ఈ రోజు జీవితంలో మొట్ట మొదటిసారి కష్టపడి సంపాదించినది యెనిమిది రూపాయల్లో టైపు మిషనుకి రెండు రూపాయలు ఇచ్చేస్తే మిగతా ఆరు రూపాయలూ షర్టు జేబులో కదులుతూంటే వాసుకి అదో విధమైన సంతృప్తిగా వుంది, మొట్ట మొదటి సంసాదనలో వదినకి యేమయినా తీసుకువెళ్ళా లన్పించింది వాసుకి. వదినకి పువ్వులంటే విపరీతమయిన ఇష్టం. కనకాంబరాలూ, సన్నజాజులూ కలిపి కట్టిన మాల కొనుక్కుని కర్చీఫ్ లో కట్టు కుని బస్సుకోసం వెయిట్ చేస్తూ వున్న వాసుకి మందుసీసాతో వడి వడిగా నడిచి వెళ్ళే మాలకన్పించింది.
"మాలా... మాలా" వాసు గొంతు విని వెనక్కి తిరిగింది.
"ఈ రోజు పనిలోకి వెళ్ళలేదూ?" కోపంగా అడిగాడు.
కళ్ళనీళ్ళు గిర్రున తిరుగుతూంటే "లేదు" అన్నట్లు తల వూపింది.
"ఎందుకనీ? ఈ మందు యెవరికి?"
"మా నాన్నకి జ్వరంగా వుంది. అందుకనీ"
"ఇలా చేస్తే నీ వుద్యోగం ఎన్ని రోజులు వుంటుంది?"
"వాసుబాబూ" అంటూ వెక్కి వెక్కి యేడ్చింది మాల.
వాసు మనస్సు ద్రవించింది. అయినా కాఠిన్యాన్ని తెచ్చుకుంటూ "అలా యేడవ్వద్దని యెన్నిసార్లు చెప్పాను. నీకేం కావాలి. చెప్పు. యేడ్చే స్త్రీలని చూస్తే ఆకసహ్యం అని మూడోసారి చెప్తున్నాను.
కళ్ళు తుడిచేసుకుంది మాల.
"గవర్నమెంట్ హాస్పిటల్ మందుతో నాన్నకి జ్వరం నయం కావటం లేదు. ప్రయివేటు డాక్టర్ డబ్బిస్తేకాని మందు ఇవ్వడు. నా వుద్యోగం వుద్వాసనైంది" "తలవంచే చెప్పింది, మాలకి ప్రపంచంలో తన బాధనీ దుఃఖాన్నీ పాలు పంచుకోవటానికి తండ్రి ఒక్కడే వుండేవాడు ఇది వరకు. ఇప్పుడు భగవంతుడు ఈ యువకుడిని ప్రసాదించాడు. ఇతని అండ చూసుకునే నిలదొక్కుకో గలుగుతున్నది జీవితంలో.
"పద మీ నాన్నని చూస్తాను."
"మీరు... మా ఇంటికి వస్తారా!" నిజంగానే అంటున్నాడా అని ఆశ్చర్యపడింది.
"ఏం రాకూడదా?"
"కూడదని కాదు. కాని మా నాన్న మంచి వాడు కాదు. మిమ్మల్ని......యేమైనా" మాట పూర్తి చెయ్యకుండానే ఆగిపోయింది మాల.
"కొడతాడని భయమా! ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే 'బలం' వుంటే రెండు వేస్తాను. లేకుంటే రెండు తింటాను. నేను అన్నింటికీ సిద్ధమే రా....ఈ రోజు యేమయినా సరే మీ నాన్నని చూడకుండా వెళ్ళలేను." ముందుకి అడుగులేస్తూ అన్నాడు.
మాలతి ముఖం నల్లబడిపోయింది.
