Previous Page Next Page 
అందరూ దొంగలే పేజి 5

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ స్టేషన్ బయటికి అడుగులు వేశాడు. రాంబాబు, చిన్నారావ్ లు అతన్ని అనుసరించారు.

   
                                 *    *    *    *

    అది ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇల్లు. రాంబాబు, చిన్నారావ్ లు  హాల్లో ఎంతో టెన్షన్ గా నిల్చుని వున్నారు.

    ఇన్స్ పెక్టర్ తమని యింటికి ఎందుకు తీసుకొచ్చారా అని చచ్చేంత సస్పెన్స్ గా వుంది వాళ్ళకి. వాళ్ళిద్దర్నీ హాల్లో నిలబెట్టి ఇన్స్ పెక్టర్ లోపలికెళ్ళి అప్పటికి పావుగంట పైనే అయ్యింది.

    పోలీస్ స్టేషన్లో సెల్ లో వున్న క్రిమినల్స్ ముందు తమని తంతే బాగుండదని యింటికి తీస్కొచ్చాడా....? ఇక్కడ ఇద్దర్నీ కుళ్ళబొడుస్తాడా అని వాళ్ళకి అనుమానంగా వుంది.

    "మనవల్ల జనం సార్ ని చింతకాయ పచ్చడి చేసేశారు. మనల్ని అంతీజీగా వదుల్తాడా అని నా అనుమానం....?" అన్నాడు చిన్నారావ్ భయం భయంగా.

    "చూద్దాం...." లోపల భయంగా వున్నా బింకంగా అన్నాడు రాంబాబు.

    ఇంతలో ఇన్స్ పెక్టర్ అప్పారావ్ లోపల్నుండి  హాల్లోకి వచ్చాడు.రాంబాబూ, చిన్నారావ్ ఇద్దరూ అతన్ని భయం భయంగా చూశారు.

    "నిన్న జరిగిన  దానికి మీకో శిక్ష....మా యింట్లోనే విధిస్తున్నా!"గంభీరంగా అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    "ఏంటిసార్ అది ?" ఇద్దరూ కోరస్ గా అడిగారు.

    "ఏంలేదు....ఈ రోజు సాయంత్రందాకా మీ ఇద్దరూ మా ఆవిడతో గడపాలి" చిలిపిగా ఇద్దరివంకా చూస్తూ అన్నాడు  అప్పారావ్.

    ఆ ఇద్దరికీ సంతోషంగా గట్టిగా కెవ్వుమని కేకేసి చిందులు వెయ్యాలనిపించింది. కాని అలా చేస్తే బాగుండదేమోనని ఊర్కున్నాడు.

    "మీరు కూడా మాతో వుంటారా సార్?" ఆనందం నుండి తేరుకుని అడిగాడు రాంబాబు.

    "లేదు....! నేను ఇప్పుడే స్టేషన్ కి వెళ్ళిపోతా" అన్నాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్.

    రాంబాబు, చిన్నారావ్ లకి మరింత ఆనందంతో  గంతులు వెయ్యాలనిపించింది. కానీ ఇందాకటి మొహమాటమే  అడ్డొచ్చింది.

    అంతలోనే వాళ్ళకి అనుమానం వచ్చింది.

    అయినా ఇదేం శిక్ష! అని అనుకున్నాడు. ఇద్దరూ అయోమయంగా మొహాలు చూస్కున్నారు.

    "మీరు లొపలికి రండి...." బొంగురు గొంతు వాళ్ళని ఈ లోకంలోకి తెచ్చింది.

    "యస్సార్....!"అన్నాడు ఇద్దరూ ఇన్స్ పెక్టర్ అప్పారావ్ వంక చూస్తూ.

    "ఆ గొంతు నాది కాదు....మా ఆవిడది!"అంటూ గది గుమ్మం వైపు చూపించాడు ఇన్స్ పెక్టర్ అప్పారావ్. 

        గుమ్మంలో అతను....ఛి  ఛి ....కాదు....ఆమె నిలబడి వుంది.

