ.

    "సారీ ఏంట్రా....సారీ! నువ్వు రోజు రోజుకీ ఇంతింత లావు కొవ్వొత్తులు వెలిగిస్తున్నా వేంట్రా  పింజారీ వెదవా....!" మండిపడుతూ అన్నాడు మంగులు.

    "సన్న కొవ్వొత్తులైతే మంట తక్కువగా ఉండి మీరు శపధం చెయ్యకముందే గాలికి ఆరిపోతాయని   లావు లావు కొవ్వొత్తులు వెలిగిస్తున్నా బాస్...." వినయంగా చెప్పాడు వీరూ.

    "మంచిపని చేశావ్.ఓ హ్హో హ్హో హ్హో...." చెయ్యి వూదుకున్నాడు మంగులు. 

       "బాస్....మీరు రొజూ ఇలా కొవ్వొత్తులు ఆర్పి చేతులు కాల్చుకుంటూ, బాధపడుతూ శపధాలు చెయ్యకపోతే, డైరెక్టుగా పోలీస్ కమీషనర్ కి ఫోన్ చేసి విషయం చెప్పొచ్చుకదా...." డెన్ లోని గుంపులోంచి ఒకడు తెలివిగా అన్నాడు.

    మంగులు వాడిని మండిపోయేలా చూశాడు.

    "దరిద్రుడా! నా చేతిని ఇన్నిసార్లు మంటెక్కించుకుంటే గానీ నీకా విషయం తట్టలేదా?" అని వాడిని తిట్టి "ఒరేయ్....ఆ ఫోనిలా తెండిరా" అంటూ అరిచాడు.

    ఫోన్ తెచ్చి మంగులు ముందు పెట్టాడు వాళ్ళలో ఒకడు.

    "ఆ కమీషనర్ గాడి ఫోన్ నెంబరేంట్రా?" వీరూని అడిగాడు మంగులు.

    వీరూ డైరీ తీసి, పేజీలు తిప్పి చూసి ఫోన్ నెంబర్ చెప్పాడు.

    గజదొంగ మంగులు నెంబర్ డయల్ చేశాడు.

    అవతలి ఫోన్ రింగవుతున్న శబ్దం. మంగులు ఎదురుచూస్తున్నాడు.

    అవతల వైపు ఉన్నవారు ఫోన్ ఎత్తారు.

    "హలో...." అంది అవతలి గొంతు.

    "హలో...." అన్నాడు మంగులు.

    వీరూ చాలా కంగారుపడిపోయి  "హవ్వ హవ్వ...."అని నోటి మీద అరచేత్తో కొట్టుకున్నాడు.

    మంగులు రిసీవర్ కి చేయి అడ్డుపెట్టి ప్రశ్నార్దకంగా వీరూ వైపు చూశాడు.

    "ఏంటి బాస్! చాలా సాదా సీదాగా హలో అనేస్తున్నారు.మీరు గజదొంగ అని మర్చిపోతున్నారు.ఏదైనా మాట్లాడేముందు భయంకరంగా నవ్వాలి!" అన్నాడు వీరూ.

    మంగులు నాలుక కొరుక్కున్నాడు. వీరూ వంక మెచ్చుకోలుగా చూసి రిసీవర్ మీది చేతిని తీసివేసి  "హ....హ....హ...." అని భయంకరంగా నవ్వాడు.

    "ఎవరండీ మీరూ....? ఏం మాట్లాడకుండా పిచ్చినవ్వులు నవ్వుతున్నారు?!" అవతలి వ్యక్తి చికాకుగా ప్రశ్నించాడు.

    "నేనెవరైతే ఏంబే....కమీషనర్ లింగారావ్ వున్నాడా?" గంభీరంగా అన్నాడు మంగులు.

    "ఇక్కడ అలాంటి వాళ్ళెవరూ లేరు బే....రాంగ్ నెంబర్....!" అంటూ అవతలివాళ్ళు ఫోన్ డిస్కనెక్ట్ చేసేశారు.

    మంగులు వీరూవంక చికాకుగా చూస్తూ   "ఇంకోసారి భయంకరంగా నవ్వమని సలహా ఇచ్చావో....నీ నడ్డిమీద నాలుగు పీకులు పీకుతా.నువ్విచ్చింది రాంగ్ నెంబరంట!" అన్నాడు.

    "సారీ బాస్" అని మరోసారి డైరీని రిఫర్ చేసి ఇంకో నెంబర్ యిచ్చాడు వీరూ.

    మంగులు మళ్ళీ ఆ నెంబర్ డయల్ చేశాడు.

    "హలో...." అవతలి నుండి పోలీస్ కమీషనర్ లింగారావ్ గొంతు.

    "హలో....కమీషనర్ లింగారావ్ కావాలి!" గంభీరంగా అన్నాడు మంగులు.

    "నేనే మాట్లాడ్తున్నా!" అన్నాడు లింగారావ్.

    "నేనే మంగుల్ని మాట్లాడ్తున్నా!" ఇంకా గంభీరంగా అన్నాడు మంగులు.

    "ఏదీ....మా వీధిచివర వున్న మటన్ షాప్ మంగులా? ఏంటోయ్! నిన్న నువ్వు పంపిన కూర చాలా ముదురుగా వుంది" చికాకుగా అడిగాడు పోలీస్ కమీషనర్ లింగారావ్.

    "ఆ...." బాధగా అరిచి నొసలుమీద కొట్టుకున్నాడు మంగులు.

    "నేను మీ ఇంటి పక్కనున్న మటన్ షాప్ మంగుల్ని కాను....నువ్వు గజదొంగ గంగుల్ని కాల్చి చంపావు కదా! వాడి తమ్ముడ్ని! గజదొంగ మంగుల్ని."

    "ఓహ్హో....అలాగా? ఏం -ఫోన్ చేశావ్? నీక్కూడా కాల్చిచంపించుకోవాలని సరదాగా వుందా?" అడిగాడు లింగారావ్ వెటకారంగా.

 Previous Page Next Page