తన మనస్సులో యెంతో వున్నతస్థానం వున్నది యువకుడికి. ఒకవేళ తన తండ్రి ఏ మాత్రమైనా అగౌరవపరిస్తే తను భరించలేదు. అసలే కోపిష్టి తండ్రి ఒక వైపు యే మాత్రమూ అగౌరవాన్ని సహించలేని దుడుకు స్వభావుడైన వాసు......ఏమవుతుందో అనే భయం పీడిస్తున్నా ఇంక తప్పక నా ఒక్కమాట వింటే మిమ్మల్ని తీసుకువెడతాను."
"వూ....షరతులు బాగానే వున్నాయి. సరే చెప్పు ఏం చెయ్యాలి కళ్ళకి గంతకట్టు కోవాలా..."
అంత వేదనలోనూ తేలిగ్గా నవ్వేసింది మాల.
"అక్కరలేదు కాని....మీరు....మీరు...."
"వూ...నేను,"
"నా యజమాని అని చెప్పాలి."
"అంటే?"
"క్షమించండి. నేను ఓ బట్టల షాపులో వుద్యోగం చేస్తున్నానని మా నాన్నతో అబద్ధం చెప్పాను ఆ డబ్బుతోనే మా పొట్ట గడుస్తోందని మా నాన్న వుద్దేశం. మొదట అలా వుద్యోగం చేసినమాట నిజమేకాని ఆ తర్వాత అదికాస్తా వూడిపోయింది......కాని....... మా నాన్నతో..."
"పోయిందని చెప్పలేదు అంతేగా."
"అవును" అన్నట్లు తలవూపింది.
"ఒక్క తప్పు కప్పి పుచ్చుకోటానికి పది తప్పులు చేస్తున్నావుకదూ?"
"ఏం చెయ్యను? యేదారీ దొరకక.....చావు బ్రతుకుల్లోవున్న తండ్రి మనశ్శాంతిని పోగొట్ట లేక ఒక్క అబద్ధం కొరకు పది అబద్ధాలు చెప్పక తప్పటం లేదు. ఇంకా ఇంకా యెన్నో చెప్తూనే వున్నాను వాసుబాబూ పరిస్థితులు సజావుగా వున్నంత వరకూ మనిషికి వున్న ఆదర్శాలూ అభిప్రాయాలూ ఆచరణలో పెట్టవచ్చు. కాని లేచిన దగ్గరనించీ తిండికీ గుడ్డకూ సరి పడ్డ సంపాదన ప్రయత్నంలోనే యెన్నో అగచాట్లు పడే మాలాంటి అతి సామాన్యులు ఆదర్శాలు పట్టుకుని యేం వేలాడగలరు. ఆదర్శాలు అన్నం పెట్టలేవు వాసుబాబూ..
వాసు విచిత్రంగా చూశాడు మాలని.
మితభాషి అయిన మాలతి ఇలా మాట్లాడుతూంటే యేదో బలవత్తరమైన కారణమే వుండివుంటుంది. మాల ఆవేదనని అర్ధం చేసుకో గలుగుతున్నాడు అందుకే తన చేతనయిన సహాయం అందివ్వాలని తపన పడుతున్నాడు.
"ఇంతకీ మీ నాన్నని చూపిస్తావా లేదా?"
నవ్వి వూరుకుంది మాల.
"నీ కిష్టంలేని పని చెయ్యను. ఇంద ఈ డబ్బుతో మీ నాన్నకి మందుకొని తీసుకువెళ్ళు. నువ్వు డబ్బుకోసం బెంగపడకు. నేను అప్పుడప్పుడు కాస్త సహాయపడుతూనే వుంటాను జాగ్రత్తగా చూస్కో నాన్నని" అంటూ జేబు లోని అయిదు రూపాయలు మాల చేతిలో పెట్టి.
"నేను వెడుతున్నాను ఆవుసరం వుంటే నా దగ్గరికి రావటానికి యే మాత్రం వెనుకాడవద్దు ఇదిగో నా అడ్రెస్ సరేనా.'
అడ్రసు అందించి, వెనక్కి వెళ్ళిపోతున్న వాసుని పరుగున వచ్చి అడ్డగించింది.
