4
నాడు గోకులాష్టమి.
గోకులకృష్ణ పుట్టినరోజుపండుగ ఘనంగా జరుపబడుతున్నది. మిత్రులూ, పరిచితులూ ఎందరో ఆహ్వానింపబడినవారు. వారందరినీ పరామర్శించడంలో, సత్కరించడంలో క్షణం తీరికలేని పనిద్ధరిలో ఉన్నాడు కళ్యాణ చక్రవర్తి. అక్కడికీ ఉదయభాను అతని పనిలో సహకరిస్తున్నాడు.
ఉదయభాను విదేశం వెళ్ళివచ్చిన డాక్టరు. విరిబాల భర్త. ఆమె తల్లి చిన్నతమ్ముడు. విరిబాల కళ్యాణ్ ల ఒక నాటిప్రేమ ఎరిగిఉన్న వ్యక్తి. అంతా విధివిలాసమని కొట్టిపారవేసి మిన్నకుండే ఉదాసీనుడు. తోడిమానవుని పట్ల అవిశ్వాసమన్నది అతడు ఎరగడు. అందుకే, కళ్యాణ్ ఆహ్వానం అందుకొని అతిథిగా, బంధువుగా భార్యతో రాగలిగాడు.
ఇద్దరు వంటమనుషుల్ని ఏర్పాటుచేసినా, చేతికింద పనులు అందుకోడానికి ఇద్దరు నౌకరు ఉన్నా, సాయంగా ఎరిబాల ఉన్నా ఊపిరిపీల్చుకోడానికికూడా తీరిక చిక్కడం లేదు కృష్ణప్రియకు.
హడావిడిలో మునిగిఉన్నకళ్యాణ్ కు తొందరగా పిలుపు వచ్చింది హాస్పిటల్ నుండి. అతిధులనుండి కొన్ని నిమిషాలపాటు సెలవుతీసుకొని తన పని ఉదయభానుకు అప్పగించి డ్రెస్ వేసుకుందుకు తన గదిలోకి వెళ్ళబోయాడు. అతని అడుగు గడప ఇవతలే ఆగిపోయింది.
గోకుల్ ను ముందు కూర్చోబెట్టుకొని అతడికికృష్ణుడివేషం వేస్తూన్న రూపవతిని చూచి ఆశ్చర్యపోయాడు. తన శత్రువెవరో బతికి వచ్చినట్లుగా బాధ పడ్డాడు.
గబగబా కృష్ణప్రియ ఉన్నచోటికి వచ్చాడు కల్యాణి.
"రూపవతి వచ్చింది; ఎవరు పిలిచారు?" అడిగాడు ముఖం చిట్లించి.
నిశితంగా, నిదానంగా చూచింది తమ్ముడి ముఖం లోకి కృష్ణప్రియ. "కృష్ణా"! అంది కొంచెం కటువుగా. "ఈమధ్య నీకు బుర్ర తిరుగుడు వచ్చినట్లుంది. ఆ తిక్క తగ్గించుకుంటే మంచిదని చెబుతున్నాను. ఏమిటి, నువ్వు చేసినపని, మొన్న? పిల్లాడంటే ముచ్చటపడి ఏవోతెస్తే మొహంమీద కొడతావా?ఈ మర్యాద ఎక్కడ నేర్చుకొన్నావు? అభిమానించినంతమాత్రాన నీ బాబు నేమైనా ఎత్తుకుపోతుందనుకొన్నావా?"
"........................" కళ్ళు చిట్లించి చూస్తున్నాడు.
"ఇక ఇలాంటి పొరపాట్లు నీవల్ల జరగడానికి వీల్లేదు. రూపజోలికి పోయావంటే క్షమించేది లేదు, చూడు!" హెచ్చరించి పనిలో నిమగ్న మయింది.
తోటలో జరిగిన సమాచారం అక్కకు ఎలా అందిందా అని ఆశ్చర్యపోయాడు కల్యాణ్. 'తను ఆహ్వానించని రూపను అక్క ఎందుకు ఆహ్వానించినట్లు? రూప అంటే ఆమె కెందుకంత అభిమానం? పేషంటుగా పరిచయమైన ఆమెతో ఇంతటి దృఢమైన స్నేహం కలుపుకోవడమేమిటి? ఆడవారి స్వభావాలు విచిత్రాలు! అంత అవమానం జరిగాక కూడా రూప ఎల్లా రాగలిగిందో!'
