Previous Page Next Page 
మణిదీపం పేజి 5

    "ఈసారీ ఆడపిల్ల పుడితే నా బ్రతుకు ఆ ఇంట్లో కుక్కకన్నా హీనమౌతుంది. నా బాధ అర్ధం చేసుకో సిస్టర్."

    "ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా మన చేతిలో లేదుకదా? ఆడపిల్లే పుడుతుందనుకో! అందర్నీ ఎదిరించి ధైర్యంగా పెంచుకోవాలిగానీ ఇలా మాట్లాడవచ్చా? ఇంకా ఈ లోకంలో అడుగయినా పెట్టని నీ బిడ్డని హత్యా చేయమని పురమాయిస్తావా? కన్నతల్లివి నువ్వే ఇలా ఆలోచిస్తే నీ అత్తనీ, మగడినీ అనడానికి ఏముంది తప్పు? ఇలా ఆలోచించకూడదు. ఇలా మాట్లాడకూడదు."

    "నా బాధ మీకు అర్ధంకావడంలేదు."

    "అర్ధంకాకపోవడానికి ఏముంది? ధైర్యంగా పుట్టిన పిల్లను పెంచుకోవాలిగానీ చంపుకొంటారా ఎవరయినా? ఈసారి ఆడపిల్ల పుట్టినాసరే ఆపరేషన్ చేయించుకో! మగపిల్లాడే కావాలంటే ఎవరి దగ్గరినుండయినా దత్తత తీసుకోవచ్చు! లేదంటే అనాథ శరణాలయం నుండి తెచ్చుకొని మగపిల్లాడు లేని లోటు తీర్చుకోవచ్చు."

    అనుకొన్న తేదీకి ఒకరోజు ముందుగానే దేవకికి నొప్పులు ప్రారంభమయ్యాయి. హెల్త్ సెంటర్ కి వచ్చింది.
    అరుణోదయే కాన్పు చేసింది.

    పుట్టింది ఆడపిల్ల అని తెలియగానే అరుణోదయకి మనస్సంతా ఎలాగో అయింది. పాపం! దేవకికి ఈ పిల్ల ఇంకెన్ని కష్టాలు తెచ్చిపెడుతుందోనని.

    "ఏం పిల్ల?" నీరసంగా అడిగింది దేవకి.

    "ఆడపిల్ల" చెప్పలేక చెప్పింది.

    దేవకి రెండు చేతులూ ముఖంమీద కప్పుకుని ఏడవసాగింది" దాన్ని తీసుకుపోయి ఏ నూతిలోనో, గోతిలోనో పారేయండి. నేను దాని ముఖమయినా చూడను. పాలు కూడా యివ్వను."

    "తప్పు. కన్నతల్లివి ఇలా మాట్లాడవచ్చా? నీ భయమంతా మీ అత్తా, మీ ఆయన ఏమంటారో అనేకదా? వాళ్ళకి నేను నచ్చజెప్పుతాగా?"

    పిల్లకి స్నానం చేయించి తల్లి పక్కలో పడుకోబెడుతూ "రాణి వాసంలో పుట్టాల్సిన పిల్ల. చూడు ఎంత అందంగా, తెల్లగా వుందో! అసలు ఈ పిల్ల అందమంతా ఈ ముక్కులోనే వుందనిపిస్తూంది. సంపెంగ పువ్వంటారు యిలా వుంటే. మీ ఆయన ముక్కు ఇలా వుంటుందా?" అంది అరుణోదయ.

    పిల్లకు పొత్తిలిగుడ్డలు మెత్తగా సర్దుతూ ఆప్యాయంగా చూసుకుంది దేవకి. "ఆయన చాలా అందంగా వుంటారు, సినిమా యాక్టర్ లా. అదే గర్వం ఆయనకీ. తనలాంటి కొడుకు కావాలని ఆయన కోరిక."

    అరుణోదయ 'నచ్చజెప్పుతాగా' అందికానీ దేవకి భర్త అసలు పిల్లను చూడ్డానికి రాలేదు. అత్తగారు మాత్రం వచ్చింది కోడలికి బ్రెడ్డు, పాలు తీసుకుని.

