Previous Page Next Page 
వెలుగుబాట పేజి 5

 

    ఈ ఆలోచనల మధ్య తల్లిదగ్గర ఊరి ప్రయాణానికని డబ్బు తీసుకుని తనకు పార్టీ  ఇవ్వబోవటం గుర్తుకొచ్చింది. ఎవరూ లేని ఆ ఏకాంతంలో అద్దంలో ప్రతిఫలిస్తున్న తన ముఖంలోని చిరునవ్వును చూసి తినే సిగ్గుపడింది.
    ఝాన్సీ స్టేషన్ కి వచ్చేసరికి ప్లాట్ ఫాం మీదకు ట్రైన్ వచ్చేసింది ఆమెకి కంగారుగా ఉంది. కుమార్ ఏ కంపార్ట్ మెంట్ లో ఉన్నాడో? 'కుమార్' అని అరవలేదుకదా! వణుకుతున్న కాళ్ళతో బెదురుతున్న చూపులతో జనసమూహాన్ని తప్పించుకుంటూ నడుస్తున్న ఆమెకి "ఝాన్సీ" అన్న కుమార్  కేక  వినిపించింది. కుమార్ కంపార్టు మెంట్ లోంచి దూకి ఆమె దగ్గరకి పరుగునవచ్చి ఆమె చెయ్యి పట్టుకున్నాడు.
    "అరగంటనుంచీ మీకోసం ఎదురుచూస్తున్నాను. ఇంత ఆలస్యమయిందేం?"
    "నా కోసం ఎదురుచూస్తూన్నారా? నేను వస్తానని ఎవరు చెప్పారు మీకు? నన్నుచూసి ఆశ్చర్యపోతారనుకున్నాను."
    "రాకపోతే ఆశ్చర్యపోయేవాడిని, రాకుండా ఉండుండి చిలిపిగా ఏదో అనెయ్యగలడు.
    ఆమె చెయ్యి పట్టుకునే అడ్డువస్తున్న జనాన్ని అటూ ఇటూ నెట్టేస్తూ తన  కంపార్టుమెంట్ దగ్గరకి తీసికెళ్ళాడు. ఇద్దరికీ మాటలు కరువయిపోయాయి. కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కుమార్ ఎప్పటికప్పుడు ఏదో చెప్పబోయి ఆగిపోతున్నాడు. ఇంజన్ కూసింది. ఝ్సానీ  గాబరాగా "ట్రైన్ కదులుతోంది ఎక్కండి" అంది. కుమార్ క్రిం నిలబడే "మనం విడిపోతున్నాం, వీడ్కోలు సందేశంగా నాకేదైనా ఒక్క మాట చెప్పండి" అన్నాడు. ఝాన్సీ అతడి కళ్ళలోకి చూసింది. ప్రభాత సమయాన అప్పుడే విచ్చుకున్న తామర రేకుల్లా స్వచ్ఛంగా ఉన్నాయని. పెదవులమీద చిరునవ్వు ఎన్ని కష్టాలనైనా హాస్యంగా తీసుకుంటూ స్థయిర్యంతో నవ్వగలిగే నవ్వు.
    "త్వరలో కలుసుకుందాం."
    కదులుతున్న ట్రైన్ లోకి ఎగిరిదూకి "థాంక్యూ" అన్నాడు. ఒకరికొకరు కనుమరుగయ్యేవరకు చేతులూపుకున్నారు.
    ఏదో స్వప్నావిష్టురాలిలాగ వచ్చిన ఝాన్సీ కి గుమ్మంలో అడుగు పెట్టగానే కళ ఎక్కడిదక్కడ చెదిరిపోయింది. అక్క ఎవరో  ఇల్లాలితో ఘర్షణ పడుతోంది. ఆవిడ ఆంటోంది.
    "అక్కడ ఇంకెవరూ లేరు. నువ్వే ఉన్నావు. మంచి నీళ్ళడిగావు. నీతో కొత్తగా చేయించిన గొలుసు మాయమయింది. గొలుసు చూస్తానని అడిగి ఇదా నువ్వు చేసేపని? ఆ గొలుసుమీద నా పేరుంది. పోలీసు రిపోర్టిచ్చానంటే ఖైదులో పెడతారు. పోనీ, బ్రాహ్మణ కుటుంబం బ్రతికి చెడ్డ కుటుంబం అని మర్యాదగా అడుగుతున్నాను. ఇచ్చావా సరే! లేకపోతే చూపిస్తా నా తడాఖా.."
