Previous Page Next Page 
జీవన సంగీతం పేజి 7


    గోకుల్ జన్మదినోత్సవసందర్భంలో ఆహుతుల నుద్దేశించి తాను చెప్పదలిచిన రెండు మాటలు చెప్పాడు కళ్యాణ్ : "గోకుల్ నాకు దొరికిన బిడ్డ అని మీ అందరికీ తెలుసు. పోయిన  కృష్ణాష్టమిరోజు రైల్లో లభ్యమయ్యాడతడు. అందుకనే, అతడికి 'గోకులకృష్ణ'పేరు ఉంచాను. ఒకవిధంగా కృష్ణుడి జీవితాన్ని పోలిఉన్న గోకుల్ అంతటి కీర్తిపురుషుడుగా, పరిపూర్ణచరితుడుగా అయేటట్లు పెద్దలందరు ఆశీర్వదించ ప్రార్ధిస్తున్నాను."
    ఒక్కొక్కరూలేచి కళ్యాణ్ చేతుల్లో గోకుల్ ను ఎత్తుకొని అతడిపై ముద్దులూ, ఆశీర్వాదాలూ కురిపించి సెలవు తీసుకోవడంతో నాటి గోకుల్ జన్మదినోత్సవం ముగిసింది.
    కళ్యాణ్ లోనికి వచ్చాడు.
    "నీదినిజమైన రసావేశమనుకోను, రూపా. చలాకీగా, ఉత్సాహంగా ఉండ ప్రయత్నిస్తూనే ఏదో పోగొట్టుకొన్నట్లు బాధపడుతూంటావు. నేను కనిపెట్టాను" అంటూంది కృష్ణప్రియ, అవనతశీర్షయై ఉన్న రూపతో.
    "ఏం లేదు, ఏం లేదు. ఏముంది, పోగొట్టుకో డానికి?" తొట్రుపాటుతో లేచి నిల్చుంది రూప. "గోకుల్ ఎక్కడ?"
    వెనకనుండి అన్నాడు కళ్యాణ్: "ఇక్కడున్నాడు."
    కళ్యాణ్ చేతులనుండీ గోకుల్ ను ఎత్తుకొని ముద్దులు కురిపించి అతడిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ, "ఇక వస్తాను, బాబూ" అంది తిరిగి ఇచ్చివేస్తూ.
    "రూపాదేవీ! ఆగండి. కారులో మిమ్మల్ని ఇంటిదగ్గిర డ్రాప్ చేస్తాను." గోకుల్ ను కృష్ణప్రియకు అందించి కదిలాడు కళ్యాణ్.
    "ఎందుకు? ఏమీ వద్దు. నేను వెళ్ళగలను."
    నవ్వుతూ అంది కృష్ణప్రియ: "కాదు. కళ్యాణ్ నిన్ను ఇంటిదగ్గిర దిగబెట్టి వస్తాడు. చాలా రాత్రి అయింది....నువ్వు కళ్యాణ్ ను క్షమించాలి, రూపా అతడు చేసింది తప్పే. దయతో మనస్సులో పెట్టుకో వద్దు. ఇంటికి వస్తూ పోతూ ఉండు."
    "అంతటి అపరాధాన్ని క్షమించందే రాగలిగానా, ఇక్కడికి?" బలవంతంగా నవ్వింది రూప. కళ్యాణ్ ముఖంలోకి చూడబోయి చటుక్కున తలవంచుకొంది, తన ముఖంమీద పరుచుకొన్న అతడి చూపులను ఎదుర్కొనలేక. "వస్తానండి" అని కృష్ణప్రియ దగ్గిర సెలవు తీసుకొని కదిలింది.
    రూప వెనకే కదిలిన తమ్ముణ్ణి చూచి నవ్వుకొంది కృష్ణప్రియ, రూప అంటే కోరగా ఉండే కళ్యాణ్ చూపు ఓరగా మారడం గుర్తించి, తన అంతరంగంలో అభిలషిస్తున్నదేదో అనుకూలించబోతున్నట్లు ఆనందించింది.
    
                                         5

    కళ్యాణ్ కారు ఇంటిగేటులో ప్రవేశించింది.
    గూర్ఖా సలాంకొట్టి, "అమ్మగారు లేరు. రూపవతి గారి ఇంటికి వెళుతున్నామని చెప్పారు. తాళంచెవి ఇచ్చి పోయారు" అని చెప్పి, కళ్యాణ్ కు తాళంచెవి ఇచ్చాడు.