అక్కగారి చీవాట్లతో కళ్యాణ్ ఆగ్రహం కొంత అణిగింది. గదిలోకి వచ్చాడు. రూపను పలకరించలేదు. డ్రెస్ వేసుకొని చూచీచూడనట్లు చరచరా వెళ్ళిపోయాడు.
సువిశాలమైన హాలులో సోఫాలలో ఆహుతులందరూ సుఖాసీనులై ఉన్నారు. అక్కడికి రూప గోకుల్ ను ఎత్తుకొని వచ్చింది. అతడికి ప్రత్యేకంగా వెయ్యబడిన కుర్చీలో కూర్చోజేసి వంశీ చేతికి అందించింది.
ద్వాపరయుగంలోని గోకులకృష్ణుని ఎవ్వరు చూడలేదుగాని ఈకలియుగ కృష్ణుని చూడడం నేత్రపర్వంగా, జన్మసార్ధకంగా భావించారు ఆహుతులు. నాటి గోకుల కృష్ణుడు ఈ విధంగానే ఉన్నాడేమో అనిపించేటట్లు ఉంది, గోకుల్ కు రూపచేసిన అలంకరణ. పట్టు పీతాంబరం పంచకట్టులోనూ, నుదుట సిందూర తిలకం దిద్దడంలోనూ, కొండెకట్టి, మాలకట్టి కేకిపింఛం అమర్చడం లోనూ ఎలాంటి లోపమూ లేదు. ధరింపజేసిన విలువైన ఆభరణాలు వేషానికి మెరుగులు దిద్దుతున్నాయి. అలంకరణకు తగినరీతిగా గంభీరంగా, నిశ్చలంగా, నిర్మలంగా చూస్తూ నెమ్మదిగా కూర్చున్నాడు గోకుల్.
నాటి గోకులకృష్ణుని ఎత్తుకోడానికి గోపాలకులు తహతహలాడారో లేదోగాని ముచ్చట గొలుపుతూన్న ఈ గోకులకృష్ణున్ని ఒక్కసారి ఎత్తుకొని ముద్దుపెట్టుకుంటే జన్మ తరిస్తుందన్నట్లుగా ఒకరి తరవాత ఒకరు వచ్చి గోకుల్ ను ఎత్తుకొని తాముతెచ్చిన బహుమతులు చేతికిచ్చి ముద్దుపెట్టుకొని ఆశీర్వదించి పోతున్నారు తమ తమ ఆసనాలలోకి.
గోకుల్ ను ఫోటో తియ్యడానికి కెమేరా పట్టుకుని నిల్చుంది రూప. విరిబాలా, కృష్ణప్రియా గోకుల్ కుర్చీకి చెరోవైపు నిలబడి అతడు చక్కగా ముఖం పెట్టేటట్లు చూస్తున్నారు.
రూప కెమేరా సరిచేసుకొంటూ వెనక్కి వెనక్కి అడుగులువేస్తూ, కారుదిగి గబగబా తలవంచుకొని లోనికి వస్తూన్న కళ్యాణ్ ను తాకి తూలింది.
వెనకనుండి రూప భుజంపట్టి నిలిపాడు కళ్యాణ్, అనాలోచితంగానే. ఆ స్పర్శలో అవ్యక్తమైన సుఖానుభూతి అనుభవించింది అతడి హృదయం. డాక్టరుగా ఆమెను తాకినన్నాళ్ళూ స్పర్శానుభూతి అతని యువక పురుషహృదయాన్ని లోబరుచుకోలేకపోయింది.
రూప కనురెప్పలపై మధురమైన లజ్జాభావ తటిల్లత రెప్పపాటుకాలం మెరిసి మాయమయింది.
"సారీ!" ఇద్దరి నోటినుండి ఒకేసారి వెలువడింది.