    ఇన్స్ పెక్టర్ అప్పారావ్ భార్యని చూసిన  రాంబాబు, చిన్నారావ్ లకి మూర్ఛ వచ్చినంత పనయింది. ఆమె అచ్చం మగాడిలా వుంది....నల్లగా, బక్కగా, పొడవుగా వుంది. సినిమాల్లో కామెడీ వేషాలేసే చిడతల అప్పారావ్ కో లేదా కళ్ళు చిదంబరానికో చీరకడ్తే ఎలా వుంటుందో ఆమె అచ్చం అలానే వుంది.

    "ఊ....లొపలికి రండి....ఎంటలా  చూస్తున్నారు ఎర్రిమొహాలేస్కుని" అంది ఇన్స్ పెక్టర్ భార్య మదన మనోహరి.

   
                                                                    *    *    *    *

   
    సాయంత్రం నాలుగు గంటలైంది. అప్పటిదాకా హెడ్ కానిస్టేబుల్ రాంబాబు, కానిస్టేబుల్ చిన్నారావులు ఇన్స్ పెక్టర్ అప్పారావ్ ఇంట్లో బండెడు బట్టలు ఉతికారు....ఇల్లంతా తడిబట్ట పెట్టి  తడిచారు....యింటి బూజులు దులిపారు....వాళ్ళిద్దరి ఒళ్ళూ నలిగిపోయింది.ప్రస్తుతం వాళ్ళు ఆ ఇంట్లోని వంట పాత్రలన్నీ తోముతున్నారు.

    "ఏం....ఇంకా కాలేదా....?" బొంగురు గొంతుతో అంటూ వంట గదిలోకి వచ్చింది మదన మనోహరి.

    "అయిపోయింది మేడం....ఇంకో  పావుగంటే!" అన్నాడు రాంబాబు.

    "ఊ...."అని ఒకసారి మూనిగి  అక్కడినుండి వెళ్ళిపోయింది మదన మనోహరి!

    "మదన మనోహరి....! ఆహా!! ఆమెకి  చక్కగా సూటయిన పేరు" నొసలుమీద కొట్టుకుంటూ అన్నాడు రాంబాబు.

    "అసలు శిక్ష ఈ గిన్నెలు తోమడం, బట్టలుతకడం కాదు....ఈవిడ్ని చూడడం, ఈవిడ గొంతు వినడం" అన్నాడు చిన్నారావ్.

    "అసలు మన సార్  ఈవిడని ఎలా చేస్కున్నాడ్రా బాబూ....నాకైతే అర్ధం కాలేదు....నీకేమైనా అర్ధమైందా?" అడిగాడు రాంబాబు.

    చిన్నారావ్ లేదు అన్నట్టుగా తల అడ్డంగా వూపాడు.

    "కానీ ఆయన ఎందుకు ఇలా చేశాడో నాకు తెల్సు!" అన్నాడు అప్పుడే వంట గదిలోకి  ఎంటర్ అవుతూ ఓ వ్యక్తి.

    "ఎవరు నువ్వు?" అడిగాడు రాంబాబు అతన్ని.

    "నా పేరు రంగయ్య....ఇక్కడ వంట మనిషిని...." చెప్పాడు రంగయ్య.

    "సరే....మన సార్ ఈ మదన మనోహరిగారిని ఎందుకు చేస్కోవాల్సి వచ్చింది? పెళ్ళికి ముందే ఆమెతో తప్పుచేసి ఇరుక్కున్నాడా?" కుతూహలంగా అడిగాడు రాంబాబు.

    రంగయ్య రాంబాబుని పిచ్చివాడిని చూసినట్టు చూశాడు.

    "అసలు ఏ మగాడైనా ఆమెతో తప్పు చెయ్యగలడా?"

    "మరి సార్ ఎలా ఇరుక్కున్నాడు?" అడిగాడు చిన్నారావ్ ఆతృతగా.

    "సార్ కి ఒకప్పుడు చాలా అందమైన పెళ్ళాం వుండేది....ఆమెని మరో అందగాడు లైన్లో పెట్టి లేవదీసుకుపోయాడు....అందుకే మళ్ళీ అలాంటి ప్రమాదం జరక్కూడదని  ఈ సారి సార్ ఏరి కోరి ఈమెనుచేస్కున్నాడు....ఈమైతే  సేఫ్ కదా మరి?!"

 Previous Page Next Page