    కళ్యాణ్ కాస్సేపు మౌనంగా కూర్చొన్నాడు తన గదిలో అతడిముందున్న టేబిల్ కాళీగా ఉంది. ఒకప్పుడు విరిబాల ఫోటో ఉండేది దానిమీద. విరిబాల వచ్చినప్పుడు ఆ ఫోటో తీసివేసింది. ఆ స్థానంలో రూప చిత్రపటాన్ని అలంకరింపజెయ్యాలని ఎన్నోసార్లు అనుకొన్నాడు. చూచినవారు నవ్విపోతారన్న భయంతో ఆ ప్రయత్నం మానుకొన్నాడు.    
    ఇంట్లో అక్కలేదు. తను ఇంటికి వస్తే క్షణం విడిచి ఉండని గోకుల్ లేడు. ఏం తోచలేదు. గోకుల్ జన్మదినోత్సవంనాటి రూప విషాదసుందరమూర్తి మనస్సులో పదేపదే మెదులుతూండగా రంగులు కలిపి చిత్రఫలకంపై ఆమె రూపాన్ని చిత్రించసాగాడు.
    కృష్ణప్రియ గోకుల్ చెయ్యి పట్టుకొని మెల్లిగా నడిపిస్తూ వచ్చింది గదిలోకి. కళ్యాణ్ తత్తరపాటుతో ఫలకంపై తెర వేసేలోగానే అక్కకు చిక్కిపోయాడు.
    కొంటెగా నవ్వి అంది కృష్ణప్రియ; "దాచుకో. దాచుకోవోయ్, వెర్రికృష్ణా! పువ్వు పూర్ణ సౌందర్యంతో పైకి దర్శనం ఇస్తూండగా తావిదాచాలని ప్రయత్నించినట్లుంది. పాపం, నీ సంగతి నా కేమీ తెలియనట్లు!"
    సిగ్గుతో ముఖం చాటుచేసి నవ్వాడు కళ్యాణ్.
    "బాబుకు నిద్రపొద్దు అయింది. అన్నం పెట్టుకు వచ్చి నిద్రపోగొట్టివస్తాను. నీతో కొంచెం మాట్లాడాలి." గోకుల్ ను తీసుకొని వెళ్ళిపోయింది.
    తాను సర్వాంగ సుందరంగా పూర్తిచేసిన రూపచిత్రం కేసి చూస్తూ కూర్చున్నాడు కళ్యాణ్. ఇప్పటికి చాలా రోజు లయింది ఆమెను చూచి తను. గోకుల్ పుట్టిన రోజు తరవాత ఒక్కసారి మాత్రం వచ్చింది. మళ్ళీ రాలేదు ఇంటికి. 'రూపా! నా మనోమీనానికి గాలంవేసి ఒడ్డుమీద కూర్చొన్నావు. వీడు గిలగిల కొట్టుకుంటున్నది నీకేం తెలుసు? కవ్వించడంవరకు నీ వంతయింది, ప్చ్!'
    ఆ రోజు ఏం చేసింది? రూపను దిగబెట్టడానికి వెళ్ళాడు కారులో.
    "ఇంట్లోకి రండి" అంది తలుపు తాళంతీస్తూ.
    "ఎందుకులెండి. చాలా రాత్రి అయింది" అన్నాడు తను.
    "రాత్రికీ, మీరు నా గృహం పావనం చెయ్యడానికీ సంబంధమేమిటో?" క్రీగంట చూసి, కొంటెగా నవ్వింది తనను కవ్విస్తూ. ఆ పాటపాడిన విషాదమూర్తికీ, ఈ రూపకూ పోలికే లేదు. ఎంత చిలిపితనం! ఎంత ఉత్సాహం! ప్రేమతోకూడిన కసి బయలుదేరింది తనలో ఆమెను తన కౌగిటిలోకి తీసుకోని కసిగా నలిపివేసి "సంబంధమిది" అని చెప్పాలని అనిపించింది.
    అంతలోనే రూప నిష్టూరంగా అంది: "సిగ్గులేని దాన్ని; మరిచిపోవడం, మన్నించడం నాకు తేలికైంది, మీరెలా మరిచిపోగలరు? నామీద ఎంత అసహ్యం లేకపోతే అంత అవమానం చెయ్యగలుగుతారు?"
    "క్షమించండి, రూపాదేవీ! నేను మీపట్ల చేసింది ఘోరమైన నేరం. నన్నావహించిన దయ్యం వదిలిపోయిందనే అనుకొంటున్నాను. అక్క నా సంగతి మీకు చెప్పే ఉంటుంది. మనిషి కొన్ని బలహీనతలకు లొంగిపోతుంటాడు కదూ?"