"ఫోటో తియ్యడానికి చక్కటి దృశ్యంకదూ?" తమ్ముడు రూప భుజంమీద చెయ్యి వెయ్యడం చూసి, చిలిపిగా నవ్వుతూ మెల్లని స్వరాన అన్నది విరిబాలతో కృష్ణప్రియ.
ప్రయత్నపూర్వకంగాతన పనిలో లగ్నమయింది రూప. గోకుల్ రూపాన్ని ఫిలిమ్ పై బంధించి, చక్కగా ముఖం పెట్టినవాణ్ణి ఎత్తుకొని మురిపెంగా ముద్దులవర్షం కురిపించింది.
గోకుల్ జన్మదినోత్సవసందర్భంలో కల్యాణ్ చేసిన ఏర్పాట్లలో 'బాలకృష్ణుని చిలిపిక్రీడలు' నృత్యవాటికా ప్రదర్శనం ఒకటి. నాటికా ప్రదర్శనకు అనువుగా ఇంటి ఆవరణలోని తోటలో ఏర్పాటయింది రంగస్థలం. నౌకర్లు కుర్చీలు తోటలో వెయ్యగా ఆహుతులు తోణలోకి తరలివెళ్ళారు.
అద్భతంగా, అపూర్వంగా సాగింది నృత్యవాటిక.
నాటిక ముగియగానే విరిబాల పాట ఒకటి పాడాలి.
కల్యాణ్ అభ్యర్ధనకు తోసివేసి పాట పాడడానికి అభ్యంతరం చెప్పింది ఆమె మొదట. "జరిగిన ఘట్టాలు స్మృతి పథంలోకి తెచ్చే సన్నివేశాలు కల్పించకు, బావా! అంది బరువుగా వ్యథగా.
విరిబాల మాటతో గడిచిన మధురమైన ఘట్టాలు కళ్ళముందు కదిలి కళ్యాణ్ అంతరంగాన్ని విషాదపు టలలతో కలిచివేశాయి.
విరిబాల నృత్యసంగీతాభిమాని. కళ్యాణ్ చిత్రలేఖ నాభిలాషి. ఒకరి అభిరుచిని ఒకరు అభిమానించుకొన్నారు. కళ్యాణ్ సితార్ తీగలు శ్రుతిచేస్తే విరిబాల తన కోయిల కంఠం సవిరించుకొనేది. శరచ్చంద్రికల' తేనెవాగులా సాగింది వారి సంగీత కళారాధన.
"నీ పాట విని చాలా రోజులయింది, రాధా. నువ్వు పాడాలి. తప్పదు."
"నువ్వు సితార్ మీటగలవా, బావా?"
"అహఁ. అది నా చేతకాదిప్పుడు. నా సితార్ దుమ్ముకొట్టుకు పడిఉంది. అది ఇప్పుడు దులపబోతే గతఅనుభవాల స్మృతులపై ఏర్పడిన విస్మృతి ధూళిని దులిపి నట్లే అవుతుంది. ఆ షరతు సడలించి, నువ్వు పాడు."
"అయితే పాడడమూ నా చేతకాదు."
"కాదు. సితార్ నే శ్రుతిచేస్తా. నువ్వుపాడు, బాలా." ఉదయభాను మాటకు లొంగిపోయి ఒప్పుకోవలసి వచ్చింది విరిబాలకు.
ఉదయభాను సితార్ వాదనంతో విరిబాల కర్ణపేయంగా పాడింది. ఆమె రంగస్థలం మీదినుండి దిగి వెళ్ళేసరికి కృష్ణప్రియ రూపను బలవంతం చేస్తూంది ఒక పాట పాడమని.
"అబ్బో! రాదంటే వదలను. మొన్న మీ ఇంట్లో వీణ చూసివచ్చాను. మస్కాకొట్టబోకు" అంటూంది గమ్మత్తుగా.
"అయితే తప్పదంటారా?"
"తప్పదు! తప్పదు! తప్పదు!"
