Previous Page Next Page 
రీవెంజ్ పేజి 6

    వీళ్ళు ఏకమైతే ఎదుటి వ్యక్తి ఎలాంటి వాడనేది ఆలోచించే అవకాశం ఇవ్వరు. "ఐన్ స్టెయిన్" ఎదురైన తనికి బుర్ర మాత్రమే వుంది. అందులో ఉండవలసిన పదార్ధం లేదని అతని చేతే ఒప్పిస్తారు ... !

    అవతలి వ్యక్తి బుర్ర తినడంలో మంచి సిద్ధహస్తులు.

    "వర్షంలో తడవడం థ్రిల్ అనిపించి తడుస్తున్నాను" సమాధానం చెప్పింది అన్విత.

    "వర్షం అంటున్నావ్ - థ్రిల్ అంటున్నావ్. ఈ రెండింటితో సంబంధం ఏమిటో నాకైతే అర్ధం కావడం లేదు" అడిగింది వాళ్ళలో చిన్నదయిన రిమి.

    "భలేదానివే - వర్షం చూసి థ్రిల్ గా ఫీలయ్యే వాళ్ళింతమందిలేరూ ఆ మాట కొస్తే వర్షం పడక బాధపడే రైతుల కన్నా - కొత్తగా పెళ్ళయిన వాళ్ళే ఎక్కువగా వర్రీ అవుతారు తెలుసా" సమాధానం చెప్పింది సుజాత. ఆమె కీ మధ్యనే ఒక సంబంధం ఖాయమయ్యింది.

    వీలయినంత వరకు తనకి వివాహాల మీద మంచి కమాండ్ వున్నట్లు మాట్లాడుతుంది.

    "అది సరే వర్షమంటే గుర్తొచ్చింది, మా బాబాయి ఒకాయన వర్షాన్ని చూస్తే చాలు చిన్నపిల్లాడిలా గంతులేస్తూ అదేదో వర్షంలో తడుస్తూ వర్షపు చినుకుల్ని నోటితో పట్టుకోవడానికి ప్రయత్నించేవాడు అఫ్ కోర్స్, అందరూ అతన్ని పిచ్చివాడని అంటారనుకోండి అది వేరే సంగతి" నవ్వుతూ చెప్పింది రిమి.
 
    "వర్షం అంటే నాకూ ఒక సంగతి గుర్తొచ్చింది చెప్పనా" 

    అభ్యర్దిస్తున్నట్లు మొహం పెట్టింది రేఖ.

    ఆమె చెప్పాలనుకున్న విషయాన్ని ఏదో విధంగానయినా చెబుతుంది. ఆమెని ఏ శక్తి ఆపలేదు కూడా ...

    సరే అన్నట్లు చెప్పమని కళ్ళతోనే సైగ చేసింది అన్విత.

    "నాకు వర్షమంటే థ్రిల్ చిన్నప్పుడే చచ్చిపోయింది. కారణం నేను జూనియర్ ఇంటర్ చదివేరోజుల్లో శేషగిరిరావనే బోటని లెక్చరర్ వుండేవారు. ఆయనొక తుఫాన్. ఆయన క్లాస్ కి రావడం దగ్గర నుంచి వెళ్ళేవరకు తుఫానొచ్చి వెళ్ళినట్లు వుండేది. ఆయనకి మేమందరం నిక్ నేమ్ పెట్టాం, "చిరపుంజీ" అని ఆయన మాట్లాడితే పెద్ద వర్షం పడినట్లుండేది. అంతెందుకు ఆయన ఫోన్ లో ఎవరితోనైనా మాట్లాడితే అవతలి వ్యక్తి ఫోన్ పెట్టేసిన తరువాత మొహం తదితుడుచుకొనేవాడు, అందువల్ల స్టూడెంట్సంతా ఆయన లెక్చరిస్తున్నప్పుడు నాలుగు బెంచీలవతల కూర్చొనేవాళ్ళం. ఆ విషయం ఆయనకి తెలుసనుకోండి. అందువల్ల మాకు సంవత్సరం పొడుగునా వర్షాకాలంలో వున్నట్లనిపించేది. అందుకే వర్షమంటే థ్రిల్ పోయింది."

    నవ్వారందరూ ఆమె చెప్పిన మాటలకి.

    ఏదో చెప్పాలని ప్రయత్నించిన రిమి నోటిని ఠక్కున సుజిత మూసేసింది, వర్షం వెలిసి చలికాలం వచ్చినా ఆ టాపిక్ అలాగే కంటిన్యూ అవుతుందని భయపడి.

    "అన్వీ...? ఇందాకేదో ధ్రిల్ గేట్రా అన్నావ్ అదేదో మాకూ చూపించవూ...? అడిగింది మమ్మి

    మమ్మి అంటే తల్లను కుంటే పొరపాటే.

    మమ్మీ అన్నది లత నిక్ నేమ్. వయస్సులో ఆమె మిగతా వాళ్ళ కన్నా కాస్త పెద్దదవటం వల్ల, సైజులో మరికాస్త పెద్దదవటం వల్ల, తను ఊరు నించి తెచ్చుకున్న వస్తువు దగ్గర నుంచి అన్ని కొసరి కోసరి అందరికి తినిపిస్తుంది. అందర్ని తల్లిలా ఆదరించటం వల్ల ఆమె పేరు పెట్టారు.

    "అన్వితానడిగితే ఏం చెబుతుంది. ఏ 'అయాన్ రాండ్' పుస్తకాలో, వర్డ్స్ వర్ కవిత్వమో చదవమని చెబుతుంది" సమాధానం ఇచ్చింది శ్రీదేవి.

    "యస్ యూ ఆర్ రైట్ .... అదేదో నన్నే అడిగితే నేను చెబుతాగా" మధ్యలో కల్పించుకుంది సుజిత.

    "సరే వినక చస్తామా... చెప్పు" చెప్పమన్నారందరూ

    "ఇలాంటివి మీరడగపోయినా చెప్పవలసిన బాధ్యత నా మీదుంది నాకు తోచినంతవరకు జనాన్ని ఎడ్యుకేట్ చేయటమేగా నా కర్తవ్యం కనుక ఇలాంటి విషయాల్లో నేను తలదూర్చక తప్పింది కాదు" అని ఆపి తిరిగి తన ప్రసంగాన్ని మొదలుపెట్టింది సుజిత

    "సపోజ్ ఒక అందమయిన అమ్మాయి, అంటే నేనే ననుకోండి నేను ప్రపంచ సేవే మాధవసేవ అని అనుకొని ప్రపంచ సేవ కోసం మధర్ ధేరిసాలా వైట్ సారి విత్ బ్లూ బోర్డర్ చీరలో రాజస్థాన్ ఎడారుల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్నాను. ఈ శారీలో నేను గ్లామర్ క్వీన్ లా వున్నానన్న సంగతి మర్చిపోవద్దు"

    ఆమె మాటలకి అడ్డం వస్తూ అడిగింది రిమి.

    "నువ్ ప్రపంచ సేవ అంటున్నావ్ మధర్ ధేరిసా అంటున్నావ్ అసలు రాజస్థాన్ ఎందుకు వెళ్ళాలి అక్కడెవరున్నారని"

    "నువ్విలా నా వాక్ ప్రవాహానికి అడ్డురాకు. ఒకసారి పడితే ఆ ఫ్లో ఇకరాదు... అయినా చెప్పింది చివర వరకూ విను" కాస్త కోపంగా అని తిరిగి చెప్పటం ప్రారంభించింది సుజిత.
 

 Previous Page Next Page