Previous Page Next Page 
నల్లతంబి పేజి 5

        న్యూఢిల్లీ...

రైల్వే ఐ.జి.పి కార్యాలయం...
సూది కిందపడినా వినిపించేటంత నిశ్శబ్దంగా వున్న ఆ గదిలో పోలీసు ఆఫీసర్లు మాత్రమే కాక రిజర్వ్ బ్యాంక్ అధికారులు, ప్రెస్ రిపోర్టర్లు వున్నారు.
గూడ్స్ బోగీకి బయట వేసిన తాళాలు వేసినట్టే వున్నాయి. బోగీ బేస్ మెంట్ క్రిందనుంచి రంధ్రం చేసి.....సర్క్యులేషన్ లో లేని పదిరూపాయల వెండిబిళ్ళలను ఎవరో కొల్లగట్టారు.
కోటి రూపాయల విలువగల వెండిని దోచుకున్నారు.
పది రూపాయల వెండినాణేలను గతంలో విడుదల చేసింది రిజర్వ్ బ్యాంక్. అయితే, తరువాత వెండి ఖరీదు అనూహ్యంగా పెరిగిపోయి నందున వాటి సర్క్యులేషన్ ను నిలుపుదల చేసి ఎక్కడెక్కడో వున్న సిల్వర్ కాయిన్స్ అన్నింటినీ ఆయా జిల్లాలవారీగా కలెక్ట్ చేసి మద్రాసు ఖజానాలో ఇంతవరకూ భద్రపరుస్తూ వచ్చారు.
అలా భద్రపరచిన నాణేలన్నింటినీ ప్రత్యేకమైన సేఫ్ లో నింపి ఢిల్లీ పంపుతున్నారు.
ఈ విషయం ఎంత గోప్యంగా వుంచినప్పటికీ, ఆ సొత్తు కాస్తా మాయమైపోయింది.
సెక్యూరిటీ సిబ్బంది వెయ్యికళ్ళతో కాపలా కాస్తున్నా, బోగీక్రింద నుంచి రంధ్రం చేసి దోపిడీ చేస్తారని ఎవ్వరూ కల్లోనైనా వూహించలేదు.
పట్టాలమీద శరవేగంతో వచ్చే గూడ్స్ బోగీ క్రిందకు చేరుకోవడమే అసంభవమైనప్పుడు...
క్రింద నుంచి రంధ్రం చేసి కొల్లగొట్టడం అసంభవం!
అలాంటి అసంభవాన్ని సంభవం చేసిన మేధావి ఎవరు...? అతనెవరై వుంటారో ఎవ్వరికీ అంతుపట్టడం లేదు.
నేరస్థుడు లాకరులో అంటించిన స్టిక్కర్ మీద మాత్రం 'కమెండో' అని వుంది!
అతను రాజశేఖర్. కోట్లకు పడగలెత్తినవాడు....తమిళనాడు మంత్రివర్గం నుంచి, ఆ రాష్ట్ర ప్రతిపక్షం వరకూ మొత్తం రాజకీయం అతని చుట్టూ సెట్ లైట్ లా తిరుగుతూ వుంటుంది.
అలా అని అతను ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఏనాడూ ప్రత్యక్షంగా తలదూర్చాడు. అదే రాజశేఖర్ ప్రత్యేకత.
అటువంటి మేధాసంపద, ఆర్ధిక బలానికి తోడు హుందాతనం మూర్తీభవించిన స్నిగ్ధ గంభీరుడు రాజశేఖర్.
అతను అవివాహితుడు....ఒంటరి!
ప్రస్తుతం దీర్లాలోచనలో తలమునకలవుతున్నాడు రాజశేఖర్.
అతని ఆలోచనల్లో అల్లుకుపోతున్న విషయం.....పెళ్ళి!
మూడు పదుల వయసు దగ్గర పడుతున్న తనకు ఇప్పుడు పెళ్ళి అంత ముఖ్యమా?
అవును....కాదు! అస్తవ్యస్త సందిగ్ధ స్థితి!
ఆ రాత్రి ఆలోచనలతో అపరాత్రే అయింది.
తెలతెలవారుతుండగా అతని ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చినట్టుగా కార్డ్ లెస్ ఫోన్ తీసి, తన వ్యవహారాలను చూసే లీగల్ ఎడ్వయిజర్ మురుగన్ కు ఫోన్ చేశాడు.
"ఓకే....ఐ యామ్ రడీ!"
"థాంక్యూ....థాంక్యూ సో మచ్"
మురుగన్ స్వరంలో ఆనంద హేల!
"ప్చ్...."
భారంగా నిట్టూర్చి టైమ్ చూశాడు రాజశేఖర్.
ఉదయం ఆరు గంటలవుతున్నది.
ఇంకా పన్నెండు గంటల వ్యవధి! అంటే....ఈ సాయంత్రమే ముహూర్తం!
ఇంత హఠాత్తుగా తనకు వివాహం అంటే....తన చుట్టూ వున్న సర్కిల్ ఏమనుకుంటుందో!
గుట్టుచప్పుడు కాకుండా తిరుపతిలో మూడు ముళ్ళు వేసి....తరువాత గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తే సరి....ఆలోచన బాగుండడంతో వెంటనే నిర్ణయం తీసుకున్నాడు రాజశేఖర్.
తిరుపతికి వెళ్ళడానికి అక్కడ పెళ్ళి ఏర్పాట్లు చేయడానికి....ఇంటర్ కమ్ లో నాయర్ ని పిలిచి ఏం చేయాలో చెప్పాడు రాజశేఖర్.
ఆ సాయంత్రమే తిరుమలేశుని సన్నిధిలో నిరాడంబరంగా రాజశేఖర్.....చందన వివాహం జరిగింది.

