వెంకటేశ్వర్లు మనస్సు తహతహ లాడి పోతోంది.
"ఆ సోది తర్వాత....అసలు పిల్ల ఎలా వుంటుందీ.....జయలలితలానా, కాంచనలానా, విజయనిర్మల లానా పోనీ చంద్రకళలానా....చెప్పుబ్రదర్. పోనీ డ్రీమ్ గర్ల్ హేమ మాలిని లా వుంటుందా"
"ఆ వుంటుంది...."
"ఏమిటి.... హేమమాలినిలానే... ఇంకేం బ్రదర్" ఎగిరి గంతేశాడు వెంకటేశ్వర్లు.
కాలర్ పట్టుకు కూర్చోపెట్టాడు వాసు.
హేమమాలినిలా కాదు. "టుం. టుం. లా"
"చచ్చింది గొర్రె.... దూత్.... అలాంటి పిల్లనా నువ్వు చూడటానికి వెళ్ళింది. అసలు మీ అన్నయ్యకి బుద్ధి వున్నదా అంట?"
"అవి అడిగే మొగాడెవరూ అంట?"
"నువ్వే!"
"నేనా....అది నా పనికాదు. ఇష్టం వుంటే" అ టుం టుం మెళ్ళో మంగళసూత్రం కట్టటం లేకుంటే పత్తాలేకుండా పారిపోవటం. అంతే"
"రే...రే ఆ పనిమాత్రం జెయ్యకు. ఆ సెలక్షన్ యేదో తేలనీయి. తీరా ఆర్డర్లు వచ్చేసరికి నువ్వు యే పక్కకన్నా పారిపోయావంటే వెతక లేక మద్యన నే చస్తాను. అయినా నీ సంగతి నాకు తెలియదూ. మీ వదిన ఎలానూ ఈ సంబంధం కుదరనివ్వదు. మీ అన్నయ్యతో ఆ పోట్లాటేదో తనే చూసుకుంటుందిలే" అని "అంతేనా....ఒరే......అమ్మపుట్టిల్లు మేనమామ దగ్గరా అని నా దగ్గరా నీ సంగతి..."
"నిజం" అన్నట్లు చిరునవ్వు నవ్వాడు వాసు.
"యెంత అదృష్ట వంతుడి విరా భాయ్."
"నిజంగానే. ఈ ఒక్క విషయంలో నేను చాలా అదృష్టంవంతుడినే."
"అక్కడ పెళ్ళిచూపులప్పుడు ఏమైందంటే" మిగతాది చెప్పకుండానే నవ్వటం మొదలు పెట్టాడు వాసు.
"అబ్బ తర్వాత నవ్వుదుగాని త్వరగా చెప్పు ఏం జరిగింది?" కుతూహలం ఆపుకోలేకుండా వున్నాడు వెంకటేశ్వర్లు.
"సరే మేము వెళ్ళాం. కాఫీలూ, ఫలహారాలూ చాలా ఘనంగా యేర్పాటు చేశారులే. మా వదిన మా దగ్గర కూర్చోవాలని సరదా పడింది. ఎందుకంటే తను ఇంటిదగ్గర చెప్పినట్లు విని టిఫిను కాస్త తిని వదిలేస్తానో లేదో ప్లేటుకూడా నాకే స్తానో అని భయం ఆవిడకి. వాళ్ళేమో వదిన్ని మరోగదిలో కూర్చోపెట్టారు. సరే కాఫీలు కాగానే పెళ్ళికూతురు వచ్చి సోఫాలో కూర్చుంది. అన్నయ్య కుర్చీకి యెదురుగా పాపం ఆ అమ్మాయి అన్నయ్యే పెళ్ళికొడుకు అనుకుంది. మహా చూసేసింది. నేను ఒక్కసారి ఆ అమ్మాయిని చూశాను. గుండె ఓ సెకండ్ ఆగిపోయింది. నిజంగానే ఆగిపోయిందిరా అంటే. ఇంక నా కక్కడ గాలి ఆడలేదు. పైన ఫానూ అదీ వుందనుకో. టకామని రెండుగుండీలు లాగేసి హైరాను పడుతూంటే వదిన వాళ్ళకి ఏం చెప్పి వచ్చిందో మేమున్న గదిలోకి వచ్చేసింది.