"మా నాన్నని చూపిస్తాను రండి....ఇక్కడికి దగ్గరే మా ఇల్లు"
"వద్దు మాలా....మరోసారి చూస్తాను. నీ మనస్సు ఈరోజు బాగాలేదు కదూ! వుద్యోగం పోయిందని ఏం బాధ పెట్టుకోకు మరోటి చూస్తాం కదూ?
"అవన్నీ సరే ముందు మా ఇంటికి రండి.
"వద్దు మరోసారి వస్తాను" అని ఎంతచెప్తున్నా వినక వాసుచెయ్యి పట్టుకుని లాక్కు వెడుతూనే వుంది మాల. ఆ అమ్మాయి చేతిలో చెయ్యి వుంచి నడుస్తున్న వాసుకి యేదోగా వుంది. రోడ్డున పోయే కొందరు ఆ ఇద్దరినీ వింతగా చూస్తున్నారు. అప్పటికి గుర్తు వచ్చింది. నలుగురూ నవ్వుతూంటే తన చెయ్యిని లాగేసుకుని మాలని వెంబడించాడు.
అంత బాధలోనూ చిరునవ్వు నవ్వింది మాల.
మురికిగా చితచిత లాడుతున్న సందులూ, గొందులూ దాటి ముందుకు పోయే మాలని అనుసరిస్తున్నాడు వాసు. చేతిగుడ్డ ముక్కకి అడ్డంపెట్టుకున్నా దుర్వాసన కడుపులో తిప్పుతూనే వుంది.
సీనారేకులతో అడ్డం కట్టిన చిన్న చిన్న గూళ్ళు" లా వున్నాయి అని. కొందరు గోనె సంచులు మాత్రమే అడ్డంకట్టుకుని వాళ్ళ వాళ్ళ అవుసరాలు తీర్చేసుకుంటున్నారు. వాసు ఈలాంటి సందుల్లోకి రావటం ఇదే మొదటిసారి.
భారత దేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకుని ఇక్కడే పడివున్నదా అన్పిస్తోంది. కొందరు మానవులు ఎలాంటి నికృష్ణ జీవితాన్ని గడుపు తున్నారో ప్రత్యక్షంగా చూస్తున్న వాసు మనస్సు గిజగిజ లాడింది. అసలు ఈ దరిద్రానికి మూల కారణం యేమిటి? ఆహారపు కొరతా? సోమరి తనమా? అధిక జనాభా? ఎందుకు వున్నది ఈస్థితిలో మన దేశం. ఆవేదన పడుతూనే ఆలోచిస్తూ నడుస్తున్నాడు వాసు.
"వాసు బాబూ! రండి చప్పున "ముందుకి నడుస్తున్న మాల గభాలున వాసుని దగ్గరకి లాక్కుంది. తూలిపడబోయి మాలచేతి ఆసరాతో నిలదొక్కుకున్నాడు.
"ఏమిటి" అంటూ వెనక్కి తిరిగి చూస్తూ.
తమలపాకులు నమిలి ఖాండ్రించి ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా వుమ్మువేశాడు. ఓ ముసలివాడు.
అసహ్యంతో వళ్ళు జలదరించింది వాసుకి.
"బుద్ధిలేదూ ఎవరు నడుస్తున్నారో కూడా చూడకుండా ఏం పని"
మాలతి చెయ్యి గుంజుకుని గోనెపట్టా తప్పించుకుని లోపలికి వెళ్ళబోతున్న వాసుని అమాంతంగా గట్టిగా పట్టేకుని లాగేసింది మాల.
"ఏం... ఎందుకూ?" కోపం తగ్గని వాసు గట్టిగా అన్నాడు.
