కళ్యాణ్, గోకుల్ ను అందుకొని పైకి ఎగరవేసి పట్టుకొన్నాడు. వాణ్ణి కిలకిలా నవ్విస్తూ చుబుకాన్ని చుంబించాడు, తనూ పసిపాపలా నవ్వేస్తూ.
రెప్ప వాల్చకుండా, కన్ను మరల్చకుండా వారిద్దరి సమాగమోత్సాహాన్ని తిలకిస్తున్నది రూప.
"టీ తీసుకో, రూపా." కృష్ణప్రియ రూపకు కప్పు అందించింది, మరోకప్పు కళ్యాణ్ కు ఇచ్చింది, "కృష్ణా, తీసుకో" అంటూ. అక్కడికి వచ్చిన విరిబాలకు కూడా టీ ఇచ్చి, రూపకూ ఆమెకూ పరస్పరం పరిచయం కలిగించింది కృష్ణప్రియ.
కొన్ని క్షణాలపాటు పరస్పరం పరికించుకొన్నారు రూపా, విరిబాలా. ఏ దేవాంగనతోనో పోల్చుకొన్నారు ఒకరినొకరు తమలో తాము.
టీ తాగడం పూర్తి చేసి హాలులోకి వచ్చి కూర్చున్నారు అందరూ.
"మీ ఆరోగ్యం బాగున్నది కదా?" అడిగాడు కల్యాణ్.
"మొన్నటిదాకా బాగానే ఉంది. నిన్నరాత్రి మళ్ళీ కొంచెం జ్వరం తగిలింది" చెప్పింది రూప.
"చెయ్యి ఇటు తెండి." చెయ్యిచాచి రూపచేతి నందుకొని చూశాడు. "జ్వరమేమీ లేదు. బలహీనంగా మాత్రం ఉంది, అందుకు ఆ టానిక్ వాడమని చెప్పాగా?" అన్నాడు చెయ్యి వదిలిపెడుతూ.
కృష్ణప్రియ అన్నది: "గోకుల్ పుట్టినరోజు కృష్ణజయంతినాడు చెయ్యదలిచాం. నిరుడు కృష్ణ జయంతినాడే వాడు కల్యాణ్ కు లభ్యమయ్యాడు. ఉదయభానుతో కలిసి తప్పకుండా రావాలి నువ్వు.ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలంటున్నాడు కళ్యాణ్. ఒక్క దాన్నీ చెయ్యలేను. రెండు రోజులు ముందుగా వస్తేనాకు సాయంగా ఉంటావు."
చెప్పింది శుభవార్తే అయినా ఒక్కరి ముఖంలోనూ సంతోష ప్రకటనకాలేదు.
విరిబాల హృదయంలో గోకుల్ ను ఆధారం చేసుకొని అగ్ని రగులుతూంది. కళ్యాణ్ చేతుల్లో ఆడించబడుతూన్న వాడికేసి మాడ్చి మసిచేసేట్లు ఒక్క చూపు విసిరి తల తిప్పేసుకుంది విసురుగా.
అంతరంగంలో గతస్మృతులు కలిచివేస్తూండగా నిరాసక్తంగా కూర్చొన్నాడు కళ్యాణ్.
పరధ్యానంగా ఎటో చూస్తూన్న రూప ఉండిఉండి లేచింది, "ఇక వస్తాను, డాక్టర్. గుడ్ నైట్" అంటూ. డాక్టర్ నుండి గుడ్ నైట్ అందుకొని నిష్క్రమించింది.
కళ్యాణ్ లోపల భోజనం చేస్తున్నాడు.
బాల్కనీలో నిల్చుండి వెన్నెల వెల్లువఅయిన ప్రకృతిని తిలకిస్తూన్నది విరిబాల. వెనకపాటుగా కాళ్ళకేదో చుట్టుకోవడంతో తుళ్ళిపడి చూచింది. గోకుల్ ! అసహ్యంగా విదిలించికొట్టింది వాణ్ణి. దూరంగా వెళ్ళి పడ్డాడు తిరిగి కొంచెం సేపటికి చేతులు చాచి ఎగబడ్డాడు. "థ థ థా" అంటూ, ఎవరో నవ్విస్తున్నట్లు గుక్కబట్టి నవ్వేస్తూ.
