Previous Page Next Page 
మణిదీపం పేజి 7

    జానకమ్మకి ముగ్గురు పిల్లలు కాదు-అయిదుమంది అంటుంటారు వాటితో ఆమె అనుబంధాన్ని తెలిసినవాళ్ళు.

    ఇప్పుడు ఆరుమంది అయ్యారు.

    అరుణోదయ వచ్చాక ఆమె 'అనాథ శరణాలయం' పేరెత్తితే ఒట్టు!

    కార్తీకకి కూడా పాప ప్రాణమైపోయింది.

   
                              *    *    *    *


    చదరంగం ఆట చాలా రసపట్టులొ వుంది.

    అర్చనా, అరుణోదయా తమ తమ అశ్వగజాలతో హోరాహోరి పోరాటం సాగిస్తుండగా డాక్టర్ అరవింద్ వచ్చాడు.

    "రండి!" అర్చన సాదరంగా ఆహ్వానించింది. "ఒక పడి నిమిషాలు! అయిపోతుంది ఆట. ఈలోగా అ పత్రిక చేతికి తీసుకొని అందులో ఒక కధుంది-చదవండి. 'ఆడదిగా పుట్టటమే శాపమా?' అందులో పల్లవికి వచ్చిన సమస్య ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుందో ముగ్గురం చర్చిద్దాం! అన్నట్టు....చెప్పడం మరిచాను. ఈ అమ్మాయి అరుణోదయ. రామకృష్ణ తమ్ముడి ఫ్రెండ్ చెల్లెలు. పాన్ గల్ లొ ఏ.ఎన్.ఎమ్.గా చేస్తోంది. మన పక్కింట్లోనె అద్దెకి దిగింది. ఏయ్, అరుణా! నేను మాటల్లో వుండగా నా గుర్రాన్ని కబళిస్తావా? అన్యాయం."

    "మీరు స్టెప్ వేసింది ఆయన రాకముందే కదా ఆంటీ?"

    "నా ఆటంతా ఈ గుర్రంమీదే వుంది. ప్లీజ్! వెనక్కి తీసుకోనివ్వు."

    "ఇది యుద్ధం! ఇరుపక్షాలు హుందాగా, సిన్సియర్ గా ఆడాలి. చిన్నపిల్లల్లా వేసిన స్టెప్ వెనక్కి తీసుకోకూడదు."

    "ప్లీ...జ్."

    "ఈ ఒక్కసారికి ఒప్పుకుంటున్నానాంటీ" తన ఏనుగును వెనక్కి తీసుకుంది అరుణోదయ.

    బ్రతుకుజీవుడా అనుకుంటూ తన గుర్రాన్ని మరో దిశకు మలిపింది అర్చన. అయిదు నిమిషాలు గడిచిన తర్వాత స్టెప్ వేయలేకపోయింది. దీర్ఘాలోచనలో పడిపోయింది, తల పట్టుకుని.

    "ఆంటీ, క్విక్! ఇంతసేపా?"

    "ఇంత ఆలోచన ఎందుకు? ఈ ఒంటెను యిటు జరపండి" సలహా యిచ్చాడు అరవింద్.

    "మహాభారతంలో దుర్యోధనుడు పాండవులయిదుగురినీ తనతో మల్లయుద్దానికి ఆహ్వానిస్తాడు. అయిదుగురు ఒక్కడితో యుద్ధం చెయ్యడము ధర్మంకాదని నలుగురిని పక్కకు పంపి భీముడొక్కడే దుర్యోధనుడితో తలపడతాడు. అదీ యుద్దనీతి" సున్నితంగా మందలించింది అరుణోదయ. "మీరు చెస్ బాగా ఆడగలరంటే తరువాత ఆట మీతో ఆడతాను. గెలవండి నాతో_చూద్దాం" చాలెంజ్ చేసింది.