"హుష్... వాడు వచ్చి కసాయి... మీరు రాక రాక వచ్చి ఈ వెధవతో తగూకి దిగుతారా వద్దు వద్దు. మిమ్మల్ని చూస్తే ఇంక ఇంటికి వెళ్ళనీయడు. వాసుబాబూ ఇక్కడ మానవత్వం వున్న మనుష్యులు బ్రతుకుతున్నారనుకోకండి. పురుగులకంటే హీనమైన దరిద్రులు నివసించే స్థలం. ఈ మూర్ఖులతో వాగ్వివాదానికి దిగి మీ పేరుని వీళ్ళ నోళ్ళలో నాననీయకండి. ఆవేశం అన్ని వేళలా తగదుసుమా. ఇదిగో మా యిల్లు..అంటూ అతన్ని బలవంతంగా లాక్కువెళ్ళి వాకిలికి అడ్డంగాకట్టిన గోనిసంచి తప్పించి "వంగి లోపలికి రండి, మీరు అసలే చెడ్డ పొడుగు, మా దర్వాజా శఠగోపం పెట్టగలదు" అంటూనే ఓ చిరిగిన చాప తెచ్చిపరిచింది.
అంతా చీకటి.
ఏదీ సరీగా కన్పించటం లేదు.
వాసు ఆ చాపమీద ఇబ్బందిగా కూర్చున్నాడు.
మాల కిరసనాయిల్ బుడ్డి వెలిగించింది.
ఆ వెలుగులో
ఓ నులకమంచం మీద ముసలాయనమూలుగుతూ పడుకున్నాడు.
"నాన్నా" మంచంమీదకి వంగి అడిగింది.
"ఇంత సేపు ఏం చేస్తున్నావమ్మా. మందు తెచ్చావా!" కళ్ళు మూసుకునే కూతురు చెయ్యి పట్టుకున్నాడు.
"తెచ్చానుగాని మన ఇంటికి యెవరో వచ్చారు చూడు నాన్నా నేను చెప్తూ వుంటానే బట్టల కొట్టు ఆయన. ఆయనకి నేనంటే చాలా అభిమానమనీ. ఆయన నిన్ను చూడటానికి వచ్చారు ఇదిగో మందు కొనుక్కోమని డబ్బుకూడా యిచ్చారు. నేను కాఫీ పెడతాను నువ్వు లేచి కూర్చోగలవా!"
ముసలాయన మెల్లగా కూతురు ఆసరాతో అతికష్టంమీద లేచి కూర్చుంటూనే పక్షవాతంతో పడిపోయిన చెయ్యి కదపలేక ఒక్క చేత్తోనే నమస్కారంచేస్తూ వాసుని చూశాడు.
వండిపోయిన తల, పెరిగిన గడ్డం చాలా వరకూ ముఖాన్ని కప్పేస్తూంటే కళ్ళు మాత్రం తీక్షణంగా పరిశీలిస్తున్నాయి వాసుని.
తెల్లగా ఆరోగ్యంగా అందంగా ఎదురుగా కూర్చున్న యువకుడిని కాదు తను వూహించింది. పైగా ఇతని కళ్ళు చాలా అందంగా వున్నాయి అవి అమ్మాయిలని ఆకట్టేసుకుంటాయి.
ఇది మరీ భరించలేని విషయం అయింది ముసలాయనకి.
ప్రతి నమస్కారం చేస్తూనే ఆయన్ని ఆయన ముఖంలో మారే రంగుల నీ చూస్తూ వుండిపోయాడు వాసు.
పరిశీలన పూర్తిచేసిన ఆయన కళ్ళు కాస్సేపటిలోనే తీక్షణంగా మారినాయి.
ఆ దృష్టి చాలా బాధ కల్గించేదిగా అన్పించి ఇంక కూర్చోలేకపోయాడు.
"వెళ్ళివస్తాను" అంటూ లేచాడు.
"ఒక్కక్షణం వుండండి టీ తెస్తాను" మాల చెప్పింది లోపలినుంచి.
"వద్దు వద్దు.. నమస్కారం" అంటూ తల వంచటం మర్చి బయటికి వస్తూ తలకి తగిలిన దెబ్బని చేత్తో రాసుకుంటూ గబగబా వెళ్ళిపోవాలని అన్పించింది. మాల వస్తుందేమో చెప్పి వెడితే బాగుంటుందని అరక్షణం నిలబడ్డాడు ఆ పరిసరాలను పరిశీలిస్తూ.