అంతకుముందే పెళ్ళికూతుర్ని చూసిన ముఖంలానే వుంది వదినది. ఇంక ఫర్వాలేదని "వదినా అలా వరండాలో కూర్చుంటాను" అని చెప్పి జవాబుకి చూడకుండా లేచి వెళ్లాను.
ఇంక అన్నయ్య అవస్థ చూడు. బాబోయ్ వద్దు.
ఆ అమ్మాయి అన్నయ్యతో యేదేదో మాట్లాడేస్తోంది....వదిన అర్ధం చేసుకుని వచ్చే నవ్వుని ఆపుకుంటూ.
"ఈయన మా శ్రీవారు. అడుగో పెళ్ళి కొడుకు" గాలి చాలలేదుట వరండాలోకి వెళ్ళాడు అంటూ కథ విప్పేసింది.
ఆ అమ్మాయి ముఖం చిన్నబోయింది.
ముసలాయన యెవరు యెవరో పరిచయం చెయ్యనందుకు నొచ్చుకున్నాడు.
"వదిన మరేం ఫర్వాలేదులెండి....అంటూ నన్ను గిచ్చి మరీ కూర్చో పెట్టి ఇప్పుడు చూసు కోమ్మా" అన్నట్లు చూసింది ఆ అమ్మాయివైపు.
ఇంత జరిగినా భయపడనేలేదులా వుంది. ఆ అమ్మాయి, నన్ను చాలా పరీక్ష చేసింది. కూర్చున్న చోటునించి కదలలేదు. పాపం చాలా సూల కాయం, ఏం చేస్తాం భగవంతుడి సృష్టి అనుకో. ఏమిటో ఆమెని చూడగానే నవ్వు వచ్చిందిగాని తర్వాత చాలా జాలేసింది.
మమ్మల్ని ఇంటివరకూ దిగవిడిచిన ముసలాయన "ఏమంటారు" అంటూ యెన్నోసార్లు అడిగాడు.
"తర్వాత కబురుపంపిస్తాం అని చెప్పండి" అంటూ వదిన అన్నయ్యని హెచ్చరించి లోపలికి వచ్చేసింది.
"ఇంక ఇంట్లో మొదలైంది యుద్ధం. అందుకే నేను మెల్లగా ఇక్కడికి జారుకున్నాను. ఇదీ కథ."
"ఒకవేళ మీ అన్నయ్య ఆ అమ్మాయి డబ్బుకి ఆశపడిన మెడలు వంచితే"
"వూ అలా జరగదు. అంతగా ఆ డబ్బు కావాలంటే మీరే ఆ పిల్లని చేసుకోండి. నా అభ్యతరం ఏమీ లేదు" అంటుంది వదిన.
"మీ వదిన అంటే ఎంత ఇష్టంరా. ఆవిడ పేరు చెప్తేనే నీ ముఖం యెలా వెలిగిపోతోందో.
"నీకు తెలియదు. ఆవిడ దేవత. అసలు స్త్రీ అంటే అలా వుండాలి. అన్పిస్తుంది నాకు ఆవిడ నాకు వదిన కాదు తల్లి. నా బుద్ధి తెలియక ముందే అమ్మపోయినా ఒక్కరోజు అమ్మకోసం బాధ పడే అవుసరం రాలేదు. రానివ్వదు వదిన. అసలు నాకేం కావాలో నా కంటే ఆవిడకే యెక్కువ తెలుసు..." వాసుకి వదినగారిమీద వుండే పూజ్య భావానికి అచ్చెరువందాడు వెంకటేశ్వర్లు.
"అందరికీ దొరకరు. ఇలాంటి వదినలు. అదృష్టవంతుడి విరా వాసూ"
"నిజం.... ఆ... ....మాలతి ఎలావుంది. వుద్యోగం ఎలా వెలిగిస్తోంది."
