"అయితే ఇలాతే నేనిస్తాను" శాసిస్తున్నట్లుగా ఉన్న ఆ కంఠాన్ని కాదనగలిగే శక్తి ఆ ఇంట్లో ఎవరికీ లేదు. అయిష్టంగా గొలుసు చెల్లెలి చేతిలో పెట్టింది.
ఝాన్సీ వెళ్ళి ఆ గొలుసు పక్కఇంటి ఇల్లాలి చేతిలో పెట్టి "మా బావ వదిలేసిన దగ్గరనుంచీ మా అక్కకు మనసు స్థిమితంగా ఉండటంలేదు. బావ డబ్బులిమ్మని పీడించేసరికి దానికి డబ్బు కనబడగానే మతిపోతోంది. ఏమీ అనుకోకండి" అంది.
ఆవిడ గొలుసందుకుని చీదరించుకొంటూ వెన్నాడింది- కన్ను మూసినా బాధతోపాటు నవ్వూ వచ్చింది.
ఒక వంక ఏదో మాధుర్యరేఖ, మరొకవంక భయపెట్టే నీలినీడలు. వీటితో సతమతమవుతూ పొద్దెక్కి నిద్ర లేచింది ఝాన్సీ. అప్పటికే తల్లి సంచిలో పట్టుబట్టలు సర్దు కొంటూంది. అంటే ఎక్కడికో వంట కెళ్తూందన్నమాట! ఆమె ఆరోగ్యం సరిగాలేదు, ఆ మధ్య జబ్బుపడింది. మైల్డ్ హార్ట్ అటాక్" అని అనుమానం వచ్చింది. తల్లికి ఆ సంగతి చెప్పలేదు.
"అమ్మా నిన్నింక వంటలకు వెళ్ళవద్దని చెప్పలేదూ? నేను సంపాదిస్తున్నానుగా నువ్వు విశ్రాంతి తీసుకో."
పాపం తండ్రి ఉండగా తల్లి అసలు వంటచెయ్యవలసిన అవసరమేం ఉండేదికాదు. కోవెలలో ప్రసాదాలు ఇంటికి వచ్చేవి. పాపం? తనకోసంబావను ఎలాగైనా డాక్టర్ చెయ్యాలని గానుగెద్దులా శ్రమపడింది. ఇంక శ్రమపెట్టకూడదు.
తల్లి నవ్వుతూ "ఇవాళొక్కరోజుకివెళ్ళనియ్యవే, ఈ పెళ్ళికి చాలామంది డబ్బున్నవాళ్ళు వస్తారు. ఈ వాడలో శ్రీకృష్ణమందిరం కట్టిస్తున్నామని చందాలు వసూలు చేస్తున్నాను పదీ పదిహేను అడిగితే ఇయ్యరు. కానీ ఒకటీ రెండు అయితే ఇస్తారు. అందులో నలుగురి మధ్యా పెళ్ళిలో అడిగితే తప్పకుండా ఇస్తారు. ఎలాగో కృష్ణమందిరం కట్టిస్తే డానికి మహత్తు ఉందని ప్రచారమయితే నీ తమ్ముణ్ణి అర్చకుడిగా ఉంచుతారు. అటు ఉద్యోగమూ చేసుకుంటాడు, ఇటు అర్చకత్వమూ చేసుకుంటాడు. లేకపోతే బ్రతకలేం!" అంది నిర్ఘాంతపోయింది ఝాన్సీ.
"ఇదీ ఆ వర్గానికీ ఈ వర్గానికీ భేదం అని మనసుని తట్టింది ఆలోచన. తల్లిని ఆపాలి. తన అనారోగ్యం తనకు తెలియటంలేదు. ఉన్న విషయం చెబితే గాబరాతో ఇప్పుడే ప్రాణంమీదకు తెచ్చుకొంటుంది.