    "మీరేం చేశారని మీమీద నా కసహ్యం? మీరు మనస్సులో అలాంటివేవీ పెట్టుకోవద్దు." పలికాడు ప్రార్ధనాపూర్వకంగా.
    తరవాత ఒకసారి మాత్రం వచ్చి తన మనస్సును సంపూర్తిగా దోచి వెళ్ళింది.
    గోకుల్ కు అన్నం పెట్టుకోని కృష్ణప్రియ వచ్చింది. "పెరుమాళ్ళ దగ్గిర దీపారాధన చేసివస్తాను. బాబును నిద్రపుచ్చు" అని చెప్పి వెళ్ళింది.
    ఈమధ్య రాత్రివేళలలో కళ్యాణ్ దగ్గిరే పడుకొంటున్నాడు గోకుల్. బట్టలు తడుపుతాడన్న భయం తీరిపోయింది. మంచంమీద పక్కవేశాడు కళ్యాణ్, గోకుల్ మంచం ఎక్కి కూర్చొన్నాడు, అతడికి నిద్రవచ్చినట్లులేదు.
    "మలే, నాన్నా! మేం ఎల్లాం." ఏదో ఘనకార్యం చేసినట్లు చెప్పాడు కళ్యాణ్ ఒళ్ళోచేరి.
    "ఎక్కడికమ్మా?"
    "ఆమె ఇంతికి."
    "ఆమె ఎవరు?" కళ్యాణ్ కు తెలుసు, చెప్పడానికి గోకుల్ ఉన్న భాషాపరిజ్ఞానం చాలదని.
    "అదే... ఆమె..."
    "అదే, ఎవరామె అని అడుగుతున్నాను."
    'నేను చెప్పలేని ప్రశ్న చూసి అడుగుతున్నావా?' అన్నట్లు కళ్యాణ్ బుగ్గకొరికి కిలకిల నవ్వాడు గోకుల్.
    పంచచెరగుతో చెంప తుడుచుకొని, వాడిని బుజ్జగిస్తూ, "రూప ఇంటికి వెళ్ళారా, నాన్నా?" అన్నాడు.
    "ఆఁ! లూప ఇంతికి ఎల్లాం." చటుక్కున అందుకొన్నాడు. "నాకు పల్లూ,పిప్పరమెంత్లూ పెత్తింది. పెత్తీ.....రోజూ మా ఇంతికి ఒత్తావా బాబూ అంది."
    "నువ్వేమన్నావ్?"
    "అహఁ లానన్నాను."
    "ఎందుకూ?"
    "మా నాన్నొత్తే.....మా నాన్నతో ఒత్తాను అన్నా."
    "ఆహాఁ?"
    కృష్ణప్రియ దేవుడిముందు పెట్టిన అరటిపండు ముక్కలు చేసి ప్రసాదంగా ఇచ్చింది కళ్యాణ్ కూ, గోకుల్ కూ. "నిద్ర రాలేదా, నాన్నా?"
    కళ్యాణ్ నవ్వుతూ, "కబుర్లు చెబుతున్నాడు." అన్నాడు.
    చెయ్యి కడుక్కొని తడి తుడుచుకొంటూ వచ్చి కూర్చొంది కృష్ణప్రియ, స్థిమితంగా, "ఎన్నాళ్ళు ఇట్లా గడుపుతూ పోవాలనుకొన్నావు, కృష్ణా" అంది, వాతావరణం బరువుగా మార్చివేస్తూ.
    మాట్లాడలేదు కల్యాణి. ఒళ్లోని గోకుల్ క్రాష్ సర్దుతూ కూర్చొన్నాడు.
    "వందమంది అనాథుల్ని చేరదీసి నీ బిడ్డలుగా పెంచినా, వెయ్యిమంది రూపవతులను చాటుగా ఆరాధిస్తూ కూర్చొన్నా నీ జీవితానికి అందం లేదు. ఇల్లూ, ఇల్లాలూ ఏర్పడాలి. పిల్లాపాపా కలగాలి. ఇల్లు కలకలలాడాలి.
    "నేను ఎన్నాళ్ళని ఉంటాను నీదగ్గిర? గోకుల్ కోపంవచ్చి ఉన్నాను. ఇప్పుడు నేను లేకున్నా వాడికి పర్వాలేదు. కొంచెం ఎదిగాడు. ఇవాళో రేపో వెళ్ళిపోవాలనుకొంటున్నాను నా ఊరికి. వంటమనుషులతో, పనిమనుషులతో నీ జీవితం గడిచిపోవచ్చు. ఏమైనా ఆడది లేని ఇల్లు ఎలా ఉంటుంది, కృష్ణా?"

 Previous Page Next Page