"బాగానేవుంది కాని మొన్న హాలు దగ్గర చాలా గల్లంతు అయిందిట. అప్పుడు క్యాష్ బాక్స్ లో అరవై రూపాయలు గల్లంతు అయినా యట.
"ఎలా పోయిందో నాకు తెలియదు" అంటూ గోలపెట్టింది.
మేనేజర్ ఇలా అయితే కష్టం అంటూ కళ్ళెర్రచేశాడు.
ఆ "అరవై" మూడునెలల్లో 20 లెక్కన కట్టుకోమని సర్ది చెప్పాను.
అసలు ఆ మేనేజర్ తమ్ముడే రౌడీ. వాడితో చాలా అవస్థపడుతోంది. అనుకుంటాను. ఈ ఉద్యోగం చెయ్యడం చాలా కష్టమే.
"ఎవరా రాస్కెల్" కోపంతో వాసు ముఖం జేవురించింది. వెంకటేశ్వర్లు వాసుని సమాధాన పరుస్తూ.
"ఆవేశపడి ఏం ప్రయోజనం గతిలేక ఆడపిల్లలు బయటికి వెడుతున్నప్పుడు రకరకాలవాళ్ళూ ఎదురవుతారు. మనం పళ్ళు కొరుక్కుని ఏం ప్రయోజనం. అరవై రూపాయలకి ఉద్యోగం చేసే ఆడపిల్ల మీద వాడికి గౌరవం వుండాలని యెక్కడ వుంది! ఇది సమాజం, ఆ హాలులో వీడిపెత్తనం కూడా చాలా వుంది. అందుకే ఎన్నోరోజులు వుండటం కష్టం అంటున్నాను"
వాసు ముఖం కందిపోయింది.
ఆ మేనేజర్ తమ్ముడేగనుక అక్కడవుంటే పీకనులిమి చంపేయాలన్పిస్తోంది. వెధవలు ఆడపిల్లలనిబైటికి వస్తే పరువుగా బ్రతకనివ్వరు. ఆలోచిస్తూ వుండిపోయాడు వాసు.
వెంకటేశ్వర్లు సచ్చిపోయె వాళ్ళకి కావల్సినవి ఇచ్చి డబ్బు లెక్కచూచుకుంటున్నాడు.
"వెంకటేశ్వర్లు ఏదైనా సరే ఓ చిన్న ఉద్యోగం నాకు చూడు. నేను వుద్యోగంలో వుంటే ఆ డబ్బు మాలతికి ఇచ్చేస్తాను అప్పుడు ఇలాంటి సమస్యలు వుండవు"
"ఎం ఎ. పాసై నేడో రేపో కలెక్టర్ కాబోతున్న నువ్వు చిన్న వుద్యోగం చేస్తావూ... చఛా...అన్నయ్యకి తెలిస్తే మన ఇద్దరిపనీ గోవింద.
"అదేం కుదరదు. ఎంతచిన్నదైనా సరే చేస్తాను, చెప్పు లేకుంటే నేనే వెతుక్కుంటాను."
"అబ్బ... యెంత మొండి ఘటానివిరా...ఇంత చిన్న వుద్యోగాల్లో ఇరుక్కుంటే పదిహేను వేలు పెట్టి నిన్ను కొనుక్కునే"టుంటుం" వచ్చి చెవులు మెలేసి లాక్కు వెడుతుంది."
"అవన్నీ చాలించు నాకిప్పుడు కావలసింది వుద్యోగం. పోనీయ్ డబ్బు సంపాదించే మార్గం మరేదన్నా చూపించు"
"కో..." అంటే కోటి రూపాయలు సంపాదనకి పోనీ సినిమా హీరోలా రిక్షాతొక్కరాదూ యేం చక్కా ఫోటోలు తీయిస్తాను."