    "చెస్ లో తనకి ఎదురులేదని ఈ పిల్లకి గర్వం! చెస్ లో చాంపియన్ కదా. ఎన్నో పోటీల్లో కప్పులూ, బహుమానాలూ తెచ్చుకొందట. వీళ్ళన్నయ్య వెంకట్ కూడా బాగా ఆడతాడు."

    "ఆహాఁ! అయితే ఈమెతో ఆడాల్సిందే" అన్నాడు అరవింద్, ఆమెను కొంచెం శ్రద్దగా గమనిస్తూ. పాతికేళ్లుంటాయేమో! పరవళ్ళు తొక్కుతున్న పరువం, చామనఛాయ. చూడగానే ఎంత బాగుందీ అనిపించకపోయినా, చూడగా చూడగా ఏదో ఆకర్షణ చుట్టేస్తుంది. అది చాకులాంటి చురుకుదనమో, యవ్వనపు మిసమిసో-ఏదో అవ్యక్తమైన ఆకర్షణ...సుడిగుండంలోకి లాగేస్తున్నట్టుగా వుంది ఆ అమ్మాయి. అరుణోదయా! చక్కటి పేరు.

    "ఏమిటీ? బ్రేక్ డాన్సా? రాక్ డాన్సా?" మాట్లాడుతూనే అలవోకగా స్టెప్స్ వేయసాగింది అరుణోదయ. కాస్సేపు ఆమె ఆట గమనించిన అరవింద్-'ఓ! చాలా చురుగ్గా ఆడుతోందే' అని అనుకోకుండా వుండలేక పోయాడు. దృష్టి మరల్చుకొని కథ చదవడం మొదలుపెట్టాడు.

    అది ఒక యువతి జీవిత సమస్య! ఒక కథగా మల్చి డాక్టరుగారి సలహాకోసం రాసింది.

   
                               *    *    *    *


    రాఘవరావు దంపతులది మధ్యతరగతి కుటుంబం. పల్లవి జ్యేష్ట పుత్రిక. తరువతః యిద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. పల్లవి బి.ఎ. ఫస్టియర్ లో వుండగానే వర్షాన్వేషణ మొదలుపెట్టారు తల్లిదండ్రులు. ముందు ఒక బరువు దింపుకొంటె తరువాత నెమ్మదిగా మగపిల్లల చదువులు, చిన్నదాని పెళ్ళి చూసుకోవచ్చని వాళ్ళ ఆలోచన.

    పల్లవి ఏవరేజ్ స్టూడెంట్. పెళ్ళయ్యేవరకు యింట్లో కూర్చొని చేసేదేమిటని కాలేజీకి వెళ్ళి చదువుతోందేగానీ పెద్దగా చదువులపట్ల ఇష్టం, పెద్ద పెద్ద చదువులు చదవాలన్న ఆశయాలు, ఆశలు ఏం లేవు ఆమెకు. పెద్దవాళ్ళు పెళ్ళి సంబంధాలు చూడ్డంతో ఆ పిల్ల మనసు చదువునుండి డైవర్ట్ అయ్యి రాబోయే వరుడి గురించి ఆకాశ కుసుమాలు అల్లుకోవడంలో మునిగిపోయింది.

    పెళ్ళికి ఆ రోజుల్లో ఆడపిల్ల చదువుకోవడం కూడా ఒక క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్ పాస్ కాగానే డిగ్రీలో చేర్చారుగానీ ఆ పిల్ల సీరియస్ గా చదివి మెడల్స్ తెచ్చుకోవాలని ఆశలేం పెట్టుకోలేదు పెద్దవాళ్ళు  కూడా! సంబంధాలు చూస్తూండగానే డిగ్రీ ఫైనల్ కి వచ్చేసింది పల్లవి. పిల్ల సన్నగా వుందని, పెద్దగా అందచందాలు లేవని రిమార్క్ పాస్ చేశారు చూసినవాళ్ళంతా.

 Previous Page Next Page