    అక్క ఆవిడకంటే గట్టిగా అరుస్తోంది.
    "నీ యిష్ట మొచ్చినట్టు చేసుకో, నేను తియ్యలేదంటే వినిపించుకోవేం? పవిత్రమైన వంశంలో పుట్టి ఇలాంటి పాడుపనులు చేస్తావా?"
    ఝాన్సీకి శరీరంలో రక్తమంతా నీరయిపొయినంత నీరసం వచ్చేసింది. ఘర్షణబట్టి విషయం అర్థమయిపోయింది. ఇంట్లోకి రాకుండా పక్క సందులోకి పారిపోయి ఆ రాత్రి సమయంలో పిచ్చిగా రెండుమూడు సందులు తిరిగి ఇంటికి వచ్చింది. తలుపులు వేసి వున్నాయి, కొట్టింది "ఎవరూ వస్తున్నా" అంటూ తలుపు తెరిచింది అక్క. చెల్లెల్ని చూసి "హమ్మయ్య నువ్వేనా?" అంది గుండెలమీద చెయ్యి వేసుకుని.
    "ఎందుకంత గాబరా."
    అక్క గబగబ బియ్యం క్రిందనుంచి రెండు పేటల బంగారు గొలుసు తీసి "ఇది ఎంత ఉంటుందీ? అంది ఆశగా.
    "బహుశః అయిదారు నెలల జైలుశిక్ష."
    అక్క కొంచెం భయపడింది.
    "ఏమిటే, ఇంత చదువుకున్నావు, ఇది కాస్త రహస్యంగా అమ్మించలేవూ."
    ఝాన్సీ సహనం నశించిపోతుంది. మనుషులలో ఈ అల్పత్వాన్ని భరించలేకపోతోంది. "అక్కా మీకోసం  మరింత కష్టపడి సంపాదిస్తాను. కాని జైలుకి వెళ్ళమంటే మాత్రం నావల్లకాదు."
    "ఎందుకే, అంతంత మాటలు?"
    "అక్కా ఏమిటీ పనులు? ఎందుకింత నీచానికి ఒడిగట్టావు?"
    అక్క ఏడుపులో దిగింది.
    "ఒక అయిదువేలు తీసుకొస్తే, తన దగ్గరికి రమ్మని ఉత్తరం రాసాడే మీ బావ, ఐదువేలు ఎవరినడగనూ? ఎవరిస్తారు? అందుకని....."
    "దొంగతనానికి సిద్ధపడ్డావా? అప్పుడు నీకు జైలు శిక్ష పడితే బావ దర్జాగా నిన్ను ఛీ కోట్టి పూర్తిగా  వదిలేస్తాడు. అయినా  ఐదువేలతో నీ సమస్య తీరుతుందా అక్కా? ఆ డబ్బు అయిపోగానే మళ్ళీ నిన్నిక్కడికే తరుముతాడు మరో పిల్లతో సహా...."
    "ఏం చెయ్యమంటావే."
    "బావకు విడాకులిచ్చెయ్యి, నీ కాళ్ళమీద నువ్వు నిలబడటానికి ప్రయత్నించు."
    "ఈ రోజుల్లో కన్నెపిల్లలకే పెళ్ళిళ్ళు కావటం కష్టంగా ఉంటే మొగుడుకి విడాకులిచ్చినదాన్ని, బిడ్డతల్లిని, నన్నెవరు చేసుకుంటారే?"
    ఉలికిపడింది ఝాన్సీ తనసలు పెళ్ళిసంగతి ఎత్తలేదు. నీతి సూత్రాల రూళ్ళకర్రలకూ, ఆదర్శాల కొలతబద్దలకూ అందకుండా ఆశల గుర్రాలు పరుగులుతీస్తూనే ఉంటాయి. ఆనందం లేశ మాత్రమైనా లేని పీడకలలాంటి తన జీవితం పూర్తిగా కరిగిపోయి కొత్తజీవితం ప్రారంభమైతే బాగుండునని ఈ అభాగ్యురాలి అంతరాంతరాలలో అజ్ఞాతంగా అణగివున్న కోరిక కాబోలు, ఏం జీవితాలు!
    "అవన్నీ తరువాత ఆలోచిద్దాం! ముందు గొలుసు ఆవిడకిచ్చెయ్యి."
    "హమ్మో! నావల్లకాదు."

 Previous Page Next Page