                                         *    *    *
రాత్రి తొమ్మిది గంటలు కావస్తున్నది.
గదిలో సుగంధ పరిమళాల గుబాళింపు.....
స్టీరియోలో శృంగార సోలో సాంగ్ అతని మనసును ఎక్కడికో తీసుకుపోతున్నది.
కళ్ళు మూసుకున్నా తన్మయావస్థలో వున్నట్లు అతని ఉచ్చ్వాస నిస్వాసాలే చెపుతున్నాయి.
అప్పుడు ప్రవేశించింది నూతన వధువు చందన.
ఆ గదిలో....
అప్పటి వరకూ ఒక పరాయి పురుషుడు....
తన మెడలో మూడు ముళ్ళతో మంగళసూత్రం ముడివేసిన తరువాత....తన భర్తనే అతనున్న గదిలో....
"చందనా...."
త్రుళ్ళిపడిందామె. తన కళ్ళలోని భావాలను కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నిస్తోందామె.
"చందనా....!"
మరలా అదే పిలుపు...!
అప్పటికీ ఆమె నోరు విప్పలేదు.
"చందనా!....నువ్వు పేరుకు తగ్గట్టుగానే పవిత్రమైన దానివని భావించాను. మీ అన్నయ్యమాట కాదనలేక నీ మెడలో మూడు ముళ్ళు వేశాను. తీరా అంతా అయిపోయాక తెలిసింది...నువ్వు మరొకరితో జీవితం పంచుకోవాలనుకున్నానని....! అది ముందే తెలిసి వుంటే ఈ పెళ్ళి జరిగేది కాదు. ఎవరినో ప్రేమించి అతనిని కాదని, మోసగించి నన్ను పెళ్ళాడడానికి కారణం నాకున్న సిరిసంపదలేనా?"
"మీ డబ్బుకు ఆశపడి నేను చేసుకోలేదు. మీ ఇంట అడుగుపెట్టే వరకూ మీరు ఇంత స్థిరపరులన్న విషయం నిజంగా నాకు తెలియదు. మా అన్నయ్య చెప్పినట్టు తలవంచుకుని తాళి కట్టించుకున్నానే కాని నా ఇష్టా యిష్టాలతో ప్రమేయం లేకుండా జరిగిపోయింది నా పెళ్ళి!"
"అవును....ప్రతి ప్రేమికుడు, ప్రియురాలు చెప్పే మొదటి మాటే ఇది...సరే జరిగిందేదో జరిగిపోయింది. నీ మనస్సులో మరొకరికి చోటుందని తెలిశాక నిన్ను నా అర్దాంగిగా స్వీకరించలేను__"
క్షణం మౌనం...
"చెప్పేది నీకే....ఆ ఉంగరం ఇటివ్వు!"
మారు మాట్టాడకుండా అతను తన చేతికి తొడిగిన ఉంగరాన్ని తీసి అతనికి అందించింది....వందన.
"ఒకసారి వ్రేలికి తొడిగిన ఉంగరాన్ని తిరిగి తీసుకుంటున్నాడేమిటా అని ఆశ్చర్యపోతున్నావేమో....మనసా వాచా కర్మణా నాతోపాటు ఏడు అడుగులు నడచి తన జీవితాన్ని నాతో ముడిపెట్టుకునే శ్రీమతి కోసం భద్రంగా దాచి వుంచుకున్న ఉంగరం ఇది....దీనిని నా ప్రేమ పూరితమైన అనురాగ అనోన్యతల సంగమానికి చిహ్నంగా ఆమెకు సమర్పించాలని చేయించాను. కానీ, మనస్సు ఒకచోట తనువు మరొకరికి అర్పించడానికి ముందుకు వచ్చిన నీలాంటి అల్పులకు కాదు! నీ మెడలో తాళి కట్టినంత మాత్రాల లభించిన ఆ ఒక్క హక్కు మినహాయిస్తే నిజానికి నాకు నువ్వేమీ కావు. అయినా ఈ సమాజం దృష్టిలో నా భార్యని! నలుగురిలో తొడిగిన ఆ ఉంగరం ఇప్పుడు నీ చేతికి లేకపోతే వచ్చే తల వంపులను నేను అర్ధం చేసుకోగలను. అందుకే, నీ కోసం ప్రత్యామ్నాయంగా మరొక ఉంగరం చేయించాను." అని మరొక ఉంగరం వున్న బాక్సును, ఆమెకు అందించాడు రాజశేఖర్.
చందన దగ్గర నుంచి తీసుకున్న ఉంగరాన్ని తన వేలికి తొడుక్కుని రాజశేఖర్ వెళ్ళిపోయాడు.
స్థితిపరుడైన వ్యక్తికి భార్యగా సమాజంలో హోదా సంపాదించగలిగినందుకు సంతోషించాలా - సంసారానికి దూరంగా అంటరానిదానిలా ఒ మూల ఉండి పొమ్మన్నందుకు బాధ పడాలా?
ఏదీ తెలియని సందిగ్ధస్థితిలో కొట్టుకుంటున్నది ఆమె అంతరంగం.