పిల్లవాడి సాధుత్వం ముందు విరిబాల కఠినత్వం కరిగిపోయింది. 'దేవతకూ రాక్షసికీ భేదం తెలియని పసికందు వాడిపైనా నే వింత అసూయా ద్వేషాలూ నింపుకొన్నది?' కళ్ళు రెండూ నిండుకొన్నాయి. నిర్మలాంతఃకరణతో గోకుల్ ను అందుకొని కిందికి వచ్చింది విరిబాల. "వీడు నిన్నే గుప్పిటలో పెట్టుకోలేదు; నన్ను కూడా జయించాడు, బావా!" అంది మందస్మిత మధుర వదనంతో.
విరిబాలలో వచ్చిన మార్పుతో తేలికపడింది కృష్ణ ప్రియ. "నీ తప్పులు ఏవి క్షమించినా తన పుట్టినరోజు పండుగకు నువ్వు రాకపోతేమాత్రం క్షమించడు గోకుల్" అంది నవ్వుతూ.
"రాకపోవడానికి ఇక ఏముంది?" అన్నది విరిబాల మనఃస్పూర్తిగా.
3
చెల్లాచెదురుగా పడిఉన్న ఆటబొమ్మల మధ్య గచ్చునేలమీద నిద్రపోతున్నాడు గోకుల్.
బయటినుండి వచ్చి తన గదిలోకి పోబోయినకళ్యాణ్ దృష్టిని గోకుల్ కంటే ముందుగా ఆటబొమ్మలు ఆకర్షించాయి. నృత్యం చేసే భామ, గడజారే కోతి, పల్టీలు కొట్టే మనిషి -ఇంకా వింత వింత బొమ్మలు చాలా ఉన్నాయి. 'ఎక్కడివి ఈ బొమ్మలు? అక్కకొన్నదా? చాలా ఖరీదే అయి ఉంటుంది' అనుకొంటూ గోకుల్ కు మెలకువ కలగకుండా నెమ్మదిగా భుజంమీదికి ఎత్తుకొనివెళ్ళి తొట్టెలో పడుకోబెట్టి వచ్చాడు. బొమ్మలన్నీ ఆల్మెర్తాలో పెట్టి, నృత్యం చేసే భామ బొమ్మను తీసుకొని దాని కులుకులు చూస్తూ కృష్ణ ప్రియ గదిలోకి వచ్చాడు. "ఈ బొమ్మలన్నీ ఎప్పుడు కొన్నావ్, కృష్ణక్కా? అన్నింట్లో ఈ బొమ్మ ముచ్చటగా ఉంది." బొమ్మను ఇంకా ఆడిస్తూ పకపక నవ్వుతూ అన్నాడు కళ్యాణ్.
"నేను కొనలేదు, బొమ్మలు. గోకుల్ కోసం రూప కొనుక్కువచ్చింది."
కళ్యాణ్ ముఖంలో నవ్వు మటుమాయమైంది. అసహనంతో అన్నాడు: "ఎందుకు తెచ్చింది?"
తమ్ముడిలో వచ్చిన మార్పుకు కొంచెం ఆశ్చర్యానికి లోనయింది కృష్ణప్రియ. నెమ్మదిగా చెప్పింది: "పసివాళ్ళంటే చాలా ఇష్టమట రూపకు, పసిపాపల ముగ్ధహాసాలకు పరవశ మౌతుందిట. గోకుల్ అనాథ బాలుడు; ఇంకొంచెం ఎక్కువే కరుణానురాగాలు వెల్లివిరిసి ఉంటాయి. వాడికోసం ముచ్చటపడి తెచ్చింది."
"గోకుల్ అనాథుడెలా అవుతాడు?"
అతడి మనోభావం గుర్తించిన కృష్ణప్రియ చిరుహాసం చేసింది. "తల్లితండ్రులచే త్యజింపబడిన బిడ్డను ఏమంటారు, కృష్ణా?"
కొంచెం ఉద్వేగంతో అన్నాడు: "కన్న మమకార మైనా లేకుండా కఠిన పాషాణ హృదయంతో కన్న పాపను వదిలివేసినవారు తల్లిదండ్రులు కాదు. గోకుల్ కు తల్లీ, తండ్రీ నేను. నా సంరక్షణలో ఉన్నంతవరకు గోకుల్ అనాథుడు కాదు. నేను బతికిఉండగా గోకుల్ కు ఆ దురదృష్టం పట్టదు."