"దరిద్రురాలా .... వీడి దగ్గరా నీ వుద్యోగం ఇంకొక్క రోజుకూడా వాడి దగ్గరికి వెళ్ళవద్దు. వెళ్ళావంటేనా చంపేస్తాను" అంటూ యేదో విసిరికొట్టిన శబ్దం మాలతి "అబ్బా......నాన్నా" అంటూ వెక్కివెక్కి యేడుస్తూన్న శబ్దం వాసుని వెనకనించి తరిమి తరిమి కొడుతూంటే వెనక్కి చూడకుండా రోడ్డు ఎక్కాడు.
"అబ్బ....తల పగిలిపోతోంది ఆ వాసన ఇంకా వేస్తున్నట్టే అన్పిస్తూంటే.
"కాస్త కాఫీ తాగితేగాని ప్రాణం కుదుట పడదు" అనుకుని యెదురుగా కన్పించిన హోటల్లోకి దారితీశాడు.
కాఫీకి ఆర్డరిచ్చి కాస్సేపు కళ్ళు మూసుకున్నాడు.
బారతదేశంలోని దరిద్రమంతా కట్టకట్టుకుని వచ్చి అతన్ని భయపెడుతోంది అతని వళ్ళు గగుర్ పెడుతూంటే సర్వర్ కాఫీ తెచ్చి ఇచ్చాడు.
వేడివేడి కాఫీ తాగిన తర్వాత అతని మెదడు తిరిగి సరీగ్గా పని మొదలుపెట్టింది. వళ్ళు తెలిసింది తన జేబులు ఖాళీ భగవంతుడా యేది దారి ..మానవుడికి తన అసహాయం తెలిసి నప్పుడు మొట్టమొదట గుర్తు వచ్చేది భగవంతుడు.
ఎవరైనా యెరుగున్న వాళ్ళుగాని స్నేహితులు గాని రాకూడదూ. అన్పించిందేగాని మనం ఆపదలో వున్నాం అని ఎవరికి తెలుస్తుంది గనుక...ఏం చెయ్యటం.....వదిన అన్నట్లు రాంభజన చెయ్యాలి అలా చేసినా విముక్తి దొరకదే.......గ్లాసుడు మంచినీళ్ళు తాగేశాడు.
ఎందుకన్నా వుంటుందని ఒక్క రూపాయన్నా వుంచుకోకుండా అంతా మాల చేతిలో పెట్టిన తన తెలివి తక్కువకి మొట్టమొదటిసారి తట్టుకున్నాడు. ఆ హాలంతా కలయజూసినా కనీసం ముఖపరిచయం వున్నవాళ్ళయినా కన్పించలేదు.
రాం రాం సీతారాం.....రాంరాం సీతారాం....గ్లాసు కదిలిస్తూ కూనిరాగాలు మొదలుపెట్టాడు వాసు. మానేజర్ వెయ్యబోయే పనిష్ మెంట్ ని భరించే వోపిక ఇవ్వమని వేడుకుంటూ.
"హల్లో వాసుదేవరావుగారూ."
తనపేరు ఆ క్షణాన వుచ్చరించినది యెవరైనా సరే తియ్యగా అతి మహ్డురంగా విన్పించింది ఆ మాట. తలతిప్పి చూశాడు. బ్రతికాం. నా మొర ఆలకించాడు ఆ రామభద్రుడు. ఇంటికి వెళ్ళగానే వదినకి చెప్పాలి ఈ విషయం?
ఇంతకీ నన్ను పిల్చింది యెవరూ? నిజంగా పిలుస్తున్నారా కలగంటున్నావా చెయ్యి గిల్లుకుని నెప్పిపెట్టి నిజంగానే ఎవరో పిలుస్తున్నారు. అనుకుని వెనక్కి చూశాడు.
"టుం టుం" అని తను పేరు పెట్టిన వైదేహి. ఆమె స్నేహితులూ వాసు పైప్రాణాలు పైనే పోయినాయి.
ఓరి భగవంతుడా నువ్వు వున్నావో లేదో అడ్రసు తెలియదుగాని లేకుంటేనా ముల్లోకాలూ వెదుక్కుంటూ వచ్చి గోడకుర్చీ వేయించేవాడిని.