                                                     *    *    *  
భళ్ళున తెల్లవారింది.
ఉదయం కొందరికి సుందరస్వప్నం, మరికొందరికి...
జరిగిపోయిన రాత్రి ఎవరి గుండెల్లో విషాదం చిలికినా తన దిన చర్యలో మార్పు లేనట్టు సూర్యోదయం అయింది.
ఆమె మనసు ఘోషిస్తోంది. జీవితం గురించి తను కన్న మధుర స్వప్నాలన్నీ ఏమైపోయాయి?
అందంగా అల్లుకున్న ఆశలన్నీ ఎలా చెదిరిపోయాయి? ఎవరు చెరిపేశారు తన సుందర స్వప్నాన్ని?
ఉవ్వెత్తున ఎగసిపడే ఆలోచనలతో చందన సతమతమైపోతోంది. అడుగుల చప్పుడుకి తల త్రిప్పి చూసింది.
"చందనా....టిఫిన్ చేద్దాంరా" రాజశేఖర్ మామూలుగా పిలిచాడు.
రాత్రి జరిగిన విషయం గురించి అతనేమీ గుర్తుపెట్టుకున్నట్టుగా అనిపించడంలేదు.
ఆమెలో చలనంలేదు.
"నిన్నే పిలిచేది"
"నాకు ఆకలిగా లేదు....మీరు చేయండి."
"అలా అంటే కుదరదు....నువ్వు నా భార్యవన్న సంగతిని మరిచిపోతున్నావ్! నాకంటూ ఈ సంఘంలో పరువు-ప్రతిష్టలు వున్నాయి. నలుగురి మధ్యా గౌరవంగా తిరిగేవాడిని. ఎవరూ నన్ను వేలెత్తి చూపించే ఆవకాశం ఇంతవరకు రాలేదు, ఇకముందు కూడా రాకూడదు. పనివాళ్ళ ముందు నువ్వు లేకుండా నేనొక్కడినే టిఫిన్ చేస్తే ఎంత తలవంపులుగా వుంటుందో అర్ధం చేసుకున్నావా?"
"నా మనసేమీ బాగోలేదు నన్ను ఒంటరిగా వదిలేయండి."
"నీకు తోచినవిధంగా వుండొచ్చు చందనా కానీ, ఎవ్వరూ నన్ను తక్కువగా కించబరచడం నేను సహించలేను! అందుకే ఈ సమాజం కోసం ఏ సమయంలో ఏం చేయాలో అది నీకు మరల మరల చెప్పక్కరలేకుండానే నువ్వు నడుచుకోవాలి. మిగిలిన విషయాల్లో నీ మనస్తత్వానికీ, నీ అభిరుచులకీ నేను అడ్డుపడను. నీకు ఏ నగలు కావాలన్నా పెట్టుకోవచ్చు. ఏ కారు కావాలన్నా వేసుకెళ్ళవచ్చు. ఏ బట్టలు కావాలన్నా కొనుక్కోవచ్చు. ఈ ఇంటి ఇల్లాలుగా నీకు సంపూర్ణమైన స్వాతంత్య్రం ఇస్తున్నాను. నీ స్వేచ్చకు నేనెప్పుడూ అడ్డురాను. కానీ నా పరువు. ప్రతిష్టలకు ఏమాత్రం భంగం కలగకుండా, కళంకం లేకుండా వుండాలి నీ ప్రవర్తన. ఇంతకాలం ఇంత గొప్పగా బ్రతికి, తెలియక నేను చేసిన ఒకే ఒక పొరపాటు వల్ల నీ మూలంగా నా స్టేటస్ కు భంగం కలగడం నేను భరించలేను."
అతన్ని ఎలా అర్ధంచేసుకోవాలో తెలియడంలేదు చందనకు. తనను ఒక మరబొమ్మ అనుకుంటున్నాడా?
"మాట్లాడవేం చందనా? నేను చెప్పింది అర్ధమైందా!" అసహజంగా అడిగాడు రాజశేఖర్.
ఏం చెప్పాలో ఏమని చెప్పాలో కొన్ని క్షణాలపాటు తెలీలేదామెకు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఎలాగో గొంతు పెగల్చుకొంది.
"అలాగే, మీ ఇష్టప్రకారమే నడుచుకుంటాను." అంతకు మించి మాట్టాడలేక ఆమె గొంతు గద్గదమైంది.

 Previous Page Next Page