"పిచ్చికృష్ణా!" కృష్ణప్రియ అనునయంగా పలికింది. "నిండు హృదయంతో ఆరాధించిన రాధను కూడా పరిత్యజించి అయాచితంగా లభ్యమైన ఒక పసివాడి బాధ్యత స్వీకరించావు. అతఃడు అనాథుడవడం నీ హృదయం సహించదు. కానీ, తల్లితండ్రులకు దూరమై ఒకరి దయాదాక్షిణ్యాలపై పెరుగుతున్న వాణ్ణి అనాథుడనే అంటుంది లోకం."
"అహఁ సహించను. అతడు అనాథుడు అని ఎవరు కూడా సానుభూతి ప్రేమలు కురిపించక్కర్లేదు. అలా అయితే నా త్యాగం, సాహసం అన్నీ అర్ధవిహీనాలు. గోకుల్ నా బాబుగా పెరగాలి. గొప్పగా, రాజాగా పెరగాలి. ఎవరూ సానుభూతి చూసి గోకుల్ జీవితాన్ని న్యూనత పరచడం నేను సహించను. గోకుల ఉజ్జ్వల భవితవ్యం పై అటువంటి మలినచ్చాయలు పడే పక్షంలో సాధ్యమైనంత దూరప్రదేశానికి గోకుల్ ను తీసుకుని వెళ్ళిపోతాను."
అత్యంతావేశపూరితమైన అతడి మాటలు వింటూ ఆశ్చర్యాంబుధిలో మునిగి ఉన్న కృష్ణప్రియ, కళ్యాణ్ కసికొద్దీ చేతిలోని బొమ్మను కిటికీలోంచి విసిరి వెయ్యడం చూచి విస్తూపోయింది. "ఏమిటిది, కృష్ణా, నీ పిచ్చి!" అంది కంగారుగా.
"గోకుల్ జీవితాన్ని కళంకితపరుస్తూ ఒకరి దయా సానుభూతులకు నిదర్శనంగా ఇలాంటి వస్తువులు నా ఇంటిలో ఒక్క క్షణం ఉండకూడదు."
ఉన్మత్తుడులాగ చటుక్కున వెళ్ళిపోయిన కళ్యాణ్ ఏం చెయ్యబోయేది క్షణంలో ఊహించింది కృష్ణ ప్రియ. ఆందోళిత హృదయంతో బయటికి వచ్చింది.
రూప కొని తెచ్చిన బొమ్మలన్నీ పెరటి నూతిలో పడవేసి ఒక పెనుభూతాన్ని వదిలించుకొన్నంత నిశ్చింతా సంతుష్టహృదయంతో ఎదురయ్యాడు కళ్యాణ్.
ఒక్క నిట్టూర్పు విడిచింది కృష్ణప్రియ. గోకుల్ బరువు బాధ్యతలు స్వీకరించడంతో తన జీవన సర్వస్వమైన రాధను కోల్పోయాడు కళ్యాణ్. ఆ లోటునుగోకుల్ ద్వారా భర్తీ చేసుకోవాలనుకుంటున్నాడు. పిచ్చి ప్రేమతో అతడి చుట్టూ ఆశలు అల్లుకొంటున్నాడు. ఈనాడు అతడే సర్వస్వం దాచిపెట్టిన ధవంలా ప్రేమిస్తున్నాడు. ఆ ధనంపై ఎవరి కన్ను పడినా సహించలేని తత్త్వం ఏర్పడింది అతడిలో.
తమ్ముడి ప్రవర్తన చూస్తూంటే భయాందోళన లకు లోనయింది కృష్ణప్రియ హృదయం. 'అధికంగా ప్రేమపాత్రమైన వస్తువు గగనకుసుమ మవుతూ ఉంటుంది మానవుడికి ఇంతగా ప్రేమించబడుతున్న గోకుల్ కళ్యాణ్ కు కాకుండాపోతే?' తమ్ముడికి సంభవించబోయే దుస్థితి ఊహించడానికే భయపడింది.
సాయం సమయం.
