Previous Page Next Page 
మణిదీపం పేజి 6

    ఎంతటి అమానుషం! ఇంకా సరిగ్గా కళ్ళయినా తెరువని పసిగుడ్డుని హత్య చేయడం!

    బాగా చదువుకున్నవాళ్ళే గర్భంలో వున్నది ఆడ శిశువని తెలియగానే హంతకులైపోతున్నారు. ఏమీ చదువుకోని ఈ పల్లెటూరి మనిషి ఇలాంటి అమానుశానికి ఒడిగడితే ఆశ్చర్యం ఏముంది?

    "నిన్ననే మా అత్త ఖచ్చితంగా చెప్పింది 'పిల్లని ఇక్కడే వదిలించుకురా. పిల్లనెత్తుకు ఇంటికి వస్తే నీకు చోటు లేదు' అని. 'కన్నతల్లిని నా చేతులారా నేనే చంపుకోలేను' అన్నాను. అందుకని తనే ఆ పసిపాప హత్యకు పూనుకుంది."

    ఝాన్సీలక్ష్మీబాయి, రుద్రమదేవి, రజియా సుల్తానావంటి వీరవనితలెందరినో కన్న భారతావని మనది అని గర్వంగా చెప్పుకునే మన దేశంలో ఆడ శిశువులకెటువంటి దుర్గతి పట్టింది!

    తల్లి కడుపు పొత్తిళ్ళలో వుండగానే హతమార్చబడుతున్నది నిర్దాక్షిణ్యంగా.

    తను పుట్టడమే తల్లి గుండెల్లో కన్నీటి కెరటాన్ని స్పష్టిస్తూంది.

    తను పుట్టడంతోనే కుటుంబంలో ఒక విషాద వీణను శృతిచేస్తోంది.

    "ఈ పాపని మా అత్తగారు ఎలాగూ బ్రతకనివ్వరు. ఈ రోజు వడ్లగింజలు గొంతులో వేసి చంపాలనుకొంది. రేపు ఇంకేమైనా చేసి చంపుతుంది. నా కళ్ళముందే నా బిడ్డ హత్యకు గురికావడం నేను భరించలేను. ఈ పిల్లను తీసికెళ్ళి ఎవరైనా పిల్లలు లేనివాళ్ళకిచ్చి పుణ్యంకట్టుకో సిస్టర్! అడుక్కుతినే బిచ్చగాళ్ళకిచ్చినా సరే. నా బిడ్డ ఎక్కడో ఒకచోట బ్రతికేవుంటే చాలు."

    "నిన్న, నువ్వేకదా పాపని తీసుకుపోయి ఏ నూతిలోనో గోతిలోనో పారేయమన్నది? ఒక్క రోజు గడిచేసరికి యింత మమకారమా?"

    "నా మొగుడు, అత్తగారి భయానికి అలా అన్నానుగానీ నా బిడ్డ అంటే నాకు మమకారం వుండదా?"

    "సరే! నీ బిడ్డ నీకంత బరువైతే నేను తీసుకుంటాను. నేనే పెంచుకుంటాను. కానీ మళ్ళీ ఏనాడూ నా పాప ఏదీ అని అడగకూడదు. పాప నాకు కావాలి అని అడగకూడదు. పాపకి బుడ్డి తెలిశాక లోకంలో యింత అమానుషమైన మనుషులుంతారని ఆమెకు తెలియడం ఇష్టంలేదు. పాప నా కూతురిగా పెరుగుతుంది."

    దేవకి కళ్ళలో నీళ్ళు జలజలా రాలిపోతున్నాయి.
    ఆనంద విషాదాలు కలగలసిన కన్నీళ్లు అవి!
   
                               *    *    *    *


    "చంపుకొంటారో, పెంచుకొంటారో...వాళ్ళ పిల్ల వాళ్ళ ఇష్టం! ఆ పిల్లను తెచ్చి నువ్వు పెంచడం ఏమిటి? పెళ్ళి కావాల్సిన పిల్లవు....ఎవరో కన్నపిల్లకు తల్లి నౌతానంటావేమిటి?" తల్లి అరిచింది పసిగుడ్డుతో తిరిగివచ్చిన అరుణోదయను చూసి.

    "దీనికింత రాద్దాంతం దేనికమ్మా? మనింట్లో ఓ కుక్క వుంది. ఓ పిల్లి వుంది. దాని పిల్లలున్నాయి. వాటితోపాటు యీ పిల్ల అనుకోరాదూ?"