తల్లికి అడ్డుగా నిలబడి "అమ్మా! నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. అంతగా శ్రీకృష్ణమందిరం కావాలనుకుంటే ఆ చందాపుపుస్తకం నాకియ్యి, నీ బదులు నేను వెళ్ళి వంటచేసి చందాలు వసూలుచేస్తాను" అంది. ఝాన్సీ ఇలా నిలబడితే డానికి తిరుగులేదు. కూతురికి తనమీద ఉన్న ప్రేమకి మురిసిపోతూనే "మొండి ఘటానివి, ఊరికే కూచుంటే నాకేం తోస్తుందీ?" అని సణుక్కుంటూనే సంచీ ఓ మూల పారేసి వంటింట్లోకి వెళ్ళింది. చెల్లెలూ, తమ్ముడూ. ఝాన్సీ ఇచ్చిన ట్రైనింగ్ తో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ కాలేజీలకు తయారవుతున్నారు. వాళ్ళని చూస్తూ "ఈ నవతరమైనా పరిపూర్ణ వ్యక్తిత్వం సంతరించుకొంటే బాగుండుణు" అనుకొంది.
* * *
"మీరు నా మాటలు వినటంలేదు" అన్నాడు కుమార్ నిష్టూరంగా ఝాన్సీ తన ఆలోచనలలోంచి తెప్పరిల్లి "ఏమిటి?" అంది. ఆమె ముఖంమీద విషాధ రేఖలు పూర్తిగా తొలగిపోలేదు.
"చూడండి, మీరంత తల పగలగొట్టుకోవలసిన ఉపద్రవమేదీ జరగలేదు. నావల్ల మీకెప్పుడూ ఏ హనీ జరగదు. కేవలం ఉద్యోగంకోసం" నేను ఉద్యోగంకోసం ఆరాటపడుతున్న మాట నిజమే! కానీ మీకు ఉద్యోగంపోయి నాకు రావాలని కోరుకోలేదు."
"నేను మీకోసం త్యాగం చెయ్యలేదు. పరిస్థితులలా వచ్చాయి. ఇంతకూ నేను చెప్పింది అర్ధమయిందా?"
"ఏమిటి?"
"వినలేదన్న మాట! ఈ సారైనా వినండి. హరిజన ప్రతినిధిగా ఎన్నికయిన యమ్మేల్యేగారు ప్రస్తుతం కొత్త పల్లెలోనే వున్నారు. ఆయనతో హరిజనురాలినని చెప్పుకొని, మీకు ఉద్యోగం వేయించమని అర్దించండి."
"అర్దించాలా?"
"లేకపోతే ఆజ్ఞాపిస్తారా?"
ఇద్దరూ నవ్వుకున్నారు. బస్ కొత్తపల్లెలో ఆగింది, ఇద్దరూ దిగారు.
ఆస్పత్రితోపాటే డాక్టర్ కి చిన్న క్వార్టర్ కూడా కట్టారు. ఆస్పత్రి ఏలావుందో ఆ క్వార్టర్ కూడా అలాగే ఉంది. గోడలకు సున్నాలు లేవు. మట్టిపెళ్ళలు రాలి పడుతున్నాయి. నేలమీద గచ్చు పగిలిపోయి మట్టి బయటపడుతోంది. పై కప్పుకుకూడా అక్కడక్కడ చిల్లులున్నాయి.
"ఇదే నా భవనం- సర్కారువారు దయతో వైద్యుడికోసం కేటాయించినది. మీరు త్వరగా తయారయి యమ్మేల్యేగారి దగ్గరకువెళ్ళండి." అతడి ముఖంలో అమాయకత్వం చూస్తోంటే ఆమె మనసులో ఏదో గౌరవం కలిగింది.
"ఏ ఒక్కరిని గురించి చెడుగా ఆలోచించలేడా ఇతడు?" అనుకొంది. కానీ మనసులో మాత్రం అయమ్మెల్యేగారి పట్ల అంత సద్భావం కలగలేదు. స్త్రీ సహజమైన ప్రేరణ ఏదో ఆమెను అజ్ఞాతంగా భయపెట్టింది. అయినా కుమార్ ఉన్నాడని ధైర్యంతో వెళ్ళడానికే నిశ్చయించుకుంది. తనకు అండగా కుమార్ ఉన్నాడు. ఈ భావన కొత్తగా ఉంది, తీయగా ఉంది, భయంగానూ ఉంది.
తయారయివచ్చి "రండి వెళ్దాం" అంది.