పబ్లిక్ గార్డెన్స్ లో ఓ పక్కన కారు ఆపి గోకుల్ తో దిగాడు కళ్యాణ్ జనంతో కలకలాడుతూంది తోట. సంధ్యావధూటిని ఆరాధించబోతూన్న పస్తాశ్వుని మయూఖాలు సోకినా ఫౌంటెన్లు విరజిమ్ముతున్న నీటి తుంపరలు రత్నాలు పగడాలు రాలుతున్నట్లుగా భ్రమ గొలుపుతున్నాయి. తల్లి ఒడిలోనుండి పైకివచ్చి రేకులు విచ్చుకొని తమ పూర్ణ సౌందర్యంతో విరగబడుతున్నపుష్పసుందరులను కొంటెగా తాకి వాటికి తెలియకుండగానే వాటి పరిమళాలు అపహరించుకొనిపోయి తోటలోని జనానికి పంచిపెడుతున్నాడు మలయ పవనుడు.
సమీపంలో ఎవరూ లేని స్థలంచూసి ఓ పక్క పచ్చికలో కూర్చొన్నాడు కల్యాణి, గోకుల్ ను ఆడిస్తూ. గోకుల దృష్టి కొబ్బరి కొమ్మపై నిక్కిచూస్తూన్న ఉడతపిల్లపై పడింది. పట్టుకోగలవాడిలా పరుగున వెళ్ళాడు. చేతులుచాస్తూ ఏమిటో సంభాషించసాగాడు ఉడతపిల్లతో. భీతి చెందినదానిలా చెంగున దూకి ఆకులమాటున అదృశ్యమైంది అది. ఏడుపు లంకించుకొన్నాడు గోకుల్. కళ్యాణ్ ఎత్తుకొని బుజ్జగించసాగాడు, "మరి అది చిక్కుతుందటరా? వెర్రినాన్నని!" అంటూ.
ఇంకా అటే చూపుతూ ఏమిటో చెబుతున్నాడు గోకుల్. అతడి మూగధ్వనులలోనూ ఏవో అర్ధాలు స్ఫురిస్తూనే ఉన్నాయి కల్యాణికు. "నీకు చిక్కదు; నాకూ చిక్కదు. దూరంగా ఉండి నేస్తం కలుపుకో" అన్నాడు నవ్వుతూ.
రసాల వృక్షంమీద రకరకాల పక్షులు కిలకిలలాడుతున్నాయి. వాటికేసి నిశ్చలంగా, గంభీరంగా దృష్టి నిగిల్చాడు గోకుల్.
కొంచెంసేపు అటు ఇటు తిప్పి తిరిగి పచ్చికలో కూర్చోబెట్టుకొన్నాడు కళ్యాణ్ అతడి కళ్ళజోడు లాగి తను పెట్టుకోబోయాడు గోకుల్. కళ్ళకు సరిగా అమరడంలేదు. కళ్యాణ్ అది పెట్టి, "చక్కగా ఉన్నావు" అన్నాడు, కళ్ళజోడులో గోకుల్ ముద్దు వస్తూంటే.
తనకుమాత్రం బాగుండలేదనిపించిందేమో, లాగి పారవెయ్యబోయాడు గోకుల్.
"పారవెయ్యకు. పగిలిపోతాయి." కళ్ళజోడు అందుకొని పెట్టుకొన్నాడు.
"గుడ్ ఈవినింగ్, డాక్టర్!"
తల తిప్పి చూశాడు కళ్యాణ్. ధవళవస్త్రాలలో నిర్మలత్వానికి ప్రతిరూపుగా, సౌందర్యానికి ప్రతినిధిగా నిలిచి ఉన్నది రూపవతి.
ఉత్సాహంగా పశ్నించింది: "తరుచుగా వస్తూంటారా షైర్, మీరిక్కడికి?"
"సెలవురోజుల్లో వీలునుబట్టి వస్తూంటాను, గోకుల్ తో." నిన్నటి సంఘటన మనస్సులో మెదలగా కోరగా చూశాడు ఆమెకేసి. గోకుల్ ను పొదివి పట్టు కొన్నాడు, డేగ దృష్టి నుండి పావురాన్ని రక్షించే వాడిలా.
"రా, బాబూ!" ఆప్యాయంగా చేతులు చాచింది రూప. చాచిన చేతుల్లోకి అతడు రాలేదు. కళ్యాణ్ మెడచుట్టూ చేతులుచుట్టి అయిష్టంగా తల ఊపాడు.