గోకుల్ ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముందువరసలో కూర్చొన్న కల్యాణి రూపగానంలోని సొంపుతో తన్మయడవుతున్నాడు. ఏదో గీతిక విషాదరాగంలో ఆలపిస్తూంది ఆమె. కంఠంలోని విషాదభావప్రకటనకు అనుగుణంగా మారిన ఆమె ముఖకవళికలు చూస్తూంటే, రంగస్థలం మీద దుఃఖరసపూరితమైతమైన పాత్ర ఆమె చక్కగా పోషించగలదనిపిస్తూంది.
ఉదయంనుండి గోకుల్ తో సంరక్షణలో క్షణం తీరిక లేక సంస్కారం నోచుకోక రేగిన ముంగురులు, అలసటతో వదిన ముఖమూ ఆమె విషాదసౌందర్యానికి మెరుగులు దిద్దుతున్నాయి, విద్యుద్దీపాల కాంతిలో.
ఆమె సౌందర్యంలోని ఆకర్షణ ఒకవంకా, ఆమె కంఠంలోని శ్రావ్యత మరొకవంకా కదిలించగా కల్యాణ్ లో అపూర్వమైన చైతన్యం ఏదో కదిలింది. ఏదో ప్రేరణ అతన్ని ఆవేశపరిచింది; దేనికోసమో ఉత్తేజ పరిచింది. దిగ్గున లేచాడు. గోకుల్ ను కృష్ణప్రియకు ఇచ్చి, ఉదయభాను వదిలివెళ్ళిన సితార్ ముందు కూర్చున్నాడు.
"ప్లీజ్! మరొక పాట పాడగలరా?" సితార్ తీగలు సవరిస్తూనే అడిగాడు.
ఆశ్చర్యంగా చూచింది రూప, అతడికేసి.
"పాడండీ!"
అతడి అర్ధింపూ, ఆసక్తీ కాదననివ్వలేదు రూపను. కంఠంసవరించి అందుకుంది మరో పాట, తిరిగి విషాదరాగంలోనే,
రూప ముఖంలో తొంగిచూస్తూన్న విషాదభావమూ, కంఠంలో ప్రవహిస్తూన్న విషాదరాగమూ విషాద భరితమైన కళ్యాణ్ హృదయవిపంచిని మీటగా అతడూ రసా వేశంతో రూపకంఠాన్ని అనుసరిస్తున్నాడు, సితార్ మీద.
కొన్ని నిమిషాలక్రితం సితార్ మీటడం తనవల్ల కాదన్న బావ రూపపాటకు శ్రుతివెయ్యడం చూచిన విరిబాల స్త్రీహృదయం సహించలేకపోయింది. చరచరా వెళ్ళిపోయింది ఇంట్లోకి.
ముగ్ధులై వింటూన్న శ్రోతలు రూప విశాల వినీలలోచనాలలో కదలివచ్చిన కన్నీరు చూసి, "ఓహ్! ఏమారసోద్వేగం, భావసమైక్యం!" అని మెచ్చుకొంటూండగానే వారిలో కలకలం రేగింది, రూప కూర్చున్నచోటే ఒరిగిపోవడంతో.
"ఏమైంది? ఏం జరిగింది?" అంటూ రూపచుట్టూ గుమిగూడారు.
స్పృహలేకుండా పడిఉన్న రూప ముఖంపై నీళ్ళు తెప్పించి చల్లి, చేతిరుమాలుతో మృదువుగా ఒత్తాడు కళ్యాణ్.
కళ్ళు తెరిచిన రూప తన చుట్టూమూగిన జనాన్నీ, తన తలదగ్గిరే కూర్చొన్న కళ్యాణ్ నూ చూచి దిగ్గున లేచికూర్చుంది సిగ్గుతో. "ఏం జరిగింది?" అంది తొట్రుపడుతూ.
"అది మీరే చెప్పాలి!" అన్నారెవరో.
"ఏం జరిగింది? ఏం జరిగింది?" గొణిగింది. "ఏదో కొంచెం కళ్ళు తిరిగినట్లనిపించింది." ఇక అక్కడ కూర్చోవడం సిగ్గుగా తోచి కృష్ణప్రియసాయంతో ఇంట్లోకి వెళ్ళింది రూప.