    "పిల్లిని పెంచుకోవడం పిల్లను పెంచుకోవడం ఒక్కటేననుకొంటున్నావా? ఆ పిల్ల పెరుగుతున్నకొద్దీ ఎన్ని సమస్యలు? ఎవరో వదిలించుకొన్న శనిని నువ్వు చంకన ఎక్కించుకురావడం ఏమిటి? నీ తెలివంతా ఏమైపోయింది?"

    "చూడు! ఈ పసిపాప నీకు శనిలా కనిపిస్తూందా? గులాబీరేకుల్లా బుగ్గలు, సంపంగిలా ముక్కు, ఇప్పుడే విచ్చుకొంటున్న కలువుపువ్వులా ఈ వేళ్ళు...ఇంత అందమైన పాపను వాళ్ళత్త చంపేయాలనుకొంది. చూస్తూ ఈ పసిదాన్ని హంతకుల చేతిలో వదిలి రాలేకపోయాను. కాసిన్ని పాలు పోస్తే బ్రతికిపోతుందికదమ్మా పాప."

    జానకమ్మ చూసింది. పిల్ల తెల్లగా కడిగిన ముత్యంలా వుంది. ఇంత ముద్దొచ్చే పాపను చంపడానికి ఆ అత్తకు చేతులెలా వచ్చాయోగానీ దీన్ని పెంచుకొంటే తమకి సమస్యలొస్తాయికదా అనుకుందామె. ముఖ్యంగా అరుణోదయకి పెళ్ళి సమస్య అవుతుంది.

    రోజులు గడిచినకొద్దీ ఈ పిల్ల అరుణోదయకే ఎవరివల్లో పుట్టిన పిల్లగా ప్రచారమైనా ఆశ్చర్యంలేదు.

    ఈ ప్రపంచములో కథలల్లేవాళ్ళకు కొరతేమీ లేదు.

    మనసులో చివురువేసిన మమకారాన్ని తుంచివేసుకొని చెప్పింది...."దీన్ని తీసుకుపోయి ఏ అనాధశరణాలయంలోనో వదిలిరా! లేదా ఎవరికయినా పిల్లలు లేని వాళ్ళకు ఇచ్చెయ్యి. ఇది మాత్రం మనింట్లో పెరగదానికి వీల్లేదు!"

    "ఈ పసిదానిపట్ల మనసున్న మనుషులు కూడా నిర్ధాక్షిణ్యం వహిస్తే యింకేం చేస్తాను? అలాగే ఏదైనా అనాథశరణాలయంలొ వదిలిపెడతాలే! నేను రేపు అర్జంటుగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చాక అలాగే యిచ్చేస్తాను. అంతవరకు కొంచెం దయతో పాలు పట్టు యీ పసిదానికి."

    పిల్లను తల్లి దగ్గర వదిలి నెలా పదిహేనురోజుల తర్వాత వచ్చింది అరుణోదయ.

    జానకమ్మ పోషణలో బొద్దుగా తయారైంది పాప. మరింత తెల్లగా, అందంగా తయారయింది. కళ్ళకి కాటుకా, బుగ్గన చుక్కా, గులాబీ రంగు ప్రాక్ లొ బుట్టబొమ్మలా ముద్దులొలికే పాపని చూసి ఆశ్చర్యపోయింది అరుణోదయ.

    మెడలు గట్టిగా నిలబెట్టేసి నల్లనల్లని కళ్ళతో అమాయకంగా మనుషులను చూస్తోంది. పడుకోబెడితే బోర్లాపడడానికి ప్రయత్నిస్తోంది!

    ఈ నెలా పదిహేను రోజుల్లో పాప ప్రాణమైపోయింది జానకమ్మకు. సహజంగా ఆమెకు కారుణ్యం ఎక్కువ! ఎక్కడినుండో వచ్చిన పిల్లిపిల్లకు పాలు పోసి బొద్దుగా తయారుచేసింది. ఇంటిముందు ఎండిన డొక్కతో పడి వుండే కుక్కాపిల్లకి రోజూ యింత అన్నం పడేసి బలిపించింది. అవి కన్నబిడ్డల్లా ఆమె వెంట వెంటే తిరుగుతూంటాయి.   

 Previous Page Next Page