"రా బాబూ. నీకు బిస్కెట్లు కొని పెడతా, దా."
'వాడు నీ బిస్కట్లకేం మొహం వాచిపోలేదు.' చురచురా చూశాడు కళ్యాణ్.
బలవంతంగా ఎత్తుకొంది గోకుల్ ను, రూప.
ఆమె చేతుల్లో నిలవకుండా కాళ్ళు చేతులు కొట్టుకొని ఏడవసాగాడు.
"ఇటివ్వండి, బాబును."
కళ్యాణ్ మాటను వినిపించుకోకుండా గోకుల్ ను లాలిస్తూ, పువ్వులనూ పక్షులనూ చూపుతూ కళ్యాణ్ దృష్టికి దూరంగా తీసుకుపోయింది రూప.
చీకటి పడింది. లైట్లు వెలిగాయి.
తోట అంతా చుట్టివచ్చాడు కళ్యాణ్. రూప జాడలేదు. రూపవల్ల గోకుల్ నుండి ఏర్పడిన ఈ వియోగం దుస్సహంగా ఉంది అతడికి. క్షణక్షణానికి చిరాకు హెచ్చుతూంది. కారు తలుపును ఆనుకొని నిరీక్షిస్తున్నాడు.
ఏడు అయింది,
'ఇక రాదేమో? ఇంటికి వచ్చి దిగబెడుతుందేమో, గోకుల్ ను!' తలుపు తెరిచి స్టీరింగ్ ముందు కూర్చున్నాడు కళ్యాణ్. స్టార్ట్ చేయబోయేముందు నలుదెసలా కలయజూశాడు. అల్లంతదూరంలో గోకుల్ తో వస్తూంది రూప. సమీపిస్తున్నకొద్దీ కళ్ళు పెద్దవిచేసి చూడసాగాడు. రూప చేతులలో ఏవో పాకెట్లు! సరదాగా ఏదో మూగసంభాషణచేస్తూ గోకుల్! అతడు ఏదో చప్పరిస్తున్నాడు.
గంట క్రితం రూపదగ్గిరికి వెళ్ళడానికి నిరాకరించిన గోకుల్ ఆమెకు ఇంతగా అలవాటుకావడం సహించరానిదే అయింది కళ్యాణ్ కు. తన వస్తువేదో పరాధీనమై పోతున్నట్లు వ్యాకులపడింది అతడి మనస్సు. ప్రథమంగా రూపపై ఈర్ష్యాసూయలు కలిగాయి అతడిలో తలుపు తీసి గోకుల్ ను అందుకొన్నాడు. చాక్ లెట్ పాకెట్ ఒకటీ, బిస్కెట్ పాకెట్ ఒకటీ అందివ్వబోయింది రూప.
"అవి ఎందుకు?" తీవ్రంగా ముఖంపెట్టి తీక్షణంగా చూసే కళ్యాణ్ చూపును ఎదుర్కొనలేకపోయింది రూప. అవమానకరమైన అతడి ధోరణికి ఆమె హృదయం సుళ్ళు తిరిగిపోయింది.
అభిమానంగా అంది: "మీ ఆదరభిమానాల కోసం ఎర వెయ్యడంలేదు. ఇవి లంచాలు కావు. బాబుమీది ప్రేమకొద్దీ తీసుకువచ్చాను. తీసుకోండి."
అతడి కోపకారణం సూటిగా గ్రహించలేని రూప తను వదిలిన వాడి బాణంతో అతడి కోపాన్ని పరిహరించ లేకపోయింది.
"మీ అనురాగాదరణలు వంచడానికి అనాథులకు కొరతలేదు." విసురుగా తలుపు వేశాడు.
స్టార్టయి వెళ్ళిపోతూన్న కారువైపు చూస్తూ శిలా ప్రతిమలా నిల్చుండిపోయింది రూప. చాచిన చేతిలోని పాకెట్లు వెక్కిరిస్తున్నట్లు తోచి, ఒక్కసారి బావురుమని ఏడవాలనిపించింది. నిర్జీవంగా కొన్ని నిమిషాలు అక్కడే నిల్చుండిపోయి నీరసంగా నడక సాగించింది.
* * *