వెంకటేశ్వర్లు హాస్యం పట్టించాడు. వాసు గంభీరంగా అన్నాడు, "ఏదీ దొరక్కుంటే అదే చేస్తాను. నాకేం నామర్దాలేదు. సరే పద. మాల యెలా వుందో చూసి వద్దాం. "లేచాడు వాసు,
"మాటిమాటికీ మీరు వస్తే యెలా" అంటూ ఆ మేనేజర్ ముఖం మాడ్చుకున్నాడు. రేపు ఇక్కడికే ఒకసారి రమ్మని చెప్పాను." అమ్మాయి ఎక్కడ వుంటున్నదట. తండ్రికాక మరెవరన్నా వున్నారా"
ఆ చూశాను. రిక్షావాళ్ళు ఫ్యాక్టరీ కూలీలూ వుండేచోట. ఓ చిన్న గదిలో వుంటున్నారు. మాల యెవ్వరితోనూ మాట్లాడదుట. 'కొత్తగా వచ్చారు" అని చెప్పారు అక్కడవాళ్ళు. అంతకుముందు ఎక్కడో వుండే వాళ్ళుట. ఆ పొరుగు అంతమంచిదికాదు. పాపం ఎలా వుంటుందో. ఒట్టి గుండాలు వుండే బస్తీ "వ్యవహారం చూస్తుంటే..." వెంకటేశ్వర్లు చెప్పటం ఆపాడు.
"చెప్పు అనుమానిస్తావెందుకు?"
"మాల మర్యాదస్తుల పిల్లలానే వుంది..."
"నేను మొదటి రోజే అనుకున్నాను. కాని ఎందుచేతో అజ్ఞాతంగా వుంటున్నారు. పాపం ఆడపిల్ల. పక్షవాతంతో లేవలేని తండ్రిని బ్రతికించుకోవటానికి పడరానిపాట్లు పడుతోంది. అందుకే నా కేదన్నా వుద్యోగం దొరికితే మాలని మెట్రిక్ కి కట్టించి ఆపైన యేదైనా వుద్యోగం చూడాలి. ఈలోపలే టైపూ అదీ నేర్పించాలి. కాస్త ఆదుకుంటే తనకాళ్ళమీద తను నిలబడగలుగు తుంది. ఉద్యోగం కోసం అందుకే చాలా తొందరపడుతున్నా"
"అయినా వాసూ మనకెందుకు ఈ పీడ" లోకంలో ఎందరో సమస్యలతో సతమతమవుతూ వుంటారు. మనం ఏం చెయ్యగలం. ఎంతమందిని తీర్చగలం"
వెంకటేశ్వర్లుకి వాసు ఈ సమస్య నెత్తి నేసు కోవడం సుతరామూ ఇష్టం లేదు. వాసు భవిష్యత్తు పాడవుతుందని బాధ. మిత్రుడగా యెన్నో విధాల చెప్పాడు. వాసుకి తలకెక్కటం లేదు.
"మనం సంఘాన్ని వుద్దరించలేకపోయినా పాపం ఆడపిల్ల దారీ తెన్నూ లేక తెగిన గాలిపటం లాగా అయితే చూస్తూ వూరుకోగలమా? అంతే"
"అంతేనా? వెంకటేశ్వర్లు వాసు ముఖం లోకి గుచ్చిచూశాడు.
"సందేహమా?"
నిర్మాలిన్యమైన వాసు కళ్ళని ఢీకొనలేక వెంకటేశ్వర్లు తలవంచేశాడు.
"రత్నానివిరా వాసూ" మనస్సులో అనుకున్నాడు.
"వెంకటేశ్వర్లు నాకు టైపుకూడా వచ్చు, యే జాబ్ వర్కు అయినా దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. లేచాడు వాసు.
"నాకు తెలిసిన ఓ ప్లీడరు గుమస్తాకి జ్వరంగా వుంది. ఆ మిషను కావాలంటే తీసుకో. నువ్వు వర్కు చేసుకుని మిషను వాడుకున్నందుకు రోజూ కొ రెండు అతనికి ఇవ్వు. ప్రస్తుతం ఈపని చేస్తూ వుండు, మరెక్కడన్నా కూడా ప్రయత్నిద్దాం యెగరి గంతేశాడు వాసు.
* * *