    "చూశారా ఎంత అందంగా వుందో మీ మనుమరాలు? నాలుగున్నర పౌనులుంది.అందుకే తల్లిని బాగా కష్టపెట్టింది."

    "ఎంత అందముంటే ఏమిటి? అందగత్తె అని ఎవడయినా కట్నం లేకుండా చేసుకుంటాడా? ముగ్గురూ ఆడముండల్నే కంది. మాకేం ధనరాసులు లేవు. ఈ ముగ్గురికీ పెళ్ళిళ్ళుచేసి అత్తారింటికి పంపేసరికి నా కొడుకు చేతికి చిప్ప వస్తుంది."

    "మీరు నేను....అందరం ఆడవాళ్ళమేకదా? ఆడపిల్ల పుట్టిందని అంద ఇదైపోతారేమిటి? కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయలేమనేకదా మీ బాధ? చక్కగా చదివించండి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడి వాళ్ళకి సచ్చిన వాళ్ళని వాళ్ళే ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు."

    "మాకు ఏం లేకపోయినా పరువు మర్యాదలున్న కుటుంబం. పెళ్ళిళ్ళు చేయలేకపోతే పీక పిసికి నూతిలోకి తీసేస్తాంగానీ అలాంటి చండాలానికి ఒప్పుకోం. ఆ ప్రేమలు దోమలు మీలాంటి పట్నవాసపువాళ్ళకి గానీ మాలాంటి పల్లెటూరి వాళ్ళకు కాదు. ఇక్కడ ఏది జరిగినా ఊరంతటికీ సంజాయిషీ చెప్పుకోవాలి" కయ్ మన్నట్టుగా అందామె.

    'బాబోయ్! ఇలాంటి నోటిదురుసు మనుషులతో మాట్లాడడం అంటే ఉన్న పరువు పోగొట్టుకోవడమే' బెదిరిపోయిన అరుణోదయ మరి మాట్లాడలేదు.

    మరునాడు ఉదయం అరుణోదయ హాస్పిటల్ కి వెళ్ళేసరికి దేవకి గోలు గోలున ఏడుస్తూంది. ఆమె చేతుల్లో పిల్ల ఊపిరి తిప్పుకోలేనట్టుగా మెలితిరిగిపోతూంది.

    "పిల్ల ఇందాక బాగానే వుంది. ఇప్పుడే హఠాత్తుగా..."

    అరుణోదయ పిల్లని చేతిలోకి తీసుకొంది. పిల్ల శరీరం అప్పుడే నీలిరంగులోకి మారిపోతోంది. ఊపిరి అందనట్టుగా గిలగిల్లాడుతోంది.

    గొంతులో కఫంగానీ అడ్డుపడిందేమోనని వేలు నోట్లోకి జొనిపించి అరుణోదయ. వేలికి ఏదో తట్టినట్లుగా అయ్యిజాగ్రత్తగా బయటికి తీసింది. వడ్లగింజ! మళ్ళీ మళ్ళీ వేలు లోపలికి పెట్టి తీసింది. అయిదారు వడ్లగింజలు బయటికి వచ్చేశాయి.

    "దేవకీ! ఏమిటిది? చివరికి పిల్లని హత్య చేయడానికి తలపెట్టావన్నమాట" నిప్పులు చెరుగుతున్నట్టుగా కోపంగా అడిగింది అరుణోదయ.

    "లేదు సిస్టర్! మరీ అంత కసాయిదాన్నికాదు. ఇందాక మా అత్తగారు పిల్లకు తలంటుతానని ఎత్తుకుని తలకి నూనె రాశి పడుకోబెట్టి పోయింది. అప్పటినుండే పిల్ల ఇలా అవుతూంది."

    తను హాస్పిటల్ గుమ్మం ఎక్కుతోంటే దేవకి అత్తగారు ఫ్లాస్క్, చెంబు బుట్టలో పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతూ ఎదురయింది. తనని చూసి తత్తరపడినట్టుగా ఇప్పుడు గుర్తువస్తూంది.